Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మూడేండ్లలో మిగులు విద్యుత్

వచ్చే మూడేండ్లలో రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 2017లో రైతులకు ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 6 గంటల దాకా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. 2017 తర్వాత తెలంగాణలో పుట్టే బిడ్డలకు కరెంటు కోత అనేది తెలియకుండా చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎవరు అడిగినా, అడగకున్నా అనేక పథకాలు చేపడుతున్నదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దని ఆయన అన్నారు.

KCR addressing in Jagtial

– 2017కల్లా రైతులకు పగలంతా కరెంటు – పుట్టే పిల్లలకు కరెంటు కోతలంటే తెలియకుండా చేస్తాం – అర్హులందరికీ ఆసరా ఇస్తాం – ఎవరూ అడగకున్నా బీడీ కార్మికులకు భృతి – బీడికార్మికుల ఇండ్లలో ఉండి చదువుకున్న – మిషన్ కాకతీయలో ప్రజలే కథానాయకులు – వాటర్ గ్రిడ్ పూర్తయితే ప్రపంచానికే ఆదర్శం – రాజకీయాలు పక్కనపెట్టి సహకరించండి – త్వరలోనే జిల్లా కేంద్రంగా జగిత్యాల – కరీంనగర్ జిల్లా రాయికల్ సభలో సీఎం కేసీఆర్ – రాష్ట్ర పిత మన కేసీఆర్: చిన జీయర్ స్వామి

గ్రామాలకు ప్రాణాధారమైన చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయకు ప్రజలే ఎక్కడికక్కడ కథానాయకులై కదలాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల వరకూ ప్రజాప్రతినిధులమంతా రాజకీయాలు మరిచి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములమవుదామని కేసీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ జిల్లా రాయికల్ మండల కేంద్రంలో చిన్న జీయర్‌స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన వృత్తి విద్యా శిక్షణ కేంద్రం భవనాన్ని ఆయన ప్రారంభించారు.

పట్టణంలో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, మైహోమ్ రామేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆడిటోరియం, కల్యాణమండపాలకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్ త్రిదండి చిన్న జీయర్ స్వామితో పాటు మహరాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జూవల్ ఓరాం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను వివరిస్తూనే తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్తు లక్ష్యాన్ని ప్రజలు ముందు అవిష్కరించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…

ఏడాదిన్నరలో ఛత్తీస్‌గఢ్ విద్యుత్.. నేను చాలా సంతోషంగా.. చాలా సగర్వంగా ఈరోజు రాయికల్‌లో ప్రకటిస్తున్నా. 2017 నాటికే తెలంగాణ రైతాంగానికి ఒకటే వరుసలో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలవరకు నిరంతర విద్యుత్తు సరఫరాచేసే బాధ్యత కేసీఆర్‌దే అని చెపుతున్నా. 2017 తర్వాత మన రాష్ట్రంలో పుట్టే బిడ్డలకు కరెంటు కోత అంటే ఏమిటో తెలియదు. ఇక ఆ కాలం పోతుంది. 2018 నాటికి తెలంగాణ 23వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్తు శక్తి సామర్థ్యంతో మిగులు రాష్ట్రంగా ఉంటుంది. అవసరమైతే పొరుగు రాష్ర్టాలకు మనమే రెండు మూడు వేల మెగావాట్ల విద్యుత్తు ఇస్తాం. దీనిని నేను ఒక ప్రతిజ్ఞలాగా తీసుకున్నా. ఇక వచ్చే సంవత్సరం.. సంవత్సరంన్నరలోగా చత్తీస్‌గఢ్‌నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.

భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్‌లో మరో 600ల మెగావాట్ల విద్యుత్తు ఈ అక్టోబర్‌కు అందుబాటులోకి వస్తున్నది. ఆదిలాబాద్ జైపూర్ సింగరేణి విద్యుత్ యూనిట్ నుంచి 1200ల మెగావాట్ల విద్యుత్తు ఈ నవంబర్‌నాటికే అందబోతున్నది. ఇంకా రూ.36వేల కోట్లతో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో 6వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి మనం శ్రీకారం చుట్టినం. దాని పనులన్నీ త్వరలో టేకాఫ్ అవుతున్నాయి. రాష్ట్ర పునర్‌విభజన చట్టం పొందుపరిచిన విధంగా ఎన్టీపీసీ నాలుగువేల మెగావాట్ల విద్యుత్తు కేంద్రాన్ని స్థాపించి దాన్ని పూర్తిగా తెలంగాణకే ఇవ్వాలని చెప్పింది. 1600ల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి పనులు ప్రారంభమయ్యాయి. నల్గొండ జిల్లా దామరచర్లలో త్వరలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు కూడా ప్రారంభం కాబోతున్నది.

ప్రతి అర్హుడికి ఆసరా చాలా కష్టపడి సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నాం. సాధించుకున్న ఈ రాష్ట్రం సక్కబడాలి. దాని కోసం మీరు ఇచ్చిన అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పురోగమిస్తుంది. అన్నింటికంటే ఎక్కువ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకితమై ఉందని చెపుతున్నా. చాలా చాలా కార్యక్రమాలు నన్ను ఎవరూ అడుగలేదు. అమలు చేయమని ధర్నాలు చేయలేదు. అయినా చేస్తున్నాం. పెన్షన్లు గతంలో కూడ ఇచ్చేవారు.

మేం ఎన్నికల ప్రణాళిక రచించేటపుడు కొందరు మనం రూ. 300లు ఇస్తే సరిపోతుందని చెప్పారు. దానికి నేను ఒప్పుకోలె. అలనా పాలన లేని వారు, విడోస్, వికలాంగులు, వృద్ధులు రెండు పూటలా అన్నం తినాలె. ఇంకొకరికి మోతాదు లేకుండా బతకాలె అని చెప్పా. మన రాష్ట్రంలో గజ దొంగలు చాలా మంది ఉన్నారు. ఒక్క రాంగ్‌బిల్లు అపితే చాలు..ఈ పేదలకు అన్నం పెట్టవచ్చు. అందుకే మా వాళ్లు రూ.675 ఇద్దామంటే రౌండ్ ఫిగర్ వెయ్యి చేయమని చెప్పాను. ఇప్పడు కూడా ఎవరైనా తప్పిపోతే బాధ పడవద్దు. మీ ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేయండి.

చివరి అర్హుడి వరకు తప్పకుండా అందిస్తాం. అదే విధంగా కళ్యాణ లక్ష్మి పథకం పెట్టుకున్నం. అడపిల్ల పెండ్లి అంటేనే గుండెల మీద బరువు. ఈ పథకం కింద కొంత అసరా ఇవ్వాలని అనుకున్నం. ఇక పేదలు కడుపు నిండ తినాలె. అందుకు ఏడాదికి 14వందల కోట్ల అదనపు భారం పడుతున్నా మనిషికి ఆరుకిలోలకు పెంచినం. ఇపుడు బీడికార్మికులకు పెన్షన్లు ప్రారంభించినం. నేను చిన్నప్పుడు బీడికార్మికుల ఇండ్లలో ఉండి చదువుకున్న. వాళ్ల బాధలు నాకు తెలుసు. నిజానికి బీడికార్మికులకు పెన్షన్ ఇవ్వాలని నన్ను ఎవరూ అడగలె. నా అంతట నేనే ఎన్నికల సందర్భంలో మోర్తాడ్ లో ప్రకటించిన. ఇక్కడ ఫికర్ వద్దు. వచ్చినవారు సంతోషంగా తీసుకోండి. రాని అర్హులెవరైనా ఉంటే ఎమ్మార్వో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోండి. వాటికి కూడా ఈనెలలోనే భృతి అందిస్తం.

