Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మూడేండ్లలో 21వేల మెగావాట్లు

-నార్త్‌గ్రిడ్‌లో స్లాట్ తీసుకోకపోవడంవల్లే కొరత -2003లో శ్రీశైలం నీటిమట్టం 762అడుగులే -సోలార్ విద్యుత్ ఉత్పతికి టెండర్లు పిలుస్తున్నాం -ఛత్తీస్‌గఢ్‌ నుంచి పవర్‌కోసం పీపీఏ కుదుర్చుకున్నాం -ఇప్పటికే పీజీసీఐ కనెక్టివిటీ పనులు మొదలుపెట్టింది -విద్యుత్ సమస్యపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్

KCR addressing in  Assembly

రాబోయే మూడేళ్లలో 21వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. నార్త్ గ్రిడ్‌నుంచి సౌత్‌గ్రిడ్‌కు కనెక్టివిటీ లేకపోవడంవల్ల తెలంగాణకు వెంటనే కరెంటు తేలేకపోతున్నామని తెలిపారు. సోమవారం అసెంబ్లీలో విద్యుత్ సమస్యపై చర్చ ప్రారంభమైంది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తామన్నారు. వైజాగ్‌లో తుఫాన్ వచ్చింది. సింహాద్రి ప్లాంట్‌లో ఉత్పత్తి బంద్ అయింది. కొత్తగూడెం 500మెగావాట్ల ప్లాంట్‌లో లోపంవచ్చి ఆగింది. విద్యుత్ అందించడం కష్టతరం అయింది. మనకున్నది సౌత్‌గ్రిడ్ కనెక్టివిటీ మాత్రమే. నార్త్‌గ్రిడ్‌లో స్లాట్ తీసుకోవాలని గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరాం. ధర్నాలు చేసినం. కానీ ఆనాడున్న పాలకులు నార్త్‌గ్రిడ్‌లో స్లాట్ కొనలేదు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎన్నో పర్యాయాలు ఉత్తరాలు రాసిన. సీఎం చాంబర్ ముందు మా సభ్యులు ధర్నాచేశారు. నార్త్‌గ్రిడ్‌లో సౌత్‌నుంచి మొత్తం తమిళనాడే స్లాట్ బుక్ చేసుకుంది. ఇక రాష్ట్రం ఏర్పడినంక గత్యంతరంలేక నాగార్జునసాగర్, శ్రీశైలంలో ఉత్పత్తి మొదలుపెట్టాం. కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం గతంలో ఏనాడు కూడా 834అడుగుల నీటిమట్టంలేదు.

1990నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంవరకు 799 అడుగులనుంచి 812 అడుగుల మధ్యే ఉంది. 2003-04లో 762 అడుగులకు కూడా పోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఏపీ సీఎం కేంద్రానికి, కేంద్ర జల వనరుల మంత్రికి లేఖలు రాసి, కృష్ణాబోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయించి, విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని చెప్పిస్తాడు. ఏమన్న అంటే మీకు ముందు చూపు లేదు అంటారు. చెబుతా అదికూడా. మీ తెలివితేటల సంగతికూడా చెబుతా. అని సీఎం అన్నారు. ఇంతలో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుంటే సీఎం భగ్గుమన్నారు.

ఇదేనా సంస్కారం? మీకు వినే సంస్కృతి లేదా? అంత ఉలుకెందుకు? నిజాలు చెప్పకుండా ఉండాలా? తెలంగాణ రైతుల పక్షాన ఉండాల్సింది పోయి చంద్రబాబుకు వత్తాసు పలకడం ఏంది? తెలంగాణ రైతుల పంటలను ఎండగొట్టాలని బాబు కంకణం కట్టుకున్నాడు అని అన్నారు. రెండు రాష్ర్టాలకు కలిపి థర్మల్, హైడల్ ద్వారా 9569మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. వీటిలో ప్లాంట్‌లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) 80శాతానికి మించదు. కేవలం భూపాలపల్లి ప్లాంట్‌లో మాత్రమే 94% పీఎల్‌ఎఫ్ ఉంది.

