-ముఖ్యమంత్రి ఆలోచనా విధానంతో మీరు పనిచేయాలి -సర్పంచ్‌లు క్రియాశీలకంగా వ్యవహరించాలి -మార్పును శాశ్వతం చేయాలి -సేవచేస్తేనే ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకొంటారు -పనిచేయకుంటే పదవులు ఊడుతాయి -ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది -మార్చిలో గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు -సిరిసిల్ల పంచాయతీరాజ్ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్

‘అభివృద్ధి విషయంలో మీ ఊరికి మీరే ఓ కేసీఆర్ కావాలి. గ్రామాలను బాగుచేసుకోవాలనే పట్టుదల ఉండాలి. బాగుచేస్తేనే ప్రజలు హర్షిస్తారు. సీఎం కేసీఆర్ ఆలోచనావిధానంతో పనిచేయాలి. 70 ఏండ్లుగా పల్లెలన్నీ చెత్తకుప్పలుగా మారాయి. పల్లెప్రగతితో గ్రామాల్లో మార్పు వచ్చింది. ఈ మార్పును శాశ్వతంగా కొనసాగించాలి. ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచ్‌లు క్రియాశీలకంగా వ్యవహరించాలి. అంకితభావంతో పనిచేయాలి. గ్రామాల్లో అన్ని రకాల సేవలను అందిస్తేనే ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకొంటారు’ అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఉద్బోధించారు.
గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశంచేశారు. స్వరాష్ట్ర సాధన అనంతరం కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను ఏర్పాటుచేసుకొని బ్రహ్మాండంగా ముం దుకు వెళ్తున్నామన్నారు. వీటికోసం శాశ్వత భవనాల నిర్మాణం, పాలనా యంత్రాంగం సమకూర్పుతో ప్రజలకు పాలన చేరువయ్యేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పారు. ప్రజలకు సీఎం కేసీఆర్ పాలనపై సంపూర్ణ విశ్వాసం ఉన్నదని.. పనిచేసే ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో సీఎం ఉండిపోయారన్నారు.

అభివృద్ధి అంటే కేవలం నిధులు మంజూరుచేయడం కాదని.. ప్రజలకు తగిన మౌలిక వసతులు కల్పించి తద్వారా సుపరిపాలన అందించడమని పేర్కొన్నారు. గ్రామాలను బాగుచేసుకోవడాన్ని ప్రజాప్రతినిధులు బాధ్యతగా భావించడంకోసమే కొత్త పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాలను సీఎం కేసీఆర్ రూపొందించారన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో అమలుచేస్తే రాష్ట్రం మరింతగా ముందుకు వెళ్తుందని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు.
ప్రజలకు సేవచేయాలనే పట్టుదల ఉండాలని, పనిచేసిన పాలకులనే ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకొంటారని పేర్కొన్నారు. పనిచేయకుంటే నూతన చట్టం వల్ల పదవి ఊడుతుందని హెచ్చరించారు. ప్రజలకు ప్రభుత్వం ఆశించిన సేవలు అందించకుంటే చట్టం ఊరుకోదని, పదవి పోతే కోర్టులు, సీఎం కేసీఆర్ కూడా కాపాడలేరని స్పష్టంచేశారు. సర్పంచ్‌లు వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డ్‌లు, చెత్త తరలించడానికి ట్రాక్టర్లు, నాటిన మొక్కలు బతికించేందుకు చర్యలు, పారిశుద్ధ్యం వంటి పనులను సమర్థంగా చేపట్టాలన్నారు. ప్రతి ఇంటినుంచి తడి, పొడి చెత్తను సేకరించి ట్రాక్టర్లద్వారా డంపింగ్ యార్డ్‌కు తరలించాలని .. వ్యర్థాలనుంచి విద్యుదుత్పత్తిచేసే ప్లాంట్‌కు సీఎం యోచిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత మెరుగుపడితే ఆహ్లాదంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. పంచాయతీలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.339 కోట్లు అందిస్తున్నదని గుర్తుచేశారు. ప్రభుత్వ విధానాన్ని పట్టించుకోని పాలకులను తొలగిస్తామని, దీంట్లో రాజకీయ కక్ష సాధింపు లేదని స్పష్టంచేశారు. ముందుగా పనిచేయని టీఆర్ఎస్ పాలకులను తొలగిస్తామన్నారు. గ్రామాల్లో చేపట్టే పనుల విషయం లో యువత, మహిళా, కుల సంఘాలకు బాధ్యతలను అప్పగించాలని సూచించారు.
‘గంగదేవిపల్లి, అంకాపూర్ ఆద ర్శ గ్రామాల జాబితాలో మీ గ్రామం కూడా చేరాలి. అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలి. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి పంటకు సాగునీరు, 24 గంటల కరంట్‌ను అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్నది. అదేబాటలో ప్రతి గ్రామంలోని పంచాయతీ పాలకవర్గం పనిచేయాలి’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. పంచాయతీ పరిధిలో నిర్మాణపనులకు పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేసుకోవాలని, దీని ద్వారా ఇసుక రవాణాకు కళ్లెం వేసినట్లవుతుందన్నారు. ఎన్నికల సీజన్ ముగిసినందున.. పరిపాలనపైనే సీఎం కేసీఆర్ దృష్టి సారించారని చెప్పారు.
1988లోనే హరితహారం చేపట్టిన సీఎం కేసీఆర్ సీఎం కేసీఆర్ 1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నకాలంలోనే హరితహారం నిర్వహించేందుకు కృషిచేశారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. సిద్దిపేటలో మొక్కలు నాటాలని అకుంఠితదీక్షతో ప్రయత్నించినా నర్సరీలు లేకపోవడంతో, పట్టుబట్టి అటవీశాఖతో మొక్కలను పెంచి 1988లో పదివేల మొక్కలను సిద్దిపేట లో నాటారని వివరించారు. నాటినుంచే పచ్చదనంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచారన్నా రు. నేడు కేసీఆర్ సంకల్పంతో గ్రామగ్రామా నా నర్సరీలను ఏర్పాటుచేసి హరితహారాన్ని పండుగలా నిర్వహిస్తున్నారని తెలిపారు.

మార్చిలో సీఎం ఆకస్మిక తనిఖీ పల్లెప్రగతి పూర్తయిన గ్రామాల్లో సీఎం కేసీఆర్ మార్చి మొదటివారంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామాలకు సరిపడా నిధులు అందిస్తుంటే పంచాయితీ పాలకవర్గం తమ వంతు బాధ్యతను తప్పకుండా నిర్వర్తించాలని, లేకుంటే కఠినచర్యలుంటాయని మరోసారి హెచ్చరించారు. ఆయా గ్రామాల అభివృద్ధి రిపోర్డులను సంబంధిత ఎమ్మెల్యేలకు పంపిస్తామని, గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యేల బాధ్యత ఉంటుందని స్పష్టంచేశారు. జిల్లా అధికారుల సహకారంతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న డంపింగ్‌యార్డ్‌లు, వైకుంఠథామాలను రానున్న వేసవిలో పూర్తిచేయాలన్నారు.
మిషన్ భగీరథ నీరే ముద్దు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన తాగునీరు అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డబ్బులు ఖర్చుచేసి మినరల్ వాటర్ తాగవద్దని, మిషన్ భగీరథ నీరును తాగాలని ప్రజలకు సూచించారు. దీంతో ప్లాస్టిక్ వాడకం తగ్గించవచ్చని గుర్తుచేశారు. ముస్తాబాద్ మండలం మోహినికుంటలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ అధ్వర్యంలో మహిళాసంఘాలు చేసిన బట్టసంచుల గురించి కేటీఆర్ ప్రజాప్రతినిధులకు వివరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి బట్ట సంచులు వాడాలని, అవసరమైతే ప్రజలకు పంపిణీచేయాలని సూచించారు. కార్యక్రమం లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్, జిల్లా రైతు సమన్వయసమితి కన్వీనర్ గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, జిల్లా అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.