బీజేపీకి ఓటెందుకెయ్యాలి?
ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తున్నందుకా?
కరెంటు మీటర్లు పెడ్తామన్నందుకా?
ప్రశ్నించిన మంత్రి తన్నీరు హరీశ్‌రావు
జమ్మికుంటలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు

‘మీరు బాగుపడా లా? లేదా ఈటల రాజేందరా?’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హుజూరా బాద్ నియోజకవర్గ ప్రజలను ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలిస్తే నియోజకవర్గ ప్రజలందరికీ మేలు జరుగుతుందని, ఈటల గెలిస్తే ఆయ నొక్కడికే ప్రయోజనమని తెలిపారు. అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న బీజేపీకి ఎందు కు ఓటేయాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ‘బీజేపీ హుజూరాబాద్ ఓట్ల కోసం వస్తంది. అసలు బీజేపీకి ఎందుకోటెయ్యాలో చెప్పాలె?.. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నందుకా?.. రిజర్వేషన్లు తొలగించే కుట్రలు పన్నుతున్నందుకా?.. యువతను నిరుద్యోగులుగా మార్చుతున్నందుకా?.. విద్యుత్తు మీటర్లు పెడ్తామన్నందుకా?.. పెట్రో, గ్యాస్ ధరలు పెంచినందుకా?.. పెద్ద నోట్లు రద్దు అట్టర్ ఫ్లాప్ అయినందుకా?’ అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ యువ నేత చిన్నాల శ్రీకాంత్ వెయ్యి మంది తన అనుచరులతో, హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గెస్ట్‌హౌస్‌లో వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, యువకులు సుమారు 100 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. జమ్మికుంటలో శ్రీకాంత్, యూత్ నాయకులు బీజేపీకి రాజీనామా చేసి, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి సభాస్థలి ఎంపీఆర్ గార్డెన్ వరకు ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సభకు రెండు వేల మంది యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ, ఈటల తీరుపై మండిపడ్డారు. హుజూరాబాద్ ఓటర్లు చైతన్యవంతులన్నారు. బీజేపీకి అసలు ఇక్కడ బలమే లేదన్నారు. హుజూరాబాద్ గడ్డ.. టీఆర్ఎస్ అడ్డా అని, టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈటల బీజేపీ అనే పాడుబడ్డ బాయిబొందల పడ్డాడని, ఆయనకు ఓటమి అనే భయం పట్టుకున్నదన్నారు. గెల్లు సీను.. గెలుపు సీను అని ఆయన పేరులో నే గెలుపు ఉన్నదని హరీశ్‌రావు అభివర్ణించారు.
బీజేపీకి గుణపాఠం చెప్పాలి: కొప్పుల
దేశానికి పట్టిన చీడ, పీడ బీజేపీ పార్టీ అని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ తనను ఆశీర్వదిం చాలని కోరారు. జమ్మికుంటలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పాల్గొన్నారు.
దళితుల మద్దతు
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 30: హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామ దళితులంతా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్కు అండగా ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానించి ఆ ప్రతిని సోమవారం సింగాపూర్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి హరీశ్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌కు అందజేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితులు ఆర్థికాభివృద్ధి చెందుతారని వారు పేర్కొన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు ప్రకటించారు.