Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మీపైనే వేయాలి 132 కోట్ల చార్జ్‌షీట్లు

-అకౌంట్లలో వేస్తామన్న 15 లక్షలు ఎక్కడ?..
-ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏవీ?
-132 కోట్ల మందిని వంచించిన బీజేపీ ..
-వారందరూ మీపైనే ఒక్కోచార్జిషీటు వేయాలి
-ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి లోపలేసినా తప్పులేదు..
-ప్రజాసమస్యలు తీర్చినందుకా..
-హామీలు నెరవేర్చినందుకా మాపై చార్జ్‌షీట్లు!
-ఉత్తరాలురాసి వరదసాయం అడ్డుకున్న బీజేపీ
-దమ్ముంటే కేంద్రం నుంచి తెచ్చి సాయంచేయండి
-మా నినాదం విశ్వనగరం..వారిది విద్వేష నగరం
-గుజరాత్‌ గులాంలా? హైదరాబాద్‌ గులాబీలా?
-ప్రశాంత నగరంలో అగ్గిరాజేయాలని చూస్తున్నరు
-యువకులూ ఆలోచించుకోండి.. వారి ఉచ్చులోపడొద్దు
-ఓట్లతోనే బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైంది
-బల్దియా గడ్డపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలె
-మళ్లీ గెలిపిస్తే హైదరాబాద్‌లో ప్రతిరోజూ తాగునీరు
-గ్రేటర్‌ ప్రచారంలో మంత్రి కేటీఆర్‌

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకా? ప్రజా సమస్యలను పరిష్కరించినందుకా? మాపై బీజేపీ నాయకులు చార్జ్‌షీటు ఎందుకువేస్తరని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. దేశప్రజలు ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని వేయనందుకు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వనందుకు బీజేపీ నాయకులపైనే చార్జ్‌షీట్లు వేయాలని చెప్పారు. అడుగడుగునా మోసం చేసినందుకు 132 కోట్ల మంది ప్రజలు 132 కోట్ల చార్జ్‌షీట్లు వేయాల్సి ఉంటుందని అన్నారు. బీజేపీ నాయకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి జైలుకు పంపినా తప్పులేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నినాదం విశ్వనగరమైతే.. వారి నినాదం విద్వేష నగరమని చెప్పారు. గుజరాత్‌ గులాంలు కావాలో? హైదరాబాద్‌ గులాబీలు కావాలో? నగర ఓటర్లు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంత్రి కేటీఆర్‌ జహీరానగర్‌, ఖైరతాబాద్‌ లైబ్రరీ చౌరస్తా, జూబ్లీహిల్స్‌ శ్రీరాంనగర్‌, యూసుఫ్‌గూడ చౌరస్తాలో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఆరేండ్లలో 12 కోట్ల ఉద్యోగాలేవీ
ఓ పెద్దమనిషి కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్‌ ఈరోజు హైదరాబాద్‌ వచ్చి.. టీఆర్‌ఎస్‌ మీద చార్జ్‌షీట్‌ విడుదల చేశారు. అందులో ఇది చేయలేదు.. అది చేయలేదు అంటూ సొల్లు పురాణమంతా చెప్పిన్రు. ఆ చార్జ్‌షీట్‌ను చెత్తను వేరుచేసేందుకు జీహెచ్‌ఎంసీ నుంచి ఇచ్చిన చెత్తబుట్టల్లో వేసేందుకు కూడా పనికిరావు. ప్రకాశ్‌జవదేకర్‌ను, బీజేపీని సూటిగా ఒకటే అడుగుతున్నా.. మామీద చార్జ్‌షీట్‌ ఎందుకు? హైదరాబాద్‌లో అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టినందుకా? గల్లీల్లోనూ ఎల్‌ఈడీ లైట్లు పెట్టినందుకా? సీసీ రోడ్లు వేసినందుకా? కరెంటు గోస తీర్చినందుకా? తాగునీటి సమస్య తీర్చినందుకా? హైదరాబాద్‌లో శాంతిభద్రతలు కాపాడినందుకా? బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకొస్తున్నందుకా? ఎందుకు వేస్తవ్‌. చార్జ్‌షీట్లే వెయ్యాల్సి వస్తే ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా 132 కోట్ల చార్జ్‌షీట్లు మీమీద వేయాలే. జీరోఅకౌంట్‌తో బ్యాంకు ఖాతాతెరవండి, అందులో రూ.15 లక్షలు వేస్తాఅని ప్రధాని మోదీ అన్నరు. ఇక్కడున్నోళ్లకు ఎవరికైనా రూ.15 లక్షలు వచ్చాయా? ఎవరికీ రాలేదు? ఆరేండ్లయినా ఇవ్వనందుకు 132 కోట్ల చార్జ్‌షీట్లు మీమీద వెయ్యాలే.

