-ప్రపంచమే ఆశ్చర్యపడేలా వారంలో రైతులకు తీపి కబురు -ధాన్యపు సిరుల తెలంగాణ.. పల్లేర్లు మొలిచిన చోటే పసిడి పంటలు -ఏడాదిలో లక్షకోట్ల పంట.. నీటితీరువా నయా పైస కూడా తీసుకోం -ప్రాజెక్టుల కోసం భూములను త్యాగం చేసిన వారికి ధన్యవాదాలు -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాష్ట్ర రైతాంగానికి వారం రోజుల్లో తీపి కబురు చెప్పనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ విషయం ప్రకటించబోతున్నానని తెలిపారు. పల్లేర్లు మొలిచిన తెలంగాణ ఇప్పుడు పసిడి పంటలతో కళకళలాడుతున్నదని, ధాన్యపు రాశుల తెలంగాణగా మారిపోయిందని సంతోషం వ్యక్తంచేశారు. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే.. అని పాడుకున్న రోజుల నుంచి కోట్ల రూపాయల పంటలు పండించే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ అమరులను స్మరించుకున్న ముఖ్యమంత్రి.. వారి త్యాగాల ఫలమే అద్భుత తెలంగాణ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ పదింతలు బాగుపడే విధంగా కండ్లముందు కనిపిస్తున్నదని చెప్తూ.. దేశానికి మన రైతులు ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ పంప్‌హౌజ్‌లో మోటర్లను ఆన్‌చేసి.. అత్యంత ఎత్తయిన కొండపోచమ్మసాగర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతను ముఖ్యమంత్రి ప్రారంభించారు. చినజీయర్‌స్వామితో కలిసి రిజర్వాయర్ వద్ద గంగమ్మ తల్లికి చీరెసారె సమర్పించి, పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ప్రపంచమే ఆశ్చర్యపోతుంది ప్రపంచమే ఆశ్చర్యపడేలా రైతాంగానికి త్వరలో తీపి కబురు అందిస్తా. ప్రపంచం, ఇండియాలో ఎక్కడా లేని శుభవార్త అది. కొంత సస్పెన్స్ పెడ్తం. త్వరలోనే ఆ కబురు చెప్పబోతున్నం. ఫైనాన్స్ పరిస్థితి కూడా చూసుకున్నం. దేశమే అశ్చర్యపడేలా, అడ్డం పడేలా ఆ వార్త ఉండబోతున్నది. తెలంగాణ రైతాంగం ఆదర్శం గా తయారుకావాలి. తెలంగాణ రాష్ట్రం కోసం చావునోట్ల తలపెట్టిన. వెంటవచ్చిన ఉద్యమకారులు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటున్నం. వారి త్యాగాలఫలమే అద్భుత తెలంగాణ కావాలి. పదింతలు బాగుపడేలా కండ్ల ముందు కనిపిస్తున్నది. దేశానికి మనం ఆదర్శం కావాలి. కేసీఆర్ మొండిపట్టు పడుతడు. తెలంగాణ రైతాంగం ఆధునిక, ఆదర్శరైతాంగం కావా లి. అద్భుతాలు సృష్టించాలి. ఫలితాలు రావాలి. అన్ని కులాలు, మతాలు సంతోషంగా బతుకాలి.

భూ నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. వారి త్యాగాలతోనే ఈ రోజు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నది. కొండపోచమ్మ ప్రాజెక్టులో మామిడ్యాల, తానేదార్పల్లి, బైలంపూర్ గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నాయకత్వంలో నిర్వాసితులకు అద్భుతమైన పునరావాస కాలనీ నిర్మించారు. తునికి బొల్లారానికి పోతే గేటెడ్‌కమ్యూనిటీ లాగా కొత్త పట్టణమే కనిపిస్తున్నది. ఆ తృప్తి ఉన్నది. నేను వాళ్లకు మాటిచ్చి ఉన్నాను. అందరి పిల్లలకు ఉద్యోగావకాశాలు లభించేలా నాన్ పొల్యూటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టిస్తం. మంత్రి, కలెక్టర్ భూమి చూసిపెట్టారు. 100- 200 ఎకరాలు సైట్ ఉన్నది. కొత్తగా ప్రారంభించబోయే ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లలో వారికి న్యాయం చేస్తం. భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది. వాళ్లు అందించిన సహకారం, త్యాగాల వల్లనే రంగనాయకసాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్‌మానేరు వంటివి కంప్లీట్ అయ్యా యి. భూములు త్యాగంచేశారు. వారికి పరిహారం ఇచ్చాం. సంతృప్తి పరిచే ప్రయత్నం చేశాం. కానీ గూడులేని పక్షుల్లాగా అయ్యారు. ప్రాజెక్టులను గాలిలో కట్టలేం. భూసేకరణ చేయక తప్పలేదు. భూములిచ్చిన వారికి అండగా ఉంటం.

ఏడాదిలో లక్ష కోట్ల పంట తెలంగాణలో ఏడాదిలో లక్ష కోట్ల పంట పండనున్నది. నిన్ననే హైదరాబాద్‌లో సమావేశమయ్యాం. తెలంగాణలో ఎంతపంట పండుతది? ఏం జరుగుతుంది? ఎలా మార్కెట్లోకి పోవాలి? అనే అంశాలతోపాటు.. రైతులకు అద్భుతమైన ధరలు.. భవిష్యత్తులో మన స్ట్రాటజీ ఎలా ఉండాలనేవి చర్చించాం. అక్కడే కొన్ని నిర్ణయా లు చేశాం. తెలంగాణ రైతాంగం ఓ సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయల పంటను పండించబోతున్నదని ఆ నిర్ణయాల లెక్కల్లో తేలింది. మేం చెప్పలేదు.. మేం డబ్బా కొట్టుకోలేదు. నిన్నగాక మొన్న ఫుడ్‌కార్పొరేషన్ సీఎండీ డీవీ ప్రసాద్ స్టేట్మెంట్ ఇచ్చారు. దేశంలో 83 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే అందులో 53 లక్షల టన్నులు తెలంగాణనే ఇచ్చిందని ఆయన చెప్పిన మాటలు మీరందరూ పేపర్లలో చూశారు. మొత్తం ఎఫ్‌సీఐ చేసిన ప్రొక్యూర్మెంట్లో 63% తెలంగాణ రాష్ట్రం నుంచే జరిగింది. నిజంగా ఇది తెలంగాణ రైతాంగానికి గర్వకారణం. లక్ష కోట్ల రూపాయల పంట పండించే బంగారు తెలంగాణ, భాగ్యరాశుల తెలంగాణ, పసిడి పంటల తెలంగాణ అనతికాలంలో తయారుకావడం గర్వకారణం. ‘పల్లెపల్లెలో పల్లేర్లు మొలిచె తెలంగాణలోనా’ అని కవులు పాటలు పాడుకున్న తెలంగాణ. తలాపున పారుతుంది గోదారి, మన సేను మన సెలక ఎడారి అని సదాశివుడు రాసినపాటలు. ఒకనాడు ఏడుపు పాటల తెలంగాణ. ఇయ్యాల పసిడి ధాన్యపు రాసుల తెలంగాణ. ఇది నాకు చాలా గర్వంగా, చాలా సంతృప్తిగా ఉన్నది.

అప్పుడు సబ్‌స్టేషన్ నిర్మాణానికి 12ఏండ్లు గతంలో విద్యుత్ సమస్య ఎలా ఉండేదో గజ్వేల్ వాసులకు తెలుసు. కొడకండ్ల వద్ద 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కావాలంటే 12 ఏండ్లు పట్టింది. అదే కాళేశ్వరంలో మోటర్లకు 4,800 మెగావాట్ల విద్యుత్ వాడుతున్నం. ఒకేసారి అన్నీ నడుపం. కానీ టోటల్ శక్తి అందుబాటులో ఉంచాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో 400కేవీ సబ్స్టేషన్లు 6 నిర్మించాం. 220కేవీ సబ్స్టేషన్లు 7, 132కేవీ సబ్స్టేషన్లు 2 నిర్మాణమయ్యాయి. ఇందుకోసం ఎన్నో నదులు, ఉపనదులు, కెనా ల్స్ దాటుకుంటూ 521 కిలోమీటర్ల విద్యుత్ లై న్లు వేశాం. లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు, ట్రాన్స్‌కో, జెన్కో అధికారులు కష్టపడి దీన్ని సాధించారు. విద్యుత్, రెవెన్యూ శాఖలకు ప్రత్యేక ధన్యవాదాలు. భూ సేకరణలో రెవెన్యూ డిపార్ట్ట్మెంట్ అద్భుతంగా పనిచేసింది. వర్క్ ఏజెన్సీలు గొప్ప గా పనిచేశాయి. ఇండియాలో ఉన్న గొప్ప కంపెనీలైన ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ, మేఘా, నవయుగ, ఏఎంఆర్, కేఎన్ఆర్ వంటి సంస్థలు గొప్పగా పనిచేశాయి. అందరికీ మించి రాజస్థాన్, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ కార్మికుల శ్రమ ఉన్న ది. కరోనా నేపథ్యంలో వారిని గమ్యస్థానాలకు చేర్చడానికి రూ.12 కోట్లు ఖర్చు పెట్టాం. ఇండియాలో ఏరాష్ట్రం ఇంతఖర్చు పెట్టలేదు. వందశా తం చార్జీలు భరించి, భోజనం ఇచ్చి పంపించి నం. ప్రాజెక్టు నిర్మాణంలో వారంతా కృషిచేశారు. 48 డిగ్రీలఎండలో లక్ష్మీబరాజ్ వద్దకు నేను పో యినప్పుడు వారినిచూసి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎందరో చెమట చుక్కలు వదిలారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. విలేకరులు కూడా ఫొటోలు తీసుకుని, ఎంకరేజ్ చేసేలా స్టోరీలు రాసి సమాజానికి తెలియజేశారు. వారికీ ధన్యవాదాలు.
ఒప్పందాల్లో రాజనీతిజ్ఞత ప్రాజెక్టుల ఒప్పందాల్లో పక్క రాష్ర్టాలతో రాజనీతితో వ్యవహరించాం. మహారాష్ట్రతో ఒప్పందంలో గొప్ప రాజనీతి ప్రదర్శించాం. ఆ రాష్ట్రా న్ని ఒప్పించి, మెప్పించి అగ్రిమెంట్ చేసుకు న్నం. ప్రారంభోత్సవానికి పొరుగు రాష్ర్టాల సీ ఎంలను ఆహ్వానించుకున్నం. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చాం. లక్షలకోట్లు ఖర్చు పెట్టాం. ఆ ఫలితాలు రావాలని కోరుకున్నం. ఫలితాలు వచ్చినయి. పంటలు పండుతయి. నియంత్రిత సాగు అద్భుతాలు చేయబోతున్నది. వేలగ్రామాలు ‘సీఎం మాటే మా బాట..’ అంటూ తీర్మానాలు చేస్తున్నయి. పాత మెదక్ జిల్లా లో 900 గ్రామాలు తీర్మానాలు చేశాయి. రాను న్న రోజుల్లో బయోడైవర్సిటీ తెలంగాణ ఆవిర్భవించబోతున్నది. పక్షులు, పశువులు అద్భుతం గా పెరుగుతయి. భూగర్భ జలమట్టం పె రిగింది. డేంజర్ నుంచి సేఫ్‌జోన్‌కు తెలంగాణ వెళ్లింది.

రూ.10వేల కోట్లు సర్కారే చెల్లిస్తది రైతులకు సాగునీళ్లు అందించడానికి పనిచేసే మోటర్లకు అయ్యే పదివేల కోట్ల రూపాయల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఒకప్పటి దుర్మార్గమైనటువంటి, భరించరానటువంటి కరెంటు కోతల నుంచి తెలంగాణ శాశ్వతంగా గట్టెక్కింది. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సమస్య పరిష్కారమైంది. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పంథా తెలంగాణది. వికలాంగులకు రూ.3,016 ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు, రైతుబీమా ప్రపంచంలో ఎక్కడాలేవు. 24 గంటలపాటు రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నం. రూ.290 కోట్ల నీటి తీరువా రద్దుచేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్లకు 4,800 మెగావాట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. సంబంధించిన బిల్లులు చెల్లించి, రైతులకు సాగునీళ్లు ఫ్రీగా అందిస్తం. నీటి తీరువా వసూలు చేయబోం. రూ.25 వేలలోపు ఉన్న 5.60 లక్షలమంది రైతుల రుణాలు ఒకేసారి మాఫీ చేశాం. కరోనా వేళ రూ.1,300 కోట్లు విడుదల చేశాం.
