Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మీది స్కాంగ్రెస్ పాతాళం నుంచి ఆకాశందాకా అన్నీ స్కాంలే

– పదేండ్లు సీఎంగా ఎలా చేశారో.. -దిగ్విజయ్ సింగ్‌పై మండిపడ్డ మంత్రి కేటీఆర్ – కుటుంబ పాలనపై కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదం – తెలంగాణ ఎప్పుడూ సర్‌ప్లస్ స్టేటే.. -త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్లు – ఎమ్మెల్సీలో సిట్టింగ్ నిలబెట్టుకున్నం.. -చిన్న గెలుపునకే బీజేపీ ఆగుతలేదు – విలేకరుల సమావేశంలో కే తారకరామారావు

KTR-counter-on-Congress

కాంగ్రెస్ పార్టీని..స్కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర పంచాయత్‌రాజ్ మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు. ఆ పార్టీ మన దేశానికి పట్టిన శని అని ఆయన విరుచుకుపడ్డారు. పాతాళంలోని బొగ్గునుంచి ఆకాశంలో అగస్టా హెలీకాప్టర్ల కొనుగోళ్లదాకా అన్నింటా కుంభకోణాలకు పాల్పడి, చివరికి కామన్వెల్త్ క్రీడల్లో కూడా అవినీతికి పాల్పడి ప్రపంచం ముందు దేశం పరువు బజారుకెక్కించిన పార్టీ కాంగ్రెస్ అని తూర్పారబట్టారు. వాటర్‌గ్రిడ్ పథకం మీద కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అవినీతి జరిగితే ఆధారాలు చూపాలని సవాలు చేశారు. కుటుంబపాలన గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదమని, తామెవరం రాహుల్ గాంధీలాగా ఆకాశంలోంచి ఊడిపడలేదని, ఆయనలాగా అడవులు, హిమాలయాలు పట్టుకు తిరగడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ వాటర్‌గ్రిడ్‌పై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.

కమీషన్లు మీ సంస్కృతి: కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేరాఫ్ అని కేటీఆర్ అన్నారు. తాము వారిలా జలయజ్ఙం పేరుతో కమీషన్లయజ్ఞం పెట్టలేదన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో కూడా అవినీతి చేసి ప్రపంచం ముందు భారతదేశం పరువుతీసిన దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు. మీదో పార్టీ… మీదో బతుకు. నిన్న మొన్నటి వరకు మీ ప్రభుత్వంలోని ఐఏఎస్‌లు జైలుకు పోయిండ్రు. మంత్రులు, మాజీ పీసీసీ అధ్యక్షుడు సీబీఐ కేసుల్లో ఉంటరు. మీ వెనుక అంత నలుపు పెట్టుకుని గురువింద గింజలా మాట్లాడుతున్నరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేండ్లు సీఎంగా ఎట్లా చేశారో: కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ పదేండ్లపాటు సీఎంగా ఎట్ల చేసిండో తనకు అర్థం కావడంలేదని కేటీఆర్ అన్నారు. పెద్ద మనుషులు ఆలోచించి మాట్లాడాలే తప్ప పక్కన కూర్చున్న వాళ్లు రాసిస్తే మాట్లాడడం సరికాదని అన్నారు. వాటర్ గ్రిడ్‌కు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు కాలేదని అన్న దిగ్విజయ్ మళ్లీ అదే నోటితో హడ్కో నుంచి రూ.10వేల కోట్లు, నాబార్డు నుంచి రూ.3వేల కోట్ల రుణం తీసుకుని రాష్ర్టాన్ని అప్పుల పాలు చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. అసలు డీపీఆర్ లేకుండా నాబార్డు, హడ్కోలాంటి సంస్థలు రుణాలిస్తాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. వాటర్‌గ్రిడ్‌కు రుణమిస్తామని కొరియా ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందని చెప్తూ, డీపీఆర్ లేకుండా అంతర్జాతీయ సంస్థలు కూడా రుణాలు ఇస్తాయా అని నిలదీశారు. కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్న ఆయనకు వాటర్ గ్రిడ్ డీపీఆర్‌ను పంపిస్తామని చెప్పారు. దిగ్విజయ్ మాటలు చూస్తే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి స్కీముల్లో కుంభకోణాలకు పాల్పడినట్టే భావించాల్సి వస్తుందన్నారు. నిన్నటివరకు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండగా దిగ్విజయ్ పక్కన కూర్చున్న జానారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారని, ఆయన హయాంలో చేపట్టిన మంచినీటి పథకాల్లో జానారెడ్డి కమీషన్లు తీసుకున్నరా? ఢిల్లీకి పంపినరా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఆ అద్భుత పరిజ్ఞానమేందో మాకూ చెప్పండి: వాటర్ గ్రిడ్ పథకాన్ని పైపుల కోసం, కంపెనీల కోసమేనని దిగ్విజయ్ అనడాన్ని ఖండించారు. పైపులు లేకుండా నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అలాంటి పరిజ్ఞానం ఏమన్నా దిగ్విజయ్ సింగ్ కనుక్కున్నడా? మాకైతె తెలువదు. అట్లాంటి అద్భుతమైన పరిజ్ఙానం ఉంటే.. వాళ్ల అద్భుతమైన మెదళ్లలోనే ఉంచుకోకుండా మాక్కూడా చెబితే వాటిని చేపడుతం అని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ నాయకులు మహానుభావులు వారు తిమ్మిని బమ్మి చేస్తారన్నారు. పైపులు లేకుండా డ్రింకింగ్ వాటర్ స్కీం తెస్తరని.. తీగలు లేకుండా కరెంటు తేగలరని.. ఆస్పత్రులు కట్టకుండా వైద్యం .. పాఠశాలలు లేకుండా విద్యను కూడా అందించగలరని ఎద్దేవా చేశారు.

