Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మార్చి 15 లోగా డ్రెరన్ పూర్తి

-శరవేగంగా కాళేశ్వరం పనులు
-మూడు పంప్‌హౌజ్‌లలో సిద్ధమవుతున్న 16 మోటర్లు
-వేగంగా కొనసాగుతున్న బిగింపు ప్రక్రియ
-ఏప్రిల్ 15 నాటికి మిగిలిన మోటర్ల బిగింపు!

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మోటర్ల డ్రైరన్ ప్రక్రియ పూర్తిచేయడానికి సర్వం సిద్ధమవుతున్నది. మార్చి 15 లోగా ముఖ్యమైన మూడు పంప్‌హౌజ్‌లలో మొత్తం 16 మోటర్ల డ్రైరన్‌ను పూర్తిచేసి పంపింగ్‌కు సిద్ధంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో మోటర్‌ను రోజుల వ్యవధిలోనే బిగిస్తున్న అధికారులు.. ఈ భారీ డ్రైరన్ ప్రక్రియను నిర్వహించేందుకు కసరత్తుచేస్తున్నారు. డ్రైరన్ ప్రక్రియ పూర్తయితే గోదావరి నదీమార్గంలోనే ఎల్లంపల్లి వరకు జలాలను ఎత్తిపోసేందుకు మోటర్లు సిద్ధమవుతాయి. గోదావరినుంచి ప్రస్తుతం రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఈ మోటర్లను బిగిస్తున్నారు. వర్షాకాలం నాటికి నీటిని ఎత్తిపోయాలన్న సీఎం కేసీఆర్ నిర్దేశించిన గడువు సమీపిస్తుండటంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ఇందులో భాగంగా మేడిగడ్డ బరాజ్ మొదలు ఎల్లంపల్లి జలాశయం వరకు నీటిని తరలించేందుకుగాను లింకు-1లో మూడుచోట్ల పంపుహౌజ్‌లను ఏర్పాటుచేశారు.

మేడిగడ్డ బరాజ్ ఫోర్‌షోర్ నుంచి కన్నెపల్లి పంపుహౌజ్ ద్వారా తొలుత నీటిని లిఫ్టు చేయనున్నారు. ఇందుకోసం కన్నెపల్లి పంపుహౌజ్‌లో 11 మోటర్లను ఏర్పాటుచేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆరింటిని బిగించారు. ఆ తర్వాత నీటిని అన్నారం బరాజ్‌లో పోసి, దాని ఫోర్‌షోర్ నుంచి నీటిని మళ్లీ లిఫ్టు చేసి సుందిళ్ల బరాజ్‌లో పోస్తారు. అన్నారం పుంపుహౌజ్‌లో ఎనిమిది మోటర్లను అమర్చాల్సి ఉండగా నాలుగింటిని ఇప్పటికే బిగించారు. మార్చి 15 నాటికి మరో రెండు మోటర్ల బిగింపు ప్రక్రియ పూర్తవుతుందని కాళేశ్వరం చీఫ్ ఇం జినీర్ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ తర్వాత సుందిళ్ల బరాజ్ ఫోర్‌షోర్ నుంచి నీటిని లిఫ్టుచేసి ఎల్లంపల్లి జలాశయానికి తరలించనున్నారు. ఇందుకుగాను గోలివాడ పంపుహౌజ్‌లో ఎనిమిది మోటర్లను అమర్చాల్సి ఉంది. ఇప్పటివరకు నాలుగు మోటర్లను అమర్చారు. ఈ మోటర్లన్నింటికీ దశలవారీగా డ్రైరన్‌ను పూర్తిచేయనున్నారు. వచ్చేనెల 15లోగా ఈ ప్రక్రియను పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించామని సీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.

నెలన్నర రోజులు కీలకం
మేడిగడ్డ బరాజ్ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్టుచేసి వరుస బరాజ్‌ల ద్వారా ఎల్లంపల్లి తద్వారా ప్యాకేజీ-6, 8 మీదుగా ఎస్సారెస్పీ వరద కాల్వకు గోదావరి జలాల్ని తరలించాల్సి ఉంటుంది. ఆపై ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ పునర్జీవన పథకం ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి, మరో టీఎంసీ నీటిని మిడ్‌మానేరుకు తరలించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ వర్షాకాలం నుంచే నీటిని విడుదల చేసి పెద్దఎత్తున చెరువులను నింపాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఎస్సారెస్పీ పరిధిలోని కీలకమైన కాకతీయకాల్వ ఆధునీకరణ పనుల్లో వేగం పెంచారు. మరోవైపు చెరువులను నింపేందుకు చేపట్టాల్సిన పనులపైనా దృష్టి సారించారు. మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీలు తరలించాలంటే కన్నెపల్లి, అన్నారం, గోలివాడ పంపుహౌజ్‌ల్లో మరికొన్ని మోటర్ల బిగింపు కూడా పూర్తి కావాల్సి ఉన్నది.

మేడిగడ్డలో ఐదు, అన్నారంలో రెండు, గోలివాడలోనూ మరో రెండు మోటర్ల బిగింపు ప్రక్రియను పూర్తిచేయాలి. మార్చి 15లోగా సివిల్ పనులను పూర్తిచేసి, ఏప్రిల్ 15లోగా ఎలక్ట్రో-మెకానికల్ పనులు (మోటర్ల బిగింపు, సంబంధిత పనులు) పూర్తిచేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రాజెక్టు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో రానున్న నెలన్నర రోజులు కీలకం కానున్నాయి. ఈ మేరకు అధికారులు కూడా ప్రణాళిక రూపొందించుకున్నారు. వచ్చే నెల 15 లోగా 16 మోటర్లకు డ్రైరన్ పూర్తిచేస్తే అధికారులపై చాలావరకు భారం తగ్గుతుంది. ఆ తర్వాత నెలరోజుల్లో మిగిలిన తొమ్మిది మోటర్ల బిగింపు, డ్రైరన్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎల్లంపల్లి తర్వాత జలాలను ఎత్తిపోసేందుకుగాను నిర్మిస్తున్న మేడారం, రామడుగు పంపుహౌజ్‌ల్లోనూ నాలుగు మోటర్ల బిగింపు, డ్రైరన్ పూర్తయింది. రెండుచోట్లా ఐదో మోటరు బిగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే రెండు చోట్లా మరో రెండు మోటర్ల బిగింపు పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ పనులను కూడా నిర్ణీత సమయంలోనే పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.