కేటీపీఎస్, వీటీపీఎస్‌లో 85% వరకు వస్తుంది. భూపాలపల్లిలో కొత్త మిషన్లు కావడంవల్ల ఎక్కువ వస్తున్నది. ఏపీకి అందుబాటులో ఉన్న హైడల్ ఉత్పత్తి 3817మెగావాట్లు. ఇందులో సీలేరు నుంచి 487మెగావాట్లు వస్తుంది. గ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లలో స్ప్రెక్ట్రం ద్వారా 280, ల్యాంకో ద్వారా 350, రిలయన్స్ ద్వారా 280, వేమగిరి నుంచి 370, కోనసీమ నుంచి 444, గౌతమి నుంచి 490మెగావాట్లు రావాల్సి ఉంది. కానీ 280మెగావాట్లు మాత్రమే వస్తున్నది. ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమా అని ఈ సంస్థలతో పీపీఏలు కుదుర్చుకున్నారు.

దీనివల్ల 2766 మెగావాట్లకు బిల్లులు కడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక మేం కట్టం అని అంటే కంపెనీలు కోర్టుకు పోయినయి. ఇతర మార్గాల ద్వారా తెలంగాణకు 105మెగావాట్ల విద్యుత్ రావాల్సి ఉంది. కానీ ఒక్క యూనిట్ కూడా రావడం లేదు. 1418మెగావాట్ల నాన్‌కన్వెన్షనల్ పవర్ రావాల్సి ఉంది. విండ్ పవర్ బయోగ్యాస్, బయోమాస్ ద్వారా కూడా ఒక్క యూనిట్ కూడా రావడంలేదు. తెలంగాణ ఇంత గడ్డు పరిస్థితిలో ఉండటానికి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని చెప్పారు. మేం వచ్చి ఐదు నెలలైంది. సమీక్ష చేసుకున్నాం.

ఆలోచించి ఎన్‌టీపీసీ చైర్మన్‌తో సమావేశమై త్వరగా ప్లాంట్ పెట్టాలని కోరాం. స్థలం అడిగితే వెంటనే చూపించినం. కోల్ లింకేజీ, ఎల్లంపల్లి నుంచి వాటర్ లింకేజీ ఇచ్చినం. 36నెలల్లో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది. సోలార్ పవర్ కూడా పగటిపూటనే వస్తుంది. దీన్ని 2000మెగావాట్లకు పెంచుతున్నాం. హైదరాబాద్‌ఐటీఐఆర్ ji24గంటల కరెంటు కావాలి. బీహెచ్‌ఈఎల్ ద్వారా ఆరువేల మెగావాట్ల ప్లాంట్ పెడుతున్నాం. మొత్తం 40వేల కోట్లతో విద్యుత్ ప్లాంట్‌లు పెడుతున్నాం.

భూపాలపల్లి స్టేజ్2 ప్లాంట్‌కోసం కేటాయించిన బొగ్గుగనిని తమవారికి ఇచ్చుకునేందుకు గత ప్రభుత్వం ఫైనలైజ్ చేయకుండా పెట్టడంవల్ల ఇటీవల సుప్రీంకోర్టు దీన్ని కూడా కొట్టేసింది. ఇప్పటికే బొగ్గుగని పనిని మొదలు పెడితే మనకే ఉండేది. దీనిపై మళ్లీ మేం కోర్టుకు పోతున్నాం. ఛత్తీస్‌గఢ్‌నుంచి 1000మెగావాట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు లైన్ వేస్తున్నారు. ఈ లైన్‌కు అదనంగా 20-30కిలోమీటర్ల లైన్ వేసుకుంటే తెలంగాణకు కరెంటు అందుబాటులోకి వస్తుంది. మొత్తం మూడేండ్లలో తెలంగాణను 21వేల మెగావాట్ల స్థాయికి తీసుకువెళ్తాం అని వెల్లడించారు.

