Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మీరే ఈ దేశ భవిత మేలుకో యువత

-ఏ రంగంలోనైనా తెలంగాణ నంబర్‌వన్‌
-దేశానికి నేతృత్వం వహించే స్థితిలో ఉన్నం
-ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు
-దేశాన్ని తీర్చిదిద్దే బాధ్యత యువతరానిదే
-విద్వేష రాజకీయాలపై అప్రమత్తం కావాలె
-ఏమరుపాటుగా ఉంటే పెద్ద దెబ్బతింటం
-అప్‌డేటెడ్‌గా ఉంటే దేశం చల్లగా ఉంటది
-యువత, విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ పిలుపు
-వరంగల్‌లో ప్రతిమ వైద్య సంస్థల ప్రారంభం

అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం భారత దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం ఉన్న మహారాష్ట్ర కంటే మన తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి వృద్ధి ఎక్కువ. తలసరి ఆదాయ వినియోగం ఎక్కువ. ఇప్పుడు మనం దేశానికి నేతృత్వం వహించే స్థితిలో ఉన్నాం. ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు.
– కేసీఆర్‌

నవ భారత నిర్మాణానికి యువతరం చైతన్యవంతంగా అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ కేంద్రంగా నూతన భారత ఆవిర్భావానికి శ్రీకారం జరుగాలని ఆకాంక్షించారు. కొందరు దుర్మార్గులు దేశంలో విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారని, యువత ఈ విద్వేష రాజకీయాలను గ్రహించి అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుకొనే కర్తవ్యం నేటి విద్యార్థులు, యువతపైనే ఉన్నదని అన్నారు. విద్యతోపాటు సామాజిక పరిణామాలను, పరిణామక్రమాన్ని గమనిస్తూ ముందుకుపోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు చుట్టూ సంభవించే పరిణామాలను గమనిస్తూ అప్‌డేటెడ్‌గా ఉంటే దేశమైనా, సమాజమైనా చకగా, చల్లగా ఉంటదని అన్నారు. రాబోయే తరాలకు మంచిని పెంచి, మంచిని పంచి, అభ్యుదయ భావాలను అందించేలా మన కర్తవ్యం ఉండాలని హితబోధ చేశారు. కొంచెం నిద్రాణమై, మూగబోయి, ఏమరుపాటుగా ఉన్నా సమాజం చాలా పెద్ద దెబ్బతింటదని హెచ్చరించారు. ప్రపంచానికే ఆహారాన్నందించేంత వనరులు ఉన్న మన భారతదేశం వంచించబడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. నవ సమాజ నిర్మాణానికి, నవ భారత నిర్మాణానికి కూడా యువత అడుగులు ముందుకు వేయాలని కోరా రు. వరంగల్‌ నగర పరిధి ములుగు రోడ్డులో ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌,ప్రతిమ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ఉదయం ప్రారంభించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి హాస్పిటల్‌ను కలియదిరిగి పరిశీలించారు. అనంతరం కాలేజీ సమీపంలోనే ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. వైద్య, విద్యరంగంలో పనిచేస్తున్న ప్రతిమ యాజమాన్యం తాము పుట్టిన గడ్డ వరంగల్లో మెడికల్‌ కాలేజీని, హాస్పిటల్‌ను ప్రారంభించడం అభినందనీయం అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

రాజకీయం కోసమే కేసీఆర్‌ను తిట్టిపోతరు
‘2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య మం ప్రారంభించినప్పుడు ఇక్కడున్న పిల్లలు పుట్టి ఉండవచ్చు. వాళ్లంతా ఇప్పుడు మెడికల్‌ విద్యార్థులు అయ్యారు. వారు పుట్టి పెరుగుతున్నప్పుడే ఉద్యమం నడిచింది. ఏం జరిగిందో వారికి అన్ని విషయాలు తెలుసు. నేడు సమాచార విప్లవం విశ్వవ్యాప్తంగా విస్తరిస్తున్నది. సమాచారం ఏ ఒకరి దగ్గరో లేదు. నాలెడ్జి బ్యాంకు లేదు. ఎవరైనా పరిశోధిస్తే ఆ విజ్ఞానాన్నే అందరూ సముపార్జించే కాలంలో మనం ఉన్నాం. తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించింది. అనేక రంగాల్లో తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌ వన్‌గా ఉన్నది. కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి రాజకీయాల కోసం కేసీఆర్‌ను తిట్టిపోతరు. అకడ ఢిల్లీలో అవార్డులు ఇస్తరు. అవి రాజకీయాలు. ఉద్యమ సందర్భంలో నేను పదే పదే ఏం చెప్పానో, అది వందకు వందశాతం ఈరోజు సాకారమతున్నది. దేశంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఉంటదని చెప్పిన. ఇప్పుడు అదే జరుగుతున్నది. భారతదేశానికి ఆర్థిక రాజధాని ముంబై నగరం ఉన్న మహారాష్ట్ర కంటే మన తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటు ఎక్కువ. తలసరి ఆదాయ వినియోగం ఎక్కువ. పరిశుభ్రతలో, పచ్చదనంలో, హరితహారంలో, అడవుల పెంపకం.. ఏ రంగంలో తీసుకొన్నా తెలంగాణ నంబర్‌ వన్‌. ఇప్పుడు మనం దేశానికి నేతృత్వం వహించే స్థితిలో ఉన్నం. ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు (ఆల్‌మోస్ట్‌ వీఆర్‌ ప్రొవైడింగ్‌ లీడర్‌షిప్‌ టు ద నేషన్‌ టుడే. టు అనౌన్స్‌ ది టైమ్‌. రియల్లీ ప్రౌడ్‌). తెలంగాణ సమాజానికి అద్భుతమైన చైతన్యం ఉన్నది. అర్థం చేసుకొని సహకరించే స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్న మన గౌరవ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీరందరితో చకగా సమన్వయం చేసుకొని ముందుకుపోతున్న అధికార గణం ఈ ఫలితాలు సాధించగలిగింది.

ఆరోగ్యరంగంలో అద్భుతాలు
ఆరోగ్యరంగంలో మనం అద్భుతాలు సాధించినం. మరింత సాధించవలసి ఉన్నది. గతంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. ఇకడ ఎంబీబీఎస్‌ సీట్ల కోసం ప్రభుత్వ రంగంలో ఐదు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఈరోజు మరో 12 కాలేజీలను కొత్తగా తెచ్చుకున్నం. మీ అందరికీ నేను శుభవార్త తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపించి, ఒక మెడికల్‌ కాలేజీని మంజూరు చేయకపోయినా మన స్వశక్తి ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసింది. రాబోయే కొద్దిరోజుల్లో ఆ మిషన్‌ పూర్తవుతుంది. యువకుడు హరీశ్‌రావు హెల్త్‌ మినిస్టర్‌గా ఉన్నడు కాబట్టి తప్పకుండా మనం సాకారం చేసుకోబోతున్నం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మన రాష్ట్రంలో 2,800 మెడికల్‌ సీట్లు మాత్రమే ఉండేవి. ఈ రోజు 6,500 మందికి మనం మెడికల్‌ సీట్లు ఇస్తున్నం. అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు పూర్తయితే 10వేల మెడికల్‌ సీట్లు ఉంటయి. వైద్య విద్య కోసం ఇకడి పిల్లలు రష్యాకు, చైనాకు, ఉక్రెయిన్‌కు పోయే పరిస్థితి రాదు. మన విద్యార్థులు ఇక్కడే ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు. వైద్య విద్య పీజీ సీట్లు గతంలో 1150 మాత్రమే ఉండేవి. మన రాష్ట్రంలో ఈరోజు 2500 పీజీ సీట్లు ఉన్నయి. ఆరోగ్యరంగంలో మనం చకగ పురోగమిస్తున్నం.

