Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మీ పెద్ద కొడుకును అడుగుతున్నా.. టీఆర్‌ఎస్‌ను దీవించండి

ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరంగల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. 56 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఏం చేశాయో.. 16 నెలల తమ ప్రభుత్వం ఏం చేసిందో బేరీజు వేసుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే తనను శిక్షించాలని లేకుంటే, తప్పుచేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలని సీఎం స్పష్టం చేశారు.

KCR addressing in Warangal public meeting

-తప్పు చేస్తే నన్ను శిక్షించండి.. లేదంటే వాళ్లకు శిక్ష వేయండి -ఆలోచించి ఆత్మసాక్షిగా ఓటేయండి – 60 ఏండ్ల చీకట్లను ఆరునెలల్లో పారదోలాం – చెప్పింది చేయకపోతే ఓట్లు అడగమనే పార్టీ చరిత్రలో ఉన్నదా? -పతంగి దందాలు..లఫంగి రాతలకు ఆగం కావద్దు – త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన – తెల్లరేషన్ కార్డున్న కుటుంబానికి కల్యాణలక్ష్మి -వరంగల్ ఎన్నికల ప్రచారసభలో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన రోజున తప్పు చేస్తే తనను రాళ్లతో కొట్టాలని చెప్పానని, ఇప్పటికీ ఆ మాట మీద ఉన్నానని అన్నారు. అడ్డం పొడువు మాట్లాడే వాళ్లు అప్పుడూ ఇప్పుడూ ఉన్నారని, వాళ్లు శిఖండి వేషాలు వేసి పతంగి దందాలు చేసినా.. లఫంగి రాతలు రాసినా ఆగం కావద్దని కోరారు.

అరవై ఏండ్ల కరెంటు దుఃఖాన్ని ఆరు నెలల్లో తీర్చామని అన్నారు. వచ్చే మార్చినుంచి పగటిపూట 9 గంటల కరెంటు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇంటి పెద్దకొడుకుగా అడుగుతున్నా.. టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించాలి అని వరంగల్ ఓటర్లకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. త్వరలో పేదలందరికీ కల్యాణలక్ష్మిని వర్తింపజేస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వరంగల్‌కు సాగునీరు అందిస్తామని సభికుల హర్షధ్వానాల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల సందర్భంగా మంగళవారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం ప్రసంగించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలను సుదీర్ఘంగా వివరించిన కేసీఆర్.. విపక్షాలపై చండ్ర నిప్పులు కురిపించారు. సుమారు 45 నిమిషాలపాటు ఉద్వేగంగా సాగిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

రైతును ఆదుకున్నది మేమే రైతు సంక్షేమంకోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. 58 ఏండ్లు ఈ రాష్ర్టాన్ని పాలించిందెవరు? కాంగ్రెస్, టీడీపీలు. అప్పుడు మేమేదో ఉద్ధరించినం, మేమేదో పొడిచేసినం, ఆరు చందమామలు పెట్టినం, ఏడు సూర్యుళ్లను పెట్టినం అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్లు బంగారు వాసాలు పెడితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి చెడగొట్టిందన్నట్టు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి. ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు మోటర్లు కాలిపోయేవి. తెలంగాణ ప్రభుత్వంలో కాలిపోవుడు లేదు. తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. కరెంటు కష్టాలనుంచి తెలంగాణను గట్టెక్కించినం. గతంలో ఎరువులు, విత్తనాలకోసం చెప్పులు లైన్‌లో పెట్టేవారు. ఇపుడు ఆ బాధలు లేవు. విత్తనాలు, ఎరువులను సక్రమంగా ఇచ్చినం. మక్కలు, వరి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటయి కాబట్టి సెంటర్‌లను ఏర్పాటు చేసి కొనుగోలు చేసినం. పత్తి కేంద్రం పరిధిలో ఉంటది. కేంద్రం మద్దతు ధర ఇవ్వడంలో నిర్లక్ష్యం చేసింది. స్వయంగా నేనూ, వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రంతో మాట్లాడినం. ఇంకోసారి కూడా మాట్లాడుతం. సీసీఐ పత్తిని కొనుగోలు చేసే విధంగా పోరాడుతం. పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తం. రైతులకు రుణమాఫీ 17వేల కోట్లలో రెండు విడుతలు మాఫీ చేసినం. వచ్చే ఆర్థిక సంవత్సరం 8వేల కోట్లను విడుదల చేస్తం.

