రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నిక ప్రచార పర్వంలో టీఆర్‌ఎస్ దూసుకుపోతున్నది. అధికారంలోకి వచ్చిన తొలిసారిగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తున్నది. టీఆర్‌ఎస్ ప్రచారంతో మిగతా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడిపోయారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఓవరాల్ ఇన్‌చార్జిగా, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మూడు జిల్లాలకు చెందిన మంత్రులు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

-దూసుకెళ్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దేవీప్రసాద్ -ఆరు జిల్లాల్లో నియోజకవర్గాల్లో రంగంలోకి దిగిన మంత్రులు -పట్టభద్రులున్న ప్రతిచోట మద్దతు సాధిస్తున్న అభ్యర్థులు -చివరి మూడు రోజుల్లో భారీ రోడ్‌షోలకు ఏర్పాట్లు హైదాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి జంటనగరాల్లో కలియదిరుగుతున్నారు. భారీ రోడ్‌షోకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.
టీఆర్‌ఎస్‌కు అనూహ్య స్పందన వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు ముగించుకున్నారు. సోమవారం నల్లగొండ జిల్లా హాలియాలో రోడ్‌షో నిర్వహించారు. తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య నాగార్జునసాగర్‌లో సమావేశం నిర్వహించారు. సాయంత్రం మిర్యాలగూడలో సమావేశానికి మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. హైదరాబాదు-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి దేవీప్రసాద్ జంటనగరాలపై దృష్టి సారించారు. సోమవారం తెలంగాణ పెన్షనర్ల సంఘం, సీనియర్ సిటజన్ల సంఘం దేవీప్రసాద్‌కు మద్దతు ప్రకటించింది.
దేవీప్రసాద్‌కు పెన్షనర్ల సంఘం మద్దతు.. టీఆర్‌ఎస్‌లోకి ఏవీఎన్ రెడ్డి సైదాబాద్ ఎస్‌బీహెచ్ కాలనీ పద్మావతి కల్యాణమండపం,లక్ష్మీనగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ హాల్, సరస్వతినగర్ సంక్షేమ సంఘం కార్యాయంలో సోమవారం సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు దేవీప్రసాద్‌ను గెలిపించుకుంటామని ప్రతిజ్ఞచేశారు. దేవీప్రసాద్ విజయం కోసం కృషిచేస్తామని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు హెచ్ రాములు తెలిపారు.
తెలంగాణ ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జీ నర్సింగ్‌రావు కూడా దేవీప్రసాద్‌కుకు ప్రకటించారు. ఉపాధి, శిక్షణశాఖ ఉద్యోగులు సెంట్రల్ ఫోరం దేవీప్రసాద్‌కు ఓట్లు వేసి గెలిపించాలని ఉద్యోగులను కోరింది. సైదాబాద్ డివిజన్ పరిధిలోని తిరుమలహిల్స్‌లో నివసముండే డీపీఎస్ విద్యాసంస్థల అధినేత ఏవీఎన్‌రెడ్డి ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరారు.
20వరకు ఎమ్మెల్సీ ప్రచార షెడ్యూల్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లేలా టీఆర్‌ఎస్ వ్యూహం ఖరారు చేసింది. ఎక్కడికక్కడ జిల్లాల్లోని మంత్రులు, నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యేలా షెడ్యూల్ రూపొందించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల్లో ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్ జిల్లా మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్‌లో ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, 4న ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కొత్తగూడెంలో మంత్రులు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్ పాల్గొననున్నారు.
6న వరంగల్ జిల్లా వర్దన్నపేట, పాలకుర్తిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, 7న నల్లగొండ జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, 8న వరంగల్ జిల్లా భూపాలపల్లి, పరకాలలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, 9న నల్లగొండ జిల్లా దేవరకొండ, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, 10న ఖమ్మం జిల్లాలో పలుప్రాంతాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, 11న స్టేషన్‌ఘన్‌పూర్, జనగాంలో డిప్యూటీ సీఎంతో కడియం, మంత్రి హరీశ్‌రావు 12న ములుగు, నర్సంపేటలలో మంత్రి చందూలాల్, 13న నల్లగొండలో మంత్రి జగదీశ్‌రెడ్డి, 14న నల్లగొండ జిల్లా మునుగోడు, భువనగిరిలో హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, 15న వరంగల్ ఈస్ట్, వెస్ట్, వర్దన్నపేటలో కడియం , మంత్రి చందూలాల్, 16న యాదగిరిగుట్ట, తుంగతుర్తిల్లో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి హాజరుకానున్నారు.
