Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మోదీ పార్టీ ఏమని ఓట్లు అడుగుతది!

టీఆర్‌ఎస్‌లోకి వలసల వరద కొనసాగుతూనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ పార్టీలనేతలు టీఆర్‌ఎస్ దారిపట్టారు. మంగళవారం అంబర్‌పేట, మల్కాజిగిరి, ఖైరతాబాద్, గోషామహల్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు వందలమంది గులాబీ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌కు తరలివచ్చినవారికి మంత్రులు కేటీ రామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గ్రేటర్‌పార్టీ అధ్యక్షులు మైనంపల్లి హన్మంతరావు గులాబీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పాలనపై నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని గ్రేటర్ ప్రజలను ఓట్లు అడుగుతారని నిలదీశారు. కేసీఆర్ పాలనతోపాటే కేంద్రంలో మోదీ పాలనకు 18 నెలలు నిండాయని గుర్తుచేశారు. మరి మోదీ ఈ కాలంలో ప్రజలకు చేసింది ఏమిటో బీజేపీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు. -ప్రధానిగా హైదరాబాద్ గడ్డమీద అడుగు పెట్టారా -ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు ఓట్లడుగుతారు -ఉపఎన్నికల్లో కేసీఆర్‌కు బ్రహ్మరథం.. మోదీకి పరాభవం -కాంగ్రెస్, బీజేపీల మీద నిప్పులు చెరిగిన కేటీఆర్

KTR-addressing-during-the-Joinings-of-other-party-members--in-TRS-party

కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్ అందిస్తున్నామని, 38 లక్షలమందికి 4,400 కోట్లమేర పింఛన్లను అందిస్తున్నామని, పేదవారికి సరిపడినన్ని బియ్యం ఇస్తున్నామని, పేదలు ఆత్మగౌరవంతో ఉండేలా డబుల్ బెడ్‌రూంల ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్ళికి 51వేల ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. సీఎం మనుమడు ఎలాంటి సన్నబియ్యం తింటున్నాడో హస్టళ్ళల్లో పేద విద్యార్థులు అలాంటివే తినాలన్న లక్ష్యంతో సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలుతో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పడుతుంటే, మోదీని ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు.

18నెలల కాలంలో మెదక్, కంటోన్మెంట్, వరంగల్ తదితర స్థానాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడితే, మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వీపు పగలకొట్టారని గుర్తుచేశారు. ఢిల్లీలో చిత్తుచిత్తుగా ఓడిస్తే, బీహర్ ప్రజలు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని, ఇక ఆయన స్వంత రాష్ట్రంలోసైతం నీపాలన బాగాలేదని గుజరాత్ ప్రజలు సైతం ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 40 దేశాల్లో తిరిగిన మోదీ దేశంలోని రాష్ర్టాలను మాత్రం మరచిపోతున్నారని అన్నారు. తెలంగాణ ఆయన పాలన పరిధిలోకి రాదా? అని నిలదీశారు. 18 నెలల్లో హైదరాబాద్ గడ్డ మీద ఎప్పుడైనా కాలుపెట్టారా? హైదరాబాద్ ప్రజలు మోదీని ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు.