దేశంలోనే ఎక్కడా లేదు: వాటర్ గ్రిడ్‌లాంటి బృహత్తర కార్యక్రమం 60 ఏండ్ల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ప్రకటించలేదని, కనీసం సాహసం చేయలేదని కేటీఆర్ అన్నారు. చెప్పడమే కాకుండా ఇంటింటికీ నీళ్లివ్వకుంటే ఎన్నికలకు కూడా పోమని చెప్పిన ధీశాలి కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో భూగర్భజలాలు పడిపోతున్నయని, చరిత్రలో ఎన్నడూలేనట్లుగా ప్రజలు దాహార్తిని ఎదుర్కోవాల్సి వస్తుందని రోజూ పత్రికల్లో ఫొటోలతో సహా వార్తలు వస్తున్నాయని మంత్రి అన్నారు. భూగర్భజలాలతో నీరు సరఫరా చేస్తే ఫ్లోరోసిస్ లాంటి వ్యాధులు వస్తాయని, అందువల్ల కృష్ణా, గోదావరి వంటి జీవ నదుల ద్వారా సర్‌ఫేస్ వాటర్‌ను ఇవ్వాలనేది మా ఆలోచన అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నపుడు అభినందించడం పోయి బట్టకాల్చి మీద ఏస్తమంటే ఎట్లా అని ప్రశ్నించారు.

అది ఈ మిలీనయంలో ఉత్తమ జోక్ తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని దిగ్విజయ్‌సింగ్ అనడం ఈ మిలీనియంలోనే పెద్ద జోక్‌గా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. మీ పార్టీ… మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ అంతా కుటుంబపాలనే. ఇతరులను ఆ మాట అనేందుకు సిగ్గుండాలి. మీ నాయకుడు రాహుల్‌గాంధీ లెక్క మేం ఆకాశం నుంచి ఊడిపడలేదు… పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు అడవులు, హిమాలయాలకు పారిపోలేదు అని దుయ్యబట్టారు. తాము ఉద్యమాల్లోంచి వచ్చామని ప్రజాక్షేత్రంలో ప్రజల మనసు గెలుచుకొని ప్రజాప్రతినిధులమైనామని అన్నారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు.ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రజలను మెప్పించి గెలిచిన వారే తప్ప అయాచితంగా రాలేదన్నారు.

