ప్రస్తుతం కేసీఆర్ అంటే జాతీయస్థాయి నాయకులు, ప్రధాని అభ్యర్థులు నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీకి భయం పట్టుకుందని సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్కు తిరుగులేకపోవడంతో మిగతాపార్టీల నేతల్లో దడ మొదలైందన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, చిగురుమామిడి, హుస్నాబాద్ మండలం రామవరంలో ఆయన ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొని ప్రసంగిచారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

-టీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కాపీకొట్టిన రాహుల్ -కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తారు – మోడీకి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లే -టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ: హరీశ్‌రావు
వరంగల్‌లో రాహుల్‌గాంధీ టీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కాపీకొట్టారని ఆరోపించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ చైనాలో తయారవుతున్నాయని, అవన్నీ తెలంగాణలోనే తయారుకావాలని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం మంచిదేనన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నాయకత్వం మెడిన్ తెలంగాణే కావాలని, ఢిల్లీ నాయకులు, ఆంధ్రా నాయకుల నాయకత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు.
తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయ్యిందని, మోడీని చంకన పెట్టుకొని చంద్రబాబు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మరోమారు వస్తున్నాడని హెచ్చరించారు. మోడీకి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లేనన్నారు. తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగులెందుకని, ఆప్షన్లు వద్దంటున్న పార్టీ టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆప్షన్లు ఇస్తారని, తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగులపాలన సాగిస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు ఓటేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి, ప్యాకేజీలు, నిధులు, రాయితీలు మాత్రం ఆంధ్రాకు ఇచ్చిందన్నారు. ఇక్కడి ప్రజల సమస్యలు తీరాలంటే ఎంపీగా వినోద్‌కుమార్, ఎమ్మెల్యేగా సతీష్‌కుమార్ గెలువాలన్నారు. రెండు ఓట్లు టీఆర్ఎస్కు వేసి గెలిపించాలని కోరారు.