ఈ గడ్డమీద అడుగుపెట్టని ప్రధానికి చెందిన పార్టీవారు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని అన్నారు. అసలు ఈయన ఏం ప్రధానో అర్థం కావడం లేదన్నారు. ఆయన చేసింది రెండే పనులు.. ఒకటి స్వచ్ఛభారత్ అని అందరికీ చీపుర్లు చేతికిచ్చి మీ బస్తీలను మీరే ఊడ్చుకొండని చెప్పడం. రెండవది జనధన్ పథకంలో మీ డబ్బులతో మీరే అకౌంట్లు ప్రారంభించుకోమని చెప్పడం అని ఎద్దేవా చేశారు. ఆ ఖాతాలో ఆయన పైసలు వేసేదీ లేదు, ఇచ్చేదీ లేదని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో నగర పారిశుధ్యం ఎలా ఉండాలో నేర్పిందే కేసీఆర్ అని గుర్తుచేశారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం చెత్త సేకరణకు ఇంటింటికి రెండు బుట్టలు, రెండువేల ఆటోలు సమకూర్చి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్న ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చి స్వచ్ఛ భారత్ అంటే సరిపోదని గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ వస్తే ఇక్కడున్న సీమాంధ్ర వాసులతోపాటు మార్వాడీలను, పంజాబీలను, సింధీలను వెళ్ళగొడతారని వదంతులు లేపి నీరుగార్చే ప్రయత్నం చేశారని,అప్పటి ఉమ్మడి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే తెలంగాణవస్తే హైదరాబాద్ అంధకారమేనని భయాందోళనలకు గురిచేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇవాళ వాళ్ళ నోళ్ళు మూతపడేలా హైదరాబాద్‌లో సానుకూలమైన పరిస్థితిని కేసీఆర్ సృష్టించారని అన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు కరువైతాయని అన్నవారికి బుద్ధిచెప్పేలా చిన్న ఘర్షణ లేకుండా పాలన సాగుతున్నదని చెప్పారు. మీకు పాలించే తెలివి ఉందా అని హేళన చేసినవారి కళ్ళు బైర్లుకమ్మేలా దేశంలోనే గొప్పపాలన తెలంగాణలో జరుగుతున్నదని అన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిపై కాంగ్రెస్ నేత దానం నాగేందర్ చేసిన వాఖ్యలపట్ల కేటీఆర్ నిప్పులుచెరిగారు. అందరూ ఎంతో గౌరవించే పెద్దమనిషిని పట్టుకుని పంచె ఊడదీసి కొడతామని వాఖ్యానించడం దానం కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఇకపై హైదరాబాద్‌లో దానం గూండాగిరిని నడవనీయమని అన్నారు. ఎవరి సత్తా ఏంటో గ్రేటర్ ప్రజలే తేలుస్తారని, అందుకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. గ్రేటర్‌లో ఇప్పటివరకు వచ్చిన సర్వేల ప్రకారం టీఆర్‌ఎస్ 75నుంచి 80స్థానాలలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

అన్ని దారులు టీఆర్‌ఎస్ వైపే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ దారులన్నీ టీఆర్‌ఎస్‌ వైపు మళ్లున్నాయని అన్నారు. గ్రేటర్‌లో ఎక్కడ చూసినా గులాబీ జెండా తప్ప ఏదీ కనిపించడం లేదని చెప్పారు. ఇప్పటికే సింగూర్, హిమాయత్‌సాగర్, గండిపేట, ఉస్మాన్‌సాగర్‌లు ఎండిపోయాయని, పరిస్థితిని ముందే గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి, కృష్ణా పనులను వేగవంతంచేసి నగరానికి నీరు తీసుకొచ్చారని అన్నారు. దానం తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలన్నారు. అసలు నిన్ను టీఆర్‌ఎస్‌లోకి పిలిచిందెవరు, నీవే కేటీఆర్, కేకే, డీఎస్‌లను కలిసి, ఫ్లెక్సీలు తయారుచేసుకుని తర్వాత వెనక్కివెళ్ళి నీ పార్టీలో నమ్మకం కలిగించడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం సమంజసమా? అని ప్రశ్నించారు. సభకు అధ్యక్షత వహించిన గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షులు మైనంపల్లి మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన బంగారు తెలంగాణ సాధనకు వివిధపార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ సీతారాంనాయక్, టీఆర్‌ఎస్ నేతలు పుటం పురుషోత్తం, కపిల్‌రాజ్, బద్దం పరశురాంరెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, ఎడ్ల సుధాకర్‌రెడ్డి, గజ్జెల నగేష్, ప్రేమ్‌కుమార్ దూత్, ఏకే మురుగేష్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. దుర్గాప్రసాద్‌రెడ్డి, మామిడి లక్ష్మీ, నర్సింగరావు, బాల్‌లింగం, బన్వర్‌లాల్ జైన్, శ్యాంకుమార్, వినయ్‌కుమార్, అశోక్‌లతోపాటు వందల సంఖ్యలో స్థానిక నేతలు, కార్యకర్తలు మంత్రుల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.