-హకీంపేట విమానాశ్రయంలో కర్నల్ సంతోష్ పార్థివదేహానికి గవర్నర్, కేటీఆర్ నివాళి -కన్నీటి పర్యంతమైన భార్య సంతోషికి ఓదార్పు -నేడు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు -సూర్యాపేట జిల్లా కాసరబాదలో ఏర్పాట్లు -పలువురు మంత్రులు, ప్రముఖుల సానుభూతి

కండ్ల నిండా నీళ్లు.. బరువెక్కిన గుండెలతో నిలువెల్లా కనులై ఎదురుచూస్తుండగానే ఆ వీరుడి పార్థివదేహం ఊరుచేరింది. ఉచ్వాస నిశ్వాసాలూ దేశం కోసమే అనేలా సరిహద్దుల్లో శత్రు సైన్యానికి ఎదురొడ్డి ప్రాణాలు వదిలిన వీరుడికి ప్రజానీకం కన్నీటి స్వాగతం పలికింది. దేశమంతా సంతాపం ప్రకటించింది. భారత్- చైనా సరిహద్దులో లఢక్ వద్ద ఘర్షణలో అసువులుబాసిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు భౌతికకాయం బుధవారం రాత్రి 7.30 గంటలకు భారత ఆర్మీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నది. కర్నల్ సంతోష్‌బాబు పార్థివదేహానికి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రులు కే తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్, విప్ బాల్క సుమన్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ నివాళులర్పించారు. సంతోష్‌బాబు మృతదేహం రాగానే ఆయన భార్య కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్రమైన దుఃఖంలో ఉన్న ఆమెను గవర్నర్‌తోపాటు మంత్రులు ఓదార్చారు. కర్నల్ పార్థివదేహం అర్ధరాత్రి దాటాక సూర్యాపేటకు చేరుకున్నది. భౌతిక కాయం సూర్యాపేటకు చేరే వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి వెంటే ఉన్నారు.

5 కిలోమీటర్లు ర్యాలీ.. అంత్యక్రియలు కర్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం ఉద యం 8 గంటలకు సైనిక లాంఛనాలతో జరుగనున్నాయి. కర్నల్ కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు సూర్యాపేటకు సమీపంలోని కాసరబాద గ్రామంలో ఉన్న సంతోష్‌కు చెందిన స్థలంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పలువురు ఆర్మీ అధికారులు, 50 మంది జవాన్లు బుధవారం సూర్యాపేటకు చేరుకున్నారు. భౌతికకాయాన్ని పట్టణంలోని విద్యానగర్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసరబాద వరకు ర్యాలీగా తీసుకువెళ్లనున్నారు. ఇందులో ఆర్మీ, సంతోష్‌బాబు బంధువులు మినహా ఎవరినీ అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు. అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరుకానున్నారు. సంతోష్‌బాబు మృతికి సంతాపంగా సూ ర్యాపేట జిల్లాకేంద్రంలో వ్యాపారసంస్థలను మూసివేశారు.
ఢిల్లీ నుంచి కుటుంబసభ్యుల రాక కర్నల్ సంతోష్‌బాబు భార్య, పిల్లలు, ఇతర కుటుంబసభ్యులు బుధవారం ఢిల్లీనుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఆర్మీ అధికారులు వారిని పరామర్శించారు.

పలువురు మంత్రుల నివాళి భారత్- చైనా సరిహద్దు ఘర్షణల్లో వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు త్యాగం మరువలేనిదని మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశ రక్షణలో ప్రాణాలు విడిచిన సంతోష్‌బాబు ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. సంతోష్‌బాబు త్యాగనిరతిని దేశం ఎప్పటికీ మరచిపోలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. కర్నల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు, పోలీస్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా సంతోష్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

భానుపురి బిడ్డకు బాష్పాంజలి పుట్టుక నీది.. త్యాగం నీది.. నీ త్యాగం వృథాకాదు.. నిన్ను చూసి దేశం గర్విస్తున్నది.. యుద్ధవీరుడా జోహార్లు అంటూ భానుపురి బిడ్డకు తెలంగాణ ప్రజానీకం కన్నీటి నివాళి అర్పించింది. ఒక్కొగానొక్క కొడుకును సైన్యంలోకి పంపిన వీరుడి కుటుంబానికి జేజేలు పలికింది. మౌనంగా రోదిస్తున్న అమరుడి భార్యను.. తామంతా అండగా ఉన్నామంటూ ఓదార్చింది. తండ్రి కలను నెరవేర్చి.. చైనా మూకదాడిలో వీరమరణం పొందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు పార్థివదేహం బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నది. హకీంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్ సౌందర్‌రాజన్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వీరుడికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలించారు. గురువారం ఉదయం సూర్యాపేట సమీపంలోని కాసరబాదలో సైనికలాంఛనాలతో సురేశ్‌బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.