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తా అన్నరు. గద్దెనెక్కి ఆరేండ్లు అవుతున్నది. 12 కోట్ల ఉద్యోగాలు రావాలే.. వచ్చినయా.. ఆ 12 కోట్లమంది నిరుద్యోగ యువత మీ మీద వేయాలే 12కోట్ల చార్జ్‌షీట్లు. నల్లధనం తెస్తామన్నరు.. తెచ్చారా..? చెప్పిందొక్కటీ చేయలే. యువకులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకులూ వారిఉచ్చులో పడొద్దు.. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. హైదరాబాద్‌ను విశ్వనగరం చేయాలనేది టీఆర్‌ఎస్‌ నినాదం.. విద్వేషనగరం చేయాలనేది వాళ్ల నినాదం. ఇక్కడ హిందూముస్లింలను ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండనివొవ్వద్దనేది వారి లక్ష్యం. దయచేసి ఆలోచించాలని కోరుతున్నా. ఈ ఆరేండ్లలో నీళ్లు, కరెంటు గోస తీర్చుకున్నాం. ఇంకా కొన్ని మిగిలిఉన్నయి.. అవన్నీ చేసుకుందాం.

ఉత్తరం రాసి వరదసాయం అడ్డుకొన్నరు
బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ. హైదరాబాద్‌ వరద నష్టం కోసం సీఎం కేసీఆర్‌ రూ.1,350 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ఉత్తరం రాస్తే.. దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరించింది. కర్ణాటకకు రూ.669 కోట్లు, గుజరాత్‌కు రూ.500 కోట్లు ఇచ్చింది. కానీ, తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వలేదు. తెలంగాణ భారతదేశంలో లేదా? ఇక్కడ పేదలు లేరా, పైగా రాష్ట్రప్రభుత్వం రూ.10 వేలు ఇస్తుంటే ఉత్తరాలు రాసి వరదసాయం పంపిణీని అడ్డుకున్నరు. ఓ పెద్దమనిషి మమ్మల్ని గెలిపించండి రూ. 25వేలు ఇస్తామంటున్నడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అపుతున్నరు. కేంద్రం నుంచి పైసలు తీసుకొచ్చి ఇవ్వండి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎవరికైతే రూ.10వేల ఇచ్చిందో ఆ జాబితాను మీకిస్తాం.. వారందరికీ మళ్లీ రూ.25 వేలు ఇవ్వండి. మేము కూడా చప్పట్లు కొడుతం. దమ్ముంటే పైసలు ఇప్పించి మాట్లాడండి. సికింద్రాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి రెండేండ్లుగా కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నరు. ఓట్లకోసం వచ్చే ఆయనను రెండేండ్లలో తెలంగాణకు ఏం తెచ్చినవ్‌ కిషనన్న. ఒక్క రూపాయన్న కేంద్రప్రభుత్వం ఇచ్చిందా? అని అడగండి..వదిలిపెట్టొద్దు. దమ్ముంటే.. ప్రధానిని ఒప్పించి వరద సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు చొప్పున ఇప్పించమని నిలదీయండి.

ఓ పెద్దమనిషి ఈరోజు హైదరాబాద్‌ వచ్చి..
టీఆర్‌ఎస్‌పై చార్జ్‌షీటు విడుదల చేశారు. అందులో ఇది చేయలేదు.. అది చేయలేదు అంటూ సొల్లు పురాణమంతా చెప్పారు. చెత్తను వేరుచేసేందుకు జీహెచ్‌ఎంసీ తరుపున చెత్తబుట్టలిచ్చాం. ఈరోజు బీజేపీ విడుదల చేసిన చార్జ్‌షీట్‌ ఆ చెత్త బుట్టలో వేసేందుకు కూడా పనికి రాదు.

విషయంలేకుండా విషం చిమ్ముతున్న పార్టీని ఓటర్లు తిప్పి కొట్టాలి. హైదరాబాద్‌ను విశ్వనగరం చేయడమే టీఆర్‌ఎస్‌ నినాదం. కానీ విద్వేషనగరం చేయాలన్నదే బీజేపీ విధానం. మనం అందరి హైదరాబాద్‌ అంటే వారు కొందరి హైదరాబాద్‌ అంటున్నారు. గుజరాత్‌ గులాంలు కావాలా.. హైదరాబాద్‌ గులాబీలు కావాలా? తేల్చుకోండి.

