-తెలంగాణ అమరులకు సర్కారు అజరామర నివాళి -మహోన్నత త్యాగాలకు ప్రతిరూపంగా ‘అమర’జ్యోతి -శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనులు -సాగర తీరాన స్మృతి చిహ్నం -3.29 ఎకరాల్లో నిర్మాణం -80 కోట్లతో ప్రమిద రూపంలో -శర వేగంగా పనులు

అగ్నికీలలను అలవోకగా కౌగిలించుకొన్నదొకరు.. ఉరికొయ్యలను ముద్దాడింది ఒకరు. పుట్టిన గడ్డ సంకెళ్లు తెంచడానికి ఒక్కో వీరుడు తెలంగాణ మహాయజ్ఞానికి ఒక్కో సమిధలా మారిపోయాడు. ఒక్కో వీరుడి త్యాగం ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి ఉత్ప్రేరకమైంది. ఈ అమరవీరులు తెలంగాణ సమాజానికి అందించిన శక్తి, చైతన్యం స్వరాష్ట్ర సాధనకు ఇంధనమయ్యాయి. ఇవాళ కాళేశ్వరంలో కనిపించే నీళ్లు వాళ్లు.. పరుచుకున్న పచ్చదనం వాళ్లు.. పండుతున్న పంట వాళ్లు.. చెరువుల్లోని చేపల్లో.. అయ్యాఅవ్వల నవ్వుల్లో.. అక్కాచెల్లెళ్ల పెండ్లి సంబురాల్లో.. అంతటా కనిపిస్తున్న వెలుగుదివ్వెలు. హుస్సేన్‌సాగర తీరాన జ్యోతి స్వరూపంగా వెలుస్తున్న అమరుల స్మృతి.. తెలంగాణకు తరతరాల స్ఫూర్తి.
తెలంగాణ ఉద్యమానికి అనునిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి.. యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచేందుకు శాశ్వత స్మృతిచిహ్నాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది. హైదరాబాద్ హుసేన్ సాగర్ తీరంలో మలి ఉద్యమానికి కార్యక్షేత్రంగా నిలిచి తెలంగాణ నినాదం ప్రతిధ్వనించిన జలదృశ్యాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేలమట్టంచేయించారు. ఇప్పుడు అదే ప్రాంతాన్ని అమరుల స్మృతి చిహ్నంగా.. నిరంతరం జ్వలించే స్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీర్చిదిద్దుతున్నారు. జలదృశ్యం ప్రాంతాన్ని ఎల్లకాలం వెలిగించాలని. అది అమరుల త్యాగాల తావు కావాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా, దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, పర్యాటకులు హైదరాబాద్‌కు వస్తే ఆ తావుకు పోయి మొక్కి రావాల్సిందే అన్నరీతిలో మహోన్నత కార్యానికి సీఎం శ్రీకారం చుట్టారు. అమెరికా, చైనాలో ఉన్న ఉక్కు నిర్మాణాలకు దీటుగా రూపొందిస్తున్న అమరుల స్మృతి చిహ్నం నిర్మాణం మార్చినెలాఖరు కల్లా పూర్తిచేయానికి ఇంజినీరింగ్ అధికారులు లక్ష్యం నిర్ధేశించుకొన్నారు.
3.29 ఎకరాల్లో రాజధాని నగరం నడిబొడ్డున 3.29 ఎకరాల్లో సూమారు రూ.80 కోట్ల నిధులతో అమరుల స్మారక నిర్మాణం జరుగుతున్నది. రెండు అంతస్థుల సెల్లార్, ఒక సర్వీస్ ఫ్లోర్ (గ్రౌండ్ ఫ్లోర్) నిర్మాణం జరుగుతున్నది. మొత్తం 2,88,461 చదరపు అడుగుల నిర్మాణంలో బేస్మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్ కలిపి 2,42,693 చదరపు అడుగులు ఉంటుంది. కాంక్రీట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సెల్లార్లలో ఒక్కో సెల్లార్ 1,06,993 చదరపు అడుగులున్నది. దీని నిర్మాణానికి 18 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు. ఇందులో 350 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. 28,707 చదరపు అడుగులున్న సర్వీస్ ఫ్లోర్లో మైంటెనెన్స్కు సంబంధించిన పనులు జరుగుతాయి. ఇక్కడే వాటర్ ఫౌంటైన్, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుచేస్తున్నారు. ఇక్కడినుంచే స్మృతి చిహ్నం భవనంలోకి ప్రవేశమార్గం ఉంటుంది. వీవీఐపీల కోసం ప్రత్యేక ర్యాంపును నిర్మించారు.
ఉక్కు నిర్మాణం అమరుల స్మృతి చిహ్నం పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్నారు.1200 టన్నుల స్టీల్‌తో మొదటి అంతస్తునుంచి నుంచి మూడు అంతస్తుల నిర్మాణం అంతా స్టీల్‌తోనే చేపట్టారు. ఇప్పటికే 95 శాతం స్టీల్ నిర్మాణం పూర్తయింది. ఇందులో జ్వలించే దీపానికే 50 టన్నుల ఉక్కును వినియోగిస్తున్నారు. 10,656 చదరపు అడుగలతో నిర్మిస్తున్న మొదటి అంతస్థులో ఫొటోగ్యాలరీ, మ్యూజియం, ఆడియో, వీడియో విజువల్, బుక్స్ ఎగ్జిబిషన్ ఉంటాయి. 16,964 చదరపు అడుగుల నిర్మాణం ఉండే రెండో ఫ్లోర్లో కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. 8,095 చదరపు అడుగులు ఉండే టెర్రస్ ఫ్లోర్ (మూడో అంతస్థులో రెస్టారెంటు ఉంటుంది. ఇక్కడినుంచే అమరుల జ్యోతిని తిలకించవచ్చు. నివాళులు అర్పించవచ్చు, అమరుల జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు.. అమరుల స్మతిచిహ్నం భవనం ఈశాన్యం వైపు 26 మీటర్ల్లు, నైరుతి వైపు18.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. పైన 54 X 37 మీటర్ల ప్రమిద ఉంటుంది. ఈ ప్రమిదపై 26 మీటర్ల ఎత్తున వెలుగుతున్న జ్యోతిని నిర్మిస్తున్నారు. ఈ జ్యోతి ప్రత్యేకంగా 365 రోజులు వెలుగుతున్నట్లుగా ఉండే విధంగా నిర్మాణం ఉంటుందని అన్నారు. ఇందు కోసం ప్రత్యేక డిజైన్ రూపకల్పనచేశారు. ఇందులో మరో మూడు అంతస్థులు అదనంగా వస్తున్నాయి. వీటిని యుటిలిటీకి వినియోగిస్తారు. దీని విస్తీర్ణం 10,053 చదరపు అడుగులు ఉంటుంది.

అమరులు.. ఆరని జ్యోతులు అమరుల త్యాగాలు భవిష్యత్ తరాలు ఎల్లప్పుడూ స్మరించుకునేలా స్మారక చిహ్నం ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావించి నిర్మాణం చేపట్టారు. సీఎం ఆదేశాల మేరకు అమరుల త్యాగం ఆరిపోకుండా ఉండే విధంగా డిజైన్ చేసి నిర్మిస్తున్నాం. అమరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్న జలదృశ్యం ఒకనాడు టీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన స్థలమిది. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత ఇప్పుడు అక్కడే స్మారక చిహ్నం నిర్మించుకుంటున్నాం… ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉన్నది. -వేముల ప్రశాంత్‌రెడ్డి , రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి