
-ఎట్టి పరిస్థితుల్లో జూన్‌లో కాళేశ్వరం నీళ్లు అందాలి: సీఎం కేసీఆర్ -ఏప్రిల్‌లో ట్రయల్న్‌క్రు కాఫర్ డ్యామ్ -వర్షాకాలంలో మిడ్‌మానేరుకు గోదావరి నీరు -సాగునీటి కోసం ఆశగా చూస్తున్న రైతులు -యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలి -ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీలకు సీఎం కేసీఆర్ ఆదేశం -ప్రాజెక్టులు పూర్తిచేసి చిత్తశుద్ధి చాటుకుంటామని వ్యాఖ్య -ప్రాజెక్టుల యాత్రలో తొలిరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన -మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌజ్ పనుల పరిశీలన -నేడు జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ పనుల సందర్శన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని బరాజ్‌లు, పంపుహౌజ్‌ల నిర్మాణపనులన్నీ మార్చి చివరినాటికే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాగునీటిశాఖ అధికారులు, వర్క్‌ఏజెన్సీలను ఆదేశించారు. గోదావరిలో కాఫర్‌డ్యామ్ ఏర్పాటుచేసుకొని ఏప్రిల్ నెలలో ప్రాజెక్టు ట్రయల్న్ నిర్వహించాలని చెప్పారు. ఈ వర్షాకాలంలో జూన్ నుంచి గోదావరి నీటిని కరీంనగర్‌లోని మిడ్‌మానేరు వరకు ఎత్తిపోసేలా ప్రణాళిక రూపొందించుకొని అమలుచేయాలని సూచించారు. రైతులు సాగునీటి కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌజ్‌ను సందర్శించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించారు.

అక్కడికక్కడే సాగునీటి శాఖ ఇంజినీర్లు, వర్క్‌ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బరాజ్‌లతోపాటు పంపుహౌజ్‌ల నిర్మాణ పనులు, మోటర్ల ఏర్పాటు పనులన్నీ సమాంతరంగా పూర్తికావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్చి 31వ తేదీ వరకు ప్రధానమైన ప్రాజెక్టు పనులన్నీ పూర్తిచేసి ఏప్రిల్, మే నెలల్లో ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌లో ఈ ప్రాజెక్టు నుంచి రైతులకు సాగునీరు అందించడానికి సిద్ధంకావాలని స్పష్టంచేశారు. గోదావరినదిలో తెలంగాణ వాటా నీళ్లను వీలైనంత త్వరగా ఉపయోగించుకోవాలంటే ఈ ప్రాజెక్టులో పంపుహౌస్‌ల నిర్మాణం, మోటర్ల బిగింపు పనుల ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. గోదావరికి రెండువైపుల ఉండే ఫ్లడ్ బ్యాంక్స్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ మట్టిపని, రివిట్మెంట్ పనులను జలాశయం మట్టం దాకా పూర్తిచేయాలని సూచించారు.
మేడిగడ్డ బరాజ్ గేట్ల ఏర్పాటు పనులను, గేట్లను ఆపరేట్‌చేసే విధానాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనులను జనవరి నెలాఖరులోగా పూర్తిచేయాలని అన్నారు. ఈ బరాజ్ కాంక్రీట్ వర్క్ రోజుకు పదివేల క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా చేయాలని వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. కన్నెపల్లి పంపుహౌస్ ఫోర్‌బే, హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించిన సమయంలో హెడ్ రెగ్యులేటర్ పనుల్లో ఉన్న సాంకేతిక లోపాలను సవరించాలని అధికారులకు సూచించారు. కన్నెపల్లి పంపుహౌస్ పనులను, ఇక్కడ పదకొండు పంపులు బిగించే ప్రక్రియను మార్చి 31వ తేదీలోగా పూర్తిచేయాలని అన్నారు. సముద్రమార్గంలో చెన్నై దాకా చేరుకొని పోర్టులో ఉన్న మోటర్లను వెంటనే తెప్పించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. నిధులపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తిచేసే విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి చాటుకుంటుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎంవో సెక్రటరీ ప్రతి పదిరోజులకు ఒకసారి పర్యవేక్షిస్తారని కేసీఆర్ తెలిపారు. \

సబ్‌స్టేషన్ నిర్మాణపనులను పూర్తిచేయాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును ముఖ్యమంత్రి ఫోన్లో ఆదేశించారు. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, దివాకర్‌రావు, శ్రీధర్‌బాబు, టీఎస్ ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, లిఫ్ట్ సలహాదారు పెంటారెడ్డి, ఎల్అండ్టీ సీఎండీ సుబ్రమణ్యన్, మెగా ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ల ద్వారా మేడిగడ్డ బరాజ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఆర్ భాస్కరన్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సాయంత్రం 5.30 గంటలకు కన్నెపల్లి పంపుహౌస్ వద్ద తన తొలిరోజు పర్యటన ముగించుకొని సీఎం కేసీఆర్ కరీంనగర్ చేరుకున్నారు. మళ్లీ బుధవారం ఉదయం రెండోరోజు ముఖ్యమంత్రి పర్యటన కన్నెపల్లి పంపుహౌస్ గ్రావిటీ కెనాల్ నుంచి ప్రారంభం అవుతుందని కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు.
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

మల్యాల/ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లాలో నిర్మిస్తున్న ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వస్తున్నందున ఏర్పాట్లను కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ మంగళవారం పరిశీలించారు. మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్ వద్ద హెలిప్యాడ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ.. వ్యూ పాయింట్, ఫొటో గ్యాలరీ, పాత్రికేయుల అనుమతి, రివ్యూ రిపోర్టు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు రాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్ వద్ద పనులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పరిశీలించి మాట్లాడారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద కాల్వ నిరంతరం జలకళ సంతరించుకొని జగిత్యాల జిల్లా సస్యశ్యామలం కానున్నదన్నారు. అధికారుల వెంట జేసీ బేతి రాజేశం, ఆర్డీవో డాక్టర్ ఘంటా నరేందర్, అదనపు ఎస్పీ మురళీధర్, డీఎస్పీ వెంకటరమణ, వరద కాల్వ ఈఈ సుధాకిరణ్, డీఈ రాంప్రదీప్ తదితరులున్నారు.


