ప్రజలంతా చేతులు కలిపితే ఆ చేతులు వేల కోట్ల సంపదను సృష్టిస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రజలకు తమ సంఘటిత శక్తిలోని విలువ ఎంతో తెలియదని, గతంలో ఎవరూ చెప్పే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఇకనైనా మేలుకొని ఎవరి గ్రామాన్ని వారే అభివృద్ధి చేసుకోవాలే తప్ప బయటివారు వచ్చి బాగుచేయరని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని సీఎం చెప్పారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అభివృద్ధిని దెబ్బతీసే ప్రతీపశక్తులు అంతటా ఉంటాయని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని ఉద్బోధించారు. వెలుతురు వెంటే చీకటి ఉంటుంది.

-సంఘటితంగా కదులుదాం – ప్రజలంతా చేతులు కలిపితే వేల కోట్ల సంపద – గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్.. ఈ మూడు గ్రామాలే అందుకు నిదర్శనం – ప్రతీపశక్తులను పట్టించుకోవద్దు – వ్యక్తులుగా బాగుంటున్నా.. సంఘంగా విఫలమవుతున్నాం – గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ – గుడుంబా రాక్షసిని తరిమికొట్టాలి: సీఎం – గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చీకటిని చూసి బెదిరిపోవద్దు, భయపడొద్దు. వ్యతిరేకించేవాళ్లు మనమధ్యే ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. వ్యక్తులుగా మనం బాగుంటున్నాం కానీ.. కానీ సంఘంగా విఫలమవుతున్నామని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్.. ఫైర్ చాలా బలమైందన్న సీఎం.. ఆ బలంతోనే గంగదేవిపల్లి ఇరవై మూడేండ్లుగా మంచి అభివృద్ధి సాధించిందని చెప్పారు. రాష్ట్రంలోని పల్లెల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేవేసే ప్రతిష్ఠాత్మక కార్యక్రమం గ్రామజ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం స్వయంపాలనతో స్వయం సమృద్ధి సాధించాలన్నదే గ్రామజ్యోతి లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో గ్రామానికి ఏం కావాలో ప్రజలే గ్రామసభల్లో నిర్ణయించుకొని అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గ్రామజ్యోతి ఆశయాలు, ప్రణాళికలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. గంగదేవిపల్లె ప్రజలు ఎవరి మీద ఆధారపడకుండా తమ గ్రామాన్ని తామే కమిటీలు వేసుకుని బాగు చేసుకున్నారని ప్రశంసించారు. తెలంగాణలో ప్రతి గ్రామం గంగదేవిపల్లిను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అభివృద్ధిలో ముందున్న గంగదేవిపల్లి స్వయంసమృద్ధినికూడా సాధించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయపద్ధతుల్లో కూడా మార్పులు చేసుకుని నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లాగా సంపన్నగ్రామం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..
మీ స్ఫూర్తి గొప్పది.. గంగదేవిపల్లికి శిరస్సు వంచి మొక్కుతున్న. మీ స్ఫూర్తి గొప్పది. దేశ విదేశాల నుంచి చాలా మంది ఈ గ్రామానికి వచ్చి వెళ్లారు. నేను కూడా ఇక్కడికి వచ్చాను. రాష్ట్రంలో చాలా ఊళ్లు ఉన్నా వచ్చాను.. అంటే ఇక్కడ గంగమ్మతల్లులు రప్పించారు. వ్యక్తులుగా మనం బాగుంటున్నాం. కానీ సంఘంగా ఫెయిల్ అవుతున్నాం. ప్రజల సంఘటిత శక్తిలో ఉన్న పవర్.. ఫైర్ చాలా బలమైంది. ఆ బలంతో మీరు ఇరవై ఇరవైమూడేండ్లు మంచి అభివృద్ధి సాధించారు. మీకు మీరుగా గ్రామాన్ని గొప్పగా మలచుకున్నారు. ఇవ్వాళ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. గంగదేవిపల్లిను చూస్తే కొత్త ఆశలు కలుగుతున్నయి. మీరు ఇక ఏదైనా సాధించగలరనే నమ్మకం ఏర్పడింది. అయితే ఇంతటితో ఆగకుండా స్వయం సమృద్ధి దిశగా ఎదగాలి
మూడు గ్రామాలు ఆదర్శం.. రాష్ట్రంలో మూడు గ్రామాలు ఎవరి మీదా ఆధారపడకుండా, ప్రభుత్వాలవైపు వేచి చేసి ఉండకుండా తమకు తోచిన విధంగా కట్టుబాట్లతో, పద్ధతులతో ఆదర్శవంతంగా ఎదిగాయి. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్, కరీంనగర్ జిల్లాలో ముల్కనూర్, వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి. ఈ మూడు గ్రామాలు ఆదర్శంగా, ప్రపంచం మెచ్చేలా నిలిచాయి. తెలంగాణలోని అన్ని గ్రామాలు ఈ మూడు గ్రామాలను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి.
