స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తనను సీఎంగా కాకుండా ఒక కో-వర్కర్‌గా.. మీలో ఒకడిగా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఐఏఎస్, ఐపీఎస్‌లు, అధికారులు, ఉద్యోగులు సహా అంతా కో వర్కర్‌లేనని అభివర్ణించారు. స్వచ్ఛ హైదరాబాద్ కేవలం వారం రోజుల కార్యక్రమం కాదని చెప్పిన కేసీఆర్, ఇది నాలుగేండ్లపాటు నిరంతరంగా కొనసాగుతుందని ప్రకటించారు. బస్తీల్లో పర్యటించే అధికారులు అక్కడి ప్రజలను ఒప్పించి రహదారులు, నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. నగరంలో రోజూ 8వేల టన్నుల చెత్త తయారవుతున్నదని దాన్ని తొలగించేందుకు 2 వేల ఆటోట్రాలీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.

-సీఎంగా కాదు.. కో వర్కర్‌గా చూడండి:అధికారులతో కేసీఆర్ -వచ్చే నాలుగేండ్లపాటు స్వచ్ఛ హైదరాబాద్ -చెత్త తరలింపునకు 2వేల ఆటోట్రాలీలు -చెత్తనుంచి విద్యుత్‌కు ప్రణాళికలు వేస్తున్నాం -నగరంలో పేదలకు 2 లక్షల ఇండ్లు కట్టిస్తాం -అందుబాటులో ఉన్న స్థలాలన్నీ తీసుకుంటాం -ఇది ప్రజాస్వామ్యం, ప్రజల సొత్తు ప్రజలకే -రెండు తరాలదాకా ఇండ్ల బాధలు ఉండవద్దు -స్వచ్ఛ హైదరాబాద్ సమీక్షలో సీఎం కేసీఆర్ -హమాలీ బస్తీలో ఆరంతస్తుల ఇండ్లు -కృష్ణానగర్‌లో పేదల ఇండ్లకు టవర్లు -బస్తీల్లో సీఎం పర్యటన..ప్రజలకు హామీ ఆ చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో రెండు లక్షలమంది పేదలకు ఇండ్లు కట్టించి తీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. పేదలకు ఇండ్ల కిరాయి బాధలు తొలగిపోవాలని.. ఇందుకోసం అందుబాటులో ఉన్న స్థలాలన్నీ తీసుకుంటామని చెప్పారు.
ఉస్మానియాలో 11 ఎకరాలు, ఉప్పల్ చౌరస్తా దగ్గర 70 నుంచి 80 ఎకరాల్లో ఆరు అంతస్తుల్లో పేదలకు ఇండ్లు కడతామని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ మెట్టుగూడలోని క్యాంపు ఆఫీస్‌లో సికింద్రాబాద్ ప్రాంత స్వచ్ఛ హైదరాబాద్ యూనిట్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని హమాలీ బస్తీ, ముషీరాబాద్ ప్రాంతంలోని కృష్ణానగర్‌లో పర్యటించి ప్రజలతో సంభాషించారు.
లష్కర్ ప్రఖ్యాతి మంటగలిసింది.. నిజాం హయాంలో లష్కర్‌గా, వ్యాపార కేంద్రంగా ఎంతో ప్రఖ్యాతి పొందిన సికింద్రాబాద్ సమైక్య పాలనలో దరిద్రంగా మారిపోయిందని కేసీఆర్ అన్నారు. మెట్టుగూడ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రసంగిస్తూ సికింద్రాబాద్ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కాలం నుంచి సికింద్రాబాద్ బహుముఖంగా విస్తరిస్తూ వస్తున్నదని, అయితే పాలకులకు ముందు చూపు లేకపోవడంతో ఇరుకిరుకుగా మారిపోయిందని అన్నారు. నాటి పాత నిర్మాణాలు నేడు పెరిగిన జనాభాకు సరిపోవడంలేదని అన్నారు. అగ్గిపెట్టెలాంటి ఇండ్లు విచ్చలవిడిగా కట్టడంతో దారులు ఇరుకుగా మారాయని, ఇవాళ ఎక్కడా కనీసం ఖాళీ జాగ లేకుండా దరిద్రంగా తయారైందని అన్నారు.