సంక్షేమానికి పెద్దపీట.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను తక్కువ కాలంలోనే అమలు చేసినం. మనం చేసే పనులను దేశమంతా మెచ్చుకున్నా వీళ్లకు మాత్రం కనిపించదు. దొడ్డన్నం, పురుగులన్నం పెట్టేవారు. అన్నా నేను హాస్టల్‌లో చదువుకున్న. హాస్టల్ పిల్లలకు మంచి అన్నం పెట్టాలని మా ఈటల రాజేందర్ చెప్పిండు. 750కోట్లు భరించి సన్నబియ్యంతో విద్యార్థులకు కడుపునిండా పెడుతున్నాం. గతంలో రేషన్ బియ్యం 20 కిలోల లిమిటే ఉండేది. దాన్ని ఎత్తేసినం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి మనిషికి ఆరు కిలోలు చొప్పున ఇస్తున్నం. హోంగార్డు, ట్రాఫిక్ పోలీసులకు, అంగన్‌వాడీలకు జీతాలు పెంచినం. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10కోట్లు ఇచ్చినం. డ్రైవర్లకు, భవన నిర్మాణ కార్మికులకు రూ.5లక్షల ప్రమాద బీమా కల్పించిన మనసున్న ప్రభుత్వం ఇది. గత పాలకులు పేదలకు డబ్బా ఇండ్లు కట్టించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలని డబుల్ బెడ్‌రూం ఇండ్లు కడుతున్నం. నియోజకవర్గానికి వెయ్యి నుంచి 2వేల చొప్పున నాలుగేండ్లలో అద్భుతమైన ఇండ్లను నిర్మిస్తం. నిన్ననే హైదరాబాద్ ఐడీహెచ్ మోడల్ కాలనీని ప్రారంభించినం. మీరు చూశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు భద్రత కల్పించి వారి జీవితాలకు ఆసరా ఇస్తున్నాం. వరంగల్‌లో గతంలో లక్షా 80వేల పింఛన్లు ఇస్తే మా ప్రభుత్వం 2లక్షల 30వేల మందికి ఇస్తున్నది. కళ్యాణలక్ష్మి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం రూ.51వేలు ఇచ్చే అద్భుతమైన పథకాన్ని మ్యానిఫెస్టోలో పెట్టకపోయినా తెలంగాణ కష్టసుఖాలు తెలిసిన వాళ్లుగా అమలు చేసి ఆదుకుంటున్నాం. త్వరలోనే కల్యాణలక్ష్మి పథకాన్ని తెల్లకార్డు ఉన్న ప్రతి పేదింటి బిడ్డకూ వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

కోటి ఎకరాలకు నీళ్లు.. మిషన్ కాకతీయ కింద చెరువులు తవ్వుతున్నాం. 46,500 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నాం. నాలుగేండ్లలో ఆ చెరువులన్నీ పునరుద్ధరించి రైతు ముఖంలో ఆనందం చూస్తం. తెలంగాణ ప్రాజెక్టుల్లో ఆంధ్ర పాలకుల అసలు రంగును తెలుసుకున్నాం. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ను అద్భుతంగా చేపట్టబోతున్నాం. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రణాళికలు రూపొందించుకున్నాం. 2018నాటికి నిబద్ధతతో పనిచేసి ఇచ్చిన మాట నిలుపుకుంటాం. త్వరలోనే కాళేశ్వరంలో దేవుని పేరుతో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలమవుతాయి.

వాటర్ గ్రిడ్‌తో ఆడబిడ్డల పాదాలు కడుగుతాం భారతదేశ రాజకీయాల్లో ఒక పథకాన్ని అమలు చేయకపోతే ఎన్నికలకే పోనని చెప్పిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. బిందెలు పట్టుకొని నీళ్లకోసం ఆడబిడ్డలు పడే వేదనను చూసి చలించి సిద్దిపేటలో ఇచ్చినట్టే ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లిచ్చే వాటర్‌గ్రిడ్ పథకాన్ని 36వేల కోట్లతో చేపట్టినం. కచ్చితంగా ఇంటింటికీ నీళ్లిచ్చి తెలంగాణ ఆడబిడ్డల పాదాలు కడిగిన తర్వాతనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. ఈ విధంగా ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి గానీ, పార్టీ, ప్రభుత్వం మరొకటి లేదు. పార్టీ భవిష్యత్‌ను, వందలమంది నాయకుల జీవితాలను పణంగా పెట్టి ఒక సవాల్‌గా దీన్ని స్వీకరించామంటేనే ప్రభుత్వ నిబద్ధత ఏపాటిదో అర్థమవుతుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను ఉద్యమం నుంచి తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టండి అని ఏ ధైర్యంతో చెప్పి రాష్ర్టాన్ని సాధించుకున్నామో అదే మొండి పట్టుదలతో ఇవాళ వాటర్‌గ్రిడ్‌ను సాధించి తీరుతాననే నమ్మకం నాకున్నది. తెలంగాణ కోసం నా వెంట నడిచి నన్ను ఆదరించినట్టుగానే ఈ ఎన్నికల్లో పసునూరి దయాకర్‌కు ఓటేసి దీవించండి.

