-అనుకొన్న ఫలితాలు వస్తున్నాయి
-రికార్డు స్థాయిలో పెరిగిన సాగు విస్తీర్ణం చెరువుల నిర్వహణపై కార్యాచరణ
-చిన్న నీటివనరుల పరిరక్షణకు చట్టం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు, మన్ననలు లభించాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.ఈ పథకం ద్వారా ప్రజలు ఏం కోరుకొన్నారో, ఎలాంటి ఫలితాలు ఆశించారో.. అవన్నీ ఇప్పుడు ప్రతిఫలిస్తున్నాయని మంత్రి తెలిపారు. మిషన్ కాకతీయ మొదటి దశ ఫలితాలు, ప్రభావంపై నాబార్డు అనుబంధ సంస్థ నాబ్కాన్స్ (నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్) నిర్వహించిన అధ్యయన నివేదికను ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్కీసింగ్ జలసౌధలో ఆదివారం ఉదయం మంత్రి హరీశ్‌రావుకు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నివేదికను పరిశీలిస్తే మిషన్ కాకతీయ ద్వారా ఆశ్చర్యకర, ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమం అమలులో భాగంగా దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఫలితాలు ఎలా ఉంటాయి? అనే దానిపై థర్డ్‌పార్టీతో అధ్యయనం చేయించాలని ముందుగానే నిర్ణయించామని, ఇందులో భాగంగానే నాబ్కాన్స్.. మొదటి దశ పనులు-ఫలితాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చిందని తెలిపారు.మిగతా రెండు దశలపై కూడా ఈ కన్సల్టెన్సీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. దీనితోపాటుగా గుజరాత్‌కు చెందిన ఇర్మా.. అమెరికాలోని మిషిగాన్, షికాగో యూనివర్సిటీలు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా మిషన్ కాకతీయపై అధ్యయనం చేస్తున్నాయని, త్వరలోనే ఆ నివేదికలు కూడా అందుతాయని చెప్పారు. గతంలో ఇక్రిశాట్.. పూడికతీత మట్టి వల్ల కలిగిన ప్రయోజనాలపై చేసిన అధ్యయనం.. ప్రస్తుత నివేదికలో ఇదే అంశంపై జరిపిన అధ్యయనంలోనూ ఒకేరకమైన ఫలితాలు కనిపించాయని మంత్రి హరీశ్ వివరించారు. నాబ్కాన్స్ అధ్యయనం ప్రకారం మిషన్ కాకతీయ వల్ల ప్రధానంగా సాగు విస్తీర్ణం51.5శాతం పెరుగడమనేది చాలా కీలకమైన ఫలితమని ఆయన విశ్లేషించారు. చెరువుల కింద నిరుడు వానకాలం, యాసంగిల్లో 15.50లక్షల ఎకరాల్లో సాగు జరుగడమన్నది రికార్డు అని ఆయన అభివర్ణించారు. సాగు విస్తీర్ణం పెరుగడంతోపాటు భూగర్భజలాలు పెరుగడం, దిగుబడి వృద్ధి చెందడం, చేపల ఉత్పత్తి పెరుగడంతో అన్నివర్గాల వారు ఆర్థికంగా బలోపేతం అవుతున్నట్లు తేలిందన్నారు.
చెరువుల నిర్వహణకు కార్యాచరణ చెరువుల నిర్వహణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నాబ్కాన్స్..రైతుల అభిప్రాయాలను సేకరించి.. పలు సూచనలను తన నివేదికలో ఇచ్చిందని మంత్రి హరీశ్ వివరించారు. రైతులు స్వయంగా ఏయే పనులు చేసుకోవచ్చు, స్థానిక సంస్థలు, ప్రభుత్వపరంగా ఎలాంటి పనులు చేపట్టవచ్చనే వివరాలను నివేదికలో వివరంగా అందించారని పేర్కొన్నారు. వీటిపై శాఖాపరంగా లోతైన చర్చ జరిపి, కార్యాచరణను సిద్ధం చేస్తామన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామని, క్యాబినెట్‌లోనూ చర్చిస్తామని హరీశ్‌రావు తెలిపారు.
చిన్ననీటి వనరుల పరిరక్షణకు చట్టం తెస్తామని చెప్పారు. కొన్నిచోట్ల చెరువుల పరిధిలో శిఖం పట్టాలుండటం, కొందరు స్వయంగా తమ పొలాల్లో కుంటలను తవ్వుకోవడం వల్ల.. మిషన్ కాకతీయ కార్యక్రమంలో 5-15 శాతం పనులు నిలిచిపోయాయని, కొన్నిచోట్ల కోర్టు కేసులు కూడా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా నాబ్కాన్స్ సంస్థ టీం లీడర్ నరేందర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.