Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మీ తండాకు మీరే పాలకులు

-గిరిజనులకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు పిలుపు -3 వేల మందికి సర్పంచులయ్యే అవకాశం -సబ్‌ప్లాన్ కింద ఐదేండ్లలో రూ.50 వేల కోట్లు -ట్రైబల్ ఫ్యామిలీస్ ప్రొఫైల్ సిద్ధం చేయాలి -రాష్ట్ర గిరిజనులు దేశానికి ఆదర్శంగా నిలువాలి -లంబాడి తండా,గోండుగూడెం కాదు.. ఇక గిరిజన గ్రామ పంచాయతీలు అని పిలువాలి

రాష్ట్ర గిరిజనులు కలిసిమెలిసి అభివృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలువాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. గిరిజన పంచాయతీల ఏర్పాటుతో వారికి సాధికారత లభిస్తుందని చెప్పారు. సబ్‌ప్లాన్ కింద ఐదేండ్లలో రూ.50 వేలకోట్ల నిధులు వస్తాయని, మూడువేల సర్పంచ్ పోస్టులు లభిస్తాయని పేర్కొన్నారు. గిరిజనులు నాయకులుగా ఎదిగేందుకు అద్భుతమైన అవకాశం తలుపు తడుతున్నదని అన్నారు. పెండ్లి ఖర్చుకు పద్ధతి పెట్టుకోవాలని, యువకులు కట్నం అడుగడం మానుకోవాలని హితవు చెప్పారు. తండాలను గిరిజన పంచాయతీలని పిలువాలని సూచించారు. ప్రభుత్వం ఎంత చేసినా.. మనకు మనమే తండాలను, గిరిజనులను బాగుపర్చుకోవాలని ఆ జాతిలోని ప్రతి ఒక్కరూ భావించాలి అని సీఎం కేసీఆర్ చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చట్టంచేసిన నేపథ్యంలో గిరిజన ప్రజాప్రతినిధులు, వివిధ తెగలకు చెందిన గిరిజనులు శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఉద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..సంతోషం.. చాలారోజులుగా అనుకున్న కోరికను చట్టం రూపంలో అమలు చేసుకున్నం. ఉద్యమంలో తిరిగినపుడు మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం వాల్యానాయక్ ఇంట్లో పండుకున్న. రాంబల్ ఇంట్లో భోజనం చేసిన. జామతండాలో వరంగల్ జిల్లాలో కూడా మిత్రుడి ఇంట్లో పండుకున్న. పొద్దున్నలేచి యాపపుల్ల ఏసుకుని అందరితోని కూసొని మాట్లాడిన. ఏం జరుగుతున్నది. ఆడపిల్లల పెండ్లి ఎట్ల చేస్తున్నరని విచారించిన. చాలామంది పెద్దఎతున్న కట్నం అడుగుతున్నరని చెప్పిండ్రు. కొన్ని చోట్ల ఆడపిల్లల్ని అమ్ముతున్నరు. ఎందుకు అమ్ముతున్నరు? అవుసరం ఏంబడ్డదని అడిగిన. చాలామంది అక్కడి యువకులు, ప్రజలు గ్రామానికి లింక్ అయి.. ఒకరి కింద ఉంటే నిరాదరణకు గురవుతున్నం.. మా తండాలు అన్ని గ్రామ పంచాయతీలు కావాలని చెప్పిండ్రు. అదే పద్ధతిలో డిమాండ్ కూడా చేసినరు. అనేక పాదయాత్రలు చేసినరు.

