Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మార్పుకోసం యుద్ధం సంఘటితశక్తిగా గ్రామజ్యోతిని వెలిగిద్దాం

అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాల్లో మార్పుకోసం యుద్ధం ప్రకటిద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇందుకోసం గ్రామస్థులంతా సంఘటిత శక్తిగా మారి గ్రామజ్యోతిని వెలిగించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి చూస్తుంటే దుఃఖం వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం.. ప్రగతికి పట్టుకొమ్మలుగా నిలువాల్సిన గ్రామాలు ఇంకెన్నాళ్లు ఇలా మురికికూపంలో మగ్గాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా ప్రజల భాగస్వామ్యం లేనంతవరకు గ్రామ సమగ్రాభివృద్ధి అసాధ్యమని కేసీఆర్ ఆన్నారు. తమ గ్రామాన్ని తామే అభివృద్ధి చేసుకోవాలనే తపన, గట్టి పట్టుదలతో సమిష్టి కృషి జరిగితే తప్ప విముక్తి లేదన్నారు.

KCR-interact-with-public-in-Gramajyothi-Programme-at-Erravelli-village-of-Gajwel-Constituency

-గ్రామాల పరిస్థితి చూస్తే దుఃఖం వస్తున్నది – నిధులు వస్తున్నా పరిస్థితులు మారలేదు – గ్రామజ్యోతి ద్వారా గ్రామాలను బాగు చేసుకోవాలి – సాగునీరు, తాగునీరు, విద్యుత్ అంశాలు ప్రభుత్వ బాధ్యత గ్రామాభివృద్ధి గ్రామ ప్రజల బాధ్యత -సంఘటిత కార్యాచరణ పరిశుభ్రతతో ప్రారంభం కావాలి – ఎర్రవల్లి గ్రామ సమావేశంలో సీఎం కేసీఆర్ – గ్రామంలో రెండు గంటల పాదయాత్ర, గ్రామస్థులతో సమావేశం – 200 ఇండ్లు, డ్రిప్ ఇరిగేషన్ పథకం మంజూరు – నేడు గ్రామంలో శ్రమదానం చేయనున్న సీఎం

మంచినీరు, సాగునీరు, విద్యుత్‌వంటి అంశాలు తనకు వదిలిపెట్టి గ్రామాల్లోని సమస్యలపై యుద్ధం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామ సమగ్ర అభివృద్ధిలో కీలకాంశం పరిశుభ్రతేనంటూ, సంఘటిత కార్యాచరణను చెత్త తొలగింపుతో ప్రారంభించాలని చెప్పారు. ఇంటికొక్కరుగా కదిలితే గ్రామాలు అద్దంలా మెరుస్తాయని ఉద్బోధించారు. గురువారం ఉదయం మెదక్‌ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామంలో రెండు గంటలపాటు వీధులన్నీ కలియతిరిగిన ముఖ్యమంత్రి, అనంతరం గ్రామపెద్దలతో, ఆ తర్వాత గ్రామ రచ్చబండ వద్ద గ్రామస్తులతో సమావేశమై గ్రామం దుస్థితిపై చర్చించారు. గ్రామాభివృద్ధి ఇంటికొకరు చొప్పున ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

CM-KCR-visit-to-Gajwel-Constituency

గ్రామస్థులు సంసిద్ధత వ్యక్తం చేయడంతో శుక్రవారం చెత్త, ఇతర అవశేషాల తొలగింపు, శనివారం హరితహారం కార్యక్రమం కార్యాచరణను సీఎం ప్రకటించారు. శుక్రవారం రోజంతా తానూ శ్రమదానంలో పాల్గొంటానని, శనివారం మొక్కలునాటిన తర్వాతే హైదరాబాద్ వెళ్తానని సీఎం ప్రకటించారు.

రెండు గంటల పాదయాత్ర..: గురువారం ఉదయం ఎర్రవల్లికి చేరుకున్న సీఎం గ్రామస్థులు అధికారులతో కలిసి గ్రామంలో పాదయాత్ర జరిపారు. అధికారులు చూపించే మార్గాలు పక్కకు పెట్టి కనిపించిన ప్రతి ఇరుకు సందులగుండా చిత్తడి నేలపై సీఎం ముందుకు నడిచారు. ఎదురైన ప్రతి ఒక్కరితో మాట్లాడారు. చాలా ఇండ్లకు తాళాలు ఉండటంతో వారు ఏ ప్రాంతానికి వలస వెళ్లిందీ వాకబు చేశారు. వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉండేవీ అడిగి తెలుసుకున్నారు. గుడిసెల వద్దకు వెళ్లి వారి స్థితిగతులు, అందుతున్న ప్రభుత్వ పథకాల మీద ఆరా తీశారు. పాడుబడ్డ ఇండ్లను పరిశీలించారు. మహిళలు, వృద్ధులతో ముచ్చటించారు.

చాలాచోట్ల కూలిన గోడలు, వదిలేసి పడావు పడిన ఇండ్లు, కూలడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లలోనే పేదల కాపురాలు, మురికి పేరుకుపోయిన వీధులు, ఇండ్ల మధ్య పిచ్చి చెట్లు, వీధుల వెంట గుట్టలుగా ఉన్న చెత్తకుప్పలను చూసి.. ఇలా ఉంటే ఎలా? అంటూ చలించిపోయారు. పాదయాత్ర మధ్యలో ప్రతాపరెడ్డి అనే రైతు ఇంట్లో సీఎం గ్రామ పెద్దలు, సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర నాయకులు, అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధి కార్యాచరణపై చర్చించారు. అనంతరం అక్కడినుంచి నేరుగా గ్రామం మధ్యలోని చింతచెట్టు వద్దకు వచ్చి అక్కడ గద్దెపై కూర్చొని గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం గ్రామ పరిస్థితిని, సంఘటితంగా ముందుకు కదలాల్సిన అవసరాన్ని గ్రామస్థులకు వివరించారు. గ్రామంలో పరిస్థితిని చూస్తే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు ఎవరికి వారు వ్యవహరిస్తున్నారు తప్ప మొత్తంగా బాగు చేసుకోవాలనే అవగాహన రాలేదన్నారు. సీఎం ప్రసంగం ప్రజలను కదిలించింది. అంతా కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. సీఎం ప్రసంగం ఇలా కొనసాగింది.

ఏ ఒక్కటీ సక్కగ లేదు.. ఎర్రవల్లి అంతా తిరిగి ఆలోచించుకుంటే గంట ఏడ్చినా దుఃఖం తీరేట్లు లేదు. అన్నీ పాతగోడలే. ఇరుకు సందులు, పిచ్చిమొక్కలు, గట్టి వానపడితే ఎప్పుడు కూలి ఎవరి ప్రాణం తీస్తాయో అన్నట్లు పాడుబడ్డ ఇండ్లు. ఎక్కడి మరుగునీరు అక్కడే. ప్రగతికి పల్లెలు పట్టుకొమ్మలుగా నిలువాల్సిన గ్రామాలు ఇంకెన్నాళ్లు ఈ మురికి కూపంలో మగ్గుతూ ప్రజలు జీవితం వెళ్లదీయాలి? గంగదేవిపల్లి, అంకాపూర్‌లాంటి గ్రామాలను చూసినప్పుడు సంతోషం కలిగింది. మిగతా గ్రామాలు చూస్తే దుఖం వస్తుంది. అన్ని గ్రామాల్లో పరిస్థితి ఇలాగే ఉన్నది. ఏ విషయంలో కూడా సక్కదనం లేదు. అన్ని ఊర్ల పరిస్థితి ఇట్లనే ఉంది. చెత్తను వేయడానికి డంపింగ్ యార్డులు లేవు. మురికి తుమ్మలు, జిల్లేడు చెట్లు మాత్రం పెరిగినయ్. ఇవి గ్రామానికి అరిష్టం. ఉద్యోగాల కోసమో, వ్యాపారం కోసమో, పని కోసమో వెళ్లిన వారి ఇండ్లు పడావు పడి ఉంటున్నాయి. వేసిన సీసీ రోడ్లు కూడా సక్కగా లేవు, వంకర టింకర ఇష్టం వచ్చినట్టు వేసిండ్రు. ఇది పద్ధతా? మనుషులు జీవించే విధానమా? మనకు ఎప్పుడు సోయి వస్తది? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నిధులు వచ్చినా ఫలితం లేదు…: గ్రామాలకు ఏదో రూపంలో నిధులు వస్తనే ఉన్నాయి. ఖర్చు అవుతున్నయి. ఫలితం మాత్రం లేదు. ఇక వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు ఇలా చాలా మంది ఉన్నరు. ఉద్యోగులు కూడా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎందరో ఉన్నరు. ఇన్ని తీర్ల ఉండి గ్రామానికి ఏం కావాల్నో అది మాత్రం జరుగుతలేదు. జనం సమస్యలతోనే సర్దుకు పోతున్నారు. మా ఖర్మ ఇంతే అనుకుంటున్నరు. మురికి ఉంటే రోగాలు వస్తయి. పరిసరాలు బాగుంచుకోవాలె అని గ్రహించడం లేదు. ఎవరూ చెప్పడం లేదు. నిధులు వస్తాయి.. కానీ వాటిని అవసరానికి తగినట్లు వాడుకోవడమే ఇప్పుడు కావాల్సింది. ప్రభుత్వం కావాల్సిన నిధులిస్తుంది తప్ప ప్రతి గ్రామంలో పరిస్థితిని చక్కదిద్దలేదు కదా. మరి ఏం చేయాలె! ఏ గ్రామానికి చెందిన గ్రామస్తులు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలె. ఎక్కడో ఒక చోట ప్రయత్నం మొదలు కావాలి. గ్రామజ్యోతి అందుకే తెచ్చినం.

దీనిద్వారా అయినా ప్రజలు సంఘటితం అవుతారని నేను ఆశిస్తున్నా. అంకాపూర్, గంగదేవిపల్లి గ్రామాల ప్రజల అంకుఠిత దీక్ష, పట్టుదల వల్లే నేడు ఆ గ్రామాలు అగ్రభాగాన ఉన్నాయి. నేను ఈ రెండు గ్రామాలను సందర్శించాను. ఆ గ్రామ ప్రజలకు తమ గ్రామ అభివృద్ధిపై ఉన్న తపన అన్ని రంగాలలో విజయాలను సాధించి పెట్టింది. ఏ సహాయ సహకారాలు లేకుండా వాళ్లు అంత అభివృద్ధి సాధిస్తే, ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు సమకూర్చుతుండగా మిగతా గ్రామాలు ఎందుకలా కాకూడదో ఆలోచించాలి అన్నారు.

పెద్ద పనులు మాకు వదిలేయండి..: రాష్ట్రంలో ప్రజల అవసరాలు సమకూర్చే బాధ్యత ప్రభుత్వానికి వదిలేయండి. పెద్ద పనులు మేం చూసుకుంటం. వాటర్‌గ్రిడ్ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందించబోతున్నం. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేస్తున్నం. రైతులకు పగటిపూటే తొమ్మిది గంటలు కరెంటు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. సాగునీరు అందించడానికి ప్రాజెక్టులు కడుతున్నాం. పాములపర్తి వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ పూర్తయితే ఇక్కడి రైతుల కష్టాలు తీరిపోతాయి. ఇలాంటి పెద్ద పనులన్నీ ప్రభుత్వమే చేస్తున్నది. మీరు మీ గ్రామాలకొచ్చే నిధులు గ్రామాల అవసరాలు తీర్చడానికి ఉపయోగించుకోండి. ఎవరి ఇంటిని వారు శుభ్రం చేసుకున్నట్టే, గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన రావాలి. సమైక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలనే తెలివి రావాలి. అది రాకపోతే ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చినా, ఏ కార్యక్రమం తెచ్చినా ప్రయోజనం ఉండదు.

ఎర్రవల్లి నంబర్ వన్ కావాలి.. : ఎర్రవల్లి గ్రామం మరో ఆరు నెలల్లో మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలువాలని, ఇందుకు తాను కృషి చేస్తానని కేసీఆర్ అన్నారు.

మహాత్మాగాంధీ, అంబేద్కర్ చేసిన ప్రజాసేవే వారికి గుర్తింపు తెచ్చిందన్నారు. మనం చేసే పనులు ముందు తరాల గుర్తింపు పొందేవిధంగా ఉండాలన్నారు. గ్రామానికి విశాలమైన రోడ్లు, మురికి కాలువల నిర్మాణంతోపాటు అర్హులైన వారికి 200 డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో జిల్లేడు, సర్కారుతుమ్మ, తూటిచెట్లు ఉండటం అరిష్టం అని, పిచ్చిమొక్కలను తొలగించి ఫలజాతి మొక్కలను నాటాలని చెప్పారు. ఎర్రవల్లిలో ప్రతి ఎకరాకు డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామ సమగ్రాభివృద్ధికి జేసీని ఇన్‌చార్జిగా నియమించారు. సర్వవర్గ కమిటీ ద్వారా ఎర్రవల్లిని బంగారువల్లిగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులతో పాటు తాను శ్రమిస్తానని శపథం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకట్రాంరెడ్డి, రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి, ఆర్డీవో ముత్యంరెడ్డి, ఓఎస్‌డీ హన్మంతరావు, సర్పంచ్ భాగ్యబాల్‌రాజ్, ఎంపీపీ ఎర్ర రేణుక, భూంరెడ్డి, మహ్మద్ జహంగీర్ తదితరులున్నారు.

నేడు సీఎం కేసీఆర్ శ్రమదానం గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10గంటలకు గ్రామానికి చేరుకుని గ్రామ ప్రజలతో కలసి శ్రమదానం చేస్తారు. మధ్యాహ్నం గ్రామంలోనే సహపంక్తి భోజనం చేస్తారు. రోడ్ల విస్తరణ, పాతగోడల తొలగింపు, గుంతల పూడ్చివేత తదితర పనులకు అధికార యంత్రాంగం జేసీబీలు, ట్రాక్టర్లను కూడా తెప్పిస్తున్నది. శనివారం కూడా సీఎం గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన అనంతరం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.