Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మావోయిస్టులపై క్యాబినెట్‌లో నిర్ణయం

-మహిళలపై నేరాలను అరికడతాం.. సీమాంధ్రుల్లో భయం మీడియా క్రియేషనే -ఉద్యమకారులపై కేసుల ఫైల్ మూవ్ అయింది.. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో హోంమంత్రి నాయిని

బంగారు తెలంగాణను నిర్మించటమే ప్రస్తుత తమ లక్ష్యమని తెలంగాణ మొట్టమొదటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మావోయిస్టుల విషయం క్యాబినెట్‌లో చర్చిస్తామని చెప్పారు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. హోంమంత్రిగా నియమితులైన నాయిని నర్సింహారెడ్డి మంగళవారం నమస్తే తెలంగాణకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Naini Narsimha Reddy

ప్రశ్న: మావోయిస్టులపై మీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది? జవాబు: ఆ అంశాన్ని క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తాం. అయినా ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టులు ఓపెన్‌గా లేరు. వారి ప్రాబల్యం గణనీయంగా తగ్గింది కూడా. అయినా మావోయిస్టులు తరుచూ లేవనెత్తే అంశాల పైనే మేం ప్రజలకు హామీలు ఇచ్చాం. వాటిని వంద శాతం నెరవేరుస్తాం. బడుగు, బలహీనవర్గాలు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీల ముఖాల్లో కళ తీసుకువస్తాం. మావోయిస్టులు సమాజంలోకి రావాలి. పార్టీ పెట్టాలి. ప్రజాస్వామికంగా ప్రజల సమస్యలపై పోరాడాలి.

ప్రశ్న: హామీలను నెరవేర్చకపోతే తెలంగాణ తుపాకీ నీడ కిందకు రావాల్సి వస్తుందని గద్దర్ అంటున్నారు? జవాబు: ఆయన బాధ పడాల్సిన అవసరమేం లేదు. ప్రజల సమస్యలపైనే మేం హామీలు ఇచ్చాం.. ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాం.

ప్రశ్న: సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జవాబు: అసలు సీమాంధ్రులు భయపడాల్సిన పరిస్థితే లేదు. అదంతా మీడియా క్రియేషన్ మాత్రమే. పదమూడేళ్ల ఉద్యమంలో సీమాంధ్రులపై ఒక్క గడ్డిపోచైనా వేశామా? నేను కార్మిక నాయకున్ని. యూనియన్ లీడర్‌గా అరవై కంపెనీల్లో ఉంటే ప్రధాన కార్యదర్శులుగా చాలాచోట్ల సీమాంధ్రులను పెట్టుకున్నా. అయినా, హైదరాబాద్‌లో రాజస్తాన్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర ఇలా ఎందరో లేరా.. సమస్యలు లేకుండా జీవించటం లేదా? రాజస్తాన్ మార్వాడీలు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు కూడా. చెప్పాలంటే వాళ్లంతా తెలంగాణవాదులైపోయారు. ఇక్కడ ఉండే సీమాంధ్రులు కూడా తెలంగాణవాదులైపోవాలి. విడిపోయినా స్నేహపూరితంగా కలిసుందామని మొదటి నుంచి చెబుతున్నాం…ఇప్పుడు కూడా అదే చెబుతున్నాం. అయినా హోంమంత్రిగా సీమాంధ్రుల భద్రతకు నాదీ భరోసా.

ప్రశ్న: మహిళలపై పెరిగిపోతున్న నేరాలను అరికట్టటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జవాబు: నిజమే.. రోజురోజుకు మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. ఇది బాధాకరం. పోలీసు అధికారులతో చర్చించి మహిళలపై నేరాలను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటాం. కొంతమంది మగాళ్లు మగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా వాళ్లు తమ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా.

ప్రశ్న: పోలీసుశాఖలో సిబ్బంది కొరతను ఎలా తీరుస్తారు? జవాబు: దశలవారీగా ఖాళీలను భర్తీ చేస్తాం. పోలీసుశాఖ పని తీరును మరింత మెరుగు పరచటానికి చర్యలు తీసుకోనున్నాం. కొత్త వాహనాలు కొనాలని నిర్ణయించాం. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు మెడికల్ అలవెన్స్ , పోలీసు సిబ్బందికి వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలనుకుంటున్నాం. నిరంతరం డ్యూటీలు చేయాల్సి వస్తుండటం వల్ల పోలీసు సిబ్బంది తమ అసహనం…కోపాన్ని జనంపై చూపిస్తారు.

ప్రశ్న: హైదరాబాద్ ఫ్రీజోన్‌గా ఉన్నపుడు ఇక్కడ ఉద్యోగాల్లో చేరినవారి విషయంలో ఏ నిర్ణయం తీసుకోనున్నారు? జవాబు: ఎక్కడివాళ్లు అక్కడ పని చేయాలన్నదే మా అభిమతం. తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రులు పని చేస్తే వారిని నమ్మలేం. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వాళ్లు పని చేస్తే వాళ్లు కూడా నమ్మరు. అపనమ్మకముండే పరిస్థితుల్లో పని సరిగ్గా సాగదు. ఈ అంశంపై కేబినెట్‌లో ఓ నిర్ణయం తీసుకుంటాం.

ప్రశ్న: తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసుల విషయం? జవాబు: ఎత్తి వేస్తున్నాం. మలి దశ ఉద్యమంలో వందలు, వేలమందిపై కేసులు పెట్టి జైళ్లకు పంపారు. కేసులు ఎత్తివేయాలని టీఆర్‌ఎస్ అప్పుడే డిమాండ్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం మాది. ఇప్పటికే కేసుల ఎత్తివేత, రుణ మాఫీ ఫైళ్లను మూవ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు కూడా.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.