సంస్కృతిని కాపాడుకుంటున్నరు కొన్ని పార్టీల వాళ్లు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిండ్రు అమలు చేయలేదు. ఎందుకో విస్మరించినరు. ఆరోజు ఉద్యమ సందర్భంలోనే రాష్ట్రం వస్తే తండాలను గ్రామపంచాయతీలు చెయ్యాలని కోరినం. తెలంగాణ వస్తే చేస్తమని నేను కూడా చెప్పాను. ఇప్పుడు చేసుకోగలిగినం. గిరిజనుల్లో లంబాడీలు ఎక్కువ శాతం, ఆదివాసీలు తక్కువ ఉంటరు. వాళ్లుగూడ కొన్ని జిల్లాల్ల ఎక్కువున్నరు. కొన్ని జిల్లాల్ల తక్కువున్నరు. లంబాడీలు అన్ని జిల్లాల్లో ఉన్నరు. ఆదివాసీల్లో గోండులు ఆదిలాబాద్‌లో, కోయలు ఖమ్మంలో ఉన్నరు. చెంచులు మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ ప్రాంతంలో ఉన్నరు. కొంతమేరకు మంథని ప్రాంతంలోనూ ఉన్నరు. వాళ్లకయినా.. వీళ్లకయినా.. ప్రత్యేకమైన జీవనసరళి, ప్రత్యేక భాష ఉన్నయి. తినే పద్ధతి, పెళ్లిచేసే పద్ధతి కూడా అట్లే ఉంటది. పండుగలు చేసేది గూడ అట్లే ఉంటది. కొలిచే దేవుళ్లు, మొక్కే గురువులు అట్లే ఉంటరు. ఎవరికివారు తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటరు. పరంపరగా భారతజాతికి సంస్కృతి వస్తున్నది. దేశంలో అనేక జాతులున్నయి. ఎవరికివారు వారి సంస్కృతిని కాపాడుకుంటున్నరు. నవీన పద్ధతులవైపు పోతు న్నా కూడా.. పాత సంస్కృతిని, సంప్రదాయాన్ని ఏ జాతీ కోల్పోదు. అందువల్ల మాకు జీవనశైలి, భాష, ఆహారం, ఆహార్యం ఉందని, అందుకే ప్రత్యేకంగా తండాలు ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. మేం కూడా కోరినం. ఎలక్షన్లు అయిపొయినయి. కానీ వాళ్లు పెట్టలేదు.

మ్యానిఫెస్టోలో పెట్టినం.. కచ్చితంగా ఇచ్చినం మన రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు దగ్గరికొచ్చినయి. ఎన్నికల ముందు చెప్పినం. మ్యానిఫెస్టోలో పెట్టినం. కచ్చితంగ చేస్తమని చెప్పినం. ఇప్పుడు చేసినం. రాష్ట్రంలో 12,741 గ్రామ పంచాయతీలు ఏర్పడితే 2600కు పైగా పంచాయతీల్లో సర్పంచులు అచ్చంగా గిరిజనులే ఉంటరు. ఏజెన్సీ ఏరియాలో ఉండే గ్రామ పంచాయతీల్లో గిరిజనులే ఉంటరు. 100% గిరిజన జనాభా ఉంటే.. గిరిజనులే పాలిస్తరు. వీటిలో జనాభా శాతం ప్రకారం మిగిలిన గ్రామాల్లో జనరల్ కోటా కింద కూడా అవకాశం వొస్తది. ఇది అద్భుతమైన సందర్భం. మూడువేల మంది గిరిజన సర్పంచులు రాష్ట్రంలో ఉండే అవకాశం. ఉమ్మడి రాష్ట్రంలో ఇంతమంది లేరు. ప్రతి చిన్న గ్రామపంచాయతీకి కనీసం మూడు లక్షలు, అయిదేండ్లలో 15 లక్షలు వస్తయి. కేంద్రం నుంచి కూడా వస్తయి.. మొత్తం రూ.20 లక్షల వరకు తండాకు నిధులు నేరుగా వచ్చే అవకాశం ఏర్పడింది. మధ్య దళారీలు లేకుండా మీరే పాలించుకోవచ్చు. తండాలు మీరే పాలించుకుని తండాలను అద్దాలుగా, పరిశుభ్రంగ మార్చాలె. తాగనీకె తొందర్లనే మంచినీళ్లు మిషన్ భగీరథద్వారా అందిస్తం. కరెంటు బాధలేదు. తండాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలె.

సబ్‌ప్లాన్ సద్వినియోగం అయ్యేలా చూడాలి తెలంగాణ ఎక్కువశాతం గిరిజనులున్న రాష్ట్రం. ఎస్టీలకోసం సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నాం. ఈ ఏడాదికి కేటాయించిన డబ్బు ఖర్చు చేయకుంటే వచ్చే ఏడాదికి పెట్టాలని నిర్ణయించినం. గతేడాది తొమ్మిదివేల కోట్లు పెట్టాం. ఈ ఏడాది కూడా 10 వేలకోట్లు బడ్జెట్ పెట్టాం. ఎవరు అధికారంలోకి వచ్చినా ట్రైబల్ సబ్‌ప్లాన్ అమలు కావాల్సిందే. అయిదేండ్లలో సబ్‌ప్లాన్ కింద గిరిజనులకు కేటాయించే డబ్బు రూ.50 వేల కోట్లు.. అందులో 75% వస్తాయి. ఐదేండ్లలో గిరిజనుల కోసం రూ.35 వేల కోట్ల వరకు ఖర్చుపెడితే గిరిజనుల్లో ఇంక పేదరికం ఎందుకుంటది? గిరిజనులు ఈ రోజు ఉన్నట్టే ఎందుకుండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ గిరిజనుల్లో పేదరికం ఉండదు. ఉండొద్దని మనమంతా మాటలు చెప్పుడుగాదు. గిరిజనులను అభివృద్ధి చేసే బాధ్యత చదువుకున్నవారు, అవగాహన ఉన్నవారు తీసుకోవాలి. గిరిజన జనాభా.. చిన్నపిల్లలు ఎట్టిపరిస్థితుల్లోనూ బడికి వెళ్లాలి. గిరిజనుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లుపెట్టి ఒక్కో విద్యార్థికి రూ.లక్ష ఖర్చు చేస్తున్నం. కొన్ని పాఠశాలలు బాగలేవు. వాటిని మారుస్తం. కొత్తగ పెట్టిన గురుకులాలు ఎట్ల ఉన్నయో ఆ పద్ధతిలో నడిపిస్తం. చదివే పిల్లలు చదువుతుంటే వ్యవసాయంలో ఉన్న కుటుంబాలకు ఆర్థికసహకారం, చదువుకుని నిరుద్యోగంతో ఉన్నవారికి ఉపాధి కల్పించాలి.

