Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మరో ఆర్థిక రాజధాని వరంగల్

-కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు 22న సీఎం శంకుస్థాపన -రూ. 25 కోట్లతో మడికొండ ఐటీపార్కు విస్తరణ -ఔటర్‌రింగ్ రోడ్డుతో మారనున్న దశ దిశ -వరంగల్ పర్యటనలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ -డిప్యూటీ సీఎం కడియంతో కలిసి టెక్స్‌టైల్ పార్కు సందర్శన -టెక్స్‌టైల్‌పార్కు లోగో, పైలాన్ ఆవిష్కరణ -మన వస్త్రపరిశ్రమ పోటీ విదేశాలతోనేనని వ్యాఖ్య -వరంగల్ టాస్క్ కేంద్రం ప్రారంభం -స్థానిక విద్యార్థులకు అక్కడే ఉద్యోగావకాశాలు

వరంగల్ నగరాన్ని తెలంగాణకు మరో ఆర్థిక రాజధానిగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. రాజధాని హైదరాబాద్ తరువాత వరంగల్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలికసదుపాయాలు కల్పించి, అద్భుతమైన పారిశ్రామికవాడగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తున్నదని అన్నారు. శనివారం వరంగల్ పర్యటనలో భాగంగా నిట్ ఆడిటోరియంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించారు. వరంగల్ అభివృద్ధిపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే వరంగల్ శివారులోని మడికొండ ఐటీపార్కును రూ.25కోట్లతో విస్తరిస్తామని ప్రకటించారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఈ నెల 22న దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కోయంబత్తూరు తరహాలో వరంగల్‌లో టెక్స్‌టైల్ కళాశాలనూ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణంతో వరంగల్ దశ దిశ మారనున్నాయని కేటీఆర్ తెలిపారు. నిట్‌లో టాస్క్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన పలు కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకొన్నారు. ఆ తరువాత కేటీఆర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. జీవితంలో ఎదురుదెబ్బలు కచ్చితంగా తగులుతాయి. వాటిని దీటుగా ఎదుర్కొన్నప్పుడే యువతలోని అసలైన చాలెంజ్ బయటపడుతుంది. ఉద్యోగం రాలేదని, టెన్త్, ఇంటర్‌లో ఫెయిలయ్యామని, ఇంట్లో అమ్మతిట్టిందని, సెల్‌ఫోన్, బండి కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకొంటున్నారు. మానసికంగా బలంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది.

నిట్‌లో, హైదరాబాద్, అమెరికాలోని ఏ కళాశాలలో ఎంత పెద్ద చదువులు చదివినా మానసికంగా దృఢంగా లేకపోతే జీవితంలో రాణించడం కష్టం. నేను ఒక పారిశ్రామికవేత్తను కావాలి, ఒక పరిశ్రమను పెట్టాలి, ఒకటి కనిపెట్టాలి, నా కాళ్లమీద నిలబడి వందమందికి ఉపాధి కల్పించాలంటే ముందుగా మానసిక సంతులనం అవసరం. ఒక్క ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఇక జీవితమే అయిపోయిందని ఆగిపోతే కరెక్ట్ కాదు.. టాస్క్ వరంగల్ రీజినల్ సెంటర్.. చదువులు పూర్తిచేసుకుని నిజమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు అన్నింటికీ మీరు సిద్ధపడేవిధంగా తీర్చిదిద్దుతుంది అని అన్నారు. మానసికంగా దృఢంగా ఉండటం అంటే ఏమిటో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ను చూసి తెలుసుకోవాలని వేదికపైనే ఉన్న ఆయన్ని చూపుతూ కేటీఆర్ చెప్పారు. 1987లో హైదరాబాద్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వసీంఅక్రమ్ లాంటి ఫాస్ట్‌బౌలర్ బౌలింగ్‌లో గాయపడ్డా, తట్టుకొని నిలబడ్డ శ్రీకాంత్ దృఢచిత్తాన్ని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వరంగల్ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయటంతోపాటు, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, టెక్స్‌టైల్ పార్కు, ఐటీపార్కు ఇవన్నీ అభివృద్ధి పర్చడానికి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు వరంగల్‌పై అపారమైన ప్రేమ ఉన్నదని, ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఉపముఖ్యమంత్రి కడియంశ్రీహరి మాట్లాడుతూ, టాస్క్ రీజినల్ సెంటర్ ద్వారా నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఐటీహబ్ ద్వారా మడికొండలో మూడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయని, మరికొన్ని కంపెనీలు కూడా వరంగల్‌కు రానున్నాయని దీనిద్వారా ఇక్కడి విద్యార్థులకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఇప్పుడున్న ఐటీ పార్కును విస్తరించటంతోపాటు ఇంక్యుబేషన్ సెంటర్లను ఇంకా విస్తరించాలని, అవసరమనుకుంటే కొన్ని నిధులు వెచ్చించి ఐటీటవర్ నిర్మిస్తే ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్‌ను కోరారు.