చెరువులను మింగేసిన గద్దలు సంక్షేమంతో పాటు రాష్ట్రంలో రెండు పెద్ద కార్యక్రమాలు తీసుకున్నం. కాకతీయ రెడ్డి రాజుల పుణ్యమా మనకు ఎన్నో చెరువులు ఉండె. వేయి సంవత్సరాల కిందటే వాటర్‌షెడ్ అంటే ఏమిటో ప్రపంచానికి మనం చాటి చెప్పినం. అంత గొప్ప రాజులు మన కాకతీయ రెడ్డి రాజులు. అందుకే వారిపేరుతోనే మిషన్ కాకతీయ అని పెట్టినం. మన చెరువులు మళ్లీ పూర్వవైభవం చూడాలె. చెరువుల సంగతి చాలా మందికి తెలియదు. తెలంగాణలో 77 వేల చెరువులను కాకతీయ రాజులు నిర్మించారు. 1974 సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ లెక్కలు చెప్పింది. దాని ప్రకారం గోదావరి బేసిన్‌లో 175 టీఎంసీలు, కృష్ణబేసిన్‌లో 92టీఎంసీల నీటి సామర్థ్యం చెరువులున్నాయని, తెలంగాణకు మొత్తంగా 265 టీఎంసీల నీటిని కేటాయించాలని అనాడు బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. కాని సమైక్య రాష్ట్రంలో 77వేల చెరువులు సగానికి సగం పోయినై.

కబ్జాల పాలైనయ్. ఇపుడు మిగిలినవి 46వేలు. అవి నిర్లక్ష్యానికి గురై తాంబాలాల లెక్క తయారైనయ్. నిజంగ 265 టీఎంసీ నీళ్లు వర్షాలతో చెరువుల్లో నిండితె ఒక సంవత్సరం మంచి వానలు కురిస్తే మూడు సంవత్సరాలు కరువు రాదు. దానిని తెలంగాణ సమాజం పునరుద్ధరించుకోవాలి. అద్భుతమైన ఉద్యమంగా ముందుకు సాగాలి. మీరు ఊరి చెరువు నిండితే మీ ఊరి కడుపు నిండుతుంది. కాబట్టి ఈ యజ్ఞాన్ని ఎక్కడి గ్రామస్తులు అక్కడే నిర్వహించాలి. ఏఊరు నాయకులు ఆ ఊరికి కథనాయకులై మిషన్‌కాకతీయను విజయవంతం చేయాలని మనవి చేస్తున్నా.

ప్రపంచానికే క్లాసికల్ ఏగ్జాంపుల్‌గా నిలుస్తాం అట్లనే తెలంగాణ డ్రికింగ్ వాటర్ గ్రిడ్ 40వేల కోట్ల రుపాయాలతోని చేపడుతున్నం. నేను ఒక శపథం తీసుకున్న. శానసభలో ప్రకటించిన. బయట పలుమార్లు ప్రకటించిన. మళ్లీ ఈరోజు రాయికల్‌లో ప్రకటిస్తున్న.. 2019 ఎన్నికలు వచ్చేలోపు తెలంగాణలో గిరిజన తండాకావచ్చు, గోండు గూడెం కావచ్చు, పల్లె, పట్టణం కావచ్చు, ప్రతి ఇంటికి నల్లా పెట్టి పరిశుభ్రమైన మంచినీటిని కనుక సరఫరా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు అడుగదు అని చెప్తున్నా. రాజకీయనాయకులు, ముఖ్యమంత్రులెవ్వరూ ఇట్ల శపథాలు చేయరు. కానీ నేను చేస్తున్న. నాకు కొంచెం అత్మవిశ్వాసం ఎక్కువ. చిన జీయర్ స్వామి లాంటి పెద్దల అశీస్సులుంటాయి..ప్రజల సపోర్టు ఉంటది కాబట్టి సాధిస్తనని నా విశ్వాసం.

గతంలో కూడా తెలంగాణ బిల్లు పాస్‌కావడానికి ముందు డిల్లీ పోయెటపుడే చెప్పినా. సమైక్య ఆంధ్రప్రదేశ్‌నుంచి వెళుతున్నా… తెలంగాణ రాష్ట్రంలోనే తిరిగి అడుగు పెడుతా అని చెప్పిన. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెట్టిన. నేను మీ అందరితో కోరిది ఒక్కటే. తెలంగాణ డ్రింకింగ్ పథకం అమలులో చాలా పనులు వేగవంతం అయ్యేందుకు చట్టాలను సవరించినం. అర్డినెన్స్‌లు తెచ్చినం. 26 ప్రాజెక్టులనుంచి నీటిని తీసుకుంటున్నం. ఆ నీటి పైపులైన్లు మూడు రకాలుగ మెయిన్ ట్రంకు లైన్, సబ్‌ట్రంక్స్, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఉంటాయి. ఈ పైపులైన్లు రావాలంటే రోడ్లు దాటాలి. రైలు పట్టాలు దాటాలి. సమస్యలు వస్తాయి. అందుకే నాయకులందరితో నా విజ్ఞప్తి.

