Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శం

-తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సాక్ష్యం
-ఒక్క పథకం.. బహుళ ప్రయోజనాలు
-ఫ్లోరైడ్‌ సమస్యకు పరిష్కారం
-బీజేపీ ఢిల్లీలో ప్రశంసలు.. గల్లీలో విమర్శలు: మంత్రి హరీశ్‌

సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ అవార్డు’ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ పథకంతో ప్రజలు ఫ్లోరైడ్‌ నుంచి విముక్తి పొందారని, సీజనల్‌ వ్యాధులు దూరమయ్యాయని తెలిపారు. నేషనల్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ అవార్డు వచ్చిన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని మిషన్‌ భగీరథ ఈఎన్సీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ పనితీరు జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమానికి ఓ బూస్ట్‌ లా పని చేస్తుందని కేంద్రం ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. మహిళల కష్టాలను తీర్చడంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేంద్రం చాటి చెప్పిందని పేర్కొన్నారు. కేంద్రం ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాష్ట్రంలో 150కి పైగా బృందాలతో 320 గ్రామాల్లో రోజుల తరబడి పరిశీలించి ఈ అవార్డును ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ పథకాలైన మిషన్‌ భగీరథను హర్‌ ఘర్‌ జల్‌గా, మిషన్‌ కాకతీయను అమృత్‌ సరోవర్‌గా, రైతు బంధు పథకాన్ని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనగా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమలు చేస్తున్నదని వివరించారు.

ఢిల్లీలో ప్రసంశలు.. గల్లీలో విమర్శలు
కేంద్రం పది గ్రామాలకు సంసద్‌ ఆదర్శ యోజన అవార్డులు ప్రకటిస్తే.. ఏడు తెలంగాణకు వచ్చాయని హరీశ్‌రావు తెలిపారు. ఓడీఎస్‌ ప్లస్‌లో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ఎకువ గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసి జనాభా నిష్పత్తిలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని, గ్రామాల్లో పచ్చదనాన్ని 7.3 శాతం పెంచి మొదటి స్థానం లో నిలిచిందన్నారు. దేశంలో కరెంటు లేని పల్లెలున్నాయని, కరెంటు లేని ఇండ్లు మాత్రం తెలంగాణలో లేవని తెలిపారు. బీజేపీ నేతలు నోటితో నవ్వి, నోసటితో వెకిరించినట్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఆర్థిక విషయాల్లో కాగ్‌, నీతి అయోగ్‌, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఢిల్లీలో అవార్డులు, రివార్డులు, ప్రసంశలు కురిపిస్తారు.

కానీ కేంద్ర మంత్రు లు మాత్రం గల్లీలో విమర్శలు చేస్తుంటారు. అవినీతి జరిగిందని, అభివృద్ధి జరగడం లేదని ఇష్టారీతిన మాట్లాడుతూ అబాసుపాలవుతున్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నా రు. పార్లమెంట్‌లో చెప్పింది నిజమా, గల్లీలో చెప్పింది నిజమా? అనేది తెలుసుకోగలరు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవాలని నీతి అయోగ్‌ సూచిస్తే కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు. గుజరాత్‌కు మాత్రం రూ.2,500 కోట్లు ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం సెక్టార్‌ స్పెసిఫిక్‌, స్టేట్‌ స్పెసిఫిక్‌ ఫండ్‌ కింద రూ.5,300 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేస్తే ఎగనామం పెట్టింది. కేంద్ర మంత్రులకు ప్రేమ ఉంటే వాటిని విడుదల చేయించాలి’ అని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌తోనే సాధ్యమైంది
తెలంగాణకు ఒకేసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌, మిషన్‌ భగీరథకు పెద్ద సంఖ్యలో అవార్డులు రావడం సీఎం కేసీఆర్‌ ఘనతేనని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

కేటీఆర్‌ ప్రశంసలు
స్వచ్ఛ సర్వేక్షణ్‌ సహా వివిధ క్యాటగిరీల్లో 13 అవార్డులు వచ్చిన సందర్భంగా ఎర్రబెల్లికి మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో శాలువాతో సతరించి, పూల మొక బహూకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ.. అందునా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ సాధిస్తున్న ఫలితాలు దేశానికే గర్వకారణమని కొనియాడారు. మరింత బాధ్యతాయుతంగా పనిచేసి, మరిన్ని ఆవార్డులు తేవాలని సూచించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ సైతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేకంగా సత్కరించారు.

దశాబ్దాల సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాష్ట్రంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలకు సీఎం కేసీఆర్‌ శాశ్వత పరిషారం చూపుతున్నారని హరీశ్‌రావు అన్నారు. మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్యకు, ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. తెలంగాణలో ఫ్లోరైడ్‌ సమస్య లేదని పార్లమెంట్‌లో కేంద్రం చెప్పడం మిషన్‌ భగీరథ విజయానికి చిహ్నమని అన్నారు. రైతుల నుంచి పరిశ్రమల వరకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ సైతం మిషన్‌ భగీరథను ప్రశంశించారని, నీతి అయోగ్‌, కేంద్రం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిశీలించి అభినందించాయని చెప్పారు.

ఈ పథకానికి 20-30 అవార్డులు వచ్చాయని వివరించారు. నాణ్యత, పరిమాణం, రెగ్యులారిటీలో మనం ఆదర్శంగా ఉన్నామని, ఒక్కో వ్యక్తికి స్వచ్ఛమైన జలాన్ని 100 లీటర్లకు తగ్గకుండా క్రమం తప్పకుండా ఇవ్వడంలో ముందున్నామని పేర్కొన్నారు. దేశంలో 20 కోట్ల ఇండ్లుంటే సగం ఇండ్లకు కూడా నల్లా ద్వారా తాగునీరు అందడం లేదని, తెలంగాణలో 54.06 లక్షల ఇండ్లకు (23, 890 ఆవాసాలకు) మిషన్‌ భగీరథతో నల్లా ద్వారా నీరు అందిస్తున్నామని చెప్పారు.

క్యాన్సర్‌ బాధితుడికి మంత్రి భరోసా
క్యాన్సర్‌ బాధితుడికి మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచి ఉదారత చాటుకున్నారు. నిర్మల్‌ జిల్లా ముథోల్‌కు చెందిన సత్యనారాయణ కుమారుడు రాకేశ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసిన రాకేశ్‌ ఏడాది కింద అనారోగ్యం బారినపడ్డాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా, లంగ్‌ క్యాన్సర్‌ అని తేలింది. ఆపరేషన్‌కు రూ.15 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు మనోవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి హరీశ్‌, బ్లడ్‌ గ్రూప్‌ సభ్యుడు సురేశ్‌ దృష్టికి తీసుకెళ్లగా, వారు రాకేశ్‌ను వెంటబెట్టుకొని గురువారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి విన్నవించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఉచితంగా వైద్యం అందించాలని బసవతారకం క్యాన్సర్‌ దవాఖాన సీఈవోను కోరారు. సోమవారం దవాఖానలో చేర్పించాలని కుటుంబసభ్యులకు తెలిపారు. మంత్రి హరీశ్‌రావుకు కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.