Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మెట్రోదయం

తొలికూత కూసింది.. చిరకాల స్వప్నం సాకారమైంది -బ్రాండ్ హైదరాబాద్ మెట్రో ప్రారంభం -ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరణ -గవర్నర్, సీఎంతో కలిసి మెట్రోలో ప్రయాణం -తొలి రైలును నడిపించిన మహిళా లోకోపైలట్ -నేటినుంచి ప్రజలకు అందుబాటులోకి -టీ-సవారీ యాప్ ఆవిష్కరణ

విశ్వనగరం మెడలో మరో మణిహారం.. బ్రాండ్ హైదరాబాద్.. మన మెట్రో తొలికూత కూసింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చారిత్రాత్మకమైన మెట్రో ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో నగరవాసుల సుదీర్ఘ కల నెరవేరింది. మియాపూర్-అమీర్‌పేట-నాగోలు మధ్య 30 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులను పైలాన్ ఆవిష్కరణ ద్వారా మోదీ లాంఛనంగా ప్రారంభించారు. సరిగ్గా మధ్యాహ్నం 2.30 గంటలకు మొదటి సిగ్నల్‌తో మెట్రోరైల్ తొలి కూత కూసింది. దేశంలో అత్యంతాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి.. తొలి దశలోనే 30 కిలోమీటర్ల ట్రాక్‌ను ప్రారంభించడం ద్వారా మన మెట్రో రికార్డు సృష్టించింది. మెట్రో ప్రారంభించిన అనంతరం తొలి రైలులో ప్రధాని మోదీతోపాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరి, రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ, మెట్రో అధికారులు ప్రయాణించారు.

కేటీఆర్ ఎక్కడ? మెట్రోరైల్ ప్రారంభోత్సవంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది. రిబ్బన్ కత్తిరించేందుకు వచ్చిన ప్రధాని మోదీ అక్కడ మంత్రి కేటీఆర్ లేకపోవడాన్ని గమనించి కేటీఆర్ ఎక్కడ? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడిగారు. తన పక్కనే ఉన్నట్టు సీఎం చూపించగా కేటీఆర్‌ను మోదీ పిలిచారు. వెంటనే మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్యలో నిలబడ్డారు. అనంతరం ప్రధాని మోదీ రిబ్బన్ కత్తిరించి మెట్రోరైల్‌ను ప్రారంభించారు.

మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు గల ఐదు కిలోమీటర్ల మార్గంలో మోదీ ప్రభృతులు ప్రయాణించి అదే మార్గంలో తిరిగి వచ్చారు. ఓ వైపు మహిళా సాధికారతపై అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో మెట్రో మొదటి రైలును ఒక మహిళే నడిపించడం విశేషం. లోకోపైలట్లు ఎస్ సుప్రియ, ఎం రాజశేఖరాచారి.. ప్రధాని ప్రయాణించిన మొదటి మెట్రోరైలును నడిపించారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మియాపూర్‌కు చేరుకున్న ప్రధా ని ముందుగా మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం మెట్రో స్టేషన్ మొదటి అంతస్తుకు ఎస్కలేటర్ ద్వారా చేరుకొన్న మోదీ.. గవర్నర్, ముఖ్యమంత్రితో కలిసి, మెట్రో ప్రాజెక్టు నిర్మాణం.. హైదరాబాద్ విశ్వనగరంగా పునరావిష్కారం అవుతున్న తీరుపై రూపొందించిన ఆడియో విజువల్‌ను తిలకించారు. ఆ తర్వాత టీ-సవారీ మొబైల్ యాప్‌ను, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం రెండో అంతస్తులో ఉన్న ప్లాట్‌ఫాం పైకి చేరుకొని అక్కడ సిద్ధంగా ఉన్న మెట్రో రైల్ ఎక్కి ప్రయాణించారు.ప్రతిష్ఠాత్మక మెట్రోరైల్ బుధవారం ఆరు గంటల నుంచి సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. నాగోల్ నుంచి అమీర్‌పేట మీదుగా మియాపూర్ వరకు ప్రయాణికులు ఈ ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవచ్చు. కనీస చార్జీని రూ.10గా, గరిష్ఠ చార్జీని రూ.60గా మెట్రో అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

