Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మిషన్ కాకతీయకు అనుహ్య స్పందన

-పూడిక మట్టిపై రైతుల ఆసక్తి.. -ఆంధ్రుల పాలనలో చెరువుల ధ్వంసం.. -పనుల్లో నాణ్యతలోపిస్తే ఉపేక్షించేదిలేదు -మేజర్ ప్రాజెక్టులుగా మీడియం చెరువులు.. -మీట్ ది ప్రెస్‌లో భారీనీటిపారుదల మంత్రి హరీశ్‌రావు

చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పూడిక మట్టిని పంట భూముల్లోకి తరలించుకోవడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లోని చెరువు పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు ఆదివారం వరంగల్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు. ఐదేండ్లలో దశలవారీగా రాష్ట్రంలోని 46 వేల చెరువులను పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. ఏటా 20 శాతం చెరువులను పునరుద్ధరిస్తామని తెలిపారు.

Irrigation-Minister-Harish-Rao-at-Meet-the-Pressరాజకీయాలకు అతీతంగా మిషన్‌కాకతీయ కార్యక్రమం అమలుకు పక్కాగా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. మిషన్ కాకతీయకు, ఓరుగల్లుకు అభినాభావ సంబంధం ఉందని, కాకతీయులు గొలుసుకట్టు చెరువులను నిర్మించింది ఇక్కడేనని వివరించారు. కాకతీయుల స్ఫూర్తిగా చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పేరు పెట్టి చేపడుతున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు బహుళ ప్రయోజనాలు పొందుతారన్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను వారి శత్రువులు సైతం ముట్టుకోలేదని, ఆంధ్రా ప్రభుత్వాలు మాత్రం వ్యూహాత్మకంగా గొలుసుకట్టు చెరువులను ధ్వంసం చేశాయని ఆరోపించారు. గొలుసుకట్టు చెరువులు తెలంగాణ ప్రజల వారసత్వ సంపద అన్నారు. వాస్తవంగా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు. హన్మకొండలో నిర్మించిన పైలాన్‌ను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కేంద్ర జల వనరులశాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఆవిష్కరింప చేస్తామన్నారు.

చెరువుల పునరుద్ధరణకు ఆర్థికంగా సహాయం చేయడానికి పెద్ద ఎత్తున దాతలు ముందుకు వస్తున్నారని, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన దొడ్డ మోహన్‌రావు నాలుగు చెరువులకు రూ.1.50 కోట్లు విరాళం ఇచ్చారన్నారు. మోహన్‌రావును స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది దాతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకువస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా గ్రామాల్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో కూడిన గ్రామ అభివృద్ధి కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చెరువుల్లోని పూడిక మట్టిని తమ పంట భూములకు తరలించుకోవడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారని, కొన్ని గ్రామాల్లో పూడికమట్టి కోసం పోటీ పడుతున్నారని తెలిపారు. వరంగల్ జిల్లా పరకాల మం డలం కంఠాత్మకూర్‌లో రైతులు పూడిక మట్టికోసం కొద్దిరోజుల ముందే తమ పేర్లను గ్రామ సర్పంచ్ వద్ద నమోదు చేసుకున్నారని వివరించారు.

నాణ్యతలోపిస్తే కఠిన చర్యలు: చెరువుల పునరుద్ధరణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. నాణ్యతకు తిలోదకాలిస్తే ఉపేక్షించమని, నాణ్యత లోపించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధానంగా కాంట్రాక్టర్లు నాణ్యతను పాటించకపోతే బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు. చెరువుల పనులను ఎక్కువగా కాంట్రాక్టర్లు లెస్ రేట్లతో పొందుతున్నారని, అయితే 10 శాతంకంటే ఎక్కువ లెస్ కోడ్ చేసిన కాంట్రాక్టర్ల నుంచి ముందుగానే అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను డీడీల రూపంలో తీసుకుంటున్నట్లు తెలిపారు. చెరువులను పునరుద్ధరించడం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి కరువు నెలకొనే అవకాశం ఉండదన్నారు. ముఖ్యంగా పంటలు సాగులోకి రావటంవల్ల కొంతవరకు రైతుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పారు. రైతులతోపాటు రజకులు, మత్స్యకారులు, గీతకార్మికులు, గొర్రెలు, మేకల పెంపకందారు మరెందరో ఉపాధి పొందుతారన్నారు.

చెరువు కట్టలపై ఈత చెట్లను పెంచడానికి కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, పట్టణాల్లోని చెరువులను కూడా పునరుద్ధరిస్తామని ప్రకటించారు. పంట భూముల్లోకి తరలించడానికి పనికి రాదని వ్యవసాయశాఖ దృవీకరించిన చెరువుల్లోని పూడికను పాత బావులు, ఇటుకబట్టీలు, రహదారుల కోసం వినియోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జర్నలిస్టులు కూడా చెరువులను దత్తత తీసుకోవాలని, పునరుద్ధరణ పనులపై మీడియా నిఘా పెట్టాలని కోరారు. ఎమ్మెల్యేలు కూడా చెరువుల పునరుద్ధరణకు వితరణ చేయడానికి సుముఖంగా ఉన్నారన్నారు. జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులైన రామప్ప, పాకాల, లక్నవరం వంటి చెరువులను మేజర్ ప్రాజెక్టులుగా మారుస్తామని ప్రకటించారు. వరంగల్‌లోని భద్రకాళి, వడ్డెపల్లి చెరువుల భూములు ఆక్రమణకు గురికాకుండా, ఎఫ్‌టీఎల్‌లో అక్రమ కట్టడాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయభాస్కర్, ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.