సంపదల దేశం మనది..
మనకంటే మూడు రెట్లు ఉండే అమెరికాలో వ్యవసాయానికి అనుకూలమైన భూమి కేవలం 29 శాతమే ఉంది. మనకంటే రెండింతలుండే చైనాలో 16 శాతమే వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉన్నది. మన భారతదేశం విస్తరించి ఉన్న భూభాగం 83 కోట్ల ఎకరాల్లో 50శాతం అంటే 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నది. అద్భుతంగా వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నయి. మన నేలలు ఎంతో మేలైనవి. నల్లనేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు, తేలికపాటి నేలలు మన దగ్గర ఉన్నయి. వీటితోపాటు నదులలో ప్రవహించే 70 వేల టీఎంసీల నీళ్లున్నయి. ఇన్ని వనరులు, వసతులున్న ఈ దేశంలో మనం మెక్‌డొనాల్డ్‌ బర్గర్లు తింటున్నం. నేడు ప్రపంచానికే ఆహారాన్నిందించే భారతదేశం వంచించబడుతున్నది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో వేల మంది రైతులు 13 నెలలకు పైగా ధర్నాలు చేసే పరిస్థితి. ఏం లేక మనకీ దుస్థితి. కరెంటు లేకనా? నీళ్లు లేకనా? వనరులు లేకనా? జనాభా లేకనా? పనిచేసే యువశక్తి లేకనా? మనం ఈ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలె. అప్‌డేట్‌ కావాలె. ఎందరో మహనీయుల త్యాగ ఫలాలు ఇవి. జీవితాన్ని నిలబెట్టే పెన్సిలిన్‌ మందు కోసం తనపైనే ప్రయోగాలు చేసుకొని, తమ జీవితాలను త్యాగం చేసిన గొప్పవాళ్లున్నరు. వీరందరూ అందించిన కల్చర్‌ తీసుకొని నేటి నవీన, నాగరిక సమాజం పురోగమిస్తున్నది. మన పెద్దల విజ్ఞానం మనకు లభించినందునే మనం ఇలా ఉండగలుగుతున్నం. రాబోయే తరాలకు మంచిని పెంచి, మంచిని పంచి, అభ్యుదయ భావాలను అందించేలా మన కర్తవ్యం ఉండాలి.

ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌..
‘ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో వంద శాతం హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేసినం. ప్రతి వ్యక్తి బ్లడ్‌ గ్రూపు, ఆరోగ్య మంచీచెడ్డలన్నీ రికార్డు చేసి కంప్యూటరైజ్‌ చేయడం జరిగింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు పూర్తయితే, ఏ వ్యక్తికి ఏ రకమైన ఆరోగ్య సమస్య వచ్చినా నిమిషంలోనే తెల్సుకోవచ్చు. దీంతో ప్రజలకు అవసరమైన వైద్యసేవలను డాక్టర్లు క్షణాల్లో అందిస్తరు. ప్రాణాలను కాపాడుతరు. ములుగు అటవీ ప్రాంతంలో డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి తెస్తున్నం. ఏటూరునాగారంలో డయాలసిస్‌ సేవలు కల్పించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ గతంలో నేను వచ్చినప్పుడు కోరారు. ఆ పనులు పూర్తైనయి. దసరా తర్వాత వైద్య మంత్రి హరీశ్‌రావు ఆ సేవలు ప్రారంభించేలా చూస్తారు. ఉమ్మడి వరంగల్‌తోపాటు, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల ప్రజల కోసం హైదరాబాద్‌ను మించి రెండు వేల పడకలతో 24 అంతస్తుల్లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణమవుతున్నది. ఆరోగ్య సేవల కోసం వరంగల్‌ వాళ్లు హైదరాబాద్‌కు వెళ్లడం కాదు. హైదరాబాద్‌ వాళ్లే వరంగల్‌కు వచ్చేలాగా ఈ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఉంటది. ఆర్‌అండ్‌బీ, ఆరోగ్య మంత్రులు దీన్ని త్వరగా పూర్తి చేయించాలె. సెంట్రల్‌ జైలు, కాకతీయ మెడికల్‌ కాలేజీ కలిపి 190 ఎకరాల్లో మెడికల్‌ సిటీ రూపుదిద్దుకుంటున్నది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరంగల్‌కు అనేక విద్యా సంస్థలు వచ్చినయి. వరంగల్‌లోనే తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ యూనివర్సిటీని పెట్టుకున్నం. మన పురోగమనం ముందుకు సాగాలంటే, సమాజం చైతన్యవంతంగా ఉండాలె. మేధావులు ముందుండి చైతన్యం చేస్తేనే ఆ సమాజం ముందుకు పోతది. నవ సమాజ నిర్మాణానికి, నవ భారత నిర్మాణానికి కూడా మీరంతా అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నాను. మీ అందరికీ సద్దుల బతుకమ్మ, దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు. ‘జై తెలంగాణ.. జై భారత్‌’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

