వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న 15 ఇన్‌టేక్ వెల్‌ల నిర్మాణాలను ఈ ఏడాది మే చివరినాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర గ్రామీణ నీటిపారుదలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే 26 వాటర్ గ్రిడ్‌లలో మొదటి విడతగా 4 గ్రిడ్‌లను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వీటి టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తిచేస్తామని చెప్పారు. ఫిబ్రవరి రెండోవారంలో నల్గొండలో పైలాన్ ప్రారంభిస్తామన్నారు. నాలుగు సెగ్మెంట్‌లలో ఇటీవలే సర్వే పూర్తయిందని తెలిపారు.
-తొలి విడత నాలుగు వాటర్ గ్రిడ్‌ల నిర్మాణం
-మూడున్నరేండ్లలో ఇంటింటికీ నల్లా నీరు
-గ్రామీణ నీటిపారుదల మంత్రి కేటీఆర్ వెల్లడి
-మహబూబ్‌నగర్‌లో గ్రిడ్ స్థల పరిశీలన
వాటర్‌గ్రిడ్‌కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు ఇదివరకే కేటాయించిందన్నారు. దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసాన్ని చేస్తూ సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా భగీరథ ప్రయత్నంతో వాటర్ గ్రిడ్‌ను చేపట్టారని కేటీఆర్ అన్నారు. మంగళవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం ఎల్లూరు రిజర్వాయర్‌వద్ద గల రేగుమాన్‌గడ్డ సమీపంలో మంత్రి కేటీఆర్‌తోపాటు జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మరెడ్డి , జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్ వాటర్‌గ్రిడ్ క్షేత్ర పరిశీలనచేశారు.
జొన్నబలగూడ వద్ద నిర్మించనున్న గ్రిడ్ ఏర్పాటు స్థలాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఎల్లూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ని సందర్శించారు. అనంతరం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్) పంపింగ్ హౌజ్ లోపలికి దిగి, అక్కడి పనులను, ఇంజినీరింగ్ డిజైన్‌లను, పరిశీలించారు. ఎల్లూర్ ఇన్‌టేక్ వెల్ నిర్మాణానికి మూడేండ్లకుపైగా సమయం పడుతుందని, ఈలోగా సాగునీటి శాఖ సహాయంతో వాటర్ గ్రిడ్‌కు అవసరమైన నీటిని అందిస్తామని చెప్పారు. కృష్ణానదిలోని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ద్వారా కోతిగడ్డ వద్ద చేపట్టే ఇన్‌టేక్ వెల్‌కు నీటిని తరలించి, అక్కడి నుంచి పంపింగ్ ద్వారా జొన్నబలగూడ్ వద్ద నిర్మించే గ్రిడ్‌కు నీటిని తరలిస్తామని చెప్పారు.
అక్కడినుంచి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల వాటర్ గ్రిడ్‌లకు నీళ్లు అందిస్తామని తెలిపారు. ప్రజల తాగునీటి అవసరాలు కనీస హక్కుగా భావిస్తూ, తాము చేపట్టిన ఈ వాటర్ గ్రిడ్ విజయవంతం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పథకాలు ప్రకృతితో అనుసంధానంగా ఉండాలనే ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఈ ప్రాజెక్టును గ్రావిటీ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వాటర్ గ్రిడ్‌కి సాగునీటి శాఖనుంచి అన్ని అనుమతులు లభించాయని చెప్పారు.
వాటర్ గ్రిడ్ పనులను చేపడుతున్న ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో కొత్తగా 1232 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారని, వీటిని త్వరలోనే టీఎస్‌పీఎస్సీద్వారా భర్తీ చేస్తామని చెప్పారు. మరికొన్ని ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీచేస్తామన్నారు. వాటర్ గ్రిడ్ పనులపై జిల్లా మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. మహిళల ఆధ్వర్యంలో గ్రామాల వారీగా మంచినీటి కమిటీలు ఏర్పాటు చేసి, పన్నులు సకాలంలో చెల్లించడంతోపాటు వాటర్‌గ్రిడ్‌పై బాధ్యత పెరిగేలా చూస్తామన్నారు. ఏడాదిలోపే మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి నీళ్ళందిస్తామన్నారు.
మొదటి దశలో నాగర్ కర్నూల్, వనపర్తి, జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గాలకు మంచినీరు అందుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సొంత కార్యాలయ భవనాలు లేని పంచాయతీలను గుర్తించి, వాటికి భవనాలు నిర్మిస్తామన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పర్యటననుంచి వచ్చిన తర్వాత కొల్లాపూర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లాలో అమలుచేస్తున్న వాటర్‌గ్రిడ్, ఆసరా పింఛన్లు, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి పర్యటనలో జిల్లాకు చెందిన రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వీ శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జే రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రామచంద్రన్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ బీ సురేందర్‌రెడ్డి, సాగునీటిశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జిల్లా ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్థన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా, పార్టీ నాయకులు గట్టు తిమ్మప్ప, ఇంతియాజ్‌ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరం రాస్తే చాలు స్పందిస్తా… ఆసరా పథకం కింద అర్హులకు లబ్ధికలగకపోయినా, అనర్హులకు అక్రమంగా ప్రయోజనం కలిగినా తన పేరిట ఎవరు ఉత్తరం రాసినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆసరా పథకాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీదేవిని ఆదేశించారు. ఉపాధి హామీలో అందరికీ వంద రోజుల పనిదినాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందిర జలప్రభ పనులను వేగవంతంచేసి, నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. జిల్లాలో వ్యవసాయ గోదాంల నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 138 మందికి మాత్రమే లబ్ధి పొందారని, ఈ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణం కోసం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం జిల్లాకు రూ.1700లకు పైగా కోట్లు కేటాయించగా ఎందుకు పనులు వేగవంతం చేయడం లేదని అధికారులను మంత్రి ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కొరత ఉన్నట్లు అధికారులు సమాధానం చెప్పగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.