విపక్షాలకు చీకటి రోజులే.. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఇక తమకు బతుకు లేదని గాభరా పడుతున్నాయి. కేసీఆర్ మొండోడు, అన్నంత పనిచేస్తాడు. నిజంగా అన్ని చేస్తే ఇక తమకు చీకటి రోజులే అన్న భయంతో ఉన్నాయి. అందుకే ఆగమాగమైపోతున్నాయి. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అడుగడుగునా అభాసుపాలు చేస్తున్నాయి. ఎవరెన్ని శిఖండి వేషాలు వేసి.. పతంగి దందాలు చేసి.. లఫంగి రాతలు రాసినా ఆగమాగం కావద్దు. హైరానా పడొద్దు. పిచ్చి పనిచేసే వాళ్లకు మేం చచ్చినా భయపడం. ప్రజలు కూడా ఆలోచించండి. తప్పుడు మాటలు చెపుతున్న వాళ్లను, ఓట్లకోసం అబద్ధాలు ఆడుతున్న వాళ్లను శిక్షించండి. వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్న వాళ్ల బాగోతాన్ని బట్టబయలు చేయండి.

కిషన్‌రెడ్డికే షాకుల మీద షాకులు.. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈ మధ్య బాగా మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలట. కిషన్‌రెడ్డీ.. షాక్‌లు ఇవ్వాల్సింది మాకా, మీకా? ఇప్పటికే బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగుల్తలేవా? ఢిల్లీలో దిమ్మ తిరిగింది. బీహార్‌లో బిత్తరపోయారు. తెలంగాణ గురించి నువ్వా మాట్లాడేది? తెలంగాణకోసం ఎమ్మెల్యేల మంతా రాజీనామా చేయాలంటే బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకడు రాజీనామా చేస్తే నువ్వు పారిపోయినవు. తర్వాత ఉప ఎన్నికలు వస్తే రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే తరపున నిజామాబాద్‌లో ప్రచారానికి పోయి అక్కడ సభలో రాజీనామా చేయమంటే కొంతమంది దద్దమ్మలు పారిపోయిండ్రు అని నేను అంటే అందులో ఓ దద్దమ్మ మీ పక్కనే ఉన్నడు అని వేదిక ముందున్న ప్రజలు అన్నరు. ఎవరా అని చూస్తే పక్కన కిషన్‌రెడ్డి ఉన్నాడు. రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్‌రెడ్డి, ఇయ్యాల వరంగల్‌కు వచ్చి కేసీఆర్‌కు షాక్‌లు ఇవ్వాలని చెప్పడం మీద ప్రజలు ఆలోచించాలి. పదహారు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? కేసీఆర్ ఏం చేస్తున్నాడు? అంటూ కిషన్‌రెడ్డి 36 ప్రశ్నలు వేస్తున్నడు. కిషన్‌రెడ్డికి నేనొక్కటే ప్రశ్న వేస్తా. మేం వచ్చినపుడే కేంద్రంలో మీ ప్రభుత్వం వచ్చింది. ఈ 17 నెలల్లో ఒక్కటంటే ఒక్కటన్న ప్రజలకు పనికివచ్చే పని కేంద్ర ప్రభుత్వం చేసిందో చెప్తవా? మీ మంత్రి వెంకయ్య నాయుడే పదహారు నెలల్లో ఏం చేయలేం.. మా దగ్గరేమన్న అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నదా? అన్నాడు. కేంద్రంవద్ద లేని అల్లావుద్దీన్ దీపం కేసీఆర్ దగ్గర ఏమైనా ఉందా?

ఫోరాన్ని మూసింది జానా.. జాతీయ వాదినని ప్రకటించుకున్న జైపాల్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి వరంగల్‌కు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. 1992లో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యేగా నేనున్నాను. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో ఆయనకు పదవి రాలేదు. అపుడు తెలంగాణ ఫోరం ఏర్పాటు చేసి మీటింగ్‌కు నన్ను రమ్మన్నాడు. అప్పుడే అన్న.. పదవుల కోసం ఫోరం పెట్టినవు.. పదవి రాగానే మూసేస్తావని చెప్పిన. సరిగ్గా వారం రోజులకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పిలిచి మంత్రి పదవి ఇవ్వగానే ఇద్దరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నరు. తెలంగాణ ఫోరాన్ని మూసిండు. ఇది నిజం. ఇది చరిత్ర. కాంగ్రెస్‌లో మరో పెద్ద మనిషి.. జైపాల్‌రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు. సకల జనుల సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని అంటున్నాడు. ఏమనాలి? ఉద్యమంలో కేసీఆర్ ఎక్కడున్నడో మీకు తెల్వదా? జైపాల్‌రెడ్డి ఏడ పండుకున్నడో తెల్వదా? 2004నుంచి 2014వరకు కేంద్రంలో మంత్రిపదవి అనుభవిస్తూ తాను జాతీయవాదిని, ప్రాంతీయవాదిని కాను అని చెప్పిన జైపాల్‌రెడ్డి, ఇప్పుడు వరంగల్‌కు వచ్చి కేసీఆర్ ఎక్కడున్నడని మాట్లాడుతాడు. ఇట్ల అబద్ధాలు, అసత్య ప్రచారాలు, వాస్తవాలను వక్రీకరించిన వారికి కర్రుకాల్చి వాతపెట్టండి.

వరంగల్ భవిష్యత్ పూచీ నాది హైదరాబాద్ తరువాత అత్యంత ప్రాముఖ్యం ఉన్న వరంగల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుందాం. వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా చేసుకుందాం. ఇప్పటికే వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. సూరత్, సోలాపూర్, తిరుపూర్‌లలో వేరు వేరుగా ఉండే పరిశ్రమలు ఒకే చోటికి తీసుకువచ్చి అన్ని రకాల వస్త్ర ఉత్పత్తిని వరంగల్‌లో నెలకొల్పబోతున్నాం. ఔటర్ రింగ్‌రోడ్ ప్రతిపాదనలు తయారవుతున్నాయి. వరంగల్ నగరంలో నాలుగు రోజులుండి గుడిసె గుడిసె తమాషాకోసం తిరగలేదు. ఈ నగరాన్ని ఒక మహానగరంగా మార్చుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలించిన.

పతంగి దందాలు.. లఫంగి రాతలు.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు, తెలంగాణను అభాసుపాలు చేసేందుకు కొంతమంది శిఖండులు తయారైండ్రు. పతంగి దందాలు చేసెటోల్లు మోపైండ్రు. మనం వాళ్లను చూసి ఆగం కావద్దు. భయపడొద్దు. నాలుగైదు రోజులుగ పేపర్లు చూస్తున్న. కొంత మంది రైతులకు వాళ్ల పంటల్ని వాళ్లే కాల్చుకునే విధంగా డబ్బులిచ్చి చేయిస్తున్నరు. సభల లొల్లి చేయిస్తున్నరు. ఇది పద్ధతా.. న్యాయమా? ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సభలు పెట్టే అవకాశం ఉంటది. వాళ్ల మాటలు చెప్పుకునే హక్కు ఉంటది. అటువంటి కాడికి పోయి మేమేదో గొప్ప చేసినమన్నట్లుగా లొల్లిపెడతరు. వాళ్లను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని లఫంగి పత్రికలు పిచ్చి రాతలు రాస్తయి. ఏదో జరిగి పోతున్నట్టు దుర్మార్గం చేస్తయి. మీరు ఓటు వేసేటప్పుడు నిజమా? అబద్ధమా? ఆలోచించండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ప్రజలు నన్ను పెద్దకొడుకు అంటున్నరు. ఆ పెద్ద కొడుకుగా అడుగుతున్నా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దీవించండి.. అని ముఖ్యమంత్రి కోరారు.

ఈ సభలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, హరీశ్‌రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, జితేందర్‌రెడ్డి, బోయినపల్లి వినోద్‌కుమార్, సీతారాం నాయక్, బాల్క సుమన్, గుండు సుధారాణి, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ పేర్వారం రాములు, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, కొండా సురేఖ, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రెడ్యానాయక్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, జిల్లా, అర్బన్ అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నన్నపునేని నరేందర్ సహా నియోజకవర్గ ఇన్‌చార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వరంగల్ సభ గ్రాండ్ సక్సెస్: ఎంపీ వినోద్ కుమార్ సీఎం కేసీఆర్ వరంగల్ సభ విజయవంతమైందని ఆ పార్టీ ఎంపీ బీ వినోద్‌కుమార్ అన్నారు. సభకు లక్ష మందికిపైగా ప్రజలు హాజరైనట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన వరంగల్ ఓటర్లకు సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.