బాబూ… మూడు పుస్తకాలు పంపిస్త చదువుకో! తన వల్లనే తెలంగాణ సర్‌ప్లస్‌గా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని మీడియా ప్రస్తావించగా దాన్ని కేటీఆర్ ఖండించారు. తెలంగాణ ఎప్పుడూ సర్‌ప్లస్సేనని మధ్యలో దౌర్యాగ్య పాలకుల వల్ల నష్ట పోయిందన్నారు. హైదరాబాద్ స్టేట్‌గా ఉన్న కాలం 1948-52 వరకు తెలంగాణ సర్‌ప్లస్ స్టేట్ అని తెలంగాణ, ఏపీ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసునని, అప్పటికి చంద్రబాబు పుట్టి ఉండకపోవచ్చనని అన్నారు. నిన్న తెలంగాణ మిగులు మీద పత్రికల్లో గౌతం పింగలె వ్యాసం రాశారని… బాబుకు దానిని తెలుగులోకి తర్జుమా చేసి పంపిస్తానని, బీపీఆర్ విఠల్ 1962, 2001లో రాసిన మరో రెండు పుస్తకాలను కూడా పంపిస్తానని చెప్పారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తెలంగాణ సర్‌ప్లస్ స్టేటేనని… అంగట్లో అన్నీ ఉన్నా అన్నట్లు ఏపీలో దౌర్భాగ్య పాలనవల్ల తెలంగాణ నష్టపోయిందన్నారు.

సిట్టింగ్ సీటు గెలిచాం.. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రస్తావించగా తమ సిట్టింగ్ స్థానం నల్లగొండ-వరంగల్-ఖమ్మం నిలబెట్టుకున్నామని చెప్పారు.అలాగే సిట్టింగ్ స్థానం కాకపోయినా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో 45వేల ఓట్లు సాధించామని అన్నారు. ఈ స్థానంలో 45వేల ఓట్లు రావడం భవిష్యత్తు విజయాలకు సోపానమని మంత్రి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దీవెనలు అందుకునేలా తాము పని చేస్తున్నామని, రెండు దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా వేసవిలోనూ కోతల్లేకుండా మొదటిసారిగా కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. పది నెలల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలకు ఇదో ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.

దానికే ఎగిరిపడితే ఎలా? బీజేపీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ పార్టీ మెదక్ ఉప ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయినట్లు డిపాజిట్ దక్కించుకుందని, కంటోన్మెంట్ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలవడంలేదన్నారు. ఏదో ఒక స్థానాన్ని గెలుచుకున్నంత మాత్రాన్నే ఆ పార్టీవారు ఆగుతలేరు.. దీనికే గంత ఎగిరిపడితే ఎలా? అని ప్రశ్నించారు. విమలక్కపై కేసును ప్రస్తావించగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. మంత్రి అయినా సామాన్యుడు అయినా చట్టం ఎవరికీ అతీతం కాదన్నారు. తాను తప్పు చేసినా చట్టం అదే పని చేస్తుందన్నారు. తెలంగాణలో అధికార మార్పిడి జరగలేదని, కొత్తగా రాష్ట్రం ఏర్పడిందని, తెల్లారితే చంద్రబాబు పెట్టే ఇబ్బందులు ఎదుర్కొని పాలన సాగిస్తున్నామని అన్నారు. రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో ఏదో జరుగుతుందని దుష్ప్రచారం చేశారని, పది నెలల్లో ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితే అసలు వీరికి పాలన చేతకాదు.. మళ్లీ ఏపీలో కలపాలని డిమాండు చేస్తారని అన్నవారూ ఉన్నారు అని చెప్పారు.

త్వరలో అన్ని నోటిఫికేషన్లు వస్తయి… కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పక్కా ప్రణాళికతో పాలన సాగిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో అన్ని ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు వస్తాయన్నారు. ఇప్పటికే ఆర్‌డబ్ల్యూఎస్‌లో 620 ఉద్యోగాలకు, హోం డిపార్టుమెంట్‌లో 3200 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చామని, సింగరేణిలో 5-6వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నారని చెప్పారు. గత సంవత్సరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో క్రైంరేట్ చాలావరకు తగ్గిపోయిందని, అయితే పోలీసు శాఖ వారు ఈ వివరాలను వెల్లడిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ కన్వీనర్ మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.