Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మొక్క తొడిగిన తెలంగాణ..

నభూతో నభవిష్యతి అన్నట్టు రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కలిసికట్టుగా ఒక్కరోజే నాటిన మొక్కల సంఖ్య కోటి దాటింది. రాష్ట్ర సాధన మొదలు.. ఏ కార్యక్రమం చేపట్టినా.. ఏ పథకం రూపుదిద్దినా.. ఉద్యమరూపంలోనే.. ఉధృతరూపంలోనే నడిపే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కదిలొచ్చిన ప్రజల స్ఫూర్తికి పుడమితల్లి పులకించిపోయింది! అటెండరు మొదలుకుని ఐఏఎస్ వరకు.. సర్పంచ్ మొదలు సీఎం వరకు.. గవర్నర్.. సినిమా తారలు.. పారిశ్రామికవేత్తలు.. న్యాయమూర్తులు.. అంధులు.. దివ్యాంగులు.. ఒకరనేమిటి.. ఒక చోటనేమిటి?

CM-KCR-planted-a-sapling-in-NIMS

-ముత్యాల నగరానికి పచ్చలహారం -సబ్బండ వర్ణాల సంబురాల పండుగ -రాష్ట్రవ్యాప్తంగా కోటికిపైగా నాటుకున్న మొక్కలు -మేము సైతం అన్న న్యాయమూర్తులు -నిమ్స్‌లో మొక్కలు నాటిన సీఎం కే చంద్రశేఖర్‌రావు -హరితహారం అప్రతిహతంగా సాగాలి.. సమీక్షలో ముఖ్యమంత్రి -బీహెచ్‌ఈఎల్ పాఠశాలలో మొక్క నాటిన గవర్నర్ నరసింహన్ -నేడు పంచాయతీరాజ్ లక్ష్యం కోటి మొక్కలు -హైదరాబాద్‌లో 4173 చోట్ల ..టార్గెట్: 25 లక్షలు -నాటిన మొక్కలు: 29 లక్షలు

సబ్బండ వర్ణాల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మొక్క తొడిగింది! మరోవైపు పచ్చలహారం పొదువుకుని ముత్యాల నగరం మురిసిపోయింది! హరితవర్ణంలో మెరిసిపోయింది! తాను ప్రేమించే వనాలు పెరుగనున్న నగరాన్ని చూసి ఆకాశమూ ముచ్చటపడిపోయింది! స్వాతి చినుకుల చిరు సవ్వడులు కలగలిసిన కోలాహలంతో నగరం కళకళలాడింది! పది గంటల వ్యవధిలో.. వందకుపైగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు.. అనేక ప్రముఖ విద్యాసంస్థలు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు.. పాఠశాలలు.. కాలేజీలు.. ప్రభుత్వరంగ సంస్థలు.. క్రెడాయ్ వంటి పారిశ్రామిక విభాగాలు.. చేయి చేయి కలిపి.. ఒక్కటై ముందుకు కదిలితే 4173 ప్రాంతాల్లో 29 లక్షలకుపైగా మొక్కలు నగరవ్యాప్తంగా పాతుకున్నాయి. ఈ స్ఫూర్తినందుకున్న పంచాయతీరాజ్ శాఖ.. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా తన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కోటి మొక్కలు నాటేందుకు సమాయత్తమవుతున్నది. ఆద్యంతం ఉత్సాహభరితం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం సోమవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత ఉత్సాహభరితంగా, అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టగా, ప్రజలు సంబురంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరం నలుమూలలా ఎక్కడ చూసినా మొక్కలు నాటే హడావుడే కనిపించింది. హైదరాబాద్‌లో సోమవారం ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని అధిగమించి 29.19 లక్షల మొక్కలను నాటి సరికొత్త రికార్డును నెలకొల్పారు.

ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్, శాసనసభ స్పీకర్, సైన్యాధికారులు, సైనికులు, సినీ నటులు, సామాన్యులు, స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, విద్యార్థులు అందరూ ఈ మహత్కార్యంలో పాలుపంచుకున్నారు. ఇండ్లు, రోడ్లు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, దవాఖానలు, గెస్ట్‌హౌజ్‌లు, ఖాళీ స్థలాలు.. ఎక్కడ చూసినా హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్న దృశ్యాలే కనిపించాయి. ఇక ఐటీ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేస్తూ అనేక చోట్ల ప్రజలను, విద్యార్థులు, కార్యకర్తలు, ఉద్యోగులను ఉత్తేజపరిచేలా చేసిన ప్రసంగాలు, మొక్కలు నాటే కార్యక్రమాలతో అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. మొక్కలు నాటినవారు.. తాము నాటిన మొక్కల దృశ్యాలను ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. లక్ష్యం నెరవేరడంతో ఇప్పుడు అందరి దృష్టి వాటి సరంక్షణపై పడింది. మొక్కలు నాటినవారే వాటికి నీరుపోసి, పెరిగి పెద్దయ్యేవరకు కాపాడాల్సి ఉంది. ఇదే దిశలో హరితహారం కొనసాగుతున్న తీరుపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగించాలని, అధికార యంత్రాంగమం తా పాల్గొనాలని అన్నారు. తెలంగాణ పచ్చగా మారేదాక అలసత్వం వహించకుండా పని చేయాలని ఆదేశించారు. నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తనదైన ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని ఎల్లప్పుడూ అందించే గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బీహెచ్‌ఈఎల్‌లోని జెడ్పీ స్కూలులో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ప్రజల కార్యక్రమమేనన్న నరసింహన్.. తమ ప్లాట్‌లలో పది మొక్కలు నాటి వచ్చినవారికే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సూచించారు.

నిమ్స్‌లో మొక్కలు నాటిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిమ్స్ దవాఖాన ప్రాంగణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ చర్లకోల లకా్ష్మరెడి, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌లతో కలిసి మూడు మొక్కలు నాటారు. నిమ్స్‌లో దాదాపు 1500 మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం మొక్కలు నాటేందుకు నిమ్స్ ప్రాంగణానికి రాగానే పిల్లలు, అక్కడి సిబ్బంది హరితహారం వర్థిల్లాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, హాస్పిటల్ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, రెడ్ క్రాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి లకా్ష్మరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మొత్తం నాలుగు లక్షల మొక్కలు నాటుతామన్నారు. ఇందులో ఒక లక్ష ఔషధ మొక్కలను ఆయుష్ ఆధ్వర్యంలో నాటాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

4173 ప్రాంతాల్లో.. రెండువారాలపాటు కొనసాగనున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ పరిధిలో ఒకేరోజు 25లక్షల మొక్కలు నాటాలని తొలుత లక్ష్యంగా పెట్టుకోగా.. ఉద్యమస్ఫూర్తితో ప్రజలు భాగస్వాములు కావడంతో 29 లక్షల పైచిలుకు మొక్కలు నాటుకున్నాయి. హైదరాబాద్‌లో హరితహారం కోసం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, అటవీశాఖలు దాదాపు 35 లక్షల మొక్కలను సిద్ధం చేశాయి. ఆదివారం సాయంత్రానికే వాటిలో 28లక్షల మొక్కలను పంపిణీచేశారు. ఇందులో ఐదు లక్షల మొక్కలను వ్యక్తిగతంగా ఇండ్లల్లో నాటేందుకు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ప్రైవేటు సంస్థలు అన్నీ కలిపి మొత్తం 104సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

హైదరాబాద్‌లో వచ్చే మూడేండ్లలో పదికోట్ల మొక్కలు నాటాలన్న ముఖ్యమంత్రి పిలుపుతో నగరంలో ఈ ఏడాది మూడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుంచే ప్రముఖులంతా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. 4,173 ప్రాంతాల్లో మధ్యాహ్నం 12గంటలకల్లా 10లక్షలవరకు మొక్కలు నాటినట్లు నమోదైంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు 21లక్షల మొక్కలకు చేరుకోగా.. సాయంత్రం ఐదుగంటలయ్యేసరికి అదికాస్తా 25.13 లక్షలు దాటిపోయింది. పొద్దుపోయే వరకూ సాగిన కార్యక్రమంలో దాదాపు 29.19లక్షల పైచిలుకు మొక్కలు నాటినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు.

పాల్గొన్న ప్రముఖులు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చింతల్‌బస్తీ డిగ్రీకాలేజ్‌తోపాటు బహదూర్‌పురలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసలే హైకోర్టులో, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి కుందన్‌బాగ్‌తోపాటు రామంతపూర్‌లోని దూరదర్శన్ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఇక మొదటినుంచీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్న పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు హైటెక్‌సిటీలోని టీసీఎస్‌తోపాటు ఉప్పల్‌లో మొక్కలు నాటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ స్పీకర్‌తోపాటు కుందన్‌బాగ్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

మేయర్ బొంతు రామ్మోహన్ కేబీఆర్ పార్కుతోపాటు చర్లపల్లి పారిశ్రామికవాడలో మొక్కలు నాటారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాటిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో, సనత్‌నగర్ వెల్పేర్ గ్రౌండ్‌లో మొక్కలను నాటారు. ఎక్సైజ్ శాఖ మంత్రి తీగుళ్ల పద్మారావు పార్శీగుట్ట శ్మశానవాటికలో, సీతాఫల్‌మండి పాఠశాలలో మొక్కలను నాటారు. జీహెచ్‌ఎంసీ నార్త్ జోన్ కార్యాలయంలో, నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయంలో మంత్రులు పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్ మొక్కలు నాటారు. అటవీ శాఖ మంత్రి జోగురామన్న చర్లపల్లి పారిశ్రామికవాడలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రులు హరితహారం ప్రాముఖ్యతను వివరించారు. గతంలో మాదిరిగా మొక్కలు నాటినట్లు కాగితాలపై తప్పుడు లెక్కలు చూపకుండా ఈసారి ఎక్కడెన్ని మొక్కలు నాటారో తెలుసుకొనేందుకు ఆయా ప్రాంతాలను జియోట్యాగింగ్ చేశారు. మొక్కలు నాటినవారే వాటిని పరిరక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర చరిత్రలో అపూర్వ ఘట్టం: మేయర్ రామ్మోహన్ ఒకేరోజు 29లక్షలకుపైగా మొక్కలు నాటడంద్వారా రాష్ట్ర చరిత్రలో ఓ అపూర్వఘట్టాన్ని ఆవిష్కరించామని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ వ్యాఖ్యానించారు. చిన్నా-పెద్దా అనే తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల వారూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని ఆయన పేర్కొన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిసహా అనేకమంది ప్రముఖులు మొదలు.. సామాన్యుల వరకు అందరూ ఉదయం నుంచే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. ఊహించినదానికన్నా ఎంతో ఎక్కువ ఉత్సాహంతో ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని మేయర్ వివరించారు. ఇందులో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు.

మంత్రుల హరిత సందేశం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటిన మంత్రులు.. చెట్ల పెంపకం వలన యావత్తు సమాజానికి కలిగే ప్రయోజనాలను, మానవ మనుగడలో చెట్ల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించారు. వారి మాటల్లోనే..చెట్లతోనే మనిషి మనుగడ హరితహారం కార్యక్రమం పాతబస్తీలో ఓ యజ్ఞంలా సాగుతుంది. త్వరలోనే ఓల్డ్ సిటీ గ్రీన్ సిటీగా మారుతుంది. చెట్లతోనే మనిషి మనుగడ సాధ్యం. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే తెలంగాణ మొత్తం పచ్చదనంతో నిండి చల్లని నీడను, స్వచ్ఛమైన గాలిని అందించే ప్రాంతంగా మారుతుంది.

– ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మొక్కలు నాటడం సామాజిక బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ మహా సంకల్పంతో హరితహారం చేపట్టారు. మొక్కలు నాటడాన్ని ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా భావించాలి. నాటిన ప్రతి మొక్కను కాపాడాలి. చారిత్రక నగరానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు ఇంటికో మొక్క నాటాలి. అడవుల శాతం ఎక్కువ ఉన్నందునే ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

– ఎక్సైజ్ శాఖ మంత్రి తీగుళ్ల పద్మారావు ఇంటికొక్కరు హరితయజ్ఞంలో భాగస్వాములు కావాలి బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగానే హరిత తెలంగాణను సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తితో ప్రతిఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలి. నగర ప్రజలు ఇంటికొక మొక్కను నాటి హరిత యజ్ఞంలో భాగస్వాములు కావాలి

– పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్త్‌డేకు ఒక మొక్కను నాటాలి రాష్ట్రంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33శాతానికి పెంచి దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక నుంచి ప్రతి పౌరుడు జరుపుకునే బర్త్‌డేకు ఒక మొక్కను నాటాలి. సీఎం కేసీఆర్ చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా పాల్గొన్ని ప్రజలు మొక్కలు నాటుతున్నారు. – పర్యావరణ, అటవీశాఖ మంత్రి జోగు రామన్న

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.