Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఎమ్మెల్యే కోటా.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌కుమార్

-ఖరారుచేసిన సీఎం కేసీఆర్
-నేడు నామినేషన్ దాఖలు
-ఏకగ్రీవం కానున్న ఎన్నిక
-త్వరలోనే గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం

శాసనసభ్యుల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌కుమార్ పేరును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఖరారుచేశారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌కుమార్‌కు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్.. నవీన్‌కుమార్ పేరును ప్రకటించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం ఇస్తామని చెప్పారు. నవీన్‌కుమార్ మంగళవారం తన నామినేషన్ దాఖలుచేయనున్నారు. అసెంబ్లీలో బలాలబలాల దృష్ట్యా ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. కాంగ్రెస్ పార్టీకి కనీసం నామినేషన్ల పత్రాలపై సంతకాలుచేసే సంఖ్యాబలం కూడా లేదు.

ఈ నెల 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదేరోజు అధికారికంగా నవీన్‌కుమార్ ఎన్నికను ప్రకటిస్తారు. మృదుస్వభావి, వివాదరహితుడుగా పేరున్న నవీన్‌కుమార్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో కూకట్‌పల్లిలోని ఆయన ఇంటి వద్ద అభిమానులు భారీసంఖ్యలో చేరి.. పటాకులు కాల్చి, సంబురాలు జరుపుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఈ ఎన్నిక జరుగుతున్నది.

ఉద్యమ నాయకుడు నవీన్‌కుమార్
కూకట్‌పల్లికి చెందిన కొండల్‌రావు, తిలోత్తమ దంపతులకు నవీన్‌రావు 1978 మే 15న జన్మించారు. ఆయనకు సతీమణి ధరణితోపాటు, ముగ్గురు పిల్లలు ఆశ్రిత్, అక్షర, అక్షిత్ ఉన్నారు. హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్‌లో పాఠశాల విద్య, ఉప్పల్ లిటిల్‌ఫ్లవర్ కాలేజీలో ఇంటర్మీడియట్, బద్రుకా కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఉస్మానియావర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. భవన నిర్మాణరంగంలో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న ఆయన మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ, టీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన తాత రామచందర్‌రావు గతంలో మంత్రిగా పనిచేశారు. మేనమామ సుదర్శన్‌రావు టీఆర్‌ఎస్ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో విద్యార్థి దశ నుంచే ఆయనకు రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసిన మేనమామ సుదర్శన్‌రావు తరపున చురుకుగా ప్రచారం నిర్వహించారు.

2016లో నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 14 డివిజన్లలో ప్రచారాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి.. టీఆర్‌ఎస్ పార్టీ అఖండ విజయం సాధించడంలో తనవంతు పాత్ర పోషించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 22 నియోజకవర్గాల్లో కేటీఆర్ నాయకత్వంలోని కోర్‌కమిటీలో సభ్యుడిగా ఉండి.. పార్టీ విజయానికి కృషిచేశారు. పార్టీ బహిరంగసభలు, ప్లీనరీలు, సమావేశాలు ఏవి జరిగినా.. అంతర్గతంగా కీలకపాత్ర పోషిస్తున్నారు. వ్యాపారం, రాజకీయాలతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో తన సొంత ఖర్చులతో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.