Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మీరా మాట్లాడేది?

తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో ఆరు గ్రామాలను ముంచాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. దానికి బదులుగా తాము ఆ ఆరు గ్రామాల్లో ఒక్క ఇల్లు మునగకుండా చేసి, అదే రెండు లక్షల ఎకరాలకు నీళ్లిస్తామంటున్నామని ఆయన తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్‌కు 2008లో శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆరేండ్లలో ఆరు తట్టల మట్టి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు.

Harish Rao press meet in Telangana Bhavan

-తోటపల్లికోసం మీరు ఆరేండ్లలో ఆరు తట్టల మట్టి తీసిండ్రా? -ఆరు గ్రామాలను కాపాడి మేం రెండు పంటలకు నీళ్లిస్తమంటున్నం: హరీశ్ -కాంగ్రెస్‌పై మండిపడ్డ మంత్రి హరీశ్‌రావు అలాంటి కాంగ్రెస్‌కు అసలు తోటపల్లిపై మాట్లాడే అర్హత కూడా లేదని తేల్చిచెప్పారు. తోటపల్లి రిజర్వాయర్ విషయంలో బుధవారం సాయంత్రం హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ఎవరైనా గ్రామాలను ముంచొద్దంటరు. కానీ మీరేమో ఆరు గ్రామాల్ని ముంచాలంటున్నరు. 3800 కుటుంబాల్ని నిరాశ్రయుల్ని చేయాలంటున్నరు. మీరు ఆరు గ్రామాల్ని ముంచి రెండు లక్షల ఎకరాలకు నీళ్లిస్తమని తోటపల్లి ప్రాజెక్టు రూపకల్పన చేసిండ్రు. మేం ఒక్క ఇల్లు మునగకుండా అదే రెండు లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లిస్తమంటున్నం. అయినా మీరు రోడ్ల మీద పడి ధర్నా చేస్తున్నరు.

ఈ ప్రభుత్వం మంచి పనిచేస్తున్నా, కావాలని గుడ్డి వ్యతిరేకతతో వ్యవహరిస్తున్నరు. అని హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా, ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని గుడ్డిగా వ్యతిరేకిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కేవలం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు రూపకల్పన చేశారని హరీశ్ విమర్శించారు. 2008లో తోటపల్లి రిజర్వాయర్‌ను కూడా కేవలం కాంట్రాక్టర్ల లబ్ధికోసమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసిందని స్పష్టంచేశారు.

మిడ్‌మానేరుకింద 1.70 టీఎంసీల సామర్థ్యంతో తోటపల్లి రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారని, అయితే పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ అందులో కేవలం 0.25 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించే వీలుండేలా ప్రాజెక్టు డిజైన్ చేశారని మంత్రి విమర్శించారు. దీనివల్ల వేల ఎకరాలు ముంపునకు గురవడంతోపాటు ఒగులాపూర్, గాగిళ్లాపూర్, నారాయణ్‌పూర్, వరికోల్, ఇందుర్తి, రామచంద్రాపురం గ్రామాల్లో 3800 ఇండ్లు కూడా మునిగిపోతాయని చెప్పారు. కేవలం 0.25 టీఎసీలకోసం ఇంత భారీ నష్టంతో, జనాన్ని ముంచడం ఎంతవరకు సమంజసమని హరీశ్‌రావు ప్రశ్నించారు. పైగా తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి మొత్తం రూ.వెయ్యి కోట్ల వ్యయం కూడా అవుతుందన్నారు.

రెండు అక్విడక్టులతో అంతకంటే భారీ ప్రయోజనం కాంగ్రెస్ హయంలో కేవలం కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు డిజైన్ చేయడంవల్ల ఈ పరిస్థితి నెలకొందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీడిజైన్‌లో, సాంకేతికంగా అన్ని కోణాల్లో పరిశీలించిన ఇంజినీర్ల బృందం సూచన మేరకు అక్విడక్టుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేవలం వంద కోట్ల వ్యయంతో మిడ్ మానేరు కింద మొహితుమ్మెద వాగు, ఎల్లమ్మ వాగు వద్ద రెండు అక్విడక్టులు నిర్మిస్తే ఏ ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదని వివరించారు.

పైగా కాంగ్రెస్ హయాంలో ముంచుతామన్న గ్రామాలతో సహా రెండు లక్షల ఎకరాలకు.. రెండు పంటలకు భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ద్వారా సాగునీరు ఇవ్వొచ్చని మంత్రి పేర్కొన్నారు. జనాన్ని ముంచకుండా నిర్థారిత ఆయకట్టుకు నీరందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, గ్రామాల్ని ముంచండంటూ కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయడం ప్రపంచంలోనే లేని విడ్డూరమని మంత్రి అన్నారు.

ఆరేండ్లలో ఆరు తట్టల మట్టి కూడా తీయలేదు తోటపల్లి రిజర్వాయర్‌కు 2008లో శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 2014 వరకు.. అంటే ఆరేండ్లపాటు ఆరు తట్టల మట్టి పని కూడా చేయలేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ నేపథ్యలో అసలు తోటపల్లిపై కాంగ్రెస్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు. మిడ్‌మానేరును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదంటూ కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండటాన్ని ప్రస్తావించిన మంత్రి.. 2006లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుకు ఎనిమిదేండ్లు రూ.78 కోట్లు వెచ్చిస్తే, కేవలం ఏడాది కాలంలో తెలంగాణ ప్రభుత్వం రూ.82 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఈ క్రమంలో అసలు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందెవరో, కరీంనగర్ ప్రజల్ని మోసం చేసిందెవరో స్పష్టమవుతున్నదని అన్నారు. మేధావులు, రైతులు, యువకులు కాంగ్రెస్ కుటిల నీతిని అర్థం చేసుకోవాలని మంత్రి కోరారు.

ప్రజలు నమ్మే పరిస్థితి లేదు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసినా దానిని విమర్శించాలనే విధంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పెచ్చులూడి, శిథిలావస్థకు చేరుకున్న ఉస్మానియా హాస్పిటల్‌ను తరలిస్తామంటే, లేదు.. లేదు.. గబ్బిలాలు ఉండే, పైకప్పు ఊడిపోయే భవనంలోనే నిరుపేదలు చికిత్స చేయించుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. గాంధీ దవాఖాన భవన నిర్మాణ సమయంలో వీరందరికీ హెరిటేజ్ అంశం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. వారి హయాంలో అమలుచేసిన పథకాలను రద్దు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న హరీశ్.. తాము రద్దు చేసిన పథకాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 పింఛను ఏడు లక్షల మందికి ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం 36 లక్షల మందికి రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నదని చెప్పారు.

వాళ్లు 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి మరచిపోయిన ఆరు కిలోల బియ్యాన్ని తాము 20 కిలోల సీలింగ్‌లేకుండా ఒకో కుటుంబానికి వంద కిలోలవరకు ఇస్తున్నామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షమంటే నిర్మాణాత్మకంగా విమర్శిస్తూ.. ప్రజలపక్షాన నిలవాలని మంత్రి హితతవు పలికారు. ఇప్పటికే ప్రజలు అసహ్యించుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ఇక ముందు కూడా నమ్మే పరిస్థితి లేదన్నారు.

సమావేశంలో తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సతీశ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన టీడీపీ నేత మూడావత్ చందానాయక్, చాలామంది టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీశ్‌రావు వారికి గులాబీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.