-గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికోసమే మిషన్‌కాకతీయ -నీతిఆయోగ్ సిఫారసు చేసినా, కేంద్రం సాయం ఇవ్వలేదు -శాసనమండలిలో మంత్రి శ్రీ టీ హరీశ్‌రావు

రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసేందుకు మిషన్‌కాకతీయ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, గంగాధరగౌడ్, ఎస్ ప్రభాకరరావు, భూపాల్‌రెడ్డి, బోడెపూడి వెంకటేశ్వర్రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరంగా సమాధానాలు చెప్పారు. మిషన్‌కాకతీయ పనులకు నీతిఅయోగ్ రూ. 5 వేల కోట్లు తెలంగాణకు సాయం అందించాలని సిఫారసు చేసిందని, అయినప్పటికీ కేంద్రం సాయం చెయ్యలేదని మంత్రి విమర్శించారు. రామన్ మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్, బ్రిటిష్ పార్లమెంట్ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సభ్యులు, బ్రిటిష్ హైకమిషనర్ హాండ్రో మైకెండ్రోతోపాటు.. కేంద్రం నుంచి వచ్చిన చాలామంది పెద్దలు మిషన్‌కాకతీయ చెరువులను సందర్శించి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ఆనాటి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి ఆదేశాల మేరకు కేంద్ర జలవనరులశాఖ ఇంజినీర్లు మిషన్‌కాకతీయ పనులను పరిశీలించి హర్షించారన్నారు. మిషన్‌కాకతీయ ద్వారా గతంలో కన్నా అదనంగా 2.88 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నదని.. ఆయకట్టు స్థిరీకరణ పెరిగిందని, పంట దిగుబడి పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న రైతులు రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు.
తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొని రావడంతోపాటు, ఆదాయ వనరులను పెంచేవిధంగా జరుగుతున్న మిషన్‌కాకతీయ పనులకు దేశమంతటా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు. మహారాష్ట్ర వంటి రాష్ర్టాలు ఈ స్కీంను అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు. రామచంద్రాపురంలో రామసముద్రం చెరువుకు కావాల్సిన నిధులు ఇస్తామని ప్రకటించారు. ప్రజా ప్రతినిధులు ఇచ్చే ప్రతిపాదనలన్నింటికీ ప్రాధాన్యమిస్తామని తెలిపారు. వాననీటిని ఒడిసి పట్టేందుకు, భూగర్భ జలవనరులను పెంచేందుకు మిషన్‌కాకతీయ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆదర్శనీయమైన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ అభినందించారని చెప్పారు. ఈ ప్రక్రియ కరువు కాటకాలను తరిమి కొడుతుందని చెప్పారు. చెరువుల ద్వారా కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలలో 244 టీఎంసీల వరకు నీటిని నిల్వచేసి 25 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని వివరించారు. చిన్న చెరువుల ద్వారా ప్రజలకు బహుళ ప్రయోజనాలు అందుతున్నాయని.. రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని, మత్స్యకార్మికులకు నిరంతరం ఉపాధి లభిస్తున్నదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
నల్లగొండలో బత్తాయి.. నకిరేకల్‌లో నిమ్మకాయల మార్కెట్ -శాసనమండలిలో మంత్రి శ్రీ టీ హరీశ్‌రావు నల్లగొండలో బత్తాయి పండ్లకోసం ప్రత్యేకంగా మార్కెట్‌ను ఏర్పాటుచేస్తామని.. అదేవిధంగా నకిరేకల్‌లో నిమ్మకాయల కోసం మరో మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బోడకుంటి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, సుంకరి రాజు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో గడ్డిఅన్నారం, వరంగల్, జగిత్యాలలో మూడు పండ్ల మార్కెట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామంలో సేకరించిన 175 ఎకరాల స్థలంలోకి, జగిత్యాల మామిడి పండ్ల మార్కెట్‌ను చెల్గల్ గ్రామంలో సేకరించిన 23 ఎకరాల స్థలంలోకి మార్చేందుకు, ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు.