రాష్ట్రంలోని మెట్టప్రాంతాల్లో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించి సస్యశ్యామలం చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని పోరెడ్డిపల్లి శివారులోని మొయతుమ్మెద వాగుపై రూ.11.15 కోట్లతో నిర్మించనున్న చెక్‌డ్యాం నిర్మాణానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి భూమిపూజ చేశారు. తర్వాత జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 60 ఏండ్ల సీమాంధ్రుల పాలనలో తెలంగాణలోని మెట్టప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ఆలేరు, జనగామ, సిరిసిల్ల, హుస్నాబాద్, సిద్దిపేట, భువనగిరి ప్రాంతాల రైతులు సాగునీటి సౌకర్యం లేక కేవలం వర్షాలపై అధారపడి పంటలు సాగుచేస్తున్నారన్నారు. వర్షాలు లేకపోతే వలసలే దిక్కవుతున్నాయన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. -జీవో 123తో పదిహేను రోజుల్లోనే నిర్వాసితులకు పరిహారం -శనిగరం, సింగరాయ ప్రాజెక్టులను ఆధునీకరిస్తాం: మంత్రి హరీశ్‌రావు

గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు తరలించి సస్యశ్యామలం చేస్తామన్నారు. మిషన్‌కాకతీయతో చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 1.4 టీఎంసీలకు పరిమితం చేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ 9 టీఎంసీలకు పెంచి అదనంగా రూ.300 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. ఇవి పూర్తయితే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రిజర్వాయర్ల నిర్మాణానికి రైతులు సహకరించాలని, నిర్వాసితులను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. గత ప్రభుత్వాలు చెప్పులరిగేలా తిప్పించుకుని నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేవని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో 123 ద్వారా పదిహేనురోజుల్లోనే పరిహారం అందిస్తున్నదన్నారు. కోహెడ మండలంలోని శనిగరం, సింగరాయ ప్రాజెక్ట్‌లను కూడా ఆధునీకరిస్తామని హామీఇచ్చారు.
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ సాగునీటి కోసమే తెలంగాణ ఉద్యమం సాగిందని,ప్రస్తుతం సాగునీటి వసతులు కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెట్టప్రాంతాల్లో కాకతీయులు నిర్మించిన చెరువులకు పూర్వవైభవం కల్పించాల్సి ఉందన్నారు. చెరువులు కళకళలాడితే గ్రామాల్లోని సబ్బండవర్ణాలకు ఉపాధి లభిస్తుందన్నారు. నడిచే ఎద్దునే పొడుస్తారని, పనిచేసే ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఆత్మైస్థెర్యం ఉన్న వ్యక్తి అని, రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ వైఎస్ చైర్మ న్ రాజిరెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-రెండేండ్లలో కాలువల ద్వారా సాగునీరు సాగునీటి రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని, వచ్చే బడ్జెట్‌లో సాగు నీటిరంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించనున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో చెరువుల పునరుద్ధరణను ఉద్యమంలా చేపట్టనున్నట్లు తెలిపారు. రెండేళ్లలో కాలువల ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ప్రాణహిత-చేవెళ్లపై అధికారులతో సమీక్షించారు. ప్రాణహిత-చేవేళ్లలో భాగంగా నిర్మించే రంగనాయకసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు రూ.1.52 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ప్రాణహిత కోసం 30 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు భూసేకరణ కోసం రూ.46.80 కోట్లు చెల్లించామన్నారు.
త్వరలో భూమలు సేకరించి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి 2017 చివరికి మూడులక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులకోసం 17 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 14 వేల ఎకరాలు సేకరణ పూర్తయిందన్నా రు. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు కోసం 12 వేల ఎకరాలు అవసరమని, 10 వేల ఎకరాలు సేకరించామన్నారు. మెదక్ జిల్లా ప్రజల దశాబ్దాల కలైన మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వేలైన్ భూ సేకరణ డిసెంబర్ వరకు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. కార్యక్రమాల్లో మెదక్ జిల్లా జేసీ వెంకటరాంరెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ఎస్‌ఈ గోపాల్‌రావు, భూసేకరణ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి పాల్గొన్నారు.