Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మార్పుకోసమే ఫ్రంట్

-నిజమైన ఫెడరల్ వ్యవస్థ కావాలి.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలి -రాష్ట్రాలకు విస్తృత అధికారాలు ఉండాలి -థర్డ్.. ఫోర్త్‌కాదు.. మాది ప్రజల ఫ్రంట్ -ఏపీ సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తాం -చెన్నైలో సీఎం కే చంద్రశేఖర్‌రావు వెల్లడి -డీఎంకే అధినేత కరుణానిధికి పలుకరింపు -తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో చర్చలు -రైతుబంధు పథకం ప్రారంభోత్సవానికి ఆహ్వానం -కేసీఆర్‌తో కలిసి పనిచేయడం సంతోషం -ఆయనతో మరిన్ని సమావేశాలు జరుగుతాయి -భావసారూప్యం ఉన్న పార్టీలతో మాట్లాడుతా -డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ -కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టిన తమిళ ప్రజలు -ఎయిర్‌పోర్టు, కరుణానిధి, స్టాలిన్ నివాసాల వద్ద ప్లకార్డులు -దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ తమిళం, హిందీలో నినాదాలు

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. నిజమైన సమాఖ్య వ్యవస్థ ఏర్పాటే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఈ దిశగా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో రెండు మూడు నెలల్లో కీలక రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం లేని, రాష్ట్రాలకు విస్తృతమైన అధికారాలుండేలా, భారతదేశంలో నిజమైన సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంతో ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు. భారతదేశం లౌకికరాజ్యంగానే మనుగడ సాగించాలి తప్ప మరో మార్గం, ప్రత్యామ్నాయం లేదని కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం లభించాలని అన్నారు. దేశ ప్రజలను ఏకంచేయడం, యువతకు ఉపాధినివ్వడం, ఆర్థిక పరిపుష్టిని కలిగించడం తమ లక్ష్యాలలో ప్రధానమైనవని వివరించారు. ఫెడరల్ ఫ్రంట్‌కు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆదివారం చెన్నై వెళ్లి డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఆయన కుమారుడు, తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు. చెన్నై వచ్చిన కేసీఆర్‌కు తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎయిర్‌పోర్టు, కరుణానిధి, స్టాలిన్ నివాసాల వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు.

పెద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్వాగతించారు. తమిళంలో, హిందీలో దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న సీఎం.. తొలుత గోపాలపురంరోడ్డులోని కరుణానిధి ఇంటికి వెళ్లారు. ఆయనకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజా, టీఆర్ బాలు తదితరులు ఘనస్వాగతం పలికారు. ఇంటిలోనికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా కరుణానిధికి సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛంఅందించి, ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ఆయన ఆరోగ్యంపై వాకబుచేశారు. తన చెన్నై పర్యటన ఉద్దేశాలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన కేసీఆర్‌కు కరుణానిధి కొన్ని పుస్తకాలు బహూకరించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు వివరించారు.

అనంతరం అల్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఈ సమయంలో స్టాలిన్‌కూడా కేసీఆర్ కారులోనే ప్రయాణించారు. ఆయన నివాసంలో ఫెడరల్ ఫ్రంట్‌పై ఉభయనేతలు చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, డీఎంకే నాయకులు స్టాలిన్, బాలు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై లక్ష్యాలు, ఉద్దేశాలను స్టాలిన్‌కు కేసీఆర్ వివరించారు. గత కొంతకాలంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఇతర పార్టీల ప్రముఖులతో జరిపిన చర్చల సారాంశాన్ని తెలియజేశారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్న అనంతరం కేసీఆర్, స్టాలిన్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాలపై కేంద్రం అనవసర పెత్తనం రాష్ర్టాలపై కేంద్రం అనవసర పెత్తనం చెలాయిస్తున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. గడిచిన ఏడు దశాబ్దాలుగా వరుస కేంద్ర ప్రభుత్వాలు అనుసరించిన కేంద్రీకృత, నియంతృత్వ పోకడలు పోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో పరిస్థితులు, కేంద్రం పెత్తనం, ఫెడరల్ వ్యవస్థ ఎలా ఉండాలి.. రాష్ట్రాలకు అధికారాలు అనే అంశాలపై స్టాలిన్‌తో అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. దేశాన్ని సుభిక్షమైన ఆర్థికవ్యవస్థగా మార్చేందుకే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గడిచిన ఏడు దశాబ్దాలుగా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు వంటి అనేక సమస్యలను కేంద్రంలో ఏర్పడిన వరుస ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయని అన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, తాగునీరు, బలహీనవర్గాలకు ఇండ్లు తదితరాల్లో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని, వాటిని రాష్ర్టాలకు బదలాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వీటికి బదులుగా విదేశీ వ్యవహారాలపై, అంతర్జాతీయ విషయాలపై కేంద్రం ఎక్కువగా దృష్టిసారించాలని అన్నారు. ఆర్థిక విషయాల్లో రాష్ర్టాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాల్లో సంస్కరణలు చేపట్టిన దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయన్నారు. రెండో ప్రపంచయుద్ధంలో దెబ్బతిన్నప్పటికీ జపాన్ దేశం నిలదొక్కుకుని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలిచిందని గుర్తుచేశారు. కానీ, భారతదేశం విషయంలో ప్రస్తుతం పాలన జరుగుతున్న తీరు దేశానికి ఏ మాత్రం తగినవిధంగా లేదని చెప్పారు. ఈ విషయాల్లో తమ చర్చలు ఫలప్రదంగా సాగాయని తెలిపారు. తనకు మంచి విందునిచ్చారంటూ స్టాలిన్‌కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే ప్రారంభంకాదు.. ఇదే ముగింపూ కాదు.. చర్చలకు ఇదే ప్రారంభం కాదు.. ఇదే ముగింపూ కాదు. దేశ పాలనలో గుణాత్మక మార్పు రావాలనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న క్రమంలో దేశంలోని అనే క మంది నేతలతో మేం చర్చలు జరుపుతున్నాం. మేమిద్దరం (తాను, స్టాలిన్) మమతాబెనర్జీతో టెలిఫోన్‌లో కూడా సంభాషించాం. దేశంలోని అనేక మంది నాయకులతోనూ మాట్లాడుతున్నాం అని సీఎం వివరించారు.

మాది ప్రజాఫ్రంట్ దేశ ప్రయోజనాలు, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కోసమే తమ ప్రయత్నాలని కేసీఆర్ చెప్పారు. మూడో ఫ్రంట్ గురించి మీడియా ప్రస్తావించగా.. మేమేమీ మూడో, నాలుగో ఫ్రంట్‌ను ప్రతిపాదించలేదు. అటువంటి ఫ్రంట్‌ను మీడియానే సృష్టించింది. మేం మాది మూడో ఫ్రంట్ అని ఎప్పడూ ప్రకటించలేదు. ఇది కేవలం కొన్ని రాజకీయ పార్టీల కలయిక కాదు. ఇది భారతదేశ ప్రజల, నిరుద్యోగ యువత కలయిక అని కేసీఆర్ చెప్పారు. దేశ ప్రజలను ఏకంచేయడం, యువతకు ఉపాధి కల్పించడం తమ ధ్యేయమన్నారు. తమ ప్రయత్నం రాజకీయం కాదని, గుణాత్మక మార్పుకోసం విశాల ప్రజల ఐక్యతకు కృషిచేస్తున్నామని, ఈ క్రమంలోనే అన్ని ప్రాంతీయ పార్టీలతో సమాలోచనలు జరుపుతున్నామని వివరించారు. తాము ఎవరితో కలిసి పనిచేస్తామన్నది భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కలుస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, ఆయన తమకు మంచి మిత్రుడని, తాము గతంలో కలిసి పనిచేశామని చెప్తూ.. ఆయనతో కూడా సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.

రైతుబంధు ప్రారంభోత్సవానికి స్టాలిన్‌ను ఆహ్వానించాం తెలంగాణలో తాము పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సహా అనేక అద్భుతమైన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. 96 శాతం భూ రికార్డులు ప్రక్షాళన చేశామని, రైతులకు ఎకరాకు రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. మే 10న రైతుబంధు పథకం ప్రారంభోత్సవానికి స్టాలిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని, వచ్చేందుకు ఆయన అంగీకరించారని కేసీఆర్ వెల్లడించారు. తప్పకుండా ఆయన వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. భారతదేశంలోనే కరుణానిధి అతిపెద్ద నాయకుడని, దక్షిణ భారతదేశం గర్వించదగ్గ నేత అని కొనియాడారు. యూపీఏ మొదటి ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేశామని, 2004లో చన్నైకి వచ్చి ఆయన ఆశ్వీరాదం తీసుకున్నానని గుర్తుచేశారు. ఈరోజు ఆయన తనకు మంచి పుస్తకాలు బహూకరించారని తెలిపారు. దక్షిణాది రాష్ర్టాలను కేంద్రం విస్మరిస్తున్నదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అందులో సందేహం ఏముంది? అని ఎదురు ప్రశ్నించారు. సీఎం వెంట చెన్నై వెళ్లినవారిలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎంపీ వినోద్‌కుమార్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.

కేసీఆర్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది: స్టాలిన్ రాష్ర్టాల స్వయం ప్రతిపత్తి గురించి డీఎంకే పోరాటం చేస్తున్నదని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్‌తో చేతులు కలుపటం సంతోషంగా ఉందని అన్నారు. తమ భేటీ సందర్భంగా ప్రస్తుత, భవిష్యత్తు రాజకీయ పరిస్థితులు, కేంద్రం-రాష్ర్టాల మధ్య సంబంధాలు, రాష్ర్టాలకు ఇవ్వాల్సిన అధికారాలు, నిధుల కేటాయింపు, రాష్ర్టాలకు మరింత ప్రతిపత్తి సహా అనేక అంశాలపై చర్చించామని స్టాలిన్ తెలిపారు. దేశంలో లౌకిక, సమాఖ్యస్పూర్తిని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కరుణానిధిని సీఎం కేసీఆర్ కలిసి ఆరోగ్యం గురించి వాకబు చేశారని వెల్లడించారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను చర్చించామని చెప్పారు. విద్య వంటి పలు అంశాలను కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదలాయించాలని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ చెప్పిన విషయాలపై తమ పార్టీ సీనియర్లతో కూడా చర్చిస్తానని తెలిపారు. తమిళనాడులో భావ సారూప్యత ఉన్న ఇతర పార్టీలతో తాను కూడా మాట్లాడుతానన్నారు. ఇది తమ మొదటి సమావేశమేనని, రాష్ట్రాల హక్కులు, ఇతర అంశాలపై కేసీఆర్‌తో ఇలాంటి సమావేశాలు ఇంకా జరుగుతాయని చెప్పారు.

ఆదివారం చెన్నైలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. చిత్రంలో మంత్రి ఈటల, ఎంపీలు కేశవరావు, వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఏ రాజా తదితరులు కూడా ఉన్నారు. (ఇన్‌సెట్) డీఎంకే అధినేత కరుణానిధిని ఆయన నివాసంలో కలుసుకొని పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో డీఎంకే నేతలు స్టాలిన్, టీఆర్ బాలు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.