ఏ గ్రామానికాగ్రామం బాగుపడితే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. మనలో ఎంతో శక్తి ఉంది. భూమి మీదకు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి వెళ్లాలి. మన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం బాగుపడాలి. ఎన్నికలు, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. బాగుపడడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. చాలా సమస్యలు వస్తాయి. వెలుతురు వెంటే చీకటి ఉంటుంది. చీకటిని చూసి బెదిరిపోవద్దు, భయపడొద్దు. వ్యతిరేకించేవాళ్లు మనమధ్యే ఉంటారు. వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు
ఆర్థిక స్వాతంత్య్రం దిశగా అడుగేయండి గంగదేవిపల్లి పట్టుదలతో సాధించిన ప్రగతి బాగా ఉంది. అయితే ఇంతటితో ఆగకుండా స్వయం సమృద్ధి దిశగా ఎదగాలి. స్వయం సమృద్ధి అంటే ఆర్థిక స్వాతంత్రం సాధించే దిశగా ఆలోచించాలి. గ్రామంలో అందరికీ భూమి ఉండదు. కాబట్టి భూమిలేని వాళ్లు, వృత్తిపనులు చేసుకునేవారికి ఇక్కడే ఉపాధి మార్గాలు సృష్టించి స్వయం ఉపాధి కల్పించుకోవాలి. వారికి ఆర్థిక చేయూతనివ్వాలి. వారితో రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు గ్రామంలోనే అమ్మించి ఉపాధి కల్పించాలి. అట్లనే ఒక చెప్పుల దుకాణం పెట్టించాలి. ఆ దుకాణంలోనే ఊరోళ్లందరూ కొనుక్కునేలా చూడాలి. అదేవిధంగా కుట్టుమిషన్లు కొనిచ్చి ఉపాధి కల్పించాలి. ఇలా ఆయా వృత్తిపనుల వాళ్లకు ఉపాధి కల్పించే పని చేయవచ్చు. అలాగే మీ దగ్గర పంటల విధానం కూడా మార్చుకోవచ్చు.
ఇందుకు నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం స్ఫూర్తిగా ఉంది. ప్రభుత్వం తరపున రెండు బస్సులు పెట్టి మిమ్మల్ని పంపిస్తా. వెళ్లి అక్కడ వ్యవసాయం పద్ధతులు చూసిరండి. అంకాపూర్‌లో కూడా మీలాగా బోర్లతోనే వ్యవసాయం చేస్తరు. అక్కడ గతంలో సర్వవర్గ సమితి ఉండే. కానీ దాని పేరు మార్చుకున్నారు. ఇప్పుడది విలేజ్ డెవల్‌మెంట్ కమిటీగా మారింది. ఆ గ్రామంలో పండే పంటలకు వారే మార్కెట్ చేసుకుంటారు. చేలనుంచి పంట వచ్చేసరికి ఆ గ్రామంవద్ద డజన్ల కొద్దీ డీసీఎంలు సిద్ధంగా ఉంటయి. అక్కడినుంచి అటే మార్కెట్‌కు తీసుకుపోతరు. అలాంటి పరిస్థితి మీ దగ్గర రావాలి. అలాగే గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి తేవాలి. ఇక్కడున్న 600 ఎకరాల వ్యవసాయ భూమి అంతా డ్రిప్ ఇరిగేషన్‌తో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. మంచి పంటలు బాగా పండించాలి. గంగదేవిపల్లి గ్రామానికి డ్రిప్ ఇరిగేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేస్తుంది.
వెయ్యేండ్లు బతుకుతమా..? మనం మనుషులుగా వెయ్యేండ్లు బతుకుతమా? ఉన్నన్ని రోజులు మనం మంచిపనులు చేసేందుకు మనవంతుగా తోడ్పాటును అందించుకోవాలి. మనం ఉన్నప్పుడు ఏం చేశామనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ పోరాటం చేశారు. ఇవ్వాళ గాంధీ లేరు. కానీ ఆయన అందించిన స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలు పటిష్టంగా పట్టుదలతో అమలు చేసుకోవాలి. మనుషులుగా మీరు చూపించిన సంఘటిత శక్తి యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలవాలి. గంగదేవిపల్లి ఇదే స్ఫూర్తిని, ఐక్యతను సాధించి బంగారు పల్లి కావాలి. బంగారు తెలంగాణకు స్ఫూర్తివంతంగా నిలబడాలి.
గుడుంబా రాక్షసి పోవాలె..: గంగదేవిపల్లి సభ అనంతరం నల్లబెల్లి మండలం మేడపల్లి-రాంపూర్ జంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామజ్యోతి సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పల్లెల్లోనుంచి గుడుంబా మహమ్మారిని తరిమివేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా పల్లెల్లో గుడుంబా రాక్షసి పట్టి పీడిస్తున్నదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి గ్రామంలో 20-30మంది వితంతువులు.. అదీ యువ వితంతువులు ఉంటున్నారు. చిన్న వయస్సులో వితంతువులుగా మార్చుతూ కుటుంబాలను వీధిపాలు చేస్తున్న ఈ గుడుంబా రాక్షసిని తరిమికొట్టాలి అని సీఎం పిలుపునిచ్చారు.
గ్రామజ్యోతి కార్యక్రమంకోసం రానున్న నాలుగేండ్లలో ప్రభుత్వంనుంచి రూ.4.10 కోట్లు రానున్నాయని, ఇక్కడి దాతలు అందజేసిన రూ.1.75 కోట్లు తోడుకాగలవని అన్నారు. అదనంగా ఈ రెండు గ్రామాలకు తాను మరో రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో గ్రామజ్యోతిలో రాంపూర్-మేడపల్లి గ్రామాలు అద్దంలా తయారవుతాయని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశమై ఈ నిధులతో జంట గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్యం మీద శ్రద్ధ పెట్టాలని చెప్పారు.
ఉల్లాసంగా సాగిన ప్రసంగం.. గ్రామజ్యోతి పథకం ప్రారంభం సందర్భంగా గంగదేవిపల్లి, మేడపల్లి-రాంపూర్ జంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో ముఖ్యమంత్రి ప్రసంగం ఎంతో ఉల్లాసంగా సాగింది. సీఎం ప్రసంగిస్తున్నంత సేపు ప్రజలు శ్రద్ధగా ఆలకించారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడే వారి గురించి ఆయన పిట్ట కథ చెప్పి నవ్వించారు. రామాయణంలో రామరావణ యుద్ధ సమయంలో రాక్షసుల బలాన్ని ఎదుర్కొనేందుకు రాముడు వేసిన రామబాణానికి రాక్షసులందరూ పోగా కొంతమంది సగం ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ అయ్యా మరి మా గతేంది? మేం చావకుండా, బతక్కుండా ఉన్నాం అని రామున్ని వేడుకున్నారు. మీరేం భయపడకండి.