గజ్వేల్‌కు ప్రతి సృష్టి గజ్వేల్‌లో 600 ఎకరాల్లో అద్భుతమైన కొత్త పట్టణం నిర్మాణమవుతున్నది. ఇది గజ్వేల్‌కు ప్రతిసృష్టి. 6 వేలకుపైగా ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నది. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ పలు ధపాలు చర్చలు చేసి, ప్రజలు కోరుకునేలా ప్రత్యామ్నాయ గజ్వేల్‌ను నిర్మించారు. న్యూ గజ్వేల్ టౌన్ ఇది. ప్రత్యేక కేర్ తీసుకుని అన్ని వసతులతో నిర్మిస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు.
మంజీరాకు నీళ్లిస్తాం.. మంజీర, సింగూరులకు నీళ్లు వచ్చేలా చేస్తం. నిజాంసాగర్‌ను కాపాడుకుంటం. మంజీర, హల్దీల్లో మళ్లీ జలకళ సంతరించుకుంటుంది. దీనికోసం ఇప్పటికే చెక్‌డ్యాంల నిర్మాణానికి అనుమతులిచ్చాం. జహీరాబాద్‌కు సింగూరు నుంచి నీళ్లు ఇస్తం. నారాయణఖేడ్, జహీరాబాద్ నీటికష్టాలు కూడా త్వరలో తీరుతయి.
165 టీఎంసీలతో కొత్త రిజర్వాయర్లు ప్రపంచ, దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా నాలుగేండ్లలో 165 టీఎంసీల సామర్థ్యంతో కూడిన కొత్త రిజర్వాయర్లు నిర్మించుకున్నం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మల్లన్నసాగర్ సెకండ్ లార్జెస్ట్ రిజర్వాయర్. ఎస్సారెస్పీ తర్వాత 50 టీఎంసీల మెగా రిజర్వాయర్ ఇదే. లక్ష్మీ, సరస్వతి, పార్వతి బరాజ్‌ల సామర్థ్యం 40 టీఎంసీలు. ఇవి కాకుండా బయట నిర్మించిన ప్రాజెక్టుల సామర్థ్యం 125 టీఎంసీలు. ఇందులో కామారెడ్డి, ఎల్లారెడ్డిల పరిధిలో గుజ్లు, కాటేవాని వంటి దాదాపు 8 నుంచి 9 ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఉన్నయి. మిగిలినవి మన కండ్లముందే ఉన్నయి. అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, గంధమల్ల రిజర్వాయర్, భువనగిరి దగ్గరి బస్వాపూర్ రిజర్వాయర్.. ఇవి అన్నీ కలిపితే 125 టీఎంసీల సామర్థ్యం. మొత్తం 165 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొత్త రిజర్వాయర్లు నిర్మించుకోవడం చరిత్ర. వాస్తవానికి ఇది అసాధ్యమైన పని. కానీ, తెలంగాణ గవర్నమెంట్ టు డూ ఇట్. చాలా ధైర్యంగా, సాహసంగా చేసినం. ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉన్నది. ఇవికాకుండా మరికొన్ని నిర్మించుకుంటున్నం. దుమ్ముగూడెం వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మసాగర్, ఏడున్నర టీఎంసీలతో సమక్కసాగర్ నిర్మాణం జరుగుతున్నది. హుస్నాబాద్‌లో గౌరవెల్లి ప్రాజెక్టు అతిత్వరలోనే పూర్తి కానున్నది.

తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభ.. కాళేశ్వరం ‘తెలంగాణ వాళ్లకు తెలివిలేదు. మీకు పనిచేయరాదు. మీకు పరిపాలన రాదు’ అన్నరు. మా ఇంజినీర్లు ఎంత శక్తిమంతులో, ఎంత నైపుణ్యవంతులో తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులే నిదర్శనం. 88 మీటర్ల లెవల్స్ నుంచి 618 మీటర్ల లెవల్స్‌కు గోదావరి జలాలు ఎగిసిపడి కొండపోచమ్మసాగర్ నిండుతుంది. చాలా అద్భుతం. ఇది మా తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనం. తెలంగాణ ఇంజినీరింగ్, ఈఎన్సీ బృందానికి సెల్యూట్ చేస్తున్నం. మాటల్లో చెప్తే కావు.. చేస్తే తెలుస్తుంది. జీవితంలో మనుషులకు కొన్ని అరుదైన అవకాశాలు వస్తయి. నా జీవితంలో ఓ ప్రత్యేకమైన సందర్భంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చెప్పారు.. ‘జీవితంలో చాలా తక్కువ మంది ఉద్యమాలు ప్రారంభించి ఫలితాన్ని పొందుతారు. వారు మధ్యలోనే చచ్చిపోతారు. మిగతా వారి నాయకత్వంలో ఫలితం వస్తది. యూ ఆర్ ఏ లక్కీ ఫెలో. తెలంగాణ ఉద్యమం నువ్వే స్టార్ట్ చేసినవ్. నువ్వు బతికుండగనే తెలంగాణ రాష్ట్రం సంపాదించినవ్. అదృష్టవంతుడివి నువ్వు చంద్రశేఖర్‌రావు’ అని ఆయన నాతో చెప్పారు. ఇయ్యాల కూడా ఆయనలా దీవెనలు ఇచ్చినవారున్నారు.. శాపాలు, కేసులు, పాసులు, రాకాసులు, బోకాసులు ఎందరో అడ్డంపడి కుట్రలు చేసినా అద్భుతంగా, అనితర సాధ్యంగా యావత్తు ప్రపంచమే అబ్బురపడే ఒక ఇంజినీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నం. కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణం చరిత్రలో ఉజ్వల ఘట్టం. ఏ లక్ష్యాన్ని, ఏ గమ్యాన్ని ఆశించి ప్రజలు తెలంగాణ కోసం పోరాడారో ఆ కల సంపూర్ణంగా సదృశ్యంగా సాకారమైన గొప్ప చారిత్రక ఘట్టం. ఇది చాలా అపురూపమైన ప్రాజెక్టు. వందల పంపుసెట్లు, 9 లిఫ్ట్‌లు దాటుకుని పదో లిఫ్టు దాటి జలాలు కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ప్రవేశించాయి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేశాం. రైతాంగ శ్రేయస్సు కోసమే మేం పనిచేస్తం.
కాళేశ్వరం ఓ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే ఒక అద్భుతంగా రూపుదిద్దుకున్నది. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ఇంజినీర్లు చక్కగా వినియోగించుకొని, ఎత్తిపోతల పథకాన్ని ఆసియాలోనే గొప్పగా నిర్మించారు.
– శ్యాంప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి
ఏండ్లకేండ్లు ఏడ్సినం నీళ్లు లేక ఏండ్లకేండ్లు ఏడ్సినం. బోర్లు ఏశి, అప్పుల పాలైనం. ఉన్న భూమిని పడావ్ పెట్టినం. కేసీఆర్ సార్ దేవుని లెక్క యాడనో ఉన్న గోదావరి నీళ్లను కొండపోచమ్మసాగర్ కట్టి తీస్కొచ్చిండు. మా భూములు పచ్చని పొలాలైతై.
– నర్సింలు యాదవ్, రైతు, నర్సన్నపేట, మర్కూక్ మండలం, సిద్దిపేట
నీళ్లను చూసినంక సంతోషమైంది సర్కారుకు మా భూములిచ్చి, ఊరు ఇడిసిపోతుంటే ఏడుపొచ్చింది. నిజంగ నీళ్లొస్తయా? అనుకున్నం. కానీ, అన్నదన్నట్టు కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మకు అచ్చినయి. నీళ్లను చూసినంక చాలా సంతోషమైంది.
