Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మొక్క మొక్కకు పక్కా లెక్క

-హరితహారంపై వారంలో నివేదిక -అడవులు మింగింది.. మేకను తిన్నది కాంగ్రెస్ వాళ్లే -వారి నేరపూరిత నిర్లక్ష్యంవల్లే అడవుల విధ్వంసం -ఇకపై అంగుళం అడవిని కబ్జాచేసినా కఠినచర్యలు -కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు తర్వాత గ్రామానికి ఒక నర్సరీ -శాసనసభలోముఖ్యమంత్రి కేసీఆర్ -అడవులు మింగింది.. మేకను తిన్నది కాంగ్రెస్ వాళ్లే -వారి నేరపూరిత నిర్లక్ష్యంవల్లే అడవుల విధ్వంసం -హరితహారం.. పర్యావరణ పరిరక్షణకు మహాయజ్ఞం -దీనిపైనా నిరాధారంగా ఆరోపణలు చేస్తారా? -మూడున్నరేండ్లలో 81 కోట్లకు పైగా మొక్కలను నాటాం -కంపా నిధులలో వాటా కోసం కేంద్రంపై వత్తిడి తెస్తున్నా -హరితహారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది -దేశంలో నాటిన మొక్కలలో 20% తెలంగాణలో నాటినవే -అటవీభూములపై ఎవ్వరికీ యాజమాన్య హక్కులుండవు -గొత్తికోయలు మనరాష్ట్రంవారు కాదు.. ఆక్రమణదారులు -పోడు పేరిట అడవిని కొడితే అనుమతించేది లేదు: సీఎం

తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా నాటిన ప్రతీ మొక్కకు పక్కా లెక్క ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. గత మూడేండ్లుగా హరితహారం కింద నాటిన మొక్కలకు ఎంత ఖర్చు చేశామనే లెక్కలపై సామాజిక తనిఖీ జరిగిందని, ఆ వివరాలను వారంలో శాసనసభ ముందుంచుతామని స్పష్టంచేశారు. గత పాలకులు, ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యం ఫలితంగా రాష్ట్రంలో అడవులు విధ్వంసానికి గురయ్యాయని సీఎం ధ్వజమెత్తారు. ధ్వంసమైన అడవులకు తిరిగి జీవం పోయడానికి తమ ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. ఇకపై అంగుళం అడవిని కబ్జాచేసినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు తర్వాత గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణకోసం మహాయజ్ఞంలా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంపై నిరాధారంగా ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై సోమవారం శాసనసభలో లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సవివరంగా సమాధానమిచ్చారు. హరితహారంపై సభలో మాట్లాడిన పలువురు సభ్యులు కొన్ని విలువైన సూచనలు చేశారు. కొందరు విమర్శించారు. ఇది వ్యక్తులకు ఉండే జిజ్ఞాస, విజ్ఞతనుబట్టి ఉంటుంది. అత్యంత ప్రాముఖ్యమైన హరితహారం అంశంపైనైనా నిర్మాణాత్మకంగా మాట్లాడుతారని ఆశించాను. కానీ దీనిపైనా విమర్శలుచేయాలన్న ధోరణిలో మాట్లాడటం బాధాకరం అని సీఎం అన్నారు. మనం అడవులను కోల్పోయాం. ఫలితంగా ప్రకృతిపరంగా వికృత, విపరీత పరిణామాలు తలెత్తుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలో సూపర్‌పవర్ అమెరికాలో ప్రకృతి విపత్తుకు మూడు రాష్ర్టాలు అల్లకల్లోలంగా మారాయి. క్లౌడ్ బరస్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్, కాలుష్యంతో చైనానుంచి చెన్త్నెవరకు విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. భారీ వర్షాలకు చెన్నై ఏడు రోజుల వరకు వరద తాకిడికి గురైంది. ముంబై మహానగరం మూడు మీటర్ల లోతు వరదలో మునిగింది అని ఆయన గుర్తుచేశారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని శాస్తవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారని, కానీ చాలాకాలంగా గత పాలకుల నేరపూరిత నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ దారుణ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

2వేల కోట్లతో మొక్కలు నాటాం కేవలం మూడున్నరేండ్లలో హరితహారం కింద ఇప్పటి వరకు 81 కోట్లకు పైగా మొక్కలను నాటామని సీఎం చెప్పారు. ఇందుకోసం రూ.2008కోట్లు వెచ్చించామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రూ.1,307కోట్లు, రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.396కోట్లు, కంపా కింద రూ.304 కోట్లు ఖర్చుచేశామన్నారు. ఈ ఖర్చుకు లెక్కలున్నాయా? అని కొందరు సభ్యులడిగారు. మాది లెక్కపత్రం లేని ప్రభుత్వం కాదు. ప్రతీ మొక్కపై చేసిన ఖర్చుపై పక్కా లెక్క ఉంది. ఉపాధి హామీ నిధులపై కేంద్రం పకడ్బందీగా ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులపై సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) చేయించాం. కంపా నిధులపై థర్డ్ పార్టీతో ఎవాల్యూయేషన్ చేయించాం. మొక్క మొక్కకు చేసిన ఖర్చుల వివరాలను వారంలోగా సభ ముందుంచుతాం అని సీఎం తెలిపారు.

గ్రీన్‌కవర్ పెంచడంపై సీరియస్‌గా ఉన్నాం రాష్టంలో గ్రీన్ కవర్‌ను పెంచడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని సీఎం స్పష్టంచేశారు. హరితహారంకోసం నిధులను పోగుచేస్తున్నాం. కంపా నిధుల కింద మనకు రావాల్సిన వాటా రూ.1,500కోట్లు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ కంపా నిధులలో మన వాటాకోసం కేంద్రంపై వత్తిడి తెస్తున్నా. కంపా నిధుల కింద కేంద్రం వద్ద అన్ని రాష్ర్టాలకు కలిపి రూ.40వేల కోట్లు న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ఒక బ్యాంకులో మురిగిపోతున్నయి. ఇది దుర్మార్గం. రాష్ర్టాల నిధులపై ఆంక్షలను సడలించి కంపా వాటా పెంచాలని పోరాడాం. ఫలితంగా కేంద్రం దీనిపై చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అది కొంత ఆలస్యమైంది. తీరా చట్టం ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖకు, అటవీశాఖకు పేచీ పడింది. తమ ఖజానాకు నిధులు జమ అయిన తర్వాతనే అటవీశాఖకు బదిలీ చేస్తామని ఆర్థికశాఖ వాదిస్తున్నది అని సీఎం తెలిపారు.

హరితహారాన్ని కేంద్రం ప్రశంసించింది రాష్ట్రంలో హరితహారంకింద భారీ సంఖ్యలో మొక్కలు నాటడాన్ని కేంద్రప్రభుత్వం ప్రశంసించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో హరితహారంలో నాతోపాటు పాల్గొన్న అప్పటి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ కార్యక్రమం జరుగుతున్న తీరుపట్ల ఆనందాన్ని వ్యక్తంచేశారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని దేశంలో పలుచోట్ల ఆయన ఉదాహరించారు. దేశంలో నాటిన మొత్తం మొక్కలలో ఒక్క తెలంగాణలోనే 20%పైగా ఉన్నట్లు కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించింది. మాకు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యం ఏమిటో స్పష్టంగా తెలుసు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన అటవీశాఖ డైరెక్టర్ జనరల్ దాస్ కూడా ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసించారు అని ఆయన చెప్పారు.

గొత్తికోయలు ఆక్రమణదారులు కాంగ్రెస్ హయాంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలిచ్చారు. వాస్తవానికి అటవీభూములపై ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఎవ్వరికీ యాజమాన్య హక్కులుండవు. భూమీ మీద వచ్చే ఫలసాయాన్ని పొంది బతుకవచ్చు. భూపాలపల్లిలో అటవీభూములను ఆక్రమించిన గొత్తికోయలకు ఏదో అన్యాయం జరిగినట్లు ఎర్రజెండాలు పట్టుకుని ఆందోళనచేశారు. అసలు గొత్తికోయలు మనరాష్ట్రం వారుకాదు. వారు ఆక్రమణదారులు. ఏ రాష్ట్రంవారికైనా ఎక్కడైనా బతికే అధికారముంది. కానీ అడవులను నరికి భూములను ఆక్రమిస్తామంటే పద్ధతా? అడవులను నరకడమే మహా ఉద్యమమా? గొత్తికోయలకు ప్రత్యామ్నాయం చూపవచ్చు. దానిపై ఒక నిర్ణయానికి రావాలి. ఇప్పటిదాక చేసిందిచాలు. ఇకనుంచి పోడు పేరిట అడవిని కొడితే అనుమతించేది లేదు. కఠినచర్యలు తీసుకుంటాం. సభ కూడా మద్దతు ఇవ్వాలి. కావాలంటే కమిటీ వేసి నిర్ధారణ చేయండి. తీర్మానం చేయండి. ఇక నుంచి అడవుల నరికివేత ఆపకపోతే భవిష్యత్‌తరాలకు తీరని అన్యాయంచేసిన వాళ్లమవుతాం. దామరచర్లలో అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌కోసం కృష్ణానది ఒడ్డున అటవీభూములు సేకరించాం. దానికిగాను కంపా కింద రూ.300 కోట్లు కేంద్రానికి చెల్లించాం. క్షేత్రస్థాయికి వెళ్లేసరికి ఆ భూముల్లో దళితులు, బీసీలు, పేద ఓసీలు కబ్జాలో ఉన్నారు. వారిని ఇబ్బంది పెట్టకుండా రిహాబిలిటేషన్ కింద మరో రూ.300కోట్లు చెల్లించాం అని సీఎం చెప్పారు.

భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది.. మనం ఎంత ధనం సంపాదించినా ఆరోగ్యకర వాతావరణం లేకపోతే దానిని అనుభవించలేమని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్‌తరాలకు జీవనస్థితిగతులు కల్పించాలని చెప్పారు. అడవుల ధ్వంసాన్ని ఆపకపోతే సమీప భవిష్యత్‌లో స్వచ్ఛమైన గాలిని కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. స్వచ్ఛమైన గాలికోసం హైదరాబాద్ చుట్టూ భూములను కొనుగోలుచేసి చెట్లను పెంచాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే రామగుండంలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటున్నది. పిట్టలు రాలిపోతున్నాయి. ఈ క్రమంలో పచ్చదనంకోసం మనమంతా ప్రతిన బూనాలి. అందుకే ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవాడ, మహబూబ్‌నగర్ జాతీయ రహదారులకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పెంచాం. నాటిన మొక్కలలో 90 నుంచి 98% బతికాయి. ఎవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలు దాదాపు అన్నింటినీ బతికించేలా చర్యలు తీసుకున్నాం. ప్రత్యేకంగా 3100 ట్యాంకర్లను ఏర్పాటుచేశాం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోవడానికి విజయవాడ దారిలో బస్సులో వెళ్లా. పరిస్థితి ఎంతో బాగుంది. బెంగళూరు జాతీయ రహదారిపై ఎవెన్యూ ప్లాంటేషన్ ఏ విధంగా ఉందో ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారికి తెలుసు అని సీఎం అన్నారు.

ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు మొక్కలకు నీళ్లుపోసే బాధ్యత ఉమ్మడి ఏపీలో నేను మంత్రిగా ఉన్నా. విజన్ 2020 డాక్యుమెంట్ రూపకల్పనలోనే భాగస్వామిని. అన్ని శాఖల అధికారులను పిలిచి మాట్లాడిన. అగ్నిమాపక డీజీతో మాట్లాడితే ఎక్కువమంది తమ ఉద్యోగులు చనిపోతున్నారని చెప్పారు. కారణం ఏంటని అడిగితే సిబ్బంది అగ్నిమాపక శకటం వద్దనే రేకుల షెడ్లలో కదలకుండా ఉంటారు.. అగ్నిప్రమాదం జరిగినప్పుడే బయటకు కదులుతారు.. ఫలితంగా చనిపోతున్నారు.. అని చెప్పారు. దీనికి నేను అగ్నిమాపక సిబ్బందికి వైర్‌లెస్ సెట్లు కొనివ్వమని చెప్పాను. ఆ తరువాత మొక్కలకు నీళ్లు పోసే పని చెప్పి వారిని బయట తిప్పాలన్నాను. వైర్‌లెస్ సెట్ వెంట ఉంటే ప్రమాదంపై సమాచారం రాగానే సిబ్బంది అలర్ట్ అయి ఘటనా స్థలానికి వెళ్లడానికి వీలవుతుందని చెప్పాను. నగరంలో ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు మొక్కలకు నీళ్లుపోసే పని అప్పగించాం అని వివరించారు.

కోతుల బెడదపై హిమాచల్ ఎన్నికల్లో హామీలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు కోతుల బెడదను నివారిస్తామనే హామీని ఎన్నికల ప్రణాళికలో ప్రధానాంశంగా చేర్చాయి. అడవులు లేక అవి జనావాసాలకు వస్తున్నాయి. కోతులు, ఇతర జాతులు తిని బతికే అడవి ఫలాలను మనం ధ్వంసంచేశాం. అవి తిండికోసం మన కిచెన్‌లోకి వచ్చాయి. అడవిలో వైల్డ్ ఫ్రూట్స్ ఎప్పుడు దొరుకుతాయో అప్పుడు అవి మన ఇండ్లకురావు. దీనిపై సీరియస్‌గా చర్చ జరుగుతుందని ఆశించాను. వానలు వాపస్ రావాలి.. కోతులు వాపస్ పోవాలి అని చెప్పాను. అడవిపందులు గతంలో ఎప్పుడైనా ఊర్లల్లకు వచ్చినయా? ఇప్పుడు వస్తున్నాయి. నేను ఆరెకరాల చెలకలో వేరుశెనగ పంట వేస్తే ఒక్క గింజ కూడా దొరుకలేదు.. అంతా అడవి పందులే తిన్నాయి. పర్యావరణ, వాతావరణ సమతుల్యత పాటించేలా అందరూ సమగ్ర అవగాహన చేసుకోవాలె. బడ్జెట్‌లో ఆటవీశాఖకు నిధులు కేటాయించకపోతే ఎందుకు కేటాయించలేదని నిలదీయాలె. ఇలా అందరం కలిసి అడవిని కాపాడుకోవాలి. ఉన్న అడవి నుంచే ఏడాదికి రూ.70 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ కాంగ్రెస్ వాళ్లు వచ్చిన డబ్బు కూడా ఆటవీశాఖకు కేటాయించలేదు. మొక్కలు పెంచడాన్ని సీరియస్‌గా తీసుకోవాలి అని సీఎం అన్నారు.

ప్రతి పంచాయతీకీ నర్సరీ కొత్త పంచాయతీ చట్టం తేబోతున్నాం. గిరిజన తండాలు, జనాభా ప్రాతిపదికగా అనుబంధ గ్రామాలను కూడా పంచాయతీలుగా చేస్తాం. ప్రస్తుతం ఎనిమిదివేలకు పైగా పంచాయతీలున్నాయి. వీటికి అదనంగా నాలుగైదు వేలు ఏర్పాటవుతాయి. వీటికి నిర్ణీత కాలవ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుతం పంచాయతీలలో చేయాల్సిన పనులుచేయడం లేదు. గ్రామాలలో సర్పంచ్‌లు, మున్సిపాలిటీలలో చైర్మన్లు పట్టించుకోవడం లేదు. ఊర్లల్ల చెట్లు పెంచితే హైదరాబాద్‌కు లాభం అయితదా? సామాజిక బాధ్యతలేదు.. పట్టింపులేదు! గ్రామంలో సఫాయి కార్మికులు, ఇతర సిబ్బంది ఉంటారు. స్కూల్స్ ఉంటాయి. కానీ పట్టించుకోరు. బాధ్యతాయుత స్థానిక సంస్థలుంటే తప్ప బడ్జెట్‌లో ఎన్ని కోట్లు కేటాయించినా లాభం ఉండదు. ఈ విషయం స్వయంగా ప్రధానికే చెప్పిన. పీఎంగా మీరు.. సీఎంగా నేను ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికసంస్థలు ఫంక్షన్‌లో లేకపోతే ఏమీ చేయలేమన్నాను. స్థానిక సంస్థలను సిస్టమ్‌లోకి తీసుకురావాలి. ప్రతి గ్రామానికి నర్సరీ ఏర్పాటుచేయాలి. కొత్త పంచాయతీ చట్టం తరువాత 15 వేల నర్సర్సీలు వస్తాయి అని సీఎం చెప్పారు.

అంగుళం అటవీ భూమి కూడా పోకూడదు అటవీ భూములు పోయినవి పోయాయి. ఇక నుంచి అంగుళం కూడా పోకూడదు అని సీఎం అన్నారు. అటవీ భూముల పరిరక్షణకు హౌజ్ కమిటీ వేయండి. అన్ని పార్టీల నుంచి పర్యావరణంపై అభిమానం ఉన్న వారిని కమిటీలో వేయండి. ప్రతి నెల సమీక్ష చేయండి. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించండి. ఎంత భూమి పోయింది? ఎంత మిగిలి ఉన్నది? లెక్కలు తీయండి. స్మగ్లర్లు అడవులను నరికివేస్తున్నారు. నిజామాబాద్‌లో ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను స్మగ్లర్లు చంపారు. ఇంకో అధికారికి ఇదే పరిస్థితి ఎదురైతే నేను గన్‌మెన్‌ను ఏర్పాటుచేశాను. ఈ రోజు చర్చలో సభ్యులు ఇచ్చిన సూచనలన్నీ చేశాం. ప్లాన్ కూడా ఉన్నది. సభ్యులకు అందజేస్తాం. ఈ అంశంపై ఇదే సభలో మళ్లీ చర్చిద్దాం. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌పై ఏం చేద్దామో మాట్లాడితే ముందుకు పోవచ్చు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా మొక్కలు ఎలా పెంచవచ్చునో న్యూఢిల్లీ ఉదాహరణ. హైదరాబాద్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ అనుకుంటే మూడునాల్గేండ్లలో విరివిగా మొక్కలు పెంచి పచ్చదనాన్ని ఏర్పాటుచేయవచ్చు. ఢిల్లీ అధికారులను కూడా తీసుకురమ్మని చెప్పాను. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో దాదాపు 14 వేల మందిని భాగస్వాములను చేశాం. త్వరలో అవసరమైతే ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగానే జీహెచ్‌ఎంసీ ఏరియా పరిధిలోని ఎమ్మెల్యేలతో పురపాలక శాఖ మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. జీహెచ్‌ఎంసీలో గ్రీన్ బడ్జెట్ పెట్టాలి అని సీఎం చెప్పారు.

సభ్యులకు ఎజెండా ముందుగా ఇవ్వాలి సభ్యులకు ముందే ఎజెండా ఇస్తే సభ్యులు ప్రిపేర్ అయ్యి వస్తారని, సభలో చర్చ మంచిగా జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జానారెడ్డి అక్బరుద్దీన్‌తో భోజనం సమయమైందని చెప్పారు. నేను కూడా పొద్దున మూడు ఇడ్లీలు మాత్రమే తిని వచ్చాను. అందరం భోజనానికి పోదాం. వ్యవసాయంపై ఎల్లుండి చర్చకు అవకాశం ఇచ్చారు. మంగళవారం గుడుంబా అంశంపై చర్చిద్దాం. సభ్యులకు ఎజెండా ముందుగా ఇవ్వాలి. ఈ మేరకు సీఎస్‌కు, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి. అలా అయితే సభ్యులందరూ ప్రిపేర్ అయి సభకు వస్తారు. చర్చ మంచిగా జరుగుతుంది అని సీఎం అన్నారు.

230 కోట్ల మొక్కలు నాటేందుకు గుండెధైర్యం కావాలి హరితహారంలో 230 కోట్ల మొక్కలను నాటాలన్న సంకల్పానికి గుండెధైర్యం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇంత భారీ సంఖ్యలో మొక్కలను నాటడం, బతికించడంపై అధికారులు పలు సందేహాలు వ్యక్తంచేశారని చెప్పారు. నాటిన మొక్కలలో 30% వరకు బతికినా మంచి ఫలితాలు వస్తాయి.. ముందుకు పదండని అధికారులతో చెప్పా. వీలైన చోట వందశాతం మొక్కలను బతికించడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నాం. విద్యార్థులు, గ్రీన్ బ్రిగేడ్లు, పౌరుల సహకారం తీసుకుంటున్నాం అని సీఎం తెలిపారు. నా నియోజకవర్గం గజ్వేల్‌లో 30వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అక్కడ దట్టమైన అడవిని తిరిగి సృష్టించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా. రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం 2015లో 4149 వరకు నర్సరీలను ఏర్పాటుచేశాం. వివిధ కారణాలవల్ల సరైన నిర్వహణ కోసం ప్రస్తుతం ఆ సంఖ్యను 2,900కు కుదించాం అని చెప్పారు.

హైదరాబాద్‌లో హరితహారంపై ప్రత్యేక సమావేశం హరితహారంపై సమీక్షచేస్తే హైదరాబాద్‌లో మొక్కలు నాటడం కష్టమని అధికారులు చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో నాకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో సీతాఫల్‌మండి ఇంచార్జీగా ఇచ్చారు. అక్కడ అగ్గిపెట్టెల్లా ఇండ్లు ఉన్నాయి. కింద పెద్ద నాలా ఉంటుంది.. పైన పెద్ద మేడ ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్ల నుంచి గృహిణులు తమకు కావాల్సిన కారం, ఇతర వస్తువులు చేబదులు తీసుకునేలా ఉంది. సికింద్రాబాద్ అంటే లష్కర్.. ఇది వ్యాపారస్థలం. దురదృష్టం ఏమిటంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ లేదు. అక్కడ ఏర్పాటుచేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అక్కడ ప్రైమరీ స్కూల్ పెడుదామంటే జాగాలేదు. వందశాతం ఆక్యుపై అయింది. చెట్టుపెడదామంటే జాగాలేదు. అక్కడ మున్సిపాలిటీ చెత్త కూడా రోడ్లమీదనే వేస్తరు. దశాబ్దాల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణం. ఈ దుస్థితి నుంచి బయట పడటానికి ఒక నిర్ణయానికి రావాలి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ నిర్ణయించాం. ఇప్పటివరకు 4,54,29,000 మొక్కలు నాటాం. ఈ వివరాలన్నీ ఈ సభలోనే సమర్పిస్తాం. చింతల రామచంద్రారెడ్డి మొక్కలను లెక్కపెట్టే బాధ్యత తీసుకోవాలి. నగర ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో మొక్కలు నాటేందుకు ఖాళీగా జాగా ఉన్నదని గుర్తించి చెప్పాలి. జీహెచ్‌ఎంసీని దబాయించి మొక్కలు నాటించాలి. ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలు పెన్ డ్రైవ్‌లో ఇస్తాను చూసుకోండి. నగరంలో నర్సరీలు అందుబాటులో ఉన్నాయి. ఆటవీశాఖ సొంత నర్సరీల ద్వారానే మొక్కలను అభివృద్ధి చేస్తున్నది. కాలనీలలో, అపార్ట్‌మెంట్లలో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు పండ్ల మొక్కలను మాత్రమే ప్రైవేట్‌నుంచి కొనుగోలుచేశాం. అవి కేవలం వేలల్లోనే ఉన్నాయి. 24 గంటలు ఆక్సిజన్ ఇచ్చే రావి, వేప చెట్లు పెంచాలని నేనే స్వయంగా రిక్వెస్ట్ చేశాను. ఔటర్‌రింగురోడ్డు చుట్టూ రావి, వేపచెట్లే పెంచుతున్నారు. హైదరాబాద్‌లో అవసరమైతే అక్కడక్కడ వంద వంద ఎకరాల భూమిని సేకరించైనా గ్రీనరీని పెంచాలి. లేకుండా హైదరాబాద్‌లో మరో ఆరేడేండ్లలో వాతావరణం మరింత వేడెక్కే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రామగుండం ఏరియాలో వేసవిలో పిట్టలు చనిపోయినట్లుగా హైదరాబాద్‌లో చనిపోతారు. ఈ ప్రమాదం నుంచి బయట పడాలి అని అన్నారు.

అడవులను మింగింది.. మేకను తిన్నది కాంగ్రెస్ వాళ్లే అడవులను మింగింది ఎవరు? మేకను తిన్నదెవరు? అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు. మొక్కలు నాటారు.. అ మొక్కలను మేక తిన్నది.. మంత్రి వచ్చాడు.. ఆ మేకను తిన్నడు అంటూ కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. అరుణ వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. మాటలు కోటలు దాటుతయ్.. కాళ్లు తంగేళ్లు దాటయన్నట్లు ఆమె వ్యవహారమున్నది. మెదక్‌నుంచి సిద్దిపేట వెళ్లే మార్గంలో దట్టమైన అరణ్యాలుండె. అక్కడినుంచి పోవాలంటే భయమేస్తుండె. ఎక్కడ పోయినవి ఆ అడవులు? వికారాబాద్‌లో అడవులు ఎంతో ఆహ్లాదంగా ఉండేవి. వికారాబాద్ కీ హవా లాఖో మరీజోంకా దవా అనే నానుడి ఉండేది. కానీ నేడు పరిస్థితి మారింది. అడవుల విధ్వంసానికి ఎవరు కారణం? స్మగ్లింగ్ ముఠాలను పెంచి పోషించింది మీరు (కాంగ్రెస్) కాదా? ఎవరి సాక్షిగా అటవీ సంపద తరిగిపోయింది? కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేండ్లలో మొక్కల సంరక్షణకు రూ.130 కోట్లు అంటే ఏడాదికి రూ.13 కోట్లు ఖర్చుచేసింది. 1980 నుంచి 2014వరకు 34 ఏండ్ల సుదీర్ఘకాలంలో పాలకులు 3.17 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. దీన్నిబట్టి అడవులపట్ల, పర్యావరణంపట్ల గత పాలకులకు ఎంత శ్రద్ధ ఉన్నదో తెలుస్తున్నది అని సీఎం విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో మూడున్నరేండ్లలోనే రూ.2008 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో ఒక నేరపూరితమైన నిర్లక్ష్యంవల్ల అడవులు విధ్వంసమయ్యాయి. గోదావరి బెల్ట్, ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి దేవాదులవెళ్లే మార్గంలో ఆదిలాబాద్‌లో అక్కడకక్కడ అడవులున్నాయి. రికార్డుల ప్రకారం మొత్తం భూభాగంలో 24% అడవులున్నాయి. కానీ కాగితాలపై ఉన్న అడవులు భూమిపై ఉండవు, విధ్వంసమైన అడవులను పునరుజ్జీవింపచేసే ప్రయత్నంలో మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది అని సీఎం చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.