మీరూ నాయకులు కావాలి ఇది అద్భుతమైన అవకాశం. గిరిజనులు కూడా నాయకులుగా ఎదుగాలి. గెలువాలి. సుమారు మూడువేల గిరిజన ఆవాసాలు ఉన్న గ్రామాలలో సబ్‌ప్లాన్ పూర్తిగా అమలుకావాలి. గిరిజన కుటుంబాల సంఖ్య, భూమి, పూర్తి వివరాలను ఏ గ్రామానికి ఆ గ్రామానికి ప్రభుత్వం ముందు పెట్టి శాసనసభ ద్వారా గిరిజనుల అభివృద్ధికి నివేదికలు రూపొందించేలా కృషిజరుగాలి. మీకు అనుకూలమైన ప్రభుత్వం. అవకాశం ఉన్నా ఉపయోగించుకోకుంటే తప్పు మీదవుతుంది. మనకు కష్టమొస్తే పక్కింటోళ్లు తీర్చలేరు. ఎవరో వచ్చి చేస్తారని కాకుండా కచ్చితంగా మనం బాగుపడాలని మనం అనుకుంటే.. కష్టపడి పనిచేయాలి. తెలంగాణ కోసం అందరం కొట్లాడినం. నేను ఒక్క మనిషిని బయల్దేరిన. అందరు నాతోటి కలిసి కొట్లాడిండ్రు. మనం బాగుపడటం కోసం ఎవరూ మనకు ఏమీ చేయరు. మనల్ని మనం బాగు చేసుకోవాలంటే కష్టపడి పనిచేయాలి. గిరిజనులకు పెద్దమొత్తంలో బడ్జెట్ పెట్టేది ఇండియాలో తెలంగాణ మాత్రమే. ఏటా 15 నుంచి 16 వేల కోట్లు బడ్జెట్ పెరుగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుపడ్తమని కొట్లాడినం. ఏ తండాకు ఆ తండాలో.. గిరిజన తెగలవారే నాయకులుగా ఉంటరు. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా వచ్చే డబ్బును, ట్రైబల్ సబ్‌ప్లాన్ నుంచి మొదటి సాయం ఏ ఊరికి ఆ ఊరు అందుకునేలా ఎక్కడికక్కడ సబ్‌ప్లాన్ పెట్టుకోవాలి. ప్రయత్నించాలి.