భాగ్యలక్ష్మి గుడి ఇప్పుడే గుర్తుకొచ్చిందా
ఓ పెద్దమనిషి గుడికివెళ్లి దండం పెట్టుకుంటా అన్నడు. హైదరాబాద్‌లో ఏగుడికైనా పోవచ్చు. కానీ, ఆయన మాత్రం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికే వెళ్లారు. అక్కడికే ఎందుకు పోవాలే..? అక్కడికి పోవాలే పోరగాండ్లను రెచ్చగొట్టాలే.. హిందూముస్లిం పంచాయితీ పెట్టాలే. హైదరాబాద్‌లో కర్ఫ్యూ తేవాలే.. నాలుగుఓట్లు రాల్చుకోవాలే.. దయచేసి మీరే ఆలోచించాలి. మనకు ఎట్లాంటి హైదరాబాద్‌ కావాలో.. ఆరేండ్లుగా అన్నదమ్ములుగా కలిసున్న హైదరాబాద్‌ కావాలా? తెల్లారిలేస్తే కిరికిరి పంచాయితీ పెట్టుకొనే హైదరాబాద్‌ కావాలా? మన పిల్లలు బయటకుపోతే ఏమైతదో అని భయపడే హైదరాబాద్‌ కావాలా? కేసీఆర్‌ నాయకత్వంలో ప్రశాంతంగాఉన్న హైదరాబాద్‌ కావాలో?. మొన్నటికిమొన్న ఇంటిపన్ను, ఆస్తిపన్నులో కూడా 50 శాతం రద్దుచేసి రూ.326 కోట్లు మాఫీ చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. రూ.10వేల వరదసాయం అందని అందరికీ డిసెంబర్‌ 4 తర్వాత ఇచ్చే బాధ్యత మాది. అందులో ఎలాంటి సందేహంవద్దు. హైదరాబాద్‌లోని లక్ష మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.

పచ్చి మోసగాళ్లు.. దగాకోర్లు
సంక్రాంతికి హరిదాసులు వచ్చినట్టు కొత్తోళ్లంత వస్తున్నరు.. వాళ్లను నమ్మొద్దు.. వారు పచ్చి మోసగాళ్లు.. దగాకోర్లు.. వారిని తిప్పితిప్పి కొట్టాలి. మతం పేరిట చిల్లరమల్లర రాజకీయాలు చేద్దామనుకునే పార్టీలకు డిసెంబర్‌ ఒకటినాడు ఓటుతో బుద్ధిచెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో 5 ఓట్లతో సెంచరీ మిస్సయినం. ఈసారి కచ్చితంగా సెంచరీకొట్టాలే. వాళ్ల డిపాజిట్లు గల్లంతు చేయండి.

కరెంటు, నీళ్ల గోస తీర్చినం
గత ఎన్నికల్లో టీఆర్‌ఆర్‌ను 99 సీట్లలో గెలిపించి కొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఐదేండ్లలో ఏంచేశామో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉన్నది. తెలంగాణ వచ్చిన కొత్తలో రాజధాని హైదరాబాద్‌పై అనేక అనుమానాలుండేవి. ఆంధ్రా, తెలంగాణ పంచాయతీ ఐతదా? హైదరాబాద్‌లో ఉద్యోగాలు వస్తయా? పోతయా? పెట్టుబడులు రాకపోగా.. ఉన్నయే పోతయట అంటూ విషప్రచారం చేశారు. నేను ఇక్కడ్నే ఎర్రమంజిల్‌ కాలనీలో ఉండేవాడ్ని. ఖైరతాబాద్‌ మీదుగా స్కూల్‌కెళ్లేటప్పుడు ప్రతి ఎండాకాలం ఖైరతాబాద్‌ జలమండలి ముందు ఖాళీ బిందెలు, కుండలతో ధర్నాలు ఉండేవి. ఒక్కసారి గుర్తు చేసుకోండి మంచినీటి ఎంత గోస ఉండెనో? ఈరోజు ఆకష్టం ఉన్నదా? అప్పుడు 14 రోజులకోసారి కూడా నీళ్లు రాని పరిస్థితి నుంచి రోజువిడిచి రోజు నీళ్లు ఇచ్చేదాక వచ్చినం. మళ్లీ గెలిపిస్తే ప్రతిరోజూ తాగునీటిని అందిస్తాం.

అప్పుడు కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు పోతేవార్త. చిన్నచిన్న షాపుల్లో, జూష్‌ స్టాళ్లలో, అపార్ట్‌మెంట్లలో జనరేటర్లు, ఇన్వర్టట్లు పెట్టుకొని వాటిలో వేలకువేలు ఖర్చుపెట్టి డీజిల్‌ పోసి ఆగమాగమైన రోజులు ఉండేవి. పరిశ్రమలకు పవర్‌హాలిడే ప్రకటించిన దుస్థితి. కార్మికులకు చేతి నిండా పని లేదు.. కడుపు నిండా తిండి లేని పరిస్థితి. కానీ, ఇప్పుడు 24 గంటల కరెంటుతో కార్మికులకు చేతినిండా పని ఉన్నది. హైదరాబాద్‌లో 1920లో గండిపేట కడితే వందేండ్ల తర్వాత కేశవాపురం రిజర్వాయర్‌ను కడుతున్న చరిత్ర కేసీఆర్‌ది, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. మరో 30 ఏండ్లదాకా హైదరాబాద్‌కు నీటిసమస్య లేకుండా చేస్తున్నాం. ఆకలైతే అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రూ. 5కే భోజనం పెడుతున్నం. పేదోడికి సుస్తీచేస్తే బస్తీ దవాఖానలను ఏర్పాటుచేసింది కేసీఆర్‌. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో అభివృద్ధి జరుగుతుంటే కొంతమందికి కడుపు మండుతున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.