Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మరో పదేండ్లూ కేసీఆరే సీఎం

-టీఆర్‌ఎస్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం -ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం -ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగిత్యాల నుంచి జైత్రయాత్ర ఖాయం : మంత్రి కేటీఆర్

రాష్ర్టానికి మరో పదేండ్లు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే ముఖ్యమంత్రిగా ఉంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు. మూడేండ్ల టీఆర్‌ఎస్ పాలనను రాష్ర్టానికి స్వర్ణయుగంగా ఆయన అభివర్ణించారు. జగిత్యాలలోని మినీ స్టేడియంలో జరిగిన జనహిత ప్రగతిసభలో మంత్రి కేటీఆర్ సుమారు 40 నిమిషాలపాటు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జైత్రయాత్ర జగిత్యాల నుంచే ఆరంభం అవుతుందని కేటీఆర్ గుర్తుచేశారు. అంతకు ముందు ఆయన కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రంలో పాగావేసేందుకే ముందస్తు ఎన్నికలకు బీజేపీ ఆలోచన చేస్తున్నదని ఈ సందర్భంగా అన్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. భారీగా ప్రజలు హాజరైన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను ఉప్పు పాతరేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు.తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడాన్ని ఎద్దేవా చేసిన మంత్రి.. కాంగ్రెస్ వాళ్లు రాజకీయ నిరుద్యోగులుగా మారితే వారికి భృతి ఇచ్చి అదుకుంటామని చురకలు అంటించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే.. గత 58 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను, టీడీపీని కడిగి పారేశారు. మధ్యమధ్యలో పిట్టకథలు చెప్తూ అలరించారు. జగిత్యాల జనహిత ప్రగతిసభకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించగా.. మంత్రి ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ వయస్సు ఇంకా 64 సంవత్సరాలే. రాజకీయాల్లో ఆయన ఇంకా యంగ్ లీడరే. ఆయన ఇప్పుడే తప్పుకోవాల్సిన అవసరం లేదు.. సీఎం కేసీఆర్ మూడేండ్లలో ఎన్నో అద్భుతాలు చేశారు. మొండిగా వెళ్లే వ్యక్తి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. – మంత్రి కే తారకరామారావు -కాంగ్రెస్‌ను ఉప్పు పాతరవేస్తేనే బంగారు తెలంగాణ -దేశానికే ఆదర్శం మన రాష్ట్ర పథకాలు -రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ కాంగ్రెస్ గెలుపు అసాధ్యం -ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగులకు భృతి మేమే ఇస్తాం -జగిత్యాల జనహిత ప్రగతి సభలో మంత్రి కే తారకరామారావు

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి 2006లో ఎన్నికల బరిలోకి దిగితే.. కేసీఆర్‌ను ఓడించి, తెలంగాణవాదంలేకుండా చేయాలని నాటి సీఎం కుట్ర చేశారని, ఆ సమయంలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు అంతా నిరాకరిస్తే.. నిస్సిగ్గుగా జీవన్‌రెడ్డి బరిలో నిలిచారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే జీవన్‌రెడ్డి సమైక్య రాష్ట్రంలో పోషించిన పాత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. తెలంగాణ అకాంక్ష బలంగా ఉన్నదని గుర్తించి, 2004 ఎన్నికల్లో ఒంటరి పోరు ద్వారా గెలువలేమని సోనియాగాంధీ నుంచి జీవన్‌రెడ్డి వరకు అంతా గులాబీ కండువా కప్పుకొని గెలిచిన మాట వాస్తవం కాదా? తెలంగాణ ఇస్తామన్న మాటను యూపీఏ నిలబెట్టుకోకపోతే.. ఆనాడు కేంద్రమంత్రి పదవిని కాలి చెప్పులా తృణప్రాయంగా వదలిపెట్టి ప్రత్యేక తెలంగాణ కోసం 2006లో కేసీఆర్ ఎన్నికల బరిలో దిగినమాట వాస్తవం కాదా? కేసీఆర్‌ను ఓడించి తెలంగాణ నినాదం లేకుండా చేయాలని నాటి సీఎం వైఎస్ కుట్రలు పన్ని, కేసీఆర్‌పై పోటీచేసే అభ్యర్థుల కోసం వెతికితే మా తెలంగాణ అకాంక్షకోసం పోరాటం చేస్తున్న కేసీఆర్‌పై పోటీచేయం అంటూ అందరూ తిరస్కరిస్తే.. నిస్సిగ్గుగా బరిలో నిలిచింది జీవన్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌పై ఎలాగూ తాను గెలువలేనని, ఆయనను ఓడించడం ఎవరితరం కాదని, కానీ, తాను ఓడిపోతే మంత్రి పదవి ఇవ్వాలంటూ బేరమాడిన చరిత్ర జీవన్‌రెడ్డిదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పొరపాటున అనాడు జీవన్‌రెడ్డి గెలిచినా.. కేసీఆర్ ఓడినా ఈనాడు తెలంగాణ వచ్చి ఉండేదా? అని ప్రశ్నించారు. 2004 ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకొని తెలంగాణ అశీర్వాదంతో గెలిచిన జీవన్‌రెడ్డి.. అంధ్రానాయకుల తొత్తుగా మారారని ఆరోపించారు. చైతన్యవంతమైన జగిత్యాలకు ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండటం సరైందేనా? అలోచించాలన్నారు. తెలంగాణ బీడు భూములను మాగాణి భూములుగా మార్చాలన్న లక్ష్యంతో కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయబద్ధంగా రావాల్సిన 1200 టీఎంసీలను మళ్లించేందుకు అనేక ప్రాజెక్టులకు కేసీఆర్ రూపకల్పన చేస్తే, చనిపోయిన వాళ్ల పేరుతో కేసులు వేయించి, వాటిని అడ్డుకోవడానికి చూస్తున్నది ఎవరో గుర్తించాలన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా జీవన్‌రెడ్డి ఒప్పుకున్నారని చెప్పారు. అనాడు వైఎస్‌తో కలిసి ఉద్యమానికి ద్రోహంచేసే ప్రయత్నం జీవన్‌రెడ్డి చేయగా.. జగిత్యాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎల్ రమణ ఇంకా చంద్రబాబు వెంట తిరుగుతున్నారని, చింత చచ్చినా పులుపు చావనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మతం పేరుతో బీజేపీ రాజకీయం -రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ.. ఆత్మగౌరవం కలిగిన ప్రాంతమని, ఇక్కడ కులమత విభేదాలకు తావులేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జనహిత ప్రగతి సభలో ఈటల మాట్లాడుతూ, ఎర్రని ఎండలో సైతం కేటీఆర్, కవితలకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చారంటూ ప్రజలను అభినందిం చారు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తదుపరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సమీక్ష సమావేశానికి హాజరయ్యారని, సమీక్షలో ఎంపీ కవిత అడుగగానే బోర్నపెల్లి వంతెనకోసం రూ.70 కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో అధికార పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోటనే నిధులు మంజూరయ్యేవని, కానీ.. సీఎం కేసీఆర్ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి శ్రమిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి విషయంలో పార్టీలతో సంబంధం లేదని, ఇక్కడ మట్టిబిడ్డల సంబంధం మాత్రమే ఉందని అన్నారు. మూడేండ్లలో 300 రివ్యూలు చేసి.. 200 జీవోలు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ైఫ్లెఓవర్‌ల నిర్మాణం రెండేండ్లో పూర్తవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల మూర్ఖపు పాలన వల్ల తెలంగాణ పూర్తిగా నష్టపోయిందని ఈటల అన్నారు. అన్యాయం, అక్రమాలతో తెలంగాణ ప్రజలు ఆక్రందనలు చేశారన్నారు. అధికారం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ మనుగడలో ఉంటుందని, అధికారంలేకపోవడాన్ని అది జీర్ణించుకోలేదని ఎద్దేవాచేశారు. దొంగ ఏడుపులు, నంగనాచి కబుర్లతో మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు వస్తున్నదని, దాన్ని నమ్మవద్దని చెప్పారు. ఆత్మగౌరవానికి విలువ ఇచ్చే తెలంగాణలో మతం పేరుతో రాజకీయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఈటల విమర్శించారు. తెలంగాణలో కులమతాలకు తావులేదన్న ఈటల.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కదని స్పష్టంచేవారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అధికారంలోకి వస్తే నిరుద్యోగభృతి ఇస్తామంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడాన్ని కేటీఆర్ ఎద్దేవాచేశారు. భవిష్యత్తులో దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పారు. ఆ తరుణంలో రాజకీయ నిరుద్యోగులుగా మారే కాంగ్రెస్ నాయకులకు తాము నిరుద్యోగ భృతి ఇస్తామని చురకలు వేశారు. 70 ఏండ్ల దరిద్రాన్ని, బాధలను మిగిల్చిన కాంగ్రెస్‌ను ఉప్పుపాతర వేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై కాంగ్రెస్ నేతలు అవినీతి ఆరోపణలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. అసలు అవినీతి, దోపిడీ ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు.

ఆకట్టుకున్న అన్నా చెలెళ్ల కథలు.. చంద్రబాబు.. ముంచే సీఎం! జగిత్యాల సభలో కేటీఆర్, ఆయన సోదరి, ఎంపీ కవిత చెప్పిన కథలు సభికులను నవ్వించాయి. కేటీఆర్ ఒక కథ చెప్తూ.. 2001లో చంద్రబాబు ధర్మపురిలో గోదావరి పుష్కరాలకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పండితుడు గోదావరిలో మునగాలని చంద్రబాబుకు చెప్పారు. రెండు మూడుసార్లు చెప్పినా చంద్రబాబు మునగలేదు. దీంతో ఆ పండితుడు పక్కన ఉన్న ఓ అటెండర్‌తో ఎన్నిసార్లు మునుగుమన్నా చంద్రబాబు మునగడం లేదు.. ఏమిటీ? అనడిగారు. అందుకు ఆ అటెండర్ మా సార్‌కు ముంచడమే తప్ప మునగటం తెలియదంటూ సమాధానం చెప్పాడు అనేసరికి సభలో పెద్ద ఎత్తున నవ్వులు విరిశాయి.

వాళ్లు సెల్ఫిష్‌లు మరోకథ చెప్తూ.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట చెరువును మిషన్ కాకతీయ కింద బాగుచేశాం. ఆ చెరువును చూసేందుకు జీవన్‌రెడ్డి వెళ్లారట. అప్పుడు చెరువులోని పిల్ల చేప తల్లిని అడిగింది.. చెరువు గట్టుమీద మూడురంగుల కండువా కప్పుకొన్న వారెవ్వరని! అప్పుడు తల్లి చేప.. మనం చెరువులో ఉండే ఫిష్‌లం అయితే.. వారు సెల్ఫిష్‌లు అంటూ పిల్లచేపకు చెప్పింది.. అనగానే సభకు వచ్చినవారంతా నవ్వేశారు. దానితోపాటు పెద్ద పెట్టున జై తెలంగాణ నినాదాలు చేశారు. అలాగే తల్లిని, తండ్రిని చంపిన ఓ వ్యక్తి జడ్జి ముందుకు వచ్చి.. తల్లి తండ్రీ లేనివాడినని, తనకు శిక్ష విధించవద్దని చేతులు కట్టుకొని నక్క వినయం ప్రదర్శించిన మరో కథను కేటీఆర్ చెప్పారు. దీనిని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి చెప్పడంతో అంతా నవ్వేశారు. జీవన్‌రెడ్డి.. ముసలి పులి బంగారు కడియం జీవన్‌రెడ్డిని చూస్తే ముసలి పులి, బంగారు కడియం కథ గుర్తుకు వస్తుందని ఎంపీ కల్వకుంట్ల చెప్పారు. శక్తులుడిగిన ముసలిపులి వద్ద ఒక బంగారు కడియం ఉండేది. దానిని చూపిస్తూ, అందరినీ పులి పిలిచేది. వారు కడియం కోసం దగ్గరకు రాగానే వారిని చంపి తినేసేది. జీవన్‌రెడ్డి పరిస్థితి సైతం అలాగే ఉంది.. అంటూ చమత్కారంగా వ్యాఖ్యానించడం అందరినీ ఆకట్టుకుంది.

సంక్షేమానికి స్వర్ణయుగం రాష్ట్రంలో మూడేండ్ల టీఆర్‌ఎస్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమని కేటీఆర్ అభివర్ణించారు. పేదల సంక్షేమానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. అనేక రాష్ర్టాలు కేసీఆర్ చేపట్టిన పథకాలను అదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. పెన్షన్లు మొదలుకొని సన్నబియ్యం, కల్యాణలక్ష్మి వరకు పేదలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అమ్మ ఒడి పథకంకింద గర్భిణులకు రూ.12 వేలతో పాటుగా పుట్టిన పిల్లలకు 13 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ కూడా అందజేయనున్నారని చెప్పారు. 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో అధిక సమయం పాలించిన కాంగ్రెస్ నేతలు ఇంతకాలం ఏం చేశారో చెప్పకుండా.. మూడేండ్ల ముక్కుపచ్చలారని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ రెండేండ్లలో తాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడుగబోమని ప్రకటించిన దమ్మున్న సీఎం మన కేసీఆర్ అన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలను ప్రస్తావించిన కేటీఆర్.. రూ.1.49 కోట్ల బడ్జెట్‌లో రూ.40వేల కోట్లు సంక్షేమంపై ఖర్చు పెడుతున్నామని చెప్పారు. నిరుపేద యువతులు గర్భవతులైనా పనులకు వెళుతూనే ఉంటారు. నిజానికి వారికి ఆరు నెలలు విశ్రాంతి అవసరం. వారిని అదుకోవాలన్న సంకల్పంతో అమ్మ ఒడి పథకాన్ని జూన్ 2 నుంచి అమల్లోకి తెస్తున్నాం.