ఫాం టు ఫ్యాషన్

మెగా టెక్స్‌టైల్ పార్కు ద్వారా 1.20లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని మంత్రి చెప్పారు. ఈ పార్కు రెండో దశకోసం 800ఎకరాల భూమిని సేకరిస్తామన్నారు. భూములు కోల్పోయిన రైతులకు టెక్స్‌టైల్ పార్కులో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా పునర్వినియోగ పద్ధతిలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని ఆయన వివరించారు. ఫాం టు ఫ్యాషన్ అన్న ఆలోచనతో టెక్స్‌టైల్‌పార్కును ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. భారతదేశంలో అత్యుత్తమ పత్తి మనదగ్గరే ఉత్పత్తి అవుతున్నదని, 60లక్షల బేళ్లు ఉత్పత్తి అయితే అందులో 10 లక్షల బేళ్లను మాత్రమే మనం వినియోగించుకుంటున్నామని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఇతర రాష్ర్టాల్లో స్థిరపడిన చేనేత కార్మికులతో సమావేశమై వారందరినీ స్వస్థలం తీసుకొస్తామని హామీ ఇచ్చారని, దాంట్లో భాగమే ఈ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. 22న టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన అనంతరం 10నుంచి 12 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకోబోతున్నాయని, వారు ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు.. ఎంతమందికి ఉపాధి కల్పించనున్నారు అనేది అదే రోజు వెల్లడిస్తారని పేర్కొన్నారు. దక్షిణకొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ (మిస్టర్ సంగ్ నేతృత్వంలో)కూడా అదే రోజు ఎంవోయూపై సంతకం చేయబోతున్నదన్నారు. నిష్ణాతులైన పీఎస్‌జీ కోయంబత్తూరు సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, వారితో ఇక్కడే టెక్స్‌టైల్ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నామని కూడా మంత్రి చెప్పారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ద్వారా కేంద్రం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. వరంగల్ ఔటర్‌రింగ్‌రోడ్డుతో ఈ పార్కును అనుసంధానిస్తామని తెలిపారు. టెక్స్‌టైల్ పార్కులోనే కాలనీలను అభివృద్ధి చేస్తామని అన్నారు. హైదరాబాద్ టు వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని, భువనగిరి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మడికొండ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని పారిశ్రామిక సంస్థలు నెలకొల్పామని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు వస్తాయని ఆయన చెప్పారు.

టెక్స్‌టైల్ హబ్‌గా వరంగల్: కడియం అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుతో వరంగల్ రూపురేఖలే మారిపోనున్నాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 22న ఘనస్వాగతం పలికేందుకు ప్రజలందరూ పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట.. ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, అరూరి రమేశ్, వినయ్‌భాస్కర్, సతీశ్‌బాబు, రెడ్యానాయక్, తాటికొండ రాజయ్య, మండలి విప్ బీ వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్‌పర్సన్ జీ పద్మ, వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, మున్సిపల్ కమిషనర్ శ్రుతి ఓజా, పోలీస్‌కమిషనర్ జీ సుధీర్‌బాబు, మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, గిరిజన సహకార సంస్థ చైర్మన్ గాంధీనాయక్, ఆగ్రోస్ చైర్మన్ కిషన్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, రాష్ట్ర సహాయకార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కేయూ వీసీ సాయన్న, నిట్ ఇంచార్జి డైరెక్టర్ జీఆర్సీ రెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.