పెండ్లి ఖర్చుకు ఒక పద్ధతి పెట్టుకోవాలె కల్యాణలక్ష్మికి రూ.లక్షా నూటపదార్లు ఇస్తున్నం. కేసీఆర్ లక్షిస్తున్నడు.. మీరేం ఇస్తరు? అని పెండ్లికొడుకులు కొందరు అడుగుతున్నట్టు తెలిసింది. కట్నం అడుగొద్దు. పేదింటి ఆడిపిల్లల పెండ్లికి ప్రభుత్వం ఈ సాయం చేస్తున్నది. ఇంతలోపలే పెండ్లి జరగాలి.. అని ప్రతి తండాలో పద్ధతి రావాలి. (ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ కృషిని సీఎం ప్రస్తావించారు.) బంగ్లాదేశ్‌లో.. ఒకాయన కష్టంలో ఉన్న ప్రజలు కష్టం నుంచి ఎట్ల బయటకు రావాలని చెబుతడు. కొంతమంది ఆడోళ్లు దినాం గుంపుగా పోయేది చూసిండు. ఎందుకా ఆలోచించిండు. రోజువారిగా మిత్తికి అప్పులిచ్చే సావుకారి దగ్గరకు వెళ్లి.. అప్పుతీస్కొని.. హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ల కూరగాయలు కొని ఇల్లిల్లు తిరిగి సావుకారి అప్పు తెంచి, 3, 4 రూపాయలు మిగిలితే బియ్యం, పప్పు, ఉప్పు కొని తింటరు. గిది గుర్తించిన ఆ పెద్దాయన.. ఒక దినం ఆడోళ్లను పిలిచి నేను మూడ్రూపాయల మిత్తికి మీకు అప్పిస్తా.. సావుకారి కాడికి పోకుండ గీడనే అప్పుదీస్కొని కూరగాయలు అమ్ముకొని బత్కుమని చెప్పిండు. అట్లా ఏండ్లు గడుస్తది. ఒకదినం.. ఆయన ఆడోళ్లతోని మీ కుటుంబం అందరు మా ఇంటికి తిన్నీకి రావాలని చెప్తడు. భోజనాల్గిట్ల చేసినంక.. మీనుంచి నేను బాగా డబ్బు సంపాయించిన.. అని పైసల మూట తీస్కొస్తడు. మీకు పొదుపు నేర్పాలని నేను గీపని జేసిన. యూనివర్శిటీలో నేను ప్రొఫెసర్‌ను. మీకు నేరుగ చెప్తే ఇనరు. అందుకే ఇట్ల జేసిన. మీతోటి వడ్డీ కింద తీస్కున్న రూ.36 వేలు మీవే. ఇవి తీస్కొని సొంతంగా మీరే వ్యాపారం చేసుకోండని చెప్తడు. నేను మిమ్ముల్ని తయారు చేసినట్టు ఇంకో గ్రూప్ తయారు చేయాలని సూచించిండు. అలా 15,500 గ్రూపులు ఏర్పడినయి. గట్లనే.. పేదరికం పూర్తిగ తీసెయ్యాలని గిరిజన జాతి అనుకోవాలి. మనకు మనం బాగుపడాలన్నది మన ఎజెండా.. మనం ఎవరికీ వ్యతిరేకం కాదు. కొత్తగా ఏర్పడిన గిరిజన గ్రామ పంచాయతీలో ఏం ఉన్నయి? ఏం చేస్తే అభివృద్ధి జరుగుతది అనేది గుర్తించాలె. గిరిజన కుటుంబాల స్థితిగతి సిద్ధం చేయాలి. ట్రైబల్ సబ్‌ప్లాన్ దళారుల పాలుకాకుండా నిజమైన లబ్ధిదారులకు వర్తింపజేసేలా కృషిచేద్దాం. కొత్తగా ఏర్పడిన గిరిజన గ్రామ పంచాయతీలో కుటుంబాలవారిగా స్థితి, గతి ప్రొఫైల్‌ను సిద్ధం చేయండి. అందరం కలిసి అనుకుంటే కానిదేది. అద్భుతమైన గిరిజనులు ఎక్కడ ఉన్నరు అని అందరూ ఇక్కడికి వొచ్చి చూడాలి. మంచి చేయాలనుకున్న హృదయం ఉంటే భగవంతుడు సహకరిస్తడు. లంబాడి తండా, గోండుగూడెం.. అని కాకుండా గిరిజన గ్రామ పంచాయతీ అని పిల్వాలె. కమిట్‌మెంట్ ఉన్నవారు ముందుకు వస్తేనే బాగుపడుతం. జాతి అభివృద్ధికి కృషిచేద్దాం. డబ్బులు దుబారా చేయకుండా మహిళలు గట్టిగ పట్టుబట్టాలి.

సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు:ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏండ్ల తరబడి గిరిజనుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి గిరిజన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనులు సేవాలాల్, మారమ్మ యాడి, జగదాంబ యాడి ఫొటో పెట్టుకున్ని పూజించినట్టు సీఎం కేసీఆర్‌నుకూడా పూజిస్తారని రెడ్యానాయక్ ఈ సందర్భంగా అన్నారు. సీఎం కేసీఆర్ అంటే బంజారా సోదరులకు చాలా అభిమానమని చెప్పారు. గిరిజనజాతికి సీఎం కేసీఆర్ ఏదైనా చేయగలుగుతారని నమ్మకం ఉందన్నారు. తెలంగాణ ప్రజలు మరో గాంధీలాగా కేసీఆర్‌ను గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రాములునాయక్ మాట్లాడుతూ, గిరిజన బాంధవుడుగా సీఎం కేసీఆర్ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. గిరిజనం సీఎం కేసీఆర్‌ను ఎన్నటికీ మరచిపోదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు శ్రీ సీతారాంనాయక్, శ్రీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ రామచంద్రునాయక్, ఎమ్మెల్సీ శ్రీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ గోవింద్‌నాయక్,శ్రీమతి కవిత తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.