18న ఖమ్మం, 19న వరంగల్, 20న నల్లగొండలో భారీ రోడ్‌షోల్లో హరీష్‌రావుతో పాటు జిల్లాల మంత్రులు పాల్గొననున్నారు. ప్రచార సమన్వయకర్తగా రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. దేవీప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం: దేవీప్రసాద్‌ను భారీమెజార్టీతో గెలిపించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్వీ మంగళవారం నుంచి 18 వరకు ప్రణాళిక రూపొందించింది. మంగళవారం సైఫాబాద్ పీజీ కాలేజీ, 5న నిజాం కాలేజీ, 7న దోమలగూడ ఏవీ కాలేజీ, 9న సికింద్రాబాద్ పీజీ కాలేజీ, 11న కూకట్‌పల్లి జేఎన్‌టీయూ, 13న కోఠి ఉమెన్స్ కాలేజీ, 18న ఉస్మానియా యూనివర్సిటీల్లో సమావేశం నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 9 నుంచి టీఆర్‌ఎస్ ప్రచారం చేపట్టనుంది. 9వ తాండూర్, వికారాబాద్, 10న చేవెళ్ల, పరిగి, 12న రాజేంద్రనగర్,మహేశ్వరం, 14న ఎల్బీనగర్, 15న మల్కాజ్‌గిరి, 16న కుత్బుల్లాపూర్, 19న శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌లలో ప్రచారం కొనసాగనుంది.
తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధిచెప్పాలి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ బలపరిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, గరిడేపల్లిలో నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధిమార్గంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాత్రికిరాత్రే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే తెలంగాణకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఉద్యోగుల విభజనను అడ్డుకుంటున్న బీజేపీ, టీడీపీలు, నేడు ఎమ్మెల్సీగా ఉమ్మడి అభ్యర్థిని నిలిపారని.. పట్టభద్రులు ఆ కుట్రలను భగ్నం చేయాలన్నారు.
విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనకోసం టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాఠీదెబ్బలు తిని జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. ఎనిమిది నెలల పాలనలోనే సీఎం కేసీఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తనను గెలిపించి తెలంగాణ వ్యతిరేక పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ నేతలు బండా నరేందర్‌రెడ్డి, అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, శ్రవణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
దేవీప్రసాద్‌కు సీపీఐ మద్దతు! హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌కు మద్దతు ప్రకటించాలని సీపీఐ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అభ్యర్థి దేవీప్రసాద్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హిమాయత్‌నగర్‌లోని మగ్ధూం భవన్‌కు వెల్లి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఏ పల్లా వెంకట్‌రెడ్డి, మన తెలంగాణ ఎడిటర్ కే శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.
అనంతరం దేవీప్రసాద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చాడ వెంకట్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. దేవీప్రసాద్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందున ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో సీపీఐ నేతలకు దేవీప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థులదే విజయం: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ టీఆర్‌ఎస్ అభ్యర్థులకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు పట్టంకడుతారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో సైదాబాద్, ఐఎస్ సదన్, అక్బర్‌బాగ్ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఖాజాగూడలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబుబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి దేవీప్రసాద్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపడుతున్నారన్నారు. సకల జనుల సమ్మె ద్వారా కేంద్రానికి సత్తా చూపించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దేవీప్రసాద్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేవీప్రసాద్‌ను ఎమ్మెల్సీ గెలిపించుకోవడంతో రాష్ర్టాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరింతగా పెరుగుతుందన్నారు. రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన దేవీప్రసాద్‌ను గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం టీఎన్జీవో భవన్‌లో అంగన్‌వాడీ కార్మికులు దేవీప్రసాద్‌ను సత్కరించారు.
కార్యక్రమాల్లో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ మైనంపల్లి, టీఆర్‌ఎస్ గ్రేటర్ కో ర్డినేటర్ పుటం పురుషోత్తం, మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గాల అడ్‌హక్ కమిటీ సభ్యుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సతీష్‌కుమార్, రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి శంకర్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు స్వప్న, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కే రవీందర్ రెడ్డి, రేచల్, అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలు భిక్షమ్మ. నగర టీఎన్జీవోఅధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.