ఇక్కడ పార్టీలు లేవు. రాజకీయాలు లేవు. 2019 ఎన్నికల్లో రాజకీయాలు మాట్లాడుదం. కానీ ఇప్పడు అన్నీ పక్కన పెట్టి ఎక్కడి వాళ్లే అక్కడే సహకరించాలి. అట్ల చేస్తెనే మీ మీ గ్రామాలకు, పట్టణాల త్వరగా మంచినీరు వచ్చే అస్కారం ఉంటుంది. మీ అధికారులకు సహకరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళితే ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అవుతుందని మీ అందరికి మనవి చేస్తున్నా.

త్వరలోనే జిల్లాకేంద్రంగా జగిత్యాల నేను జగిత్యాల ప్రాంతానికి వచ్చిన… అంటే ఇక్కడి ప్రజలకు చాలా అంచనాలు ఉంటాయి. గతంలో నేను మాట చెప్పిన. నేను ఎప్పుడైనా మాట చెప్పినా అంటే తలతెగిపడ్డా తప్పను. అమలు చేసి తీరుతను. జగిత్యాల పట్టణాన్ని త్వరలోనే మనం జిల్లాకేంద్రంగా చేసుకోబోతున్నామనే విషయాన్ని మీ అందరి హర్షధ్వానాల మధ్య నేను ప్రకటిస్తున్నా.

జగిత్యాలను జిల్లా కేంద్రంగ బ్రహ్మండంగా అభివృద్ధిచేసుకుందం. మనకు ఐఏఎస్, ఐపీఎస్ అఫీసర్లను విభజన చేసినప్పుడు 13 జిల్లాలు 10 జిల్లాలు అని పంచారు. కొంత నష్టం ఏర్పడింది. జిల్లాలు పదే అయినా ఒక్క హైదరాబాద్‌లోనే 17 మంది ఐపీఎస్‌లు అవసరం పడుతారు. ఆ నిష్పత్తి పరిగణలోకి తీసుకోలేదు. నేను మొన్ననే ప్రధాన మంత్రిని, హోం మంత్రిని అడిగిన. వారు హామీ ఇచ్చారు. అదనంగా ఐఏఎస్, ఐపీఎస్ అపీసర్లను కేటాయిస్తామని చెప్పారు. ఆ కేటాయింపు బహుశా ఒకటి రెండు నెలల్లో జరగవచ్చు. అది జరిగిన మరుక్షణమే మన జగిత్యాల జిల్లా కేంద్రంగా ప్రకటించబడుతుంది. ఇక్కడ 200ల పడకల అసుపత్రి నిర్మిస్తం. దరూర్ క్యాంపు వద్ద మంచి స్థలం ఉంది.

నేను మళ్లీ జగిత్యాలకు వచ్చినప్పుడు స్థల పరిశీలన చేసుకొని ఎక్కడ జిల్లాకేంద్రం పెట్టుకుందాం, ఎక్కడ కార్యాలయాలు కట్టుకుందామన్న విషయాన్ని స్వయంగా చూస్తా. అవసరమైతే రెండు గంటల పాదయాత్ర చేసైనా చూస్తా. కోరుట్ల నియోజకవర్గ చెరుకు రైతులకు రావాల్సిన చెరకు బకాయిలను వెంటనే ఇప్పిస్తా. రాష్ట్రంలో ఈ ఏడాది రూ. 15వేల కోట్లతో రోడ్లు వేయబోతున్నాం. అట్లనే కరెంటు కావచ్చు , మంచినీటి వసతి కావచ్చు చేసుకుంటూ ముందుకు పోవాలి. అదే విధంగా చినజీయర్ స్వామి చెప్పినట్లు దళితులు, గిరిజనులు మైనార్టీలు బీసీ, ఓసీల్లో ఉంటే అల్పాదాయ వర్గాలు వీళ్ల అందరి పరిస్థితి కూడా చక్కదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రభుత్వం ఆ దిశగా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నది.