ఆదివారం రాత్రి గూగుల్‌లో ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఎక్కడ కూడా గుంటెడు స్థలం కనిపించలేదన్నారు. ఇక్కడ నాలాలు భయంకరంగా తయారై పిల్లలు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. 1.5 కిలో మీటర్ల మేర నాలా ఉంటే అంబర్‌నగర్‌లో నాలాల మీదనే ఇండ్లు కట్టారని చెప్పారు. గతంలో ఉన్న కార్పొరేటర్లు ఇండ్లు కట్టిండ్రట. మరి అపుడు ఎట్ల పర్మిషన్ ఇచ్చిండ్రో. అంబర్‌నగర్‌లో మాత్రం ఇండ్లు కట్టలేమని వాళ్లకే చెప్పాను. జాగ లేదు..ఎట్ల కట్టాలె?అని అడిగిన. మనిషికి రోగం వస్తే డాక్టర్ దగ్గరి పోతడు. ఆయన మందులు ఇస్తడు.. గోలీ రాస్తడు .. తగ్గకపోతె స్కానింగ్, ఎక్స్‌రే అంటడు. ఆఖరుకు ఆపరేషన్ చేయాలని చెప్తడు.. ప్రాణం దక్కాలి కాబట్టి సరే అంటరు.
అట్లనే బస్తీలల్ల కూడా ఆపరేషన్ కావాలె. వాళ్లు ఉన్న జాగను ఇస్తే ఆ జాగలోనే మంచిగ ఇళ్లు కట్టిస్తం. నష్ట పరిహారం ఇస్తం. ఇది చెప్పి పేదలను చైతన్యవంతం చేయండి అని ముఖ్యమంత్రి అధికారులకు మార్గదర్శనం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 390 కిలో మీటర్ల మేర 77 నాలాలున్నాయని, అందులో రెయిన్ వాటర్ నాలాలు డ్రెయిన్ నాలాలుగా మారిపోయాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నాలాల వెంట దుర్వాసనతో ప్రజలు నరకయాతన పడుతున్నారని, మరోవైపు ట్యాప్, డ్రైనేజీ వాటర్ కలిసిపోయి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చాలని అధికారులకు పిలుపునిచ్చారు.
చెత్త పని పడదాం.. హైదరాబాద్‌లో రోజూ 8 వేల టన్నుల చెత్త తయారవుతున్నదని కేసీఆర్ చెప్పారు. చెత్తను తరలించేందుకు ఇపుడు వాడుతున్న సైకిల్ రిక్షాలు బాగాలేవని ఆయన అన్నారు. వీటి స్థానంలో ఆటో ట్రాలీలు తీసుకురావాలని అన్నారు. ప్లాస్టిక్, బయోవేస్ట్ వేర్వేరుగా సేకరించేలా ట్రాలీలో రెండు కంపార్ట్‌మెంట్లు ఉండాలని, కలెక్టింగ్ పాయింట్లు పెట్టి వీటిని రోజూ అక్కడికి తరలించాలని అక్కడినుంచి శివారుకు తరలించాలని అన్నారు. వచ్చే 22న మళ్లీ హెచ్‌ఐసీసీలో మీటింగ్ పెట్టుకుందాం.
అందులో అన్నీ ఫైనల్ చేద్దాం. సిటీలోని నాలుగు వైపుల పవర్ జనరేటింగ్ వంటి వాటిని పెట్టాలి. ఎక్స్‌పర్ట్స్‌తో సలహాలు తీసుకుని ముందుకు సాగుదాం అని కేసీఆర్ చెప్పారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చే ఆటో ట్రాలీలను డివిజన్ వారీగా బస్తీ యువకులకే ఇవ్వాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పిస్తామని, నెలన్నర కాలంలో ఈ ప్రక్రియ ముగించి ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ఆటోలు పంపిణీ చేస్తామని అన్నారు.
బస్తీవాసులకు కార్పొరేట్ వైద్యం.. పేదల బస్తీల ప్రజలకు కార్పేరేట్ దవాఖానల్లో వైద్య సౌకర్యాలకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆధికారులను ఆదేశించారు. తాను స్వయంగా ఆదివారం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వారితో మాట్లాడానని.. వారు కూడా ఇందుకు అంగీకరించారరని కేసీఆర్ చెప్పారు. సిటీలో బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్‌తో చాలా ఇబ్బందులు వస్తున్నాయని తన దృష్టికి వచ్చిందని సీఎం తెలిపారు. ఈ వేస్ట్‌ను హైదరాబాద్ చుట్టూరా ఉన్న గుట్టల వద్ద పెద్దపెద్ద రాళ్లను తొలగించడంతో ఏర్పడిన కందకాల్లో నింపేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు ఆయన సూచించారు.
