Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మోడీలు గీడీలు వద్దే వద్దు

రెండు ఓట్లు టీఆర్‌ఎస్‌కే వేయాలి 17 సీట్లు గెల్చుకుంటే కేంద్రం దిగివస్తుంది భ్రమలు వదిలి.. తెలంగాణను బాగుచేసుకుందాం ఆంధ్ర ఉద్యోగులు వెళితేనే మన పిల్లలకు ఉద్యోగాలు ఫ్లోరైడ్‌నుంచి కాపాడలేకపోయిన కాంగ్రెస్, టీడీపీ దళితుల అభివృద్ధికి రూ.50వేల కోట్లు ఇళ్లులేని వారికి మూడు లక్షల సబ్సిడీతో ఇళ్లు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీలు టీఆర్‌ఎస్‌లో చేరిన నకిరేకల్ సీపీఐ, టీడీపీ నాయకులు

Kcr21

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఉన్న కోటి ఆశలు నెరవేరాలంటే రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రెండు ఓట్లూ టీఆర్‌ఎస్‌కే వేయాలని కోరారు. కొందరు యువకులు అసెంబ్లీకి టీఆర్‌ఎస్‌కు, పార్లమెంటుకు బీజేపీకి వేద్దామన్న యోచనలో ఉన్నారన్న కేసీఆర్.. మోడీతో ఒరిగేదేమీ లేదని చెప్పారు. మనసంగతి మనమే చూసుకోవాలని అన్నారు. 17 స్థానాలు మనమే గెలిచి.. ఢిల్లీని కమాండ్ చేయాలని, అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో, ప్రాజెక్టులు కేటాయించడంలో కేంద్రం దిగివస్తుందని చెప్పారు. సోమవారం తెలంగాణభవన్‌లో నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన సీపీఐ, తెలుగుదేశం పార్టీలకు చెందిన మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడారు.

మోడీలు గీడీలు ఏమీ చేయరు: ‘ఎన్నికల్లో రెండు ఓట్లూ టీఆర్‌ఎస్‌కే వేయాలి. మనకు కోటి ఆశలున్నాయి. ప్రజల ఆశలు నెరవేరాలి. కొందరు యువకులు అసెంబ్లీ ఓటు టీఆర్‌ఎస్‌కు, ఎంపీ ఓటు మోడీకి వేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఈ మోడీలు, గీడీలు ఏమీ చేయరు. మన సంగతి మనం చూసుకోవద్దా? కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే నన్ను గెలిపిస్తే మళ్లీ రెండు రాష్ట్రాలను ఒక్కటి చేస్తా అంటున్నాడు. ముద్దుకృష్ణమనాయుడు కూడా మమ్మల్ని గెలిపిస్తే రెండింటినీ కలుపుతాం అన్నాడు. ఇంకా గోతికాడి కుక్కలా వెనకే ఉన్నారు. ఇంకా మనకు భయం ఉంది. 17 ఎంపీలను మనమే గెలవాలి. ఢిల్లీని కమాండ్ చేయాలి. అప్పుడే కేంద్రం దిగివస్తుంది. ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు. కనుక సంపూర్ణ బలం మనకే రావాలి. రెండు ఓట్లూ టీఆర్‌ఎస్‌కే వేయాలి. భ్రమలు వదిలిపెట్టాలి. ముందు తెలంగాణ బతుకు చూసుకుందాం. దేశాన్ని చూసేవారు చాలా మందే ఉన్నారు’ అని కేసీఆర్ అన్నారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామని, అనుకున్న ఫలితాలు తెచ్చుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా పనులు చేసుకోవాల్సి ఉందని, నల్గొండలో ఇంకా ఫ్లోరైడ్ రక్కసి ఉందని అన్నారు. కాంగ్రెస్ 41 సంవత్సరాలు, టీడీపీ 17 ఏళ్ల పాలనను చూశామని, అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు. కానీ ఫ్లోరైడ్ రక్కిసి మాత్రం నల్గొండ జిల్లాను వదల్లేదని చెప్పారు. లక్షలాది మంది పిల్లలు దీని బారిన పడ్డారని తెలిపారు. ‘డబ్ల్యూహెచ్‌వో అనే అంతర్జాతీయ సంస్థ ఉంది. వారు ఎవరో చెబితే పని చేయరు. ప్రపంచంలో ఎక్కడైనా ఆరోగ్య సమస్యలుంటే వచ్చి పరిశోధనలు చేస్తారు. వాస్తవానికి భూమిలోని ఫ్లోరైడ్‌ను తాగితే ఫ్లోరోసిస్ వస్తుందనుకున్నం. కానీ ఆ నీటితో పండించిన పంటలు, ఆహారధాన్యాలు తిన్నా ఇది వస్తుందని తేలింది. బైరారాండ్డి అనే రైతు 54బోర్లు వేసిండు. ఆయన పేరు చివరికి బోర్ల రాంరెడ్డిగా మారింది. ఇలా బోర్లతోనే తెలంగాణ ఎండిపోతున్నది. నల్గొండ జిల్లాలో జానెడు మందం ఫ్లోరైడ్ భూమిపై ఉంది. మిగులు జలాలతో ఫ్లోరైడ్ భూములను పారిస్తే ఫ్లోరైడ్ భూమిలోకి పోతుందని, ఇంకొంత నీళ్లలో కొట్టుకుపోతుందని డబ్ల్యూహెచ్‌వో పరిష్కారం చెప్పింది. లేకుంటే ఇది ప్రజలు నివసించలేని ప్రాంతంగా మారుతుందని చెప్పింది. అయినా ఇక్కడ ప్రాజెక్టులు కట్టరు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నవారైతే ఏం చేయాలో ఆలోచించేవారు. ఈ వలస పాలకులు పట్టించుకోలేదు. అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాలు కలిపి భయంకరమైన పోరాటం చేశాయి. ప్రతి జిల్లాలో ఇటువంటి సమస్యలే ఉన్నాయి’ అని అన్నారు.