పీపీఏ ఉంటేనే కనెక్షన్ ఇస్తారు ఏపీనుంచి రావాల్సిన విద్యుత్‌ను తెచ్చేందుకు అవసరమైతే పోరాటానికీ సిద్ధమని ప్రతిపక్షం చెప్పినందుకు ధన్యవాదాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకుంటేనే పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లైన్ వేస్తుందని, ఒప్పందం నేపథ్యంలో పీజీసీఐ వార్థా నుంచి డిచ్‌పల్లికి కనెక్టివిటీ లైన్ వేస్తున్నదని తెలిపారు. అక్కడి నుంచి మహేశ్వరానికి లైన్ వస్తుందని చెప్పారు.

ఈ లైన్ ద్వారా ఒకేసారి 4500మెగావాట్ల విద్యుత్‌ను స్వీకరించవచ్చిని చెప్పారు. అందుకే తాము వెయ్యి మెగావాట్లకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. గతంలో పాతలైన్ కొంత ఉందని, అందులో కొన్ని టవర్లను మావోయిస్టులు పేల్చేశారని అన్నారు. వాటిని పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. అందుకే ఛత్తీస్‌గఢ్ నుంచి అడ్వాన్స్‌గా పీపీఏ కుదుర్చుకున్నామని అన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటాను న్యాయపరంగానైనా సాధించి తీరుతామని సీఎం తెలిపారు.

పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇప్పుడే వచ్చిందా? -వాస్తవాలు బయటపడుతాయనే వినడం లేదు.. చరిత్ర కళ్లముందే ఉంది ఇన్నాళ్లు బోగస్ కథలు చెప్పారు -పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై సీఎం ఘాటు స్పందన హైదరాబాద్, నవంబర్ 10 (టీ మీడియా): సభను నియమ నిబంధనల ప్రకారమే నడుపుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నడూ లేని పాయింట్ ఆఫ్ ఆర్డర్‌లు ఇప్పుడే వస్తున్నాయని ఎద్దేవాచేశారు. సోమవారం సభ టీ బ్రేక్ అనంతరం ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క సభను ఏ రూల్స్ ప్రకారం నడుపుతున్నారో చెప్పాలన్నారు. రూల్స్ కమిటీ వేసుకోకుండానే సభను నడుపుతున్నారని వెంటనే రూల్స్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.

దీనిపై సీఎం స్పందిస్తూ అన్ని నియమాలను, నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తుందని, వాటి ఆధారంగానే సభ నడుపుతున్నామనిచెప్పారు. ఇంతలో భట్టి విక్రమార్క అడ్డుతగలగా సీఎం ఘాటుగా స్పందించారు. విక్రమార్క.. నువ్వు సభను డిస్ట్రబ్ చేస్తున్నావు. నీకు కరెంటు సమస్యపై చర్చ జరగొద్దా? ఎందుకు అంత అసహనం? ప్రతి అంశంపై ప్రభుత్వం చర్చించడానికి, సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంది. అవతల యాత్రలు.. ఇక్కడ డ్రామాలు. మీకు ఆసక్తి లేకుంటే చెప్పండి. మేం చెప్పేది కూడా వినాలి ఏపీ ముఖ్యమంత్రి పంటలు ఎండగొట్టేందుకు ఫీజ్‌లు పీకేసే కుట్ర చేస్తున్నాడు అన్నారు.

అయినా విక్రమార్క అడ్డుతగలడంతో హరీశ్‌రావు ఆయన వద్దకువెళ్లి సముదాయించే యత్నం చేశారు. మళ్లీ సీఎం స్పందిస్తూ రైతుల సమస్యలపై చర్చించడం ఇష్టం లేకుంటే చెప్పండి. చరిత్ర మన కళ్లముందే ఉంది. ఇన్నాళ్లూ బోగస్ కథలుచెప్పారు. చర్చిస్తేనే డూప్లికేట్ మాటలు బయటకు వస్తాయి. వాస్తవాలు ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలుస్తాయి. వినే ఓపిక ఉండాలి. కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు కారణం మీరే. పైగా ఇప్పుడు కాకికథలు, పిట్టకథలు చెబుతున్నారు. స్పీకర్‌కు అసాధారణ అధికారాలున్నాయి. ఆయన చర్యలు తీసుకుంటారు.

నా మాటలను అడ్డుకోవడం అనేది మీ పార్టీ విధానమా? ఎన్నడూ లేనిది ఇప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకొచ్చింది? లక్షలమంది రైతులు వింటున్నారు. మీ మొసలి కన్నీరు యాత్రలన్నీ బయటపడుతున్నాయి అని మండిపడ్డారు. వాస్తవాలు వినడానికి సిద్ధంగా లేరా? అని ప్రశ్నించారు. మీరు చేసిన పనులు ఎక్కడ బయటపడుతాయోననే వినడంలేదని ఆరోపించారు. పొరుగురాష్ట్రం ఇబ్బంది పెడుతున్నదని, సభ్యులందరికీ వాస్తవాలు తెలవాల్సిందేనని సీఎం అన్నారు.

మూడేండ్లలో 21వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తాం. 36నెలల్లో ఎన్టీపీసీ ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. సోలార్ పవర్‌ను 2000 మెగావాట్లకు పెంచుతున్నాం. బీహెచ్‌ఈఎల్‌ద్వారా 6వేల మెగావాట్ల ప్లాంట్ పెడుతున్నాం. ఛత్తీస్‌గఢ్‌నుంచి 1000 మెగావాట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదు. అందుకే ఈ దుస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు ముక్కు పిండి మరీ తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను తీసుకొస్తాం. తెలంగాణ పంటలను ఎండగట్టాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.

విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు 54% వాటా ఉంటుందని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. కానీ ఏపీ సీఎం చట్టాన్ని అతిక్రమించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల తెలివితక్కువతనంవల్ల స్థాపిత కరెంట్‌లో కేంద్రంనుంచి ఎక్కువ వాటా పొందలేకపోయారు. 2001 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8.45 కోట్లు. కేంద్రంనుంచి తీసుకోవాల్సిన స్థాపిత కరెంట్‌లో హైడ్రో, గ్యాస్, థర్మల్ కలిపి ఉమ్మడి రాష్ర్టానికి దక్కిన వాటా 16,719 మెగావాట్లే. వారసత్వంగా వచ్చిన దరిద్రం ఇది. – సీఎం కేసీఆర్

ఫీజులు పీకుతారు.. యాత్రలు చేస్తారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేమో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయొద్దంటూ ఫీజులు పీకుతారు. ఇక్కడున్న నాయకులేమో తెలంగాణను ముంచే విధంగా బస్సు యాత్రలు చేస్తారు. తప్పులు మీవి పెట్టుకుని మమ్మల్ని నిందిస్తే ప్రయోజనం ఉండదు అని టీడీపీ సభ్యులనుద్దేశించి సీఎం మండిపడ్డారు. బీహెచ్‌ఈఎల్ ద్వారా ఇప్పటికే ఆర్డర్ చేసిన మిషన్లు ఉన్నాయి. వాటితో రెండేండ్లలోనే 2300మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. ఆ మి షన్లు తెలంగాణకు వినియోగిస్తేనే ఆర్డర్ ఇస్తామని చె ప్పాం. అందుకే వారు వచ్చారు.

అని తెలిపారు. ఏపీ నుంచి రావాల్సిన విద్యత్‌ను తెచ్చేందుకు అఖిలపక్షంగా ఢిల్లీకి పోదామని సీఎం చెప్పారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలి అని పిలుపునిచ్చారు. ఖరీఫ్‌లో నెట్టకొచ్చాం. కాంగ్రెస్ హయాంలో కూడా రైతాంగానికి 6.12గంటల కరెంటే ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో వినియోగం పెరిగింది. ఏపీవల్లే తప్పులు జరిగాయి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై వారు ఆలోచించలేదు. అందుకే ఈ దుస్థితి. దృష్టిలోపం వల్లే నేడు కరెంటు కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించాలి. మనందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు రావాల్సిన కరెంటును సాధించుకోవాలి అని కేసీఆర్ అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.