రెండు పడకల ఇళ్లు నిర్మిస్తాం.. స్వచ్ఛ హైదరాబాద్‌లో తిరిగిన ప్రతిచోట ఇండ్లు లేవనే ఫిర్యాదులు చేస్తున్నరని సీఎం అన్నారు. పేదల బాధలు గుర్తించామని అందుకే వారికి గూడు కల్పించేందుకు ఉస్మానియా క్యాంపస్ ప్రాంతంలో 11 ఎకరాలు, ఉప్పల్ చౌరస్తా వద్ద 70 నుంచి 80 ఎకరాలను గుర్తించామని అన్నారు. ఈ స్థలాల్లో పేదలకు ఆరు అంతస్తుల్లో రెండు పడక గదుల ఇండ్లను కట్టి ఇస్తామని చెప్పారు. నాలాలు, రహదారుల విస్తరణలో బాధితులుంటే వారికి ఇండ్లు ఇస్తామని చెప్పారు.
తెలంగాణ వచ్చింది.. మన తలరాత మారింది సోమవారం రాత్రి ఏడు గంటలకు సీఎం కేసీఆర్ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని హమాలీబస్తీని సందర్శించారు. అక్కడి బస్తీవాసులను పిలిచి వారికి ఇండ్ల నిర్మాణం విషయమై మాట్లాడారు. ప్రభుత్వం పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టాలని నిర్ణయించిందని వారికి చెప్పారు. తెలంగాణ వచ్చింది..మన తలరాత మారింది. మీ హమాలీ బస్తీ అమీర్‌బస్తీ కావాలని ఆకాంక్షించారు. తాను ఆదివారం రాత్రి వెళ్తూ వెళ్తూ ఈ బస్తీని చూశానని ఇక్కడి పరిస్థితికి బాధ పడ్డానని తెలిపారు. పొద్దున్నే రెవిన్యూ అధికారులు వచ్చి ఇక్కడ జాగ లెక్కలు తీశారని వివరించారు.
ఇక్కడ కేవలం ఎకరంన్నర భూమే ఉంది, 144 కుటుంబాలున్నాయి.. 69 మంది అన్నదమ్ముల కుటుంబాలున్నాయి..ఎనిమిది ఇండ్లకు తాళాలు ఉన్నాయి. ఇక్కడ కనీసం 250 ఇండ్లు కావాలి. అధికారులతో మాట్లాడితే ఆరు అంతస్తుల్లో కడితే తప్ప అందరికీ ఇండ్లు రావన్నారు అని వారికి చెప్పారు. ఆరంతస్తులు కడితే తప్పనిసరిగా లిఫ్టు ఉండాల్సి వస్తుందని సీఎం తెలిపారు. లిప్టుకు కరెంటు బిల్లులు భారం కాకుండా ఇక్కడ దానికి 2,500 చదరపు గజాలలో రెండతస్తుల కమ్యూనిటీ హాల్ కట్టి కింది అంతస్తు దుకాణాలకు ఇస్తే వచ్చే అద్దెలు కరెంటు నల్లా బిల్లులకు సరిపోతాయని వివరించారు.
బస్తీవాసులు అంగీకరిస్తే బుధవారం శంకుస్థాపన చేస్తానని ఆయన చెప్పారు. ఐడీహెచ్ కాలనీలో ఒక్క ఫ్లాట్‌కు రూ.7లక్షలు ఖర్చైతే ఇక్కడ రూ.9లక్షల వరకు ఖర్చు వస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించేందుకు కాలనీ జాగాలన్నీ తీసుకుంటున్నాం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజల సొత్తు ప్రజలకే చెందాలి.
