Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మెట్రోరైలు రెడీ

-ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం ఏమీ లేదు -10-12 కి.మీ.ల లైన్‌తో ప్రజలకు లాభముండదు -30 కిలోమీటర్ల ప్రయాణం కోసమే ఆగాం -హైదరాబాద్ మెట్రోకు ఇతర మెట్రోలు సాటిరావు -సెక్యూరిటీ, సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం -ఓల్డ్‌సిటీ లైన్ చిక్కుముడులు విప్పుతున్నాం -సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మెట్రోకు నేరుగా స్కైవేలు -జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎఫ్‌ఓబీలు, పార్కింగ్ ప్లేస్‌లు -రెండవ దశపై ప్రణాళికలు సిద్ధం -వెల్లడించిన ఐటీ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ -ఒలిఫెంటా మెట్రోవంతెన పరిశీలించిన మంత్రి

ప్రధాని నరేంద్రమోదీ సమయం ఇవ్వగానే మెట్రోరైలు ప్రారంభిస్తామని ఐటీ, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. మెట్రోరైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీయే ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయం ఇచ్చే సమయాన్ని బట్టి ప్రారంభతేదీ నిర్ధారిస్తామన్నారు. మెట్రోరైలు ప్రారంభంలో ఎలాంటి జాప్యం జరుగలేదని, ఇతర ప్రాంతాల్లో మాదిరిగా పది, పన్నెండు కిలోమీటర్ల లైన్ ప్రారంభించాలనుకుంటే రెండేండ్ల క్రితమే ఆ పని చేసేవారమన్నారు. అయితే దానివల్ల ప్రజలకు పెద్ద ప్రయోజనం ఉండదని, కనీసం 30 కిలోమీటర్ల ప్రయాణమైనా అందుబాటులోకి తీసుకురావాలని ఆగామని చె ప్పారు. గురువారం సికింద్రాబాద్‌లోని ఒలిఫెంటా వంతెనను అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం అక్కడి మెట్రోస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మెట్రోరైలు ఎప్పుడు ప్రారంభమవుతుందోనన్న ఉత్సుకత నగర వాసుల్లో ఉందని..దానికి అనుగుణంగా పనులు వేగవంతం చేసి ప్రయాణ సౌకర్యాన్ని అతిత్వరలో చేరువ చేస్తున్నట్లు తెలిపారు.

మేం సిద్ధం… మెట్రో ప్రారంభానికి తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రపంచస్థాయి ప్రాజెక్టు కాబట్టి దేశ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైతే బాగుంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి రావాల్సిందిగా ప్రధానిని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయంగా కలిసి ఆహ్వానించడంతోపాటు లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. నవంబర్ 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభానికి ప్రధాని వస్తున్నందున, ఆ సందర్భంగా సమయం ఇస్తారని భావిస్తున్నామని చెప్పారు. ఐతే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ప్రధాని ఇచ్చే సమయాన్ని బట్టి నవంబర్ 28 లేదా మరోరోజు మెట్రో ప్రారంభం ఉంటుందని, ప్రోటోకాల్, భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ఎస్పీజీ సూచనల ప్రకారం మియాపూర్ డిపో ఆవరణలోనే ప్రధాని మెట్రోరైలును ప్రారంభిస్తారని చెప్పారు.

జాప్యంగా చూడకూడదు.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో జాప్యం జరుగుతున్నదని, దీని తర్వాత ప్రారంభమైన మెట్రోరైలు ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయని కొందరు చేస్తున్న వ్యాఖ్యానాలను కేటీఆర్ కొట్టిపారేశారు. కేవలం ప్రారంభించామని గొప్పలు చెప్పు కోవటం కోసమే అయితే రెండేండ్ల కిందటే ఆ పని చేసేవారమని అన్నారు. నాగోల్-మెట్టుగూడ 8 కిలోమీటర్ల స్ట్రెచ్ రెండేండ్ల క్రితమే పూర్తయిందని, దాన్ని ప్రారంభించి మమ అనిపించుకోవచ్చని, అయితే దానివల్ల ఉపశమనం కలుగదన్నారు. కొచ్చిన్, లక్నో, బెంగళూరుల్లో కేవలం 7,11,12 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేసిప్రారంభించారని, కానీ మనం ఎండ్ టూ ఎండ్ ప్రయాణ సౌకర్యం కలిగించాలన్న ఉద్దేశంతో ఒకేసారి 30 కి.మీలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మెట్రోరైలు అత్యంత సంక్లిష్టమైనదని అన్నారు. ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ దిగ్విజయంగా పూర్తిచేస్తున్నామని అన్నారు.

