– హరితహారంతో తెలంగాణ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కుతుంది – చెట్లను రక్షించేవారికి ప్రోత్సాహం.. నరికేవారికి జైలు – అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం దేశవ్యాప్తంగా రెండో హరిత విప్లవానికి నాంది పలుకుతుందని, ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూపొందిన ఈ కార్యక్రమం సీఎం కే చంద్రశేఖర్‌రావును, తెలంగాణ ప్రభుత్వాన్ని గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కిస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు సోమవారం నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలు..
హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయా? కొన్ని నర్సరీలలో మొక్కలు ఇంకా నాటే స్థాయికి ఎదగలేదంటున్నారు. దీనిపై మీరేమంటారు? గత కొన్నిరోజులుగా నాతోపాటు ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ హరితహారం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. అంతటా ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగాయి. మొక్కలు ఇంకా సిద్ధం కాలేదనడం అవగాహనలేనివారు మాట్లాడే మాటలే. దాదాపు 3,900 నర్సరీలలో ముందుగా నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం 40కోట్ల మొక్కలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అవి నాటే స్థితికి ఎదిగాయి. జూలై 3న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుంది.
హరితహారం కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి చేరుతుందని మీరంటున్నారు. ఇది ఎలా సాద్యం?
రాష్ట్రం మొత్తాన్ని పచ్చని హరితహారంగా మార్చడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా మా ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌గా ప్రకటించింది. హరితహారం అమలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మూడేండ్లలో దాదాపు 230కోట్ల మొక్కలను నాటాలని, తెలంగాణను పచ్చని తోరణంగా మార్చాలని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం నాటి అశోక చక్రవర్తిని తలపిస్తుంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ఇన్ని మొక్కలను నాటడం సాధారణ విషయం కాదు. చైనాలోని గోబీ ఎడారిలో, బ్రెజిల్‌లో కొన్ని లక్షల మొక్కలను నాటితేనే ఆ దేశాలు రికార్డులకెక్కాయి. కొత్త రాష్ట్రంలో ఇంత భారీ సంకల్పంతో, నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించడం ఖాయం. మరో హరిత విప్లవానికి హరితహారం నాంది పలుకడం ప్రజలందరికీ గర్వకారణం.
రాష్ట్రంలో అడవులు ఆందోళనకరమైన రీతిలో అంతరించాయి. ఈ దశలో మీరు మూడేళ్లలో వందకోట్ల మొక్కలు నాటి అడవులకు పూర్వవైభవం తేవడం సాధ్యమేనా? ఉమ్మడి పాలనలో తెలంగాణలో విచక్షణా రహితంగా అడవుల విధ్వంసం కొనసాగిన మాట వాస్తవం. కేసీఆర్ సర్కారు హయాంలో ఆ ఆటలు సాగవు. అంతరిస్తున్న అడవుల విస్తీర్ణాన్ని పెంచడానికి వందకోట్ల మొక్కలను అటవీప్రాంతాలలో పెంచడానికి సమగ్ర ప్రణాళిక తయారు చేశాం. ప్రణాళికలో భాగంగా మొత్తం 230కోట్ల మొక్కలలో వంద కోట్లు అటవీభూములలో, 120 కోట్ల మొక్కలను అడవుల వెలుపల నాటాలని నిర్ణయించాం. పది కోట్ల మొక్కలను హెచ్‌ఎండీఏ పరిధిలోనాటుతాం.
హరితహారం కార్యక్రమంలో ప్రజలను ఏ విధంగా భాగస్వాములను చేస్తున్నారు? ప్రైవేటు సంస్థల మాటేమిటి? హరితహారం కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంలా చేపడుతున్నాం. ఇందులో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రకాల సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నాం. బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీల సభ్యులు, అడవుల్లో ఉండే చెంచులు, ఆదివాసీలతోపాటు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం.
గత ప్రభుత్వాలు కూడా ఏటా కొన్ని లక్షల మొక్కలను నాటించాయి.. కానీ వాటిని రక్షించలేకపోయాయి. మీరు కోట్ల సంఖ్యలో మెక్కలు నాటుతున్నారు. వాటి రక్షణ ఎలా? గత ప్రభుత్వాలకు, మాకు చాలా తేడా ఉంది. గతంలో కొన్ని లక్షల మెక్కలను నాటినట్లు రికార్డులలో చూపారు. ఆ తర్వాత గాలికి వదిలేశారు. కానీ మా సర్కార్ మొక్కల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. గ్రామాలవారీగా హరిత రక్షక కమిటీలను వేస్తున్నాం. అడవులను, మొక్కలను రక్షించడానికి తగిన ప్రోత్సాహకాలిస్తున్నాం.
స్థానికుల భాగస్వామ్యంతో కబ్జాకు గురైన అడవులలో అటవీ సంపదను పెంపొందించే చెట్లను పెంచుతాం. యాక్సెసరీ బెనిఫిట్ స్కీం కింద వాటిపై వచ్చే ఫలాల్లో 50శాతం స్థానికులకిస్తాం. అడవులను ధ్వంసం చేసే స్మగ్లర్లపై, చెట్లను నరికేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పదే పదే నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తాం. అటవీ చట్టాలలో శిక్షలను మరింత కఠినతరం చేస్తాం.అనుమతిలేకుండా చెట్టును నరికితే జైలుకు పంపుతాం.