Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మోదీ..హైదరాబాద్‌కు ఏంచేశావ్?

-ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నరు?
-ఎన్నికలప్పుడే హిందూ-ముస్లిం.. ఇండియా-పాక్
-మూడొందలు కాదు.. రాష్ట్రంలో మూడుసీట్లలో డిపాజిట్ తెచ్చుకోండి
-ఢిల్లీలో 16 మంది బలం ఉంటే ఏదైనా చేయొచ్చు
-ముషీరాబాద్, అంబర్‌పేట ఎన్నికల ప్రచారంలో కేటీఆర్
-సాయికిరణ్ గల్లీలో సేవకుడు, ఢిల్లీలో సైనికుడిగా పనిచేస్తాడని వెల్లడి

ఐదేండ్ల పాలనలో ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ఒక్క పనీచేయకుండా కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ తన పాలనలో రాష్ర్టానికి ఏం చేశారో చెప్పకుండా కేవలం కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ముషీరాబాద్, అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి తాను గెలిస్తే కేంద్రంలో మంత్రినవుతా అని చెప్పుకుంటున్నారని.. ముందుగా దత్తాత్రేయను మంత్రిపదవి నుంచి ఎందుకు తీసేశారో చెప్పాలని అన్నారు.

అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారం పెడతానన్న చందంగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోళ్లు మళ్లీ అధికారం ఇస్తే చేస్తానంటే నమ్ముదామా? మరోసారి మోసపోదామా? అని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. జాతీయపార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, పదహారుమంది ఎంపీలను కేసీఆర్‌కు అప్పజెప్పి ఢిల్లీని శాసిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఎలాంటి చిన్న పంచాయతీ కూడా లేకుండా ఉన్నామని.. ఎన్నికలు రాగానే కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే పరిస్థితికి ప్రధాని మోదీ దిగజారడం సిగ్గుచేటన్నారు. ఈ నెల 11న సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ను గెలిపిస్తే గల్లీలో సేవకుడిగా..ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా పనిచేస్తాడని చెప్పారు.

ఢిల్లీలో బలంఉంటే ఏదైనా చేయొచ్చు
ఐదేండ్ల క్రితం కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి ఒక్కమాట చెప్పకుండా ప్రధాని మోదీ తెలంగాణలోని ఏడు మండలాలను తీసుకపోయి ఆంధ్రలో కలిపారని కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు చేతిలో ఎంపీలు ఉన్నారు కాబట్టే తెలంగాణ ప్రాంతాలను ఆంధ్రలో కలిపారని.. ఎంపీల బలం ఉంటే ఢిల్లీలో ఏమైనా చేయొచ్చని అనడానికి ఇదో ఉదాహరణ చెప్పారు. తెలంగాణ నుంచి పొరపాటున కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీ, మోదీ ఏం చెపితే ఆదే చేస్తారే తప్ప తెలంగాణ కోసం ఏం చేయరని అన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిఏటా పన్నుల రూపంలో రూ.50 వేల కోట్లు కడుతున్నామని, ఐదేండ్లలో 2.50 లక్షల కోట్లు చెల్లించామని.. కానీ కేంద్రం నుంచి ఐదేండల్లో మనకు వాపస్ వచ్చింది రూ.1.20 లక్షలవేల కోట్లు మాత్రమేనని వివరించారు. గత ఎన్నికల్లో బండారు దత్తాత్రేయను గెలిపిస్తే కేంద్ర మంత్రిగా పనిచేసినా.. హైదరాబాద్‌కు ఆయన ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.

మతం పేరుతో చిచ్చుపెట్టొద్దు
అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి మసీదు, రామమందిరం గుర్తుకు రాదని.. ఎన్నికలు రాగానే హిందూ- ముస్లిం, ఇండియా- పాకిస్థాన్ అంటూ ప్రజలను రెచ్చగొడతారని కేటీఆర్ విమర్శించారు. మతం పేరిట చిచ్చు పెట్టే పార్టీల వైపు ప్రజలు ఆలోచించాల్సిన అక్కర్లేదని స్పష్టంచేశారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌కు 36 వేల మెజార్టీ వస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు మొత్తం వచ్చిన ఓట్లు 30వేలు మాత్రమేనని.. అలాంటి నాయకుడు.300 సీట్లు తీసుకొస్తామని అంటుండడం వింతగా ఉన్నదన్నారు..రాజకీయాల్లో సన్యాసం కాదు ముందుగా తెలంగాణలో మూడు సీట్లలో డిపాజిట్లు తెచ్చుకుని చూపించు అని ఎద్దేవాచేశారు. మూసీ సుందరీకరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థను మరింత బాగుపర్చేందుకు రూ.11 వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సలీం, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎన్నికల పరిశీలకులు రాంబాబు యాదవ్, టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకుడు పాటిమీది జగన్మోహన్‌రావు, గ్రేటర్ టీఆర్‌ఎస్వీ నాయకులు కిశోర్ గౌడ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

నేడు సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో రోడ్‌షోలు
కేటీఆర్ శుక్రవారం సికింద్రాబాద్, సనత్‌నగ ర్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో కలిసి తలసాని సాయికిరణ్‌యాదవ్‌కు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొంటారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.