మరే మెట్రో సాటిరాదు.. దేశంలోని మరే మెట్రోరైలు హైదరాబాద్‌కు సాటిరాదని కేటీఆర్ చెప్పారు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో పీపీపీలో ఇంత పెద్ద ప్రాజెక్టును ప్రపంచంలోని ఏ దేశంలో నిర్మించలేదని అన్నారు. విదేశీ నిర్మాణ సంస్థలు కాకుండా స్వదేశీ కంపెనీ ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఒలిఫెంటా వంతెన నిర్మాణం సంక్లిష్టమైనదని, ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ నియంత్రించినా రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడకుండా వంతెనను బిగించిన ఎల్‌అండ్‌టీకి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ స్టీలు బ్రిడ్జి వెరీవెరీ యునిక్ అని అభివర్ణించారు. రోడ్డు మధ్యలో హైట్ చేస్తున్నా ఇబ్బందేమీ ఉండదని, పబ్లిక్ ఫ్రీ మూమెంట్ ఉండేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రతి స్టేషన్‌లో స్టెయిర్‌కేస్‌లు, ఎస్కలేటర్లు ఉన్నాయని, స్టేషన్‌కు ఆనుకుని ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు కూడా నిర్మిస్తామని తెలిపారు. ప్రయాణికులు మెట్రోకారిడార్లకు అనుసంధానంగా ఏర్పాటు చేసే స్కైవాక్‌ల ద్వారా తమకు అవసరమైన చోటులో దిగి పోయే విధంగా ఏర్పాట్లు ఉంటాయని అన్నారు. నాగోల్-మియాపూర్ ప్రారంభమైతే 72 కిలో మీటర్ల ఈ ప్రాజెక్టులో 40 నుంచి 42 శాతం అందుబాటులోకి వచ్చినట్లేనని తెలిపారు. ప్రస్తుతం 34 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించామని, జీహెచ్‌ఎంసీ తోపాటు ప్రైవేటు పార్కింగ్‌ను కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు.

రైల్వే స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు స్కైవేలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌నుంచి ప్రయాణికులు స్కైవేల ద్వారా నేరుగా మెట్రోరైలు స్టేషన్‌కు చేరుకోవచ్చని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ స్టేషన్లతో స్కైవేలను అనుసంధానం చేస్తున్నామన్నారు. మెట్రోరైలు నిర్మాణం, ఆపరేషన్‌లో స్మార్ట్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. స్టేషన్ల నుంచి కాలనీలకు చేర్చేందుకు ఎలక్ట్రికల్ వాహనాలు,15 నుంచి 20 సీట్ల సామర్ధ్యం గల మినీ వ్యాన్లను ఉపయోగిస్తామని చెప్పారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని 3,4 కిలోమీటర్లలోపు ప్రయాణికుల రాకపోకలకు వీటిని ఉపయోగిస్తామన్నారు. ఎంఎంటీఎస్, ఆర్టీసీ, మెట్రోరైలు టికెట్ల కోసం కామన్ కార్డు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఓలా, ఉబెర్ సంస్థలను కూడా దీనికిందకే తెచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎల్ అండ్‌టీ స్మార్ట్‌యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.

రెండోదశపై అధ్యయనం పూర్తి ఓల్డ్ సిటీ ప్రాజెక్టు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించి స్పష్టమైన ప్రణాళికతో దాన్ని చేపడుతామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఎంపీ దీనికి సానుకూలంగా ఉన్నారన్నారు. రెండవదశ మెట్రోరైలు నిర్మాణం కోసం టోక్యో వెళ్లివచ్చామని, వివిధ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఆర్థిక పరమైన అంశాలు, అంచనా వ్యయం, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టతకు వచ్చామని, దీనిపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దశలవారీగా ప్రారంభిస్తూ వచ్చే సంవత్సరం నవంబర్ 2018 నాటికి పూర్తి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మేయర్ బొంతు రామ్మోహన్, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ శివానంద్ నింబార్గి తదితరులు ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.