– కుంబాల కృష్ణారెడ్డి, బైలంపూర్, కొండపోచమ్మసాగర్ భూనిర్వాసితుడు
మాకు కేసీఆరే దేవుడు మా తాన సాగునీళ్లకు ఇబ్బందులున్నై. మొన్నటి దాకా ఇండ్లిచ్చిండు. గిప్పుడు నీళ్లు తెచ్చిండు. ఇగ మా భూమిల బంగారు పంటలు పండిస్తం. దేవుడు దేవుడని గుళ్లల్లకు పోతరు కానీ, మాకు కేసీఆరే దేవుడు.
– ఈదన్నగారి సుధాకర్‌రెడ్డి, రైతు, ఎర్రవల్లి, మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా
రియల్ఎస్టేట్ నుంచి సాగువైపు మాకు ఆరెకరాల భూమి ఉన్నా నీళ్లు లేక గతంలో రియల్ఎస్టేట్ చేసిని. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్లే గోదావరి నీళ్లతోటి మా ఊరి చెరువులు నిండినై. రియల్ఎస్టేట్ వదిలి భూమిని సాగుచేస్తున్న.
-రవీందర్‌రెడ్డి, రైతు, గుండ్లపల్లి, గన్నేరువరం మండలం, కరీంనగర్
నీళ్లు పదిగజాల మీదికి వచ్చినై గాయత్రీ పంపుహౌజ్ మా ఊళ్లెనే ఉన్నది. గతంల నీళ్లు లేక ఏ పంటేసినా చేతికచ్చుడు కష్టమే ఉండేది. ఇప్పుడు కాలువల నీళ్లు పారి బావులల్ల పది గజాల మీదికి నీళ్లు వచ్చినై. ఇప్పుడు నా మూడున్నర ఎకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న.
– నారెడ్డి మధుకర్‌రెడ్డి, లక్ష్మీపూర్, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా
ముదిరాజ్‌ల జీవితాల్లో వెలుగులు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంకనే మా ముదిరాజ్‌ల జీవితాల్లో వెలుగులు నిండినై. గతంల కూలీ పనితో బతికెటోళ్లం. ఇప్పుడు చెరువుల్ల సర్కారే చాపపిల్లలు పోసింది. గతేడాది 20 క్వింటాళ్లు పట్టినం.
-రాగం అనిల్, బూరుగుపల్లి, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా
నీళ్లు లేక కూలికి పోయేటోన్ని మా ఊరి చెరువు కింద నాకు పొలం ఉన్నది. నీళ్లు లేక రోజు కూలిపనికి పోయేది. సీఎం సార్ పుణ్యమా అని చెరువు కాళేశ్వ రం నీళ్లతోటి నిండింది. బాయిలకు నీళ్లొచ్చినై. ఈ సారి పంట వేసిన. మంచిగ పండింది.
– తిరుపతి, చిన్న ముల్కనూరు, చిగురుమామిడి మండలం, కరీంనగర్
వద్దన్నా నీళ్లు వచ్చినై మా ఊళ్లె నుంచే కాకతీయ కాల్వ ఉన్నది. కొన్నేండ్ల కింద ఒక్కపంటకే నీళ్లు ఇచ్చెటోళ్లు. ఈ తాప కాళేశ్వరం నీళ్లు ఎల్ఎండీలకెళ్లి ఒదిలిండ్లు. ఇప్పుడు వద్దన్నా నీళ్లు వచ్చినై. మంచి పంట పండింది.
-అంబాల రాజు, యువరైతు, ఎల్కతుర్తి, వరంగల్ అర్బన్ జిల్లా
కొండపోచమ్మ ప్రారంభం మహోజ్వల ఘట్టం కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభించడం రాష్ట్ర చరిత్రలో మహోజ్వల ఘట్టం. ప్రాజెక్టు కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు అభినందనలు. పాలకుడికి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని సీఎం కేసీఆర్ నిరూపించారు. నిండు వేసవిలో కొండపైకి నీటిని తీసుకెళ్లడం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమైంది. తెలంగాణలో నిండు వేసవిలోనూ చెరువులు నీటిలో మత్తడి దుంకుతున్నాయి.
– గుర్రాల నాగరాజు, టీఆర్ఎస్ సౌత్ఆఫ్రికా ఎన్నారైశాఖ అధ్యక్షుడు