22న టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో, దేశంలోనే అతి పెద్ద వస్త్రపరిశ్రమను వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటుచేస్తుండటం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ ఇతర దేశాలతోనే పోటీ పడుతుందని అన్నారు. దేశంలో ఉత్పత్తిఅయ్యే వస్ర్తాలన్నింటినీ ఇక్కడినుంచే ఉత్పత్తిచేయనున్నట్లు వివరించారు. ఈ నెల 22న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నందున ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఉపముఖ్యమంత్రి కడియంశ్రీహరి, వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి కేటీఆర్ శనివారం సందర్శించారు. టెక్స్‌టైల్ పార్కు కోసం గీసుగొండ మండలం శాయంపేట హవేలి, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల మధ్య సేకరించిన 1200ఎకరాల భూమిని ఆయన పరిశీలించారు. 40ఎకరాల విస్తీర్ణంలో అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగసభ కోసంచేస్తున్న ఏర్పాట్లపై ఆరాతీశారు. అనంతరం టెక్స్‌టైల్‌పార్కు స్థలంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి టెక్స్‌టైల్ పార్కులోగో, పైలాన్ నమూనాలను కేటీఆర్ ఆవిష్కరించారు.

సీఎం హామీలపై నిర్లక్ష్యం తగదు: కేటీఆర్ సీఎం కేసీఆర్ వరంగల్‌కు ఇచ్చిన హామీల అమలులో అలక్ష్యం చేయొద్దని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో కార్పొరేషన్ అభివృద్ధిని ఆయన సమీక్షించారు. నగరాభివృద్ధికోసం రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించిన రూ.300కోట్లతో చేపట్టిన పనులను 2018 మార్చి వరకు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రూ.300కోట్లలో రూ.283కోట్లు విడుదలైనప్పటికీ ఇప్పటివరకు రూ.50కోట్ల పనులు మాత్రమే పూర్తయినట్లు కమిషనర్ శ్రుతి ఓఝా వివరించడంపై ఆయన ఆగ్రహించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లపై ప్రయోగాలు చేయొద్దని, సీఎం మంజూరు చేసిన 3800 ఇండ్లను, మిషన్ భగీరథ పనులను 2018 మే నెల లోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

తెలంగాణ కోహ్లీ.. కేటీఆర్ -కోచ్ రవిశాస్త్రిలా డిప్యూటీ సీఎం కడియం -రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నది -మాజీ క్రికెటర్ శ్రీకాంత్ ప్రశంసలు తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించారు. తాను పొగడ్తలకోసం ఈ విషయం చెప్పడంలేదని.. యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ ఇండియన్ స్కిప్పర్ విరాట్‌కోహ్లీలా దూసుకెళ్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఐటీరంగం వేగంగా పురోగమిస్తున్నదని అన్నారు. క్రికెట్‌లో కోచ్ రవిశాస్త్రిలా రాష్ర్టాభివృద్ధిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వ్యవహరిస్తున్నారని చమత్కరించారు. తాను తమిళనాడుకు చెందినవాడినైనప్పటికీ నిజాయితీగా ఈ విషయం చెప్తున్నానన్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, జాబ్‌స్కిల్స్ ఉంటే విజయం అసాధ్యం కాదని టాస్క్ ప్రారంభోత్సవంలో విద్యార్థులకు శ్రీకాంత్ సూచించారు. క్రికెట్‌లో ధోనీ, విరాట్ కోహ్లీ సక్సెస్ అయినట్లు.. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన రంగంలో నిలబడటం సాధ్యమేనని అన్నారు. తాను మద్రాస్ ఐఐటీలో 70 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పూర్తిచేశానని.. కోరుకున్న రంగంలో రాణిస్తున్నానంటే ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణమని వెల్లడించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.