రేపు కలియుగం అంటూ ఒకటి వస్తుంది. అపుడు మీరు ఊరికో నలుగురు చొప్పున పుడుతురు అని వరం ఇస్తడు. అగో.. గా వరంతో పుట్టినోళ్లే, ఆ సంతతివాళ్లే ఉర్లలో ఉంటరు. మనం మంచిపని చేసినా అడ్డుపడుతుంటారు అని చెప్పడంతో సభ గొల్లుమంది. వారిని అసలే లెక్కచేయద్దు. మనం పోతుంటే వత్తరు. అడ్డుపడుతరు. ఇటువంటి ప్రతీపశక్తులకు, నెగెటివ్ ఫోర్సెస్‌కు భయపడి మనం చేయాలనుకున్న మంచిపనిని, ధర్మమైన పనిని ఆపకూడదు. ధైర్యంగా ముందుకు పోతూనే ఉండాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మనం చేసే పని మంచిదైనప్పుడు. ధర్మమైనది అయినపుడు. మనం ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నేను తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించినపుడు ఎంతో మంది ఎక్కిరించారు. అయినా వాటిని లెక్కచేయకుండా ముందుకు సాగినం కనుకనే, మొండిగా ఉన్నం కనుకనే ఇవ్వాళ తెలంగాణను సాధించుకున్నాం అని పేర్కొన్నారు. మరో సందర్భంలో గ్రామంలో పారిశుద్ధ్యం ప్రాముఖ్యాన్ని వివరిస్తూ దోమలు ఎవరినైనా కుడుతాయి. అవి సర్పంచ్‌ను కుడుతయి. కమిటీ మెంబర్‌ను కుడుతాయి. డాక్టర్‌ను కుడుతాయి. అందరినీ కుడుతాయి. అంతెందుకు ముఖ్యమంత్రినీ కుడుతాయి. దోమలకు ఎవరైనా ఒకటే. దోమ చాలా పెద్ద సోషలిస్ట్. దానికి అందరూ సమానులే అని ఆయన పేర్కొనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిశాయి. ఈ పథకం కింద గంగదేవిపల్లి గ్రామానికి పదికోట్లు మంజూరు చేస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఒక రెసిడెన్షియల్ పాఠశాలను, డ్రిప్‌ఇరిగేషన్ పథకాన్ని, డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేశారు. మిషన్ కాకతీయ పథకం కింద గ్రామ చెరువును విస్తరిస్తామని, చెక్‌డ్యాంలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామంలో విద్యుత్ తీగల సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు రామచంద్రు తెజావత్, ఎస్ వేణుగోపాలాచారి, కరీంనగర్ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, తెలంగాణ సాంస్కృతి సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, మాధవరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో గ్రామజ్యోతి: సీఎం సంతృప్తి గ్రామజ్యోతి కార్యక్రమం అన్ని జిల్లాల్లో ఉద్యమస్ఫూర్తితో ప్రారంభం కావడంపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లాలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్ చేరుకున్న సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కార్యక్రమం తీరును సమీక్షించారు. వివిధ జిల్లాల్లో గ్రామజ్యోతిని ప్రారంభించిన మంత్రులతో మాట్లాడి ప్రజాస్పందనను తెలుసుకున్నారు. అన్ని ప్రాంతాలనుంచి సానుకూల స్పందనలు రావడంతో సీఎం ఆనందం వ్యక్తంచేశారు. గ్రామాలకు వచ్చే నిధులపై గ్రామస్తులకు అవగాహన ఉండడంవల్ల వాటితో ఏ పనులు చేసుకోవచ్చనే స్పష్టత కూడా వస్తుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల నిధుల వృథా తగ్గుతుందని, గ్రామాల్లో ప్రజలకు అవసరమైన ఆస్తుల కల్పన జరుగుతుందని అన్నారు. సోమవారం తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడడంతో వాయిదా పడిన జిల్లాల్లో హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.