భవిష్యత్తు టీఆర్‌ఎస్‌దే -నలభై ఏండ్ల కలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది -నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సంక్షేమం, అభివృద్ధి ఎజెండాలుగా ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌దే భవిష్యత్తు అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. జగిత్యాల జనహిత ప్రగతి సభకు కవిత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా కావాలన్నది ఇక్కడి ప్రజల 40 ఏండ్ల ఆకాంక్ష అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్దిపేట, మంచిర్యాలతోపాటు జగిత్యాలను తెలంగాణ రాష్ట్రంలో జిల్లాగా చేస్తామని ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆనాడు ప్రకటించారని, రాష్ట్ర ఏర్పాటు తదుపరి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. తాంబాళం, బతుకమ్మ లెక్క గుండ్రగా అందంగా జగిత్యాల భౌగోళిక పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్న సమయంలోనే మంత్రులు రాజన్న, రామన్న సహాయ సహకారాలతో జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటామని ప్రకటించామన్నారు. పదిహేను రోజుల క్రితం నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ను జగిత్యాల జిల్లాలోని మూడు మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని, కోరగానే నిధులు ఇచ్చారని చెప్తూ.. కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజవకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరిందని, జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్‌కు చెందిన జీవన్‌రెడ్డి గెలిచారన్నారు. జీవన్‌రెడ్డిని చూస్తే ముసలి పులి, బంగారు కడియం కథ గుర్తుకు వస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను చూసి టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులకు జీవన్‌రెడ్డి ఫోన్లు చేసి పోవద్దు అంటూ ఆపివేస్తున్నాడన్నారు. ఇదే విషయాన్ని పలువురు ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తూ.. ఎన్నడూ ఫోన్ చేయని ఎమ్మెల్యే.. టీఆర్‌ఎస్ పుణ్యమాని ఫోన్ చేశాడని, అయినా టీఆర్‌ఎస్‌లో చేరుతామంటూ ముందుకు వస్తున్నారని చెప్పారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో 85 శాతం ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారని కవిత తెలిపారు. భవిష్యత్తులో మరింతమంది టీఆర్‌ఎస్‌లోకి వస్తారన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వం అధికంగా నమోదైందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. భవిష్యత్తులో మైనారిటీల దీవెనలు ఉంటే మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.

ప్రసవించే తల్లి ఖాతాలో రూ.12వేలు జమచేస్తాం. ఇందుకోసం రూ.605 కోట్లు పెట్టుకున్నాం అని కేటీఆర్ చెప్పారు. అన్నం ఉడికిందా? లేదా? చూడటానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే సరిపోతుందన్న మంత్రి.. మూడేండ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను గమనించి.. ఇది పేదల ప్రభుత్వమా? పెద్దల ప్రభుత్వమా? అన్నది మీరే తేల్చాలని సభకు వచ్చినవారిని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లో సన్న బియ్యం పెట్టిన ఘతన మన ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కేటీఆర్ పిల్లలు, కవిత పిల్లలు ఏ భోజనం చేస్తున్నారో, పేదపిల్లలు సైతం పాఠశాలలు, వసతిగృహాల్లో అదే భోజనం చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉచితంగా ఎరువులు అందించడానికి ఎకరాకు నాలుగువేలు ఇస్తామని ప్రకటించిన ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు. ఈ విధాన ప్రకటన ద్వారా తాను రైతు పక్షపాతి అని మరోమారు నిరూపించుకున్నారని అన్నారు. అన్ని అంశాలపై పరిపూర్ణ అవగాహన ఉన్న నేత మనకు ముఖ్యమంత్రిగా దొరకడం నిజంగా మన అదృష్టమన్నారు. మట్టికైనా ఎట్టికైనా మనోడే కావాలని జయశంకర్‌సార్ అనే వారు. అమరావతిలో ఉన్న వాళ్లకు బానిసలు.. ఢిల్లీ నాయకుల కాళ్ల దగ్గరున్న వారు మనకు అవసరంలేదు. తెలంగాణలో మన పార్టీయే ఉండాలి. కాంగ్రెస్ పార్టీని ఉప్పు పాతరేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సభలో జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.