గాడీ నంబర్ సోలా.. బోగీ నంబర్ ఏక్.. గాడీ నంబర్ సోలా.. బోగీ నంబర్ ఏక్.. హైదరాబాద్‌కీ షాన్ అయిన మెట్రో ప్రాజెక్టును మంగళవారం ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి ప్రయాణం చేసిన రైల్ నంబర్ ఇది. ఆశ్చర్యపోకండి.. భారతీయ రైల్వేలకు నంబర్లు ఉంటాయి కానీ, మెట్రో రైలు నంబర్లకు ఉంటాయా అని సందేహించకండి.. హైదరాబాద్ మెట్రోలో ప్రతి రైలుకూ ఒక నంబర్ ఉంటుంది. అలాగే మంగళవారం తొలికూత పెట్టిన రైల్ నంబర్ 16. ఈ రైలులోని మొదటి బోగీలో ప్రధాని పది నిమిషాలపాటు ప్రయాణించారు. తొలి సిగ్నల్ సరిగ్గా మధ్యాహ్నం 2.30 గంటలకు పడింది. అందమైన పూలతో అలంకరించిన సోలా నంబర్ మెట్రో మియాపూర్ నుంచి కూకట్‌పల్లికి (5కిలోమీటర్ల దూరం).. తిరిగి అక్కడి నుంచి మియాపూర్‌కు పది నిమిషాల్లో మొదటి ప్రయాణాన్ని ముగించింది. మెట్రో రైల్‌లో ప్రధాని మోదీ ప్రయాణం ఒక ట్రాక్‌పైనే సాగింది. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు వెళ్లిన తరువాత మరో ట్రాక్‌పై తిరుగు ప్రయాణం ఉంటుందని మొదట అనుకున్నప్పటికీ అదే ట్రాక్‌పై మెట్రో వెనక్కి వచ్చింది.

ప్రధానితో సీఎం, కేటీఆర్ చర్చలు మెట్రో రైల్‌లో ప్రధానమంత్రికి ఒకవైపు మంత్రి కేటీఆర్ కూర్చోగా, మరో పక్క గవర్నర్ కూర్చున్నారు. గవర్నర్ పక్కన సీఎం కేసీఆర్ కూర్చున్నారు. రైలులో ప్రయాణించిన సమయంలో మెట్రోరైలు నిర్మాణం.. అందులోని టెక్నాలజీ, దాన్ని విస్తరించిన తీరు.. రెండో దశ ప్రతిపాదనలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు.. జరుగుతున్న పనుల గురించి ప్రధానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రధాని ప్రయాణించిన మెట్రో రైలు లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఎండీ నింబార్గి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు ప్రయాణించారు.

మెట్రోరైలు ప్రారంభ విశేషాలు మధ్యాహ్నం 2.18 గంటలు: మియాపూర్ స్టేషన్‌లో మెట్రో పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరించారు. 2.21: ప్రధాని మెట్రోరైలు రిబ్బన్ కట్ చేశారు.సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెంట ఉన్నారు. 2.22 మెట్రోరైలు ఏవీ ప్రదర్శనను మోదీ, సీఎం కేసీఆర్‌తో కలిసి చూశారు. 2.28 టీ-సవారీ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. 2.29 మెట్రోరైలులోకి ఎక్కారు. 2.30 మెట్రోరైలు ప్రయాణం ప్రారంభమైంది. 2.35 మెట్రో రైలు కూకట్‌పల్లికి చేరింది. అక్కడి నుంచి తిరిగి మియాపూర్‌కు ప్రయాణం ప్రారంభమైంది. 2.41 మియాపూర్‌కు తిరిగి చేరుకున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.