కార్యక్రమంలో మంత్రులు టీ హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాసర్‌, ఎంపీలు సంతోష్‌కుమార్‌, దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్‌, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్‌, వొడితెల సతీశ్‌కుమార్‌, నన్నపునేని నరేందర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, టీ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, కార్పొరేషన్ల చైర్మన్లు బండ శ్రీనివాస్‌, మెట్టు శ్రీనివాస్‌, కే వాసుదేవరెడ్డి, బొల్లం సంపత్‌కుమార్‌, వై సతీశ్‌రెడ్డి, ప్రతిమ గ్రూపు సంస్థల చైర్మన్‌ బోయినపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వరంగల్‌ పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి, జిల్లా కలెక్టర్‌ గోపి, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రావీణ్య, ప్రతిమ హాస్పిటల్స్‌ డైరెక్టర్లు డాక్టర్‌ ప్రతీక్‌, డాక్టర్‌ హరిణి, డాక్టర్‌ రమేశ్‌, డాక్టర్‌ అవినాష్‌, డాక్టర్‌ రాహుల్‌, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఏమరుపాటు అసలే వద్దు
‘ఇకడ అందరూ చదువుకున్న వాళ్లున్నరు. నేను మీ అందరినీ కోరేది ఒకటే. ఎప్పుడైనా ఎప్పటికప్పుడు చుట్టూ సంభవించే పరిణామాలను గమనిస్తూ అప్‌డేటెడ్‌గా ఉంటే దేశమైనా, సమాజమైనా చకగా, చల్లగా ఉంటది. ఏమరుపాటుగా ఉంటే సమాజం చాలా పెద్ద దెబ్బతింటది. మన తెలంగాణలో మనం పడ్డ బాధలే దీనికి మంచి ఉదాహరణ. ఒకనాడు తెలంగాణ నాయకత్వం కొద్దిపాటి ఏమరుపాటుతో.. ఉన్న రాష్ట్రాన్ని పోగొట్టుకున్నం. తిరిగి మళ్లీ మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవడానికి ఎంతమంది చనిపోయిండ్రు, ఎన్ని ఉద్యమాలు చేసినం, ఎన్ని లక్షల మంది జైళ్ల పాలైనం, ఎన్ని దశాబ్దాల కాలం పట్టింది. తెలంగాణ ఎంత నష్టపోయిందో మనకు తెలుసు. ఏడేండ్ల కింద తెలంగాణ ఎట్లున్నదో, ఈరోజు తెలంగాణ ఎట్లున్నదో మీకు తెలుసు. వనరులు వసతులు, అవకాశాలు అన్నీ ఉండి కూడా ఆ రోజు మనం వంచించబడ్డాం, మోసపోయినం, దగాపడ్డం. మళ్లీ మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఇన్ని దశాబ్దాలు పోరాటం చేసినం. చివరికి 2001లో మళ్లీ నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి గర్జిస్తే, మీరందరూ ఎకడివాళ్లకడ విజృంభిస్తే రాష్ట్రాన్ని తెచ్చుకున్నం. ఈరోజు దేశానికే ముందు నిలబడి మార్గదర్శకంగా నిలిచే స్థాయికి మనం ఎదిగినం.

సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ పనుల పరిశీలన
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌ నగరంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించే లక్ష్యంతో 24 అంతస్తులతో రెండు వేల పడకల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ భవానాన్ని నిర్మిస్తున్నది. పనుల పురోగతిపై రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వీలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ సీఎం కేసీఆర్‌ వెంట ఉన్నారు.

సీఎం కేసీఆర్‌ అసంతృప్తి..: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ డిజైన్‌పై సీరియస్‌

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దవాఖాన నిర్మాణం జరుగుతున్న ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ వద్ద దవాఖాన డిజైన్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మెడికల్‌ సిటీగా నిర్మించే దవాఖాన విషయంలో అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలు డిజైన్‌ ప్రకారం నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణంపై దసరా తర్వాత హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరుపుదామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనుకున్న డిజైన్‌ ప్రకారం 24 అంతస్తులతో సకాలంలో నిర్మాణం పూర్తయ్యేలా సమీక్ష చేద్దామన్నారు.

నేడు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ కీలక సమావేశం
-మంత్రులు, 33 జిల్లాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులతో భేటీ

రాష్ట్ర మంత్రులు, 33 జిల్లాల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భేటీ కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో వారితో కలిసి భోజనం చేసిన అనంతరం ఒంటిగంటకు ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ నెల 5న తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న సమావేశం ఏర్పాటుపై ప్రాథమికంగా చర్చించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అందరు మంత్రులు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులకు సమాచారం అందింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.