Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మోదీ.. గిదేంది?

-తెలంగాణ ఆత్మగౌరవానికి ఢిల్లీ అమర్యాద
-నేడు హైదరాబాద్‌కు ప్రధానమంత్రి మోదీ రాక
-సీఎం స్వాగతం పలుకుతారని చెప్పిన ప్రభుత్వం
-సీఎం రానక్కర్లేదంటూ సీఎస్‌కు పీఎంవో ఫోన్‌
-ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతి
-సంప్రదాయానికి విరుద్ధంగా కేంద్ర సర్కారు తీరు
-వస్తున్నది ప్రధానమంత్రా, బీజేపీ నాయకుడా?
-ఇది అధికారిక పర్యటనా.. పార్టీ పర్యటనా?

రాష్ర్టానికి దేశ ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రి స్వాగతం పలుకడం సంప్రదాయం. ఇందుకు భిన్నంగా తనకు స్వాగతం పలుకడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానవసరం లేదని ప్రధాన మంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపించింది. తద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అగౌరవపరిచింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హృదయ సమ్రాట్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల అమర్యాదకరంగా వ్యవహరించింది. ప్రొటోకాల్‌ ప్రకారం స్వాగతించడానికి వస్తానని కేసీఆర్‌ సంసిద్ధత వ్యక్తం చేసినా తిరస్కరిస్తూ.. ఐదుగురు అధికారులు మాత్రమే రావాలంటూ ఆదేశించడం ఏమి మర్యాద? రాష్ర్టాల పట్ల కేంద్రం వ్యవహరించే సమాఖ్య స్ఫూర్తి ఇదేనా? ఏ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఏండ్ల తరబడి ఉద్యమం చేయాల్సి వచ్చిందో.. అదే ఆత్మగౌరవాన్ని మోదీ ఇవాళ అగౌరవపరిచారు.

ఆత్మగౌరవం కోసమే ఆరు దశాబ్దాలపాటు పోరాటంచేసి సాధించుకొన్న సొంత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపర్చేలా వ్యవహరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటనకు రానున్న సమయంలో అనుసరించాల్సిన సంప్రదాయాలకు కేంద్రం ఈసారి తిలోదకాలు ఇచ్చింది. సహజంగా ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్‌, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు విమానాశ్రయం వద్దే స్వాగతం పలుకుతారు. ఈసారి కూడా అలాగేచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాని కార్యాలయానికి సమాచారమిచ్చింది. దీనికి స్పందనగా పీఎంవో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది. ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్‌.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పారు. అంతేకాకుండా ప్రధానమంత్రికి స్వాగతం చెప్పడానికి ఐదుగురికి మాత్రమే పీఎంవో అవకాశమిచ్చింది. హకీంపేట ఎయిర్‌ ఆఫీస్‌ కమాండెంట్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతామొహంతి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మాత్రమే రావాలని పీఎంవో ఆదేశాలు పంపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది. గతంలో ఏ ప్రధాని ఐనా రాష్ట్రాల్లో అధికారిక పర్యటనకు వస్తే గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం చెప్పేవారు. కానీ ఈ సారి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయం వారించడం విశేషం. పీఎంవోనుంచి గతంలో ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ రాలేదని, ఇలా ఎందుకు చేశారో అర్థంకావడం లేదని సీనియర్‌ అధికారులు వ్యాఖ్యానించారు.

మోదీ పర్యటన మతలబు ఏమిటి?
అసలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం వాడిగా వేడిగా సాగుతున్న తరుణంలో ప్రధాని హఠాత్తుగా హైదరాబాద్‌ పర్యటన పెట్టుకోవడంపై రాజకీయ వర్గాల్లో ముందే కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ అగ్రనేతలంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారుచేసే వ్యాక్సిన్‌ పురోగతిని పరిశీలించేందుకని ప్రధాని ఇప్పుడు పర్యటన పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు ముఖ్యమంత్రిని తన పర్యటనకు దూరంగా ఉంచడం వారిని నివ్వెరపరిచింది. మోదీ ప్రధాని హోదాలో ఇక్కడికి వస్తున్నారా.. లేక బీజేపీ నేతగా ఇక్కడకు వస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించారు. ‘భారత్‌ బయోటెక్‌ సహా హైదరాబాద్‌లో ఫార్మా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, కల్పించిన మౌలిక సదుపాయాలే కారణం. అందువల్లే ఇవాళ మొత్తం దేశానికి.. చివరికి ప్రపంచానికి సైతం.. వ్యాక్సిన్‌ అందించే సామర్థ్యాన్ని సంతరించుకొన్నది. దీన్ని విస్మరించి వ్యాక్సిన్‌ పురోగతి పరిశీలన పేరుతో క్రెడిట్‌ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకునేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఏ పాత్రా లేదని చాటిచెప్పాలన్నట్టుగా వారి వ్యవహారశైలి ఉన్నది’ అని ఆ రాజకీయ పరిశీలకుడు విశ్లేషించారు.

వ్యాక్సిన్‌ పురోగతిపై ప్రధాని పరిశీలన
కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను పరిశీలించేందుకు ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌ రానున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి జీనోమ్‌వ్యాలీలో ఉన్న భారత్‌బయోటెక్‌ క్యాంపస్‌కు చేరుకొని వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను పరిశీలిస్తారు.

సెకండ్‌వేవ్‌పై అప్రమత్తం
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సెకండ్‌వేవ్‌ను అడ్డుకునేందుకు ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. వైరస్‌ లక్షణాలు లేకుండానే నిర్ధారణ అవుతున్నవారు దాదాపు 70 శాతానికి పైగానే ఉంటున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా గుర్తించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 1,096 వైరస్‌ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటుచేశామని, ఇక్కడికి రాలేని వారి కోసం ప్రజల వద్దకే వెళ్లి టెస్టులు చేయాలని ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.