రెండు లక్షల మందికి ఇండ్లు కడతాం, వచ్చే రెండు తరాలకు ఇండ్ల బాధలు తప్పాలి. పేదలకు కిరాయి బాధలు తప్పాలి. అందరూ సమిష్టిగా సంతోషంగా బతకాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బస్తీల్లో పనికిమాలిన పంచాయితీలు పెట్టుకోవద్దని, హమాలీ బస్తీ ఇతర బస్తీలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. వచ్చే ఐదు నెలల్లో మీరంతా కొత్త ఇండ్లలోకి చేరాలి, నాకు మంచి దావత్ ఇవ్వాలి అని సీఎం అనడంతో అందరూ హర్షధ్వానాలతో అంగీకరించారు.
హరితహారంకోసం సిద్ధంకండి.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం పథకానికి ఇప్పటినుంచే అధికారులు సిద్ధం కావాలని సీఎం సూచించారు. బస్తీల్లో తిరుగుతున్న సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో అనువైన ప్రదేశాలను గుర్తించి ఇండెంట్లు తయారు చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ జాగ దొరికితే అక్కడ మొక్క నాటేందుకు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. తాను పర్యటించిన ప్రాంతాల్లో శ్రీనివాసనగర్ కాలనీలో ఎలాంటి కంప్లెయింట్ రాలేదని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్, పీహెచ్‌సీ, హెచ్‌ఎం డబ్ల్యూఎస్ శాఖలపై ప్రజలనుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని సంబంధిత అధికారును ప్రశంసించారు. కొన్ని చోట్ల మాత్రం పింఛన్లు రావడం లేదన్నారని ,వాటి విషయం చూడాలని సూచించారు.
సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ముషీరాబాద్, కంటోన్మెంట్, సనత్‌నగర్ నియోజవర్గాల ప్రజల సమస్యలను సైతం అర్థం చేసుకుని ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. అన్ని రకాల సమస్యలను అర్థం చేసుకుని ప్రజలకు కావాల్సిన రేషన్‌కార్డు, పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీ, కరెంట్, మంచినీళ్లు తదితర నిత్యావసరాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, నగరంలో చెత్త లేకుండా సుందర నగరంగా తీర్చి దిద్దే బాధ్యతను తీసుకుని ముందుకు సాగాలని, అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ రివ్యూ కార్యక్రమంలో మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్, జిహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితర ఐఏఎస్, ఐపీఎస్, ఐఎస్‌ఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
కృష్ణానగర్‌లో పేదలకోసం టవర్ స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా సోమవారం రాత్రి ముషీరాబాద్ కృష్ణానగర్‌లో పర్యటించిన సీఎం అక్కడి పేదలకు ఇండ్లు మంజూరు చేశారు. అక్కడ కేవలం 412 గజాల స్థలంలో 12 చిన్న గదుల్లో 46 కుటుంబాలు జీవిస్తున్నాయి. కొన్ని ఇండ్ల సైజు 6×6 మాత్రమే ఉంది. కాళ్లు చాపుకొని పడుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితిని చూసి సీఎం కలత చెందారు. బస్తీవాసులను పిలిచి మాట్లాడారు. వీళ్లంతా ఆటోలు నడుపుతూ, భవనాలకు పెయింటింగ్ వేస్తూ, ఇండ్లలో పాచి పని చేస్తూ జీవిస్తున్నారు. అందరికీ ఇండ్లు కావాలంటే టవర్ పద్ధతిలోనే ఇండ్లు కట్టాలి. అయితే 412 గజాల స్థలంలో టవర్ నిర్మాణం సాధ్యం కాదు.
పక్కనే ఉన్న ఇంటికి చెందిన కొంత స్థలం ఉంటే బాగుంటుందని భావించిన సీఎం సదరు ఇంటి యజమాని సత్యానంద్‌ను పిలిచి మాట్లాడారు. పేదల ఇండ్లకు సహాయపడితే ప్రతిఫలంగా తాను సాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీనితో స్థలం ఇవ్వడానికి సత్యానంద్ సంతోషంగా అంగీకరించారు. సత్యానంద్‌ను అభినందించిన సీఎం ఈ ప్రాంతాన్ని మంగళవారం ఉదయమే సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తాను మరోసారి ఇక్కడికి వస్తానని, బుధవారం శంకుస్థాపన చేస్తానని బస్తీవాసులకు హామీ ఇచ్చారు. అనుకోకుండా తలుపు తట్టిన అదృష్టానికి ఆ బస్తీవాసులు ఆనందంలో మునిగితేలారు.