Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మొదటి ప్రాధాన్యం తాగునీటికే

-ప్రాజెక్టులనుంచి మంచినీటి వాడకం తెలంగాణలో ఒక హక్కు -ఈ ఏడాది చివరికి గ్రామాలకు నదీజలాలు -రిజర్వాయర్లలో కనీస నీటివినియోగమట్టాలు -మిషన్ భగీరథ కోసం 30 రిసోర్స్‌పాయింట్లు -కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యేదాకా వీటినుంచే నీరు -కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయ్యాక మంచినీటికి శాశ్వత ప్రణాళిక -నీటిపారుదలశాఖతో సమన్వయానికి మిషన్ భగీరథలో ప్రత్యేక అధికారి -వికారాబాద్ అడవుల్లో ఔషధమొక్కలు పెంచాలి -సంచార పశువైద్యశాలలు సిద్ధంచేయండి -ఈ నెల 18 నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్

నదీజలాల వినియోగంలో తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది చివరినాటికి అన్ని గ్రామాలకు నదీ జలాలు అందించాలని చెప్పారు. తాగునీటికి రిజర్వాయర్లలో 10% నీటిని రిజర్వు చేస్తున్నందున అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస నీటి వినియోగమట్టాలను పాటించాలని, అవసరమైనదానికంటే అదనంగా 25% జలాలను తాగునీటి అవసరాలకోసం నిల్వ ఉంచుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథకు నీటి సరఫరాపై ప్రగతిభవన్‌లో సోమవారం నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఒక్క రోజుకూడా మంచినీటి సరఫరా ఆగొద్దు ప్రతి ఇంటికి ప్రతిరోజూ నిరంతరాయ మంచినీటి సరఫరాకోసం మిషన్ భగీరథ అనే బృహత్తర కార్యక్రమం తీసుకున్నాం. ఒకసారి మంచినీరు ఇవ్వడం ప్రారంభమయిన తర్వాత ఒక్కరోజు కూడా సరఫరా ఆపలేము. ఆపవద్దు కూడా. ఇందుకోసం నదీజలాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలి. దీనికోసం ప్రాజెక్టుల్లో ఎండీడీఎల్ నిర్వహించాలి. ప్రాజెక్టుల్లో నీరు ఉండగానే సరిపోదు. అవసరమైనప్పుడు విడుదల చేసుకోవడానికి అనువుగా ఉండేలా నీటిని నిల్వ ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మంచినీటి కొరత లేకుండా చూడగలం. మిషన్ భగీరథకోసం 30 పాయింట్లను మనం రిసోర్సులుగా పెట్టుకున్నాం. ఏ రిసోర్సు వద్ద ఏడాదికి ఎన్ని నీళ్లు అవసరమో అంచనావేసి, అందుకు 25% అదనంగా నీరు ఉంచుకోవాలి. ప్రాజెక్టులవారీగా చార్ట్ రూపొందించి ఉత్తర్వులు జారీచేయాలి. తదనుగుణంగా ప్రాజెక్టులకు ఆపరేషనల్ రూల్స్ రూపొందించాలి. దీనికోసం నీటిపారుదల, మి షన్ భగీరథ అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించుకోవాలి అని సీఎం సూచించారు.

మంచినీటిని వాడుకోవడం హక్కు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలో కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. వీటిలో 10% జలాలను మంచినీటికి రిజర్వుచేస్తున్నాం. కాబట్టి ప్రాజెక్టుల నీటిని మంచినీటిగా వాడుకోవడం తెలంగాణ రాష్ట్రంలో ఒక హక్కుగా ఉంటుంది. కాళేశ్వరంతోపాటు ఇతర కొత్త ప్రాజెక్టులు పూర్తయితే చాలా నీరు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్‌లాంటి వనరులు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు మిషన్ భగీరథ నీటిని అందించడానికి ప్రస్తుత వనరులనే వాడాలి. వాటినుంచే నీటిని అందించాలి. ఇందుకోసం మొదటి దశ ప్రణాళిక సిద్ధంచేసుకోవాలి. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత శాశ్వత ప్రణాళిక సిద్ధంచేసుకోవాలి. ఈ ఏడాది చివరికే నదీ జలాలను గ్రామాలకు అందించాలి. అందుకోసం మొదటి దశ ప్రణాళికను అమలుచేయాలి. నీటిపారుదల శాఖతో సమన్వయం కోసం మిషన్ భగీరథ అధికారిని ప్రత్యేకంగా నియమించాలి అని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ నాగేందర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, మిషన్ భగీరథ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, సీఈ జగన్‌మోహన్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

సంచార పశు వైద్యశాలలు సిద్ధం చేయండి రాష్ట్రవ్యాప్తంగా సంచార పశు వైద్యశాలలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే వాటిని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. పెద్దఎత్తున రాష్ర్టానికి వచ్చిన గొర్రెలతోపాటు ఇతర పశువులకు కూడా ఎక్కడికక్కడే వైద్యం అందించడానికి ఈ సంచార పశు వైద్యశాలలను ఉపయోగించాలని చెప్పారు.

కలెక్టర్ల పర్యవేక్షణలో బతుకమ్మ చీరెల పంపిణీ బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేదలందరికీ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చెప్పారు. ఇప్పటికే సగానికిపైగా చీరెలు జిల్లా కేంద్రాలకు చేరాయని, రాబోయే రెండు మూడు రోజుల్లో మిగతావి కూడా చేరుతాయని అధికారులు సీఎంకు తెలిపారు. జిల్లాలకు చేరిన చీరెలను గ్రామాలకు చేర్చాలని, 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు పంపిణీ చేయాలని కలెక్టర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.