-పీపీఏ రద్దుపై హరీశ్‌రావు ఆగ్రహం

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)ను రద్దు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా తెలంగాణలో విద్యుత్ లోటు ఏర్పడుతుందని, తద్వారా సంభవించే కష్టనష్టాలకు సీమాంధ్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు పీపీఏల రద్దుపై విద్యుత్ అధికారులతో కలిసి రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కరెంట్ రానివ్వకుండా చేసే వారి కార్యాలయాలు తమ రాష్ట్రంలో ఎలా నడుపుతారని ప్రశ్నించారు. మీ ఇళ్లకు కరెంట్ వద్దా అని తీవ్రంగా మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరబాద్‌లో సీమాంధ్ర అసెంబ్లీ, సచివాలయం, డీజీపీ కార్యాలయంతో పాటు అందులో పనిచేసే ఉద్యోగులు అధికారులు ప్రజాప్రతినిధులు తెలంగాణలోనే నివాసముంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకమని, రాష్ట్ర పునర్విభజన చట్టానికి తూట్లు పొడవడమేనని ఆయన మండిపడ్డారు. బాబు ఒకటి చేస్తే తాము పదిచేయాల్సివస్తుందని, కాని అది సరియైన సంప్రదాయం కాదన్నారు. తెలుగు ప్రజలు అంతా ఒక్కటేనంటూ మాట్లాడే బాబు అర్దరాత్రి నిర్ణయం తీసుకుని తెలంగాణకు కరెంటురానివ్వకుండా చేయాలనుకోవడం ఏవిధంగా సమర్థనీయమన్నారు. చంద్రబాబు చెప్తున్న సమన్యాయం ఇదేనా?అని ప్రశ్నించారు. పీపీఎ రద్దు నిర్ణయం ఏకపక్షమని దాన్ని అమలు జరగనివ్వమని స్పష్టం చేశారు. పీపీఏ రద్దు ద్వారా తెలంగాణ కు రావాల్సిన 460 మొగావాట్ల విద్యుత్‌ను కోల్పోవాల్సి వస్తుందని హరీశ్‌రావు తెలిపారు. ఇదే విషయమై విద్యుత్‌శాఖ అధికారులతో సీఎం చర్చించారన్నారు. కాగా రాష్ర్టానికి ఎటువంటి కరెంటు లోటు రాకుండా చూస్తామని కేంద్రం భరోసా ఇచ్చిందని హరీశ్‌రావు తెలిపారు.