-అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు
-ప్రజా రవాణాతోనే ట్రాఫిక్‌కు కళ్లెం
-ప్రజలు బాగుండాలి.. నగరం బాగుండాలి
-కామినేని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రి కే తారకరామారావు
-42 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హైదరాబాద్ 2030కల్లా మెగాసిటీగా అవతరిస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రస్తుతం దేశంలో ఐదో అతిపెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్.. రానున్నకాలంలో నాలుగు లేదా మూడోస్థానంలో నిలుస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నామని వివరించారు. ప్రజలు బాగుండాలి .. నగరం బాగుండాలనే లక్ష్యంతో బహుముఖ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ వద్ద ప్రధానరోడ్డుపై ఎడమవైపు రూ.49 కోట్లతో నిర్మించిన ైఫ్లెఓవర్‌ను ప్రారంభించారు. కామినేని వద్ద మరోవైపు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ ను వచ్చే ఆరునెలల్లో ప్రారంభిస్తామన్నారు. దీనితోపాటు ఎల్బీనగర్లో మన నగరం కార్యక్రమం సందర్భంగా ప్రజలనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రూ.42 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాగోలు వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారవాణా వ్యవస్థ వినియోగంతోనే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని స్పష్టంచేశారు. ఎన్ని ైఫ్లెఓవర్లు నిర్మించినా, వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గనంతవరకు ఫలితం ఉండదన్నారు. హైదరాబాద్‌లో సుమారు కోటి జనాభా ఉంటే.. 50 లక్షల వాహనాలు ఉన్నాయని, ఇంత భారీస్థాయిలో వ్యక్తిగత వాహనాల వాడకం ఉన్నప్పు డు గ్రిడ్లాక్ కాకపోతే ఏమవుతుందని ప్రశ్నించారు. 32-33 శాతం మంది మాత్రమే ప్రజారవాణాను వినియోగిస్తున్నారని, అందుకే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని విశ్లేషించారు. ప్రజారవాణాను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశను ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా మొత్తాన్ని రైల్వేశాఖకు చెల్లించిందన్నారు.
సెప్టెంబర్ మొదటివారంలో ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం సేఫ్టీ అనుమతుల రాకలో జాప్యం కారణంగా ఈ నెల 15న ప్రారంభించాల్సిన ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రో మార్గాన్ని సెప్టెంబర్ మొదటివారానికి వాయిదావేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోను నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు, అక్కడి నుంచి ఫలక్‌నుమా మీదు గా శంషాబాద్ వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. నగరంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రూ.23 వేల కోట్లతో ఎస్సార్డీపీ ప్రాజెక్టును చేపట్టగా.. అందులో సుమారు రూ.మూడు వేల కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. మరో రూ.4వేల కోట్ల పనులు మంజూరీదశలో ఉన్నాయని చెప్పారు. రూ.1,500 కోట్లు రహదారుల అభివృద్ధికి వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పాదచారులకు అత్యంత ప్రాధా న్యం ఇస్తున్నామని, రూ. 100 కోట్లతో ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
శివారు ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి శివారు ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతంగా జరుగుతున్నదని, ఇందులో ఎల్బీనగర్ ముఖ్యమైనదని మం త్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎల్బీనగర్లో రూ.450 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్టు చెప్పారు. ప్రభుత్వ స్థలా ల్లో ఇండ్లు నిర్మించుకొన్నవారికి పట్టాలు మంజూరుచేసే అంశంపై దాదాపు 15-20 ఏండ్లుగా పెండింగులో ఉన్న సమస్యను ఉప ముఖ్యమంత్రి, తాను స్థానిక జోనల్ కమిషనర్ కార్యాలయంలో కూర్చొని పరిష్కరించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్వోసీలు మంజూరుచేయడంతో దాదాపు 40 నుంచి 50 వేల మందికి ఉపశమనం లభించిందన్నారు.
రంగారెడ్డిలో భారీగా అభివృద్ధి పనులు: మంత్రి మహేందర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్, హైటెక్‌సిటీ, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో రూ.1900 కోట్ల వ్యయంతో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని చెప్పారు.