ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయింది: విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మూడేండ్లలో రెప్పపాటు అంతరాయం లేకుండా అత్యంత మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకుంటున్నామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ పట్టణ, ఏడు గ్రామాల విస్తృతస్థాయి సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు పనిలేకుండా పోయిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లే లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజలు సుఖసంతోషాలతో లేకుండా ఇంకా కొంత మంది రాక్షసులు వచ్చిన తెలంగాణను మింగేందుకు కుటిలయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉన్నంత వరకు ఇతరపార్టీలకు ఇక స్థానమే ఉండదని పేర్కొ న్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని చెప్పారు. త్వరలో నకిరేకల్‌లో జరిగే ఏడు గ్రామపంచాయతీల ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రతి చిన్న సమస్యపై రాద్ధాంతం చేస్తూ భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాయని, వారిని ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత జెల్లా మార్కండేయులు, నకిరేకల్ జెడ్పీటీసీ సభ్యురాలు పెండెం ధనలక్ష్మి సదానందం, నార్కట్‌పల్లి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మండల పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచు లు తదితరులు పాల్గొన్నారు.