పునరుద్ధరణకు ఈ ఏడాది ఎంపికచేసిన చెరువుల్లో 50 శాతం చెరువుల సర్వే, అంచనాల తయారీ, పరిపాలన అనుమతి, టెండర్ల ప్రక్రియను జనవరి 10లోపు పూర్తిచేసి పనులు ప్రారంభించాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆయకట్టు లేని చెరువుల తూములు, కాలువలను మరమ్మతు చేయొద్దని సూచించారు. మిషన్ కాకతీయ పనుల పురోగతి, ఇతర అంశాలపై చీఫ్ ఇంజినీర్లు, జిల్లాల నోడల్ అధికారులతో మంగళవారం జలసౌధలో మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాలకు జీపీఎస్ సర్వే పరికరాలను మూడురోజుల్లో సరఫరా చేయాలని ఆదేశించారు.

-జనవరి 10లోగా 50 శాతం చెరువుల పునరుద్ధరణ ప్రారంభించాలి -నీటిపారుదలశాఖ ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి హరీశ్‌రావు -మిచిగాన్ విద్యార్థి ఆదిత్య పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పనులను వేగవంతం చేయాల్సిన బాధ్యత నోడల్ అధికారులదేనని మంత్రి స్పష్టంచేశారు. చిన్ననీటిపారుదల చీఫ్ ఇంజినీర్లు వారానికి కనీసం మూడురోజులు జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు. రాష్ట్రంలో అత్యధిక చెరువులు ఉన్న మెదక్ జిల్లాలో సర్వే పనులు నెమ్మదిగా సాగడంపై స్పందిస్తూ.. పనుల పురోగతిపై దృష్టిసారించాలని, ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందజేయాలని మెదక్ సూపరింటెండెంట్, నోడల్ అధికారికి సూచించారు. చెరువులను సందర్శించకుండానే ఏఈఈ, డీఈఈలు పంపిన అంచనాలను యథాతథంగా పంపిస్తున్నారన్న విషయాన్ని నోడల్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన మంత్రి.. ప్రతి అంచనాతోపాటు ఈఈ, ఎస్‌ఈ తనిఖీచేసిన నివేదికను జతచేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ కార్యక్రమానికి కేంద్రం నుంచి ఆర్థికసాయం పొందేందుకు కావాల్సిన నివేదికలను తయారుచేయించి, సంబంధిత సంస్థలకు సమర్పించాలని స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ మల్సూర్‌కు హరీశ్ సూచించారు. కేంద్రం నుంచి ఏఐబీపీ కింద నిధులు తెచ్చుకొనేందుకు అవసరమైన ప్రాజెక్టుల నివేదికలను జనవరిలోనే సమర్పించాలని ఈఎన్‌సీ మురళీధర్‌ను ఆదేశించారు. దేవాదుల, ప్రాణహిత, భీమా, కొమరం భీమ్ తదితర ప్రాజెక్టుల అటవీ అనుమతుల కోసం జీడీపీఎస్ సర్వేలు పూర్తిచేసి నివేదికలు పంపాలని సంబంధిత చీఫ్ ఇంజినీర్లకు సూచించారు.
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఈ సమావేశంలో మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక విద్యార్థి ఆదిత్య మిషన్ కాకతీయపై తాము చేసిన అధ్యయనం, అందించే సహకారాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి హరీశ్‌రావుకు వివరించారు. ఈ పరిశోధన కోసం యూనివర్సిటీ 50 వేల డాలర్ల సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో పూడికను రైతుల పొలాలకు తరలించడానికి సహకరిస్తామని చెప్పారు.
ఫిబ్రవరిలో యూనివర్సిటీలో జరుగనున్న గ్లోబల్ వాటర్ సింపోజియానికి ప్రత్యేక అతిథిగా అమెరికా రావాలని మంత్రిని ఆహ్వానించారు. అందుకు హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాష్, చిన్ననీటిపారుదల చీఫ్‌ఇంజినీర్లు రామకృష్ణారావు, రమేష్, జిల్లా నోడల్ అధికారులు, మంత్రి ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పీఎస్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమిష్టి కృషితోనే బంగారు తెలంగాణ -హైదరాబాద్ ఇంజినీర్స్ డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్: బంగారు తెలంగాణ సాకారం కావాలంటే, ఉద్యోగులందరూ సమిష్టిగా కృషి చేయాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణాన్ని సమయానికి పూర్తిచేసి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ నూత న సంవత్సర-2015 డైరీని జలసౌధలో మంత్రి మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహదారులు విద్యాసాగర్, ఈఎన్‌సీ మురళీధర, హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేతలు వెంకటేశం, శేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, బాలనర్సయ్య, ధర్మ, జే శ్రీనివాస్‌గౌడ్, రమేష్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, విజయ్‌కుమార్, మహేందర్ పాల్గొన్నారు.