-భూములు విలువలు, ఆస్తుల విలువలు పోతయి -వ్యాపారాలు బందైతయి.. ఉద్యోగాలు కరువైతయి -ఇది హైదరాబాద్‌కు ఏమాత్రం శ్రేయస్కరం కాదు -నగరాన్ని ఉజ్వలంగా ముందుకు తీసుకుపోదం -కళకళలాడే హైదరాబాద్‌ను కలిసి కాపాడుకుందం -చావునోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన -తెలంగాణ రాష్ట్రంలోని, నగరంలోని ప్రతి అంగుళం -అన్నివిధాలా బాగుండాలని, బాగుచేయాలని నా కల.. -టీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

ఎన్నో అవమానాలు భరించి, చివరికి చావు నోట్లో తలపెట్టి సాధించిన ఈ రాష్ర్టాన్ని, ఈ నగరాన్ని అన్ని విధాలుగా బాగుచేయాలనే తపనతో ప్రభుత్వం, టీఆర్ఎస్ ముందుకు పోతా ఉన్నయి. మీరు ఆశీర్వదించి పంపిస్తే, గెలిపిస్తే మా ప్రయత్నాలన్నీ బ్రహ్మాండంగా సఫలీకృతం చేస్తం.
ఎవరో కొందరి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్ మొత్తం ఆగమైతదని, అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు. హైదరాబాద్ ఆగమైతే భూముల, ఆస్తుల విలువలు పోతయని, వ్యాపారాలు బందైతయని, పిల్లలకు ఉద్యోగాలు రావని అన్నారు. కళకళలాడే హైదరాబాద్‌ను అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రచారసభలో సీఎం మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
హైదరాబాద్‌ను అదరం కలిసి కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తు.. మన నగర భవిష్యత్తు. ఒక ఉజ్వలమైన నగరాన్ని ఇంకా ఉజ్వలంగా ముందుకు తీసుకొని పోవాలె. గొప్పగా ముందుకు పోతున్న నగరానికి ఇంకా గొప్పతనాన్ని ఆపాదించుకోవాలి. మన హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరం. ఎంతో చరిత్ర ఉన్న నగరం. ఎన్నో మంచి చెడ్డలకు సాక్ష్యంగా నిలిచిన నగరం. అందరం చిరునవ్వుతో.. సంతోషంతో కళకళలాడే హైదరాబాద్‌ను కలిసి కాపాడుకుందం.
కొందరి కోసం హైదరాబాద్‌ను ఆగం చేయబోం ఒక శ్రేష్ఠమైనటువంటి హైదరాబాద్ తయారుకావాలె. అత్యంత నివాసయోగ్య నగరం కావాలె. అందుకోసం బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాలి. అదే విధంగా మేం పనిచేస్తం. అది మా ధర్మంగా భావిస్తా ఉన్నం. కొందరికోసం పనిచేసి అందరి హైదరాబాద్‌ను ఆగం చేసే పరిస్థితి మాది కాదు. ఆ ఎజెండా కూడా మాది కాదు.
ఎంతో తపన, లోతైన ఆలోచన ఉంటేనే సాధ్యం ఇవన్నీ ఊరికే వచ్చేవి కావు. ఆషామాషీగా జరిగే కార్యక్రమాలు కావు. ఎంతో తపన, లోతైన ఆలోచన, నిధుల కూర్పు, ఆ సంయమనం. ఆ ఎగ్జిక్యూషన్ ఉంటే తప్ప సాధ్యమయ్యేవి కావు. గతంలో కాలే. ఇప్పుడు సాధ్యం అయ్యాయి. టీఆర్ఎస్ చేసి చూపించింది.

హైదరాబాద్ ఖాళీ అయితదన్నరు నేను 2001లో ఉద్యమం ప్రారంభించినప్పుడు ఎన్నో చిత్ర విచిత్రమైన వాదనలు.. అనుమానాలు.. అపోహలు.. చర్చోపచర్చలు. దాదాపు 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అప్పుడు చాలా అపనమ్మకాలుండేవి. ‘తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదు.. మీ దగ్గర ఉన్న పరిశ్రమలు తరలిపోతాయి. రాష్ట్రం అంధకారం అయితది’ అని కొందరు.. ‘మీకు నీళ్లు రావు.. పంటలు పండించుకోవడం చేతకాదు.. దెబ్బతింటది’ అని ఇంకొందరు.. ‘ప్రాంతీయవాదం పెచ్చరిల్లుతుంది.. నక్సలైట్లు చెలరేగుతరు.. అసలు హైదరాబాద్ నగరం ఖాళీ అయితది’ అని ఇంకొందరు! ఇట్లా శాపాలు.. ఎన్నో అనుమానాల మధ్య ప్రయాణం ప్రారంభించాం. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్పై నమ్మకం పెట్టి.. మమ్మల్ని గెలిపించి దీవించారు. ఎన్నో సమస్యల మధ్య ప్రస్థానం ప్రారంభించి ఒక్కో సమస్యను అధిగమిస్తూ వచ్చాం.
ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా.. అంతకుముందు కేసీఆర్ ఉద్యమ నాయకుడు. కేసీఆర్ ప్రసంగాలు తెలంగాణ ప్రజలు చెవి కోసుకుని వినేవాళ్లు. గంటల తరబడి సభల్లో వేచి ఉండేవాళ్లు. లక్షలమంది సభలకు హాజరయ్యేవారు. భారతదేశమే ఆశ్చర్యపడేలా కూడా తెలంగాణలో సభలు జరిగాయి. మన పరేడ్‌గ్రౌండ్‌లో వరంగల్ పట్టణంలో.. ఇతర చాలా పట్టణాల్లో జరిగాయి. చాలా వాడిగా వేడిగా చర్చలు ఉండేవి. అది రాష్ట్రం సాధించే వరకు ఉన్న చరిత్ర. ఇక తర్వాత ఉద్యమం గమ్యం చేరింది. రాష్ట్రం సిద్ధించింది. అప్పుడు నేను చెప్పాను.. మనం రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడు కావాల్సింది రాజకీయ పరిణతి. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉన్నది. సంయమనం పాటించాలి.. ఇక టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉండదు.. ఉద్యమ బాధ్యత ముగిసింది.. రాజకీయ పార్టీగా పరిణతితో పనిచేస్తుందని నేను ఆనాడు చెప్పాను. చాలా మంది నా మాటలు చూసి ఆశ్చర్యపోయారు.
పిల్లలకు ఉపాధి అవకాశాలు పోతై మీ అందరికీ మనవి చేస్తున్న. తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ కుటుంబ పెద్దగా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నగర ప్రజానీకానికి నా వినయపూర్వక విజ్ఞప్తి. పిచ్చి ఆవేశానికి పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, రెచ్చగొట్టే ప్రేలాపనలకు ఆగం అయితే హైదరాబాద్ ఆగమైతది. మొత్తం భూముల విలువలు పోతయి. ఆస్తుల విలువలు పోతై. వ్యాపారాలు బందైతై. పిల్లలకు ఉపాధి అవకాశాలు పోతై. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి రానీయొద్దు. హైదరాబాద్‌కు అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
ప్రతి ఇంచూ బాగుపడాలన్నదే నా కల నేను చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన విషయం మీకు తెలుసు. అందుకే నాకు తపన ఉంటది. ఈ రాష్ట్రంలో ప్రతి ఇంచూ, ఈ నగరంలో ప్రతి ఇంచూ అన్ని విధాలా బాగుపడాలనే కల నాకు ఉంటది. అది చూడాలనే కల నాకు ఉంటది.
పొత్తూరి మెచ్చుకున్నారు ప్రముఖ జర్నలిస్టు పొత్తురి వెంకటేశ్వర్రావుగారు అప్పట్లో నాతో చెప్పారు.. ‘బ్రిటన్‌లో విన్స్టన్ చర్చిల్ యుద్ధసమయంలో ప్రధానిగా బాగా పనిచేశారు. కానీ సాధారణ పాలనలో ప్రధానిగా ఆయన ఫెయిల్ అయ్యారు. కేసీఆర్‌గారు.. మీరు కూడా ఉద్యమాన్ని బాగానే నడిపారు. కానీ రాష్ర్టాన్ని సమర్థవంతంగా నడపలేరని మేం అనుకున్నాం. కానీ మీరు మా అందరి అంచనాలను తలకిందులు చేశారు’ అని ఆయన చాలామంది మిత్రుల ముందు నాతో అన్నారు. అట్లా అందరి అంచనాలు తలకిందులు చేసి టీఆర్ఎస్ ఏ రకమైన కార్యక్రమాలు తీసుకున్నదో.. ఏ రకంగా పురోగమించిందో మీరు అంతా చూశారు.