ఎంతగొప్ప దేశం..! ఈ సందర్భంగా కేసీఆర్ దేశ ఔన్నత్యాన్ని గురించి వివరించారు. ఈరోజు విద్యాసాగర్‌రావు కట్టించిన విద్యాలయానికి భూమి ఇచ్చిన దాత ఫాతిమా బేగం అయితే.. దానిని అంకితం అందుకున్న వ్యక్తి చినజీయర్‌స్వామి అని వివరించారు. భూమి ఇచ్చిన దాత మహమ్మదీయ మతానికి చెందినవారైతే చిన్న జీయర్‌స్వామి హిందుధర్మంలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేవారు అని గుర్తు చేశారు. భారత దేశ ఔన్యత్వానికి ఇంతకు మించిన నిదర్శనం లేదని ఉద్వేగంగా అన్నారు. ఇదో గొప్ప అదర్శం. ప్రపంచమంతా నేర్చుకోవాల్సిన అదర్శం. తెలంగాణ రాష్ట్రం గంగాయమునా సంగమంగా ప్రసిద్ధి గాంచింది. ఇటువంటి గొప్పరాష్ట్రంలో పుట్టిన మనమంతా అదృష్టవంతులం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర పిత కేసీఆర్: చిన్న జీయర్ స్వామి తెలంగాణ విజయంతో కేసీఆర్‌ను తెలంగాణ పితగా తాము గుర్తిస్తున్నామని త్రిదండి చిన్నజీయర్‌స్వామి అన్నారు. సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో సాగించాలన్న తపన, లక్ష్యం ముఖ్యమంత్రిలో కనిపిస్తున్నాయని ప్రశంసించారు. కేసీఆర్ అచరణలో తన లక్ష్యాలను సాధించితీరుతారని, అందుకు తమ అశీస్సులు ఎప్పుడు ఉంటాయని స్వామి ఆశీర్వదించారు. గిరిజన సంక్షేమం, విద్యా వికాసం కోసం మౌలిక వసతులను కల్పించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వం సంలీనమై సాగాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలు, యోగ్యతపూరితమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. గిరిజన సంస్కృతిని రక్షించేందుకు జీయర్ ట్రస్టు కృషి చేస్తుందని చెప్పారు.

విద్యాసాగర్‌రావు చతురుడు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును చతురుడని, సహజంగానే ఆయనకు ఆకర్షణీయంగా ఉపన్యసించే కౌశలం ఉందని సీఎం అన్నారు. అది ఆయనకు గాడ్ గిప్టు అన్న కేసీఆర్ అంతకుముందు విద్యాసాగర్‌రావు చెప్పిన కథ తనను కేంద్రమంత్రి ఓరాంను కట్టిపడేసిందని అన్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి ఓరామ్‌కు సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్ వద్ద బ్రిడ్జి నిర్మాణం, ఐటీడీఏ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి ఇచ్చిన హామీపై కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తంచేశారు. అలాగే రెండు ఎకరాల స్థలంలో భారీ అడిటోరియం, కళ్యాణ మంటపం నిర్మాణంకు ముందుకొచ్చిన మైహోం రామేశ్వర్‌రావును అభినందించారు.

సమావేశంలో రాష్ట్రగిరిజన శాఖ మంత్రి చందులాల్, రాష్ట్ర సాంస్కృతిక మండలి ఛైర్మన్ రసమయి బాలకిషన్, రాష్ట్ర చీప్ విఫ్ కొప్పుల ఈశ్వర్, విద్యాశాఖ పార్లమెంటరీ సెక్రటరీ సతీష్‌కుమార్, నిజమాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్, విద్యాసాగర్‌రావు, బొడిగే శోభ, జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ, జగిత్యాల టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మైహోం అధినేత రామేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.