-దూసుకుపోతున్న టీఆర్ఎస్ శ్రేణులు -లక్ష్యసాధన దిశగా అడుగులు

గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. పలుచోట్ల లక్ష్యానికి మించి చేపడుతుండగా చాలాచోట్ల లక్ష్యానికి చేరువలో ఉన్నారు. గడువు సమీపిస్తున్న కొద్దీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొని పలువురికి సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. పిడికెడు మందితో ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్, ఇప్పుడు మహావృక్షంగా ఎదిగిందన్నారు. 70లక్షల సభ్యత్వాలతో దేశంలోనే అధిక సభ్యత్వాలు గల పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందన్నారు.

శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, సభ్యత్వ నమోదు ఇంచార్జి మందుల సామేల్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు, జీసీసీ చైర్మన్ ధరావత్ మోహన్‌గాంధీ నాయక్, నియోజక వర్గ పరిశీలకుడు జన్ను జకర్య తదితరులతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో 75 వేల సభ్యత్వ నమోదే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే పాలకుర్తిని ప్రథమ స్థానంలో నిలుపాలని, 15వ తేదీలోగా సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని కోరారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్లో నిర్వహించిన సభ్యత్వ నమోదులో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే జీ సాయన్న, నాయకులు తలసాని సాయికిరణ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ చిరుమల్ల రాజేశ్‌కుమార్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పాల్గొన్న సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ఉద్యమంలా కొనసాగుతున్నదన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 80 శాతం వరకు పూర్తయిందని, మరో రెండు రోజుల్లో వంద శాతం పూర్తికానున్నదని తెలిపారు. అనంతరం సభ్యత్వ నమోదు ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, పాలేరు నియోజకవర్గంలోని చేగొమ్మలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు శేరి నర్సింగ్‌రావు తదితరులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, సివిల్ సప్లయీస్ కార్పొరేష్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ సభ్యత్వాలను అందజేశారు.

ఉమ్మడి వరంగల్‌లో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్ చేతుల మీదుగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వికలాంగుల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ములుగులో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు సమీక్షలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్, మాజీ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు.

వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

వరంగల్ నగరంలోని 9వ డివిజన్ లక్ష్మీపురం కూరగాయలు, పండ్ల మార్కెట్లలో వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని సభ్యత్వాలను అందజేశారు. ఖతార్‌లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షుడు అబ్బగాని శ్రీధర్, ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికేని ఆధ్వర్యంలో శనివారం సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఖతార్ శాఖ ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేశ్ కోరం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి, జగ్గసాగర్‌లో సభ్యత్వ నమోదు చేపట్టారు.
