Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మోదీది మాటల సర్కార్‌

-మోదీది మాటల సర్కార్‌
-ప్రజల సంక్షేమం పట్టని కేంద్రం
-హస్తినలో రాజకీయ శూన్యత
-పాకిస్థాన్‌ను బూచిగా బీజేపీ రాజకీయం
-అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా మాట్లాడాలి
-టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో సీఎం కేసీఆర్‌

కేంద్రంలో రాజకీయ శూన్యత ఉన్నదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మోదీ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం మాటల ప్రభుత్వమే తప్ప.. చేతల ప్రభుత్వం కాదన్నారు. బీజేపీకి ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలి? తమ ప్రభుత్వాన్ని ఎలా తీసుకొచ్చుకోవాలనే ఆలోచనే ఉంటుందని మండిపడ్డారు. మన కు రావాల్సిన జీఎస్టీ పరిహారంతో పాటు సాధారణం గా ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదని గుర్తుచేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో కలిసొచ్చే పార్టీలతో సమిష్టిగా ప్రజాసమస్యలపై పోరాటంచేయాలని పార్టీ ఎంపీలను ఆదేశించారు. అనేక అంశాల్లో విఫలమైన కేంద్రాన్ని నిలదీయాలన్నారు. దేశాన్ని అభివృద్ధిచేయడంలో కాంగ్రెస్‌, బీజేపీ రెండూ విఫలమయ్యాయని తెలిపారు. ఆ పార్టీలకు నినాదాలు తప్ప, ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్టదని పేర్కొన్నారు. గతంలో ప్లస్‌ 6 జీడీపీ వృద్ధిరేటు ఉండగా ఇప్పుడది మైనస్‌ 24కు పడిపోయిందని, 30 శాతం జీడీపీ వృద్ధి రేటు తగ్గింది అంటే దేశం ఎంతగా వెనకబడిందో అర్థం చేసుకోవచ్చన్నారు. బీజేపీ పాకిస్థాన్‌ను బూచీగా చూపించి రాజకీయాలు చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యం చెందిందని, తాము గెలిచిన రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూడా కాపాడుకునే స్థితిలో ఆ పార్టీ లేదన్నారు. గెలువని రాష్ర్టాల్లో కూడా బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తున్నదని సీఎం తెలిపారు. దేశంలో రాజకీయ శూన్యత స్పష్టంగా ఉన్నదని చెప్పారు. 193 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్‌ అంతగా అభివృద్ధి చెందితే వేల కిలోమీటర్ల తీరాన్ని కలిగి ఉన్న భారతదేశం ఎంత అభివృద్ధి చెందాలో ఆలోచించాలని అన్నారు.

కరోనాతో తీవ్ర ఇబ్బందులు
కరోనాతో ప్రభుత్వం, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనాపై మొదట్లో కేంద్రం అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వాస్తవంగా ఎక్కడి ప్రజలు అక్కడికి వెళ్లడానికి నాలుగురోజులు సమయమిచ్చిన తర్వాత లాక్‌డౌన్‌ పెడుదామని తాను కేంద్రానికి సూచించినా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో ప్రజలు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయి ఇక్కట్లను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పారు. కరోనాతో ప్రభుత్వాల ఆదాయం తీవ్రంగా పడిపోయిందని, ప్రజల ఆదాయం కూడా తగ్గిందన్నారు. రాష్ర్టానికి నెలకు రూ.12-15వేల కోట్ల ఆదాయం వచ్చేదని, లాక్‌డౌన్‌లో ఒక నెల రూ.326 కోట్లు మాత్రమే వచ్చిందని తెలిపారు. దీంతో ప్రభుత్వం వేసుకున్న అనేక అంచనాలు తప్పే పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారాన్ని కూడా ఇవ్వడంలేదని గుర్తుచేశారు.

వ్యవసాయం బ్రహ్మాండం
వ్యవసాయ రంగాన్ని తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నదని, రాష్ట్రంలో ఇప్పటికే 1.40 కోట్ల ఎకరాల్లో పంట సాగయ్యిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 50 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి, 10.50 లక్షల ఎకరాల్లో కందులు సాగయ్యాయని చెప్పారు. కరోనా ఉన్నా.. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి పంటను కొన్నామని గుర్తుచేశారు. ఇప్పటికే చేపట్టిన అనేక ప్రాజెక్టుల నిర్మాణపనులు తుదిదశకు చేరాయన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి అయితే అన్ని ప్రాజెక్టులు పూర్తి అయినట్లేనని అన్నారు. అభివృద్ధికి సూచికగా భావించే విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని తెలిపారు. మన రాష్ట్రం నూటికి నూరుశాతం ఇంటింటికి నల్లా ఇచ్చిందని కేంద్ర జల్‌శక్తి శాఖనే ప్రకటించిందని సీఎం గుర్తుచేశారు.

పల్లెల దశ మారింది
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతి తండాను గ్రామ పంచాయతీగా మార్చుకున్నామని, 12,751 గ్రామపంచాయతీల సమగ్ర స్వరూపం మారిపోయిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. పచ్చదనం ప్రకృతివనాలు, రోడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రగతి, ఇంటింటికి నల్లా నీరు, ట్రాక్టర్లు ఇలా అనేక రకాలుగా మార్పులు తీసుకువచ్చామన్నారు. దీంతో వాటి సమగ్ర స్వరూపమే మారిపోయిందన్నారు. వీటన్నింటిపై గ్రామాల్లో చర్చపెట్టాలని, ప్రజల్లో అవగాహన తీసుకొనిరావాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

అసెంబ్లీలో అందరూ మాట్లాడాలి
అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులైనా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రజలు మా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏం ప్రశ్న అడుగుతున్నాడనేది చూస్తారని, కాబట్టి ప్రతి ఎమ్మెల్యే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సెంట్రిక్‌గానే పోతుందని, ఇకపై అదే విధం గా ఉంటుందన్నారు. నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులు, ఇతరులు వాళ్లకు తెలియకుండా జోక్యం చేసుకోవద్దని, జోలికి వెళ్లవద్దని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మంత్రులు పాల్గొన్నారు.

కొత్తగా దళిత జ్యోతి పథకం
దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ఉన్నా ఇంకా వారు అనుకున్నంత అభివృద్ధి సాధించడంలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం దళిత జ్యోతి కార్యక్రమాన్ని అమలుచేద్దామని, దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకసారి సమావేశమై ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక గొర్రెలు ఉన్నాయని కేంద్రం చెప్పిందన్నారు. మరో విడత గొర్రెల పంపిణీకి కూడా చేపడుతున్నామన్నారు. మాంసం, చేపలను ఎగుమతిచేసే స్థాయికి ఎదగాల్సి ఉందన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.