-చెరువుల పరిరక్షణ బాధ్యత స్థానికులదే -రైతులకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తాం -మిషన్ కాకతీయలో ప్రజాప్రతినిధులు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు జలకళను సంతరించుకొని పల్లెల్లో సిరుల పంటలు పండుతాయి. పల్లెలు పచ్చగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇన్నేండ్లూ వ్యవసాయం దండగన్న పాలకులతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఇక నిత్యం పండుగే. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. రైతు ఆత్మహత్యలకు తావులేకుండా వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు పూనుకున్నారు. ఈ మహాయజ్ఞానికి ప్రతిఒక్కరూ సహకరించాలి. భావితరాలకు ఉపయోగపడేలా శాశ్వతపనులు చేసి చరిత్ర సృష్టించేంది టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే. చెరువుల పునరుద్ధరణతో ఏటా రెండు పంటలకు సాగునీరు అందించి రైతులకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తాం అని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం పలుచోట్ల చెరువు పునరుద్ధరణ పనులను ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. తొలిదశలో 9,627 చెరువులకు ఇప్పటివరకు 6,739 చెరువుల్లో పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 60 చెరువుల్లో పనులు ప్రారంభమయ్యాయి.

మిషన్ కాకతీయ రైతులకు గొప్ప వరం మిషన్ కాకతీయ రైతులకు గొప్ప వరమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట రామప్ప చెరువు పనులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. తూప్రాన్ మండలం ఇమాంపూర్ శివారులోని ఊర చెరువు పనులను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. బీడు భూములు పచ్చబడాలనే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. చెరువు మట్టిని పొలాలకు తరలించుకొని సారవంతం చేసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ మండలం దివిటిపల్లిలోని నల్లకుంట, అల్లీపూర్‌లోని మొగుళ్ల చెరువు పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం దుబ్బగూడ చెరువు పనులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, కోహెడ, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ చెరువు పనులను ప్రారంభించారు.