మళ్లీ వస్తున్నారు…. జాగ్రత్త టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మళ్లీ ప్రజలవద్దకు వస్తున్నారని తెలిపారు. ‘కొంపకూల్చిన మేస్త్రీకే మళ్లీ పని ఇచ్చినట్లు చేయొద్దు. నేను ఏదన్న విషయం మాట్లాడితే గొంతు లేపుతున్నారు. తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులే ఉండాలి, ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేయాలని అంటున్నా. వాళ్లే మన దగ్గర ఉండేటట్లైతే ఇంకెందుకు తెలంగాణ? కొందరైతే గట్లెట్ల మాట్లాడుతరు? అంటున్నారు. నేను గట్లనే మాట్లాడుతా. నాకు గట్ల మాట్లాడుడే వస్తది. తెలంగాణ రాష్ట్రం ఫలితం ప్రజలకు రావాలి. సక్రమంగా ఉండేవారినెందుకు పొమ్మంటం? అక్రమంగా వచ్చిన ఉద్యోగులనే పొమ్మంటున్నాం. మేమేం అందర్నీ పొమ్మంటలేం కదా!అక్రమంగా వచ్చిన వారు పోతే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తయి. ఈ సమయంలో ఏమాత్రం పొరపాటు చేసినా ఫలితం రాదు. వాళ్ల పాలన చూడనివాళ్లం కాదు. కొత్త పంథా, కొత్త రాష్ట్రం, మన రాష్ట్రం, మన పాలన అన్నట్లుగా ఉండాలి’ అని తెలిపారు. దళితుల అభివృద్ధికి రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తామని, ఇది కేసీఆర్ ఇస్తున్న హామీ అని తెలిపారు. జిల్లాకు ఐదువేల కోట్ల చొప్పున కేటాయించి, సాంఘిక సంక్షేమశాఖకు నిప్పులాంటి మంత్రిని, ఇద్దరు నిజాయితీ కలిగిన ఐఏఎస్‌లను పెట్టి పైసా కూడా దుర్వినియోగం కాకుండా చూస్తామని తెలిపారు. భూమిలేని దళితులకు మూడు ఎకరాల భూమిని కేటాయిస్తామని, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని అన్నారు. అదే సమయంలో భూమిని నీటివసతి, చదునుకోసం డబ్బుతో పాటు ఒక సంవత్సరం పెట్టుబడిని కూడా ఉచితంగా ఇస్తామని తెలిపారు.

గతంలో గుడిసెలే పక్కాఇళ్లు గతంలో గుడిసెలు వేసిచ్చి పక్కా ఇళ్లు అనేవారని, ఎన్టీరామారావు వచ్చిన తరువాత ఒక్కరూం కట్టించి బలహీనవర్గాల గృహనిర్మాణం అన్నారని తెలిపారు. ఈ ఒక్కరూంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండగలరా? అని కేసీఆర్ ప్రశ్నించారు. గతంలో దొంగ పైరవీలు చేసుకుని మింగారని, ఇకపై అలా ఉండదని, ఇల్లులేని కుటుంబానికి మూడు లక్షల రూపాయలతో రెండు బెడ్‌రూంలు, కిచెన్, హాల్, బాత్‌రూం, లెట్రెన్ లను పిల్లర్లతో 125గజాల్లో కట్టించి ఇస్తామని, ఇందులో ఒక్క రూపాయి కూడా లోన్‌లేదని తెలిపారు. పూర్తి సబ్సిడీతో ఇల్లు నిర్మించి ఇస్తామని, ఈ ఇళ్ల నిర్మాణం చూసి దేశం ఈర్ష పడాలని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీకి నీళ్లు రాలేదని, రాబోయే రోజుల్లో తను అక్కడ కుర్చీవేసుకుని కూర్చోని కాల్వల్లో నీళ్లుపారేలా చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉచిత నిర్బంధ విద్య ఉంటుందని తెలిపారు. తెలంగాణ బతకాలని, భాగుపడాలని ఆకాంక్షించారు. ఈ విషయాలను అన్ని గ్రామాల్లో దీపం మరో దీపాన్ని వెలిగించినట్లుగా ఒకరు మరొకరికి చెప్పాలని సూచించారు. నకిరేకల్‌నుంచి తనను వీరేశం టికెట్ అడగలేదని, తనే వెళ్లి పనిచేసుకోమని చెప్పానని అన్నారు. వీరేశంను గెలిపిస్తే తనను గెలిపించినట్లుగా వ్యాఖ్యానించారు. నకిరేకల్ అభివృద్ధి తన బాధ్యతని, వీరేశంను గెలిపించి తేవాలని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా నల్లగొండ జిల్లాకు చెందిన లక్ష్మీనరసింహారెడ్డి, నరేందర్‌రెడ్డి, ముత్తయ్య, వీరారెడ్డి, సైదులు, ఉపేందర్, నిర్మల, నాగరాజు, వెంక మస్తాన్ ఆలీ, సాయిలు, సతీష్ తదితరులతోపాటు హైదరాబాద్ నాంపల్లికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మహమూద్ ఆలీ, రాష్ట్ర నాయకులు బూర నర్సయ్యగౌడ్, దేవర మల్లప్ప, వీరేశం పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.