-కాంగ్రెస్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలి -మూడు సీట్ల కోసం కోదండరాం పొర్లుదండాలు -బాబు తీరుతో క్షోభిస్తున్న ఎన్టీఆర్ ఆత్మ -మార్పునకు సంకేతం పాలమూరు -నాగర్‌కర్నూల్ అభివృద్ధి నివేదనసభలో మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో విపక్షాలు ఏర్పాటు చేసుకొన్న కూటమి మహాకూటమి కాదని.. అదొక దౌర్భాగ్య కూటమి అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి సంకల్పంపై కాంగ్రెస్ పార్టీ పగబట్టిందని.. అలాంటి పార్టీ చేస్తున్న డబుల్ ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అవినీతికి కేరాఫ్ అయిన కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేయడానికి నాడు ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. నేడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొంటూ ఎన్టీయార్ ఆత్మను క్షోభ పెడుతున్నాడని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో వందలమందిని పొట్టన పెట్టుకొన్న కాంగ్రెస్ ముందు మూడు సీట్లకోసం టీజేఎస్ నేత కోదండరాం పొర్లుదండాలు పెడుతున్నారని విమర్శించారు. గురువారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన అభివృద్ధి నివేదనసభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరు కాగా, పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాలుగున్నరేండ్ల టీఆర్ఎస్ పాలనకు పాలమూరు సంకేతంగా నిలుస్తున్నదని చెప్పారు. దక్షిణభారత దేశంలోని ఆరు రాష్ర్టాల్లోనూ తెలంగాణలో ఉన్న దౌర్భాగ్యపు ప్రతిపక్ష పార్టీలు మరెక్కడా లేవన్నారు. ఆయా రాష్ర్టాల అభివృద్ధి కోసం ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంతో కలిసి నడుస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్నాయని తెలిపారు. అరవై ఏండ్లకు పైగా దేశంలో.. రాష్ట్రంలో రాబందుల పాలన కొనసాగించిన కాంగ్రెస్ డబుల్ ప్రకటనలో ప్రజలను మభ్యపెడుతున్నదని విమర్శించారు.

ఇలాంటి ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దశాబ్దాలపాటు ప్రజలను సర్వనాశనంచేసిన కాంగ్రెస్ ఓట్ల కోసం కొత్త గేమ్ ఆడుతున్నదని పేర్కొన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి 30 ఉత్తరాలను రాసిన చంద్రబాబునాయుడుతో తెలంగాణలోని పార్టీలు జతకట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ పొత్తుల వల్ల తెలంగాణ ఆత్మను మరోసారి అమరావతి ముందు దాసోహం చేసేందుకు ఇక్కడి పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఢిల్లీ చేతుల్లో అధికారం ఉంచుకొని కాంగ్రెస్‌పార్టీ కథ నడిపించే వ్యవహారం కావాలా, సొంతంగా సింహంలా పనిచేసే ముఖ్యమంత్రి తెలంగాణకు కావాలా ప్రజలు ఆలోచించాలన్నారు. గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో వందలమందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీతో కోదండరాం అంటకాగడం అత్యంత దుర్మార్గమని మంత్రి కేటీఆర్ చెప్పారు. 119 స్థానాలకు పోటీ చేస్తామని చెప్పిన కోదండరాం నేడు అమరుల పేరుతో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమవడం ఘోరమన్నారు. డబ్బాలో ఓట్లు పడేంతవరకే కాంగ్రెస్ నాయకులు కనిపిస్తారని అనంతరం ప్రజలకు కన్పించకుండా పోతారని అన్నారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి స్థానం నుంచి దించాలంటున్న పార్టీలకు ప్రజలు త్వరలోనే కండ్లు తెరిపిస్తారన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త ప్రగల్భాలు పలుకుతున్నాడని కేటీఆర్ దుయ్యబట్టారు. రూ.200 ఇయ్యడానికి సంకలు కొట్టిన కాంగ్రెస్.. రూ.2 వేలు ఇస్తుందా అని ప్రశ్నించారు.

ఇంతకాలం కరువుకు దాసోహమైన పాలమూరు ప్రాంతంలో నిండు ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పారుతున్నాయంటే అందుకు టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు నిదర్శనమని మంత్రి కేటీఆర్ ఉదహరించారు. టీఆర్ఎస్ సాగునీటి సంకల్పంపై కాంగ్రెస్ అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ సాగునీటి వసతులు కల్పించకుండా పగబట్టిందన్నారు. ఇందుకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలపై పాలమూరు కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయని చెప్పారు. నాగర్‌కర్నూల్‌లో గతంలో మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్‌రెడ్డి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యంచేశారని, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యంత భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ బాల్కసుమన్, గట్టుతిమ్మప్ప, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, శ్రీనివాస్‌గౌడ్, కల్వకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, కార్యదర్శి బైకని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. వేదికపై మంత్రి కేటీఆర్‌తోపాటు ప్రజాప్రతినిధులంతా గులాబీ తలపాగాలు ధరించడం